ఒక సినిమాకు కథానాయకుడు ఎంత ముఖ్యమో, కథానాయిక కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని మర్చిపోయిన తెలుగు సినిమా దర్శకులు కేవలం నాయకుడికే ప్రాధాన్యం ఇస్తూ నాయికను కేవలం “పాట”బొమ్మగా వాడుకుంటున్నారు. ఆ తప్పు తన సినిమాతో చేయలేదు దర్శకుడు “కళ్యాణ్ కృష్ణ“. “రకుల్ ప్రీత్ సింగ్“, నాగచైతన్య జంటగా “రారండోయ్ వేడుక చూద్దాం” అనే సినిమాను కథానాయికను కేంద్రబిందువుగా చేసుకొని తీశాడు. ఈ సినిమాను “అన్నపూర్ణ స్టూడియోస్” పతాకంపై “అక్కినేని నాగార్జున” నిర్మించారు.
కథ :
తన సోదరుడి పెళ్ళిలో భ్రమరాంబ (రకుల్)ను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు శివ (నాగచైతన్య). ఆ తరువాత అతడు ఆమెకు ఎలా దగ్గరయ్యాడు? తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు? తన ప్రేమను గెలుచుకోవడానికి గల అడ్డంకులను ఎలా ఎదురుకున్నాడు? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
ఈ సినిమా టైటిల్, ట్రైలర్, పాటలు ఇలా ప్రతి అంశం ఇది ఒక కుటుంబ కథా చిత్రమని ప్రేక్షకుడికి అంచనాలను రేకెత్తిస్తాయి. కానీ ఈ సినిమా చూశాక అనిపించే విషయమేమిటంటే, ఇందులో అంత పెద్ద కుటుంబాన్ని ఇరికించాల్సిన అవసరంలేదని. బహుశా దర్శకుడు దీన్ని పెంకితనం కలిగిన అమ్మాయికి, సహనం కలిగిన అబ్బాయికి మధ్య జరిగే ఒక ప్రేమకథగానే మొదలుపెట్టి, ఆ తరువాత కుటుంబ కథగా మలిచాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ప్రేమకథ పండినంతగా కుటుంబ కథ పండలేదు కనుక.
ముందుగా కథానాయకుడిని కాకుండా కథానాయికను పరిచయం చేయడం సాధారణ కమర్షియల్ సినిమాల్లో అరుదుగా జరిగే విషయం. అందులోనూ, బాల్య జీవితాన్ని చూపించడంలో కూడా కథానాయిక బాల్యాన్నే చూపించడం మరింత అరుదుగా జరిగే విషయం. ఇలాంటిది “పవన్ సాదినేని” దర్శకత్వంలో నందిత, నారా రోహిత్ నటించిన “సావిత్రి” తరువాత బహుశా ఇందులోనే జరిగింది. దర్శకుడు కళ్యాణ్ కేవలం కథానాయిక పాత్రనే నెలకొల్పడంతో, సినిమాలో కథానాయకుడి లక్ష్యం ఈ కథానాయిక మనసును గెలుచుకోవడమేనని అర్థమయ్యేలా చేసింది. కానీ అంతకు ముందు వచ్చిన ఓ కుటుంబ కథ ఈ పాయింట్ ని బలంగా రిజిస్టర్ చేయలేకపోయింది. అసలు కథ ఆరంభమే పెళ్ళితో అయినా, అందులో ఉబుసుపోని కామెడీతో ఇబ్బందిపెట్టాడు దర్శకుడు. పెళ్లి ఘట్టం అయిపోయాక కానీ సినిమా మీద ఆసక్తి రాదు ప్రేక్షకుడికి.
మెచ్చుకోదగిన విషయమేమిటంటే, భ్రమరాంబ పాత్రకిచ్చిన గౌరవాన్ని దర్శకుడు ఎక్కడా రవ్వంతైనా తగ్గించలేదు. శివ పాత్ర కూడా ఆమెను ఎప్పుడూ అగౌరవపరచదు. కానీ భ్రమరాంబ పాత్ర తాలూకు పెంకితనంలో నాటకీయత ఎక్కువగా కనిపించింది.
శివ, అతడి తండ్రి కృష్ణ (జగపతిబాబు) మధ్యనున్న బంధాన్ని బాగా పరిచయం చేసినప్పటికీ దాన్ని పూర్తిగా నెలకొల్పలేదు దర్శకుడు. ఇంకాసేపు వారిద్దరి మధ్యన సన్నివేశాలు ఉంటే బాగుండేది అనుకునేలోపే కట్ చేసి భ్రమరాంబ వైపు వెళ్ళిపోతాడు. అటునుండి వెంటనే ఒక కామెడీ సన్నివేశానికి వెళ్తాడు. ఇలా అతడు ఎంచుకున్న అంశాలలో ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తిగా స్పృశించకుండానే మరో అంశానికి వెళ్ళిపోతాడు. తక్కువగా స్పృశించినా ఆయా ఘట్టాల్లోని సన్నివేశాలు బాగుండడం కొసమెరుపు.
రెండో సగంలో ప్రేమ సన్నివేశాలను బాగా తీశాడు దర్శకుడు. ముఖ్యంగా “భ్రమరాంబకు నచ్చేశాను” పాట వచ్చిన సందర్భం చాలా అందమైనది, సహజమైనది. శివ భ్రమరాంబతో విడిపోయే సన్నివేశం కూడా చాలా సహజంగా వచ్చింది. ఆ సన్నివేశానికి ధియేటరులో అబ్బాయిలు ఈలలు వేశారంటే అర్థమవుతుంది అది ఎంత సహజమైనదో.
కొన్నిసార్లు మాటకన్నా పాటే భావోద్వేగాన్ని బాగా నెలకొల్పుతుంది. ఆ విషయాన్ని దర్శకుడు బాగా వాడుకున్నాడు ఈ సినిమాలో. సినిమా చివరకు వచ్చే సమయంలో, ముఖ్యమైన సన్నివేశాలను కొన్ని బిట్ సాంగ్స్ తో నడిపించడం, దానికి సంగీత దర్శకుడు “దేవీశ్రీప్రసాద్” నుండి పరిపూర్ణ సహకారం ఉండడం కథనం స్థాయిని పెంచిందని చెప్పాలి.
అలా, “రారండోయ్ వేడుక చూద్దాం“ అనే ఈ సినిమా భావోద్వేగాలను పైపైన స్పృశిస్తూ సాగే ఒక కుటుంబ కథా చిత్రమనే భ్రమను కలిగించే ఒక ప్రేమ కథా చిత్రం.
నటనలు :
నాగచైతన్య “ప్రేమమ్”తోనే తనలోని నటుడిని పరిపూర్ణంగా పరిచయం చేశాడు. ఈ సినిమాతో దాన్ని మరింత బలంగా నెలకొల్పాడు. రకుల్ కి ఇలాంటి పాత్రలు అరుదుగా దక్కాయి. కేవలం కథానాయిక మీద ఆధారపడే కమర్షియల్ సినిమాలు మన కథానాయికలకు దొరకడం చాలా అరుదు. అలాంటి అవకాశం దక్కించుకున్న రకుల్ పెంకితనం కన్నా చివర్లో భావోద్వేగాన్నే బాగా పండించింది.
జగపతిబాబుకి ఒక రకంగా మంచి పాత్రే దక్కింది కానీ దాన్ని పూర్తిగా నెలకొల్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు. చాలాకాలం తరువాత సంపత్ మంచి పాత్రలో కనిపించాడు. “నేను కూడా అత్తయ్య లాగే చేస్తే?” అని భ్రమరాంబ అడిగే ప్రశ్నకు అతడు సమాధానం చెప్పిన విధానం చాలా బాగుంది.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వెన్నెల కిషోర్ గురించి. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను నవ్వించగాలిగాడు.
చలపతిరావు, అన్నపూర్ణ, కౌసల్య, మురళి, ఇర్షాద్, సురేఖ వాణి, మధునందన్, పోసాని, తాగుబోతు రమేష్ ఇలా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో.
బలాలు :
- కళ్యాణ్ కృష్ణ కథ. ఒక కమర్షియల్ సినిమాలో, పైగా హీరో తండ్రే నిర్మాతగా ఉన్న సినిమాలో హీరోయిన్ కి హీరోకన్నా విలువను ఇచ్చే కథతో సినిమా తీయడం పెద్ద సాహసమే. ఏ క్షణంలో కూడా హీరోయిన్ పాత్రను తక్కువ చేసి చూపించకపోవడం కథకుడిగా కళ్యాణ్ కృష్ణ గొప్పతనం.
- దేవీశ్రీప్రసాద్ సంగీతం. చాలాకాలం తరువాత దేవి సంగీతం సినిమాకు బాగా సహకరించింది. “రారండోయ్ వేడుక చూద్దాం”, “నీవెంటే నేనుంటే”, “తకిట తకజం” లాంటి పాటలతో పాటు, నేపథ్యంలో వచ్చే కొన్ని బిట్ సాంగ్స్ కూడా అలరించాయి. కొన్నిచోట్ల నేపథ్య సంగీతం కూడా సన్నివేశానికి బలాన్నిచ్చింది.
- విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం. సినిమా అంతా అందమైన ప్రదేశాల్లోనే తీయబడింది. వాటిని అంతే అందంగా కెమెరాలో బంధించారు విశ్వేశ్వర్.
- నిర్మాణ విలువలు. హీరోకన్నా హీరోయిన్ కే ఎక్కువ విలువున్న ఈ కథను నమ్మి తన కొడుకు హీరోగా, ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన నాగార్జునని అభినందించాలి.
- నటనలు. నాగచైతన్య, రకుల్ ఇద్దరూ తమ నటనలతో తమ పాత్రలకు న్యాయం చేశారు.
బలహీనతలు :
- కళ్యాణ్ కృష్ణ కథ. స్వచ్చమైన ప్రేమకథగా తీసుంటే సరిపోయే కథలో బలవంతంగా కుటుంబ బంధాలను, వాటిమధ్య కక్షలను ఇరికించాల్సిన అవసరంలేదు.
- మొదటి సగంలోని పెళ్లి తంతు. అటు మెప్పించకపోగా, పనికిరాని కామెడీతో చిరాకు తెప్పించింది.
– యశ్వంత్ ఆలూరు