ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు కాస్త చరిత్రను తెలుసుకోవాలి. ఇరాన్ దేశంలో చోటు చేసుకున్న పెను రాజకీయ మార్పుకి కారణమైన “ఇస్లామిక్ రెవల్యూషన్” అక్కడి సినిమాపై కూడా ప్రభావం చూపింది. సినిమాపై ఆ దేశం పలు ఆంక్షలు విధించింది. అవి, సినిమాలో “సెక్స్”, “హింస”, “ఆడవారిని అసభ్యకరంగా చూపించడం”, “ప్రభుత్వాన్ని దూషించడం”, “పరిపక్వత లేని ప్రేమలు” లాంటివి. నిజానికి, ఇవి లేని మన భారతీయ సినిమాను మనం ఊహించుకోవడం చాలా కష్టం. అన్ని దారులు మూసుకొనిపోయినప్పుడు, కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చినప్పుడే మనసు రెట్టింపు వేగంగా ఆలోచిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొందరు ఇరాన్ సినీదర్శకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. వారిలో “అబ్బాస్ కిరోస్తమి“, “జాఫర్ పనాహి“, “మజిద్ మజిది” లాంటివారున్నారు. వీరు తీసిన సినిమాలే ప్రపంచంలో ఎందరో దర్శకులను ప్రేరేపించాయి.
పనాహి తీసిన “టాక్సీ” సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో రోడ్డుపై షూటింగ్ చేసేందుకు అనుమతి లేదు. పైన చెప్పుకున్నట్టు, అన్ని దార్లు మూసుకుపోయిన ఆ క్రమంలో పనాహి స్వయంగా ఓ టాక్సీ డ్రైవర్ అవతారమెత్తి, తన కారులో కెమెరాలను అమర్చి, ఏ మాత్రం నటనానుభవం లేని సామాన్య ప్రజలను ఎక్కించుకొని టెహ్రాన్ అంతా ఓ రోజు తిరిగాడు. ఆ ప్రయాణంలో అతడు తన కారులో ఎక్కించుకున్న ప్రతి ఒక్క మనిషి కథను తమ ద్వారానే ప్రేక్షకులకు చేరవేశాడు.
ఈ “టాక్సీ” అనే సినిమాను ప్రేరణగా తీసుకొని తీయబడిన సినిమా “ఎ లవ్ లెటర్ టు సినిమా“. “శశి“, “రోహిత్” దర్శకత్వం వచించిన ఈ సినిమా “తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ” ఆధ్వర్యంలో “సినివారం” పేరిట నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మే 20వ తేదిన “రవీంద్ర భారతి“లో ప్రదర్శింపబడింది. “అనిల్ AKC ఫిలిమ్స్” మరియు “అవంతి చిత్రనాలయం” ఈ సినిమాను నిర్మించాయి.
కథగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది ఒక దర్శకుడి జీవితంలోని ఒక రోజు అని మాత్రమే చెప్పొచ్చు. కానీ ఆ ఒక్క రోజులో జరిగిన సంఘటనలు చాలారోజుల వరకు గుర్తుండిపోతాయి.
శశి (శశి) అనే దర్శకుడు తన కారులో కొంతమందిని ఎక్కించుకొని హైదరాబాద్ వీధుల్లో తిరగడం మొదలుపెడతాడు. అతడి కారులో పలువురు వ్యక్తులు ప్రయాణిస్తారు…
మొదటి ట్రిప్ – యశు :
పదేళ్ళ లోపు వయసున్న కుర్రాడు. ఒక అపార్ట్మెంట్ వాచ్ మెన్ కొడుకు. ఎక్కువగా మాట్లాడడు.
రెండవ ట్రిప్ – ఖలీల్ భాయ్ :
ఒక చాయ్ వాలా. ఎన్నో ఏళ్ళుగా హైదరాబాదులో చాయ్ అమ్ముకుంటూ బ్రతికే ఇతడు తన కస్టమర్స్ తనకు బహుమతిగా ఇచ్చిన కౌబాయ్ టోపీలను ధరిస్తూ ఉంటాడు.
మూడవ ట్రిప్ – షబ్బీర్ మరియు భాను :
వీరిద్దరూ శశికి రూమ్మేట్స్. ఇంటి యజమానితో సమస్య, ఇంటి అద్దె సమస్య, ఎడిట్ చేసిన పెళ్ళి వీడియో కస్టమర్స్ కి నచ్చలేదని, ఇలా పలు సమస్యలను వివరిస్తారు.
ఇలాంటి సినిమాలు తెలుగులో ప్రథమం కనుక ప్రేక్షకుడు మొదట ఈ సినిమాలో లీనమవ్వడానికి దారులు వెతుక్కుంటాడు. అది దొరకని పక్షాన బయటకు వెళ్ళడానికి దారిని వెతుక్కుంటాడు. ముఖ్యంగా, మూడవ ట్రిప్ లో శశి కారు దిగినా కెమెరా కారులోనే ఉంటుంది. విడిగా రీ-రికార్డింగ్ లాంటి పనులు పెద్దగా లేని సినిమా కనుక, ట్రాఫిక్ శబ్దాలు కూడా ప్రేక్షకుడిని ఇబ్బంది పెడతాయి. దీన్ని దాటుకొని ముందుకు వెళ్తేనే ప్రేక్షకుడికి అసలు విషయం అర్థమవుతుంది.
నాలుగవ ట్రిప్ – అమర్ :
ఈ పాత్ర సినిమాలంటే ఇష్టంతో పాటు కాస్త అవగాహన ఉన్నవాళ్ళ కోసం. ప్రస్తుతం సినిమా పరిస్థితిని గురించి, హైదరాబాదులో టాక్సీ సర్వీసుల గురించి చర్చించే పాత్ర.
అయిదవ ట్రిప్ – సంధ్య :
ఈ సినిమా వెనుక దర్శకుడి ఆలోచన ఏమిటో పూర్తిగా అర్థమయ్యేలా చేసే ఘట్టం ఇది. ఒక నటి ఒక క్యాబ్ ఎక్కితే ఆవిడకి, ఆ డ్రైవరుకి మధ్యన సంభాషణ. ఇక్కడ శశిని, సంధ్యని మెచ్చుకోవాలి. సినిమా పరంగా చూస్తే ఆవిడ ఒక నటి, ఇతడు ఒక క్యాబ్ డ్రైవర్. వాళ్ళిద్దరి మధ్యనున్న సంభాషణలు చూస్తే అప్పటివరకు ప్రేక్షకుడి మనసులో దర్శకుడిగా ఉన్న శశి అమాంతం ప్రేక్షకుడికి కూడా క్యాబ్ డ్రైవరులాగే కనబడతాడు.
ఆరవ ట్రిప్ – రోహిత్ :
ప్రేక్షకుడిని పూర్తిగా సినిమాలో లీనం చేసే ప్రయాణికుడు ఇతడు. ఇరాన్ దర్శకుడు అబ్బాస్ కిరోస్తమి గురించి, ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి మాట్లాడిన విషయాలు బాగున్నాయి. ఇక్కడ ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడానికి కారణం, ఇద్దరు సినిమా పిచ్చోళ్ళ మధ్యన ఇలాంటి సంభాషణలు సర్వ సాధారణం కనుక.
ఏడవ ట్రిప్ – రోహిత్, దివ్య :
హైదరాబాదు యూనివర్సిటీలో “రాకీ” అనే డ్రగ్స్ వ్యాపారి కోసం మొదలైన అన్వేషణ ఈ ట్రిప్. కాలానుగుణంగా, “రోహిత్ వేముల” గురించి ఇక్కడ ప్రస్తావన వస్తుంది.
ఎనిమిదవ ట్రిప్ – రాకీ (జాన్) :
ఇతడు ఒక డ్రగ్ డీలర్. ఇలాంటి వ్యక్తులను మనం తరచూ చూస్తూనే ఉంటాం. నగరంలో డ్రగ్స్ వ్యాపారం ఎలా జరుగుతుందో, డ్రగ్స్ వల్ల ఉపయోగాలేమిటి అన్న విషయాలు ఇతడు శశితో చర్చిస్తాడు.
తొమ్మిదవ ట్రిప్ – అదితి :
సినిమాలో ఇదే పెద్ద ఘట్టం. అందమైన ఘట్టం కూడా. శశి మేనకోడలుగా పరిచయమయ్యే అదితి ఎన్నో విషయాలను చర్చిస్తుంది. వారిద్దరి మధ్యన వచ్చే చర్చ చాలా అందంగా ఉంటుంది. సహజంగా ఉంటుంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఏది ఏమైనా, ఎంతసేపు ఈ పాత్ర ఉన్నా, ఇంకాసేపు ఉంటే బాగుండేది అనిపించే ట్రిప్ ఇది. దీనితో దర్శకులుగా శశి, రోహిత్ లకు పూర్తి మార్కులు వేసేయొచ్చు. అదితికి వీరికన్నా ఇంకో పది మార్కులు ఎక్కువే వేయొచ్చు.
పదవ ట్రిప్ – ఆరిఫ్ :
ఇతడు సినీ దర్శకుడు కావాలని కలలు కనే వ్యక్తి. కానీ ధైర్యం చేయలేని అమాయకుడు. ఒక సినిమా తీయడానికి డబ్బు ఒకటే ప్రామాణికం కాదు. సినిమా తీయాలన్న కసి బలంగా ఉంటే చాలు డబ్బుతో పాటు అన్ని సమకూరుతాయని చెప్పే ఈ ఘట్టం భవిష్యత్తులో సినిమా తీయాలనుకునే ఔత్సాహికులకు ఎంతో ప్రేరణ ఇచ్చేది.
అలా, శశి అనే ఆ దర్శకుడి జీవితంలో ఆ రోజు గడిచిపోతుంది. ఈ ఘట్టాలన్నీ చదివి “ఏంటి ఇది సినిమానా? ఎలా రా తీశారు? నువ్వెలా చూశావు దీన్ని? దాని మీద నువ్వు మళ్ళీ రివ్యూ కూడా వ్రాయడమా?” అనే ప్రశ్నలు మీలో కలగక మానవు. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. అవును, ఇది సినిమానే. సహజత్వం కలిగిన సినిమా కాదు, సినిమాగా చూపించబడిన ఓ సహజత్వం. శశి ఆరిఫ్ తో చెప్పినట్టు, తపనతో ఈ సినిమాను తీశారు. మొదట్లో సినిమా చూడాలని వెళ్ళిన ప్రేక్షకుడికి కాసేపటికి అతడొక “సినిమా” చూస్తున్న భావన కలిగించదు. ఎవరో ఇద్దరు అతడి ముందు మాట్లాడుకుంటూ ఉంటే విన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఆ సినిమాపై నేను వ్రాసే రివ్యూ కానే కాదు. ఇది ఒక పరిచయం మాత్రమే.
ఈ సినిమా నుండి నేర్చుకోవడానికి ఏమైనా ఉందా అంటే చాలా ఉంది. సీతారామశాస్త్రి గారు వ్రాశారు “చుట్టూ ప్రక్కల చూడరా చిన్నవాడ… చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ” అని. ఆ వాక్యాన్ని ఇక్కడ వాడుకుంటే, ఒక సినిమా తీయాలంటే కోట్ల ఖర్చు, పెద్ద స్టార్స్, ఒక అత్యద్భుతమైన కథ కోసం విపరీతంగా శ్రమించాల్సిన అవసరంలేదు. మన దయనందన జీవితంలో మనకు తారసపడే ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది, ఆ కథలో అన్ని భావోద్వేగాలుంటాయి. చేతిలో మొబైల్ ఫోను ఉన్నా చాలు అతడి కథను ప్రపంచానికి చెప్పాలనుకుంటే అదే సినిమా అవుతుంది అని ఈ సినిమా చెబుతుంది.
పనాహి తీసిన “టాక్సీ” సినిమా వెనుకనున్నది ఒక అద్భుతమైన ఆలోచన. దాన్ని తెలుగు రాష్ట్రంలోకి తీసుకొని వచ్చి తమ శైలిలో ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మలిచిన దర్శకులు శశి, రోహిత్ లను మనస్పూర్తిగా అభినందించాలి.
సాంకేతిక నిపుణులు :
భరత్ వ్యాస్ – ఫోటోగ్రఫి :
కారు దిగకుండా ఎక్కిన ప్రతి ఒక్కరి భావోద్వేగాలను కెమెరాలో బంధించడం ఎంత కష్టమో ఈ సినిమా చూశాక అర్థమవుతుంది. అంతటి కష్టాన్ని తీసుకున్న ఇతడిని మొదటగా అభినందించాలి.
అవంతి రుయా – ఎడిటింగ్ :
ఓ చిన్న కారులో పలు ప్రదేశాల్లో పలు కెమెరాలను వాడి తీసిన ఈ సినిమాలో ఇంత పర్ఫెక్ట్ ఎడిటింగ్ ఉండడం ఆశ్చర్యం మరియు అభినందనీయం.
వివేక్ సాగర్ – సంగీతం :
ఇతడి సంగీతం ఈ సినిమా ముగిసిన తరువాత ప్రేక్షకుడిని మంచి సంగీతంతో సాగనంపుతుంది.
అనిల్ – నిర్మాత :
ఎంతటి మహత్తరమైన ఆలోచనైనా నిర్మాత లేకుంటే ముందుకు వెళ్ళదు. ఇలాంటి ఆలోచనను ప్రోత్సహించిన నిర్మాతను మెచ్చుకొని తీరాల్సిందే.
చివరి మాట :
సాధారణ కమర్షియల్ సినిమాలు ప్రత్యేకంగా తీయబడినవి. కానీ ఇలాంటివి ప్రకృతిలో సహజంగా అలా జరిగిపోయేవి. అమ్మ ఒడిలో దొరికే ప్రశాంతత ఎలా ఉంటుందని అడిగితే మాటల్లో చెప్పడం ఎంత కష్టమో, ఇలాంటి సినిమాల గురించి కూడా రివ్యూ వ్రాయడం కూడా అంత కష్టం. అమ్మ ఒడిలాగే అనుభవించి తెలుసుకోవాలి.
– యశ్వంత్ ఆలూరు
Brilliant review Yash. Nee chivarimaata adirindi 👌
LikeLiked by 1 person
Thank you 🙂
LikeLike