ప్రదర్శన ఎలా ఉన్నా ప్రతి మనిషిలో కలిగే భావోద్వేగాలు ఒక్కటే. అలాగే సినిమా కథలు కూడా. ప్రదర్శనలు ఎలా ఉన్నా, కొన్ని సినిమాలలో మూల కథా వస్తువు ఒకటే ఉంటుంది. వాడిన వస్తువునే ఎంత కొత్తగా వాడామన్నదే ముఖ్యం ఇలాంటి సినిమాలకు. అలాంటి కథావస్తువుతో వచ్చిన సినిమానే “పటేల్ S.I.R“. వారాహి చలనచిత్రం నిర్మాణంలో “జగపతిబాబు” హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా “వాసు పరిమి” దర్శకుడిగా పరిచయమయ్యాడు.
కథ :
ఒక డ్రగ్స్ మాఫియాలోని వ్యక్తులను ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు పటేల్ (జగపతిబాబు) అతి దారుణంగా హత్యలు చేస్తూ ఉంటాడు. దాని వెనుక అతడి ఉద్దేశ్యమేంటి? అసలు పటేల్ ఎవరు? అతడితో ఉన్న పాప ఎవరు? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
ఈ సినిమా టీజర్లు, అందులో జగపతిబాబు కనిపించిన విధానం చూడగానే విజువల్ పరంగా ఇది కొత్తగా ఉండబోతోందని, కథలో కొత్తదనమేమి లేదనిపిస్తుంది. ఈ విధానం ఇలాంటి సినిమాలకు మంచిదే. ఎందుకంటే, తను ఏమి చూడబోతున్నాడో ప్రేక్షకుడికి ముందే చెప్పేస్తే అతడికి సినిమా పట్ల ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి ప్రేక్షకుడికి కథనంలో కొత్తదనం చూపిస్తేనో లేదా అతడికి బోరు కొట్టించకుండా దాన్ని నడిపితేనో సరిపోతుంది. దర్శకుడు వాసు కూడా ఇదే టెక్నిక్ ని వాడాడు.
దారుణంగా హత్యలు చేసే పటేలుకు ఖచ్చితంగా తన శత్రువుల వల్ల అన్యాయం జరగి ఉంటుంది అన్నది తెలుగు సినిమాలోని ప్రాథమిక సూత్రం. కానీ ఆ అన్యాయం ఎంత ఘోరంగా జరిగింది? అది జరగక ముందు పటేల్ జీవితం ఎలా ఉండేది? ఈ రెండు విషయాలే దర్శకుడికి తన ప్రతిభను చూపించుకునే సాయం చేసేది. మధ్యమధ్యలో పటేల్ గతాన్ని కొద్దికొద్దిగా ప్రేక్షకుడికి చెబుతూ అతడు చేసేస్ హత్యలను చూపిస్తూ ఏదో రొటీన్ సినిమా చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలిగే సమయానికి “Expect the Unexpected” అనే శీర్షికతో వచ్చిన ఈ సినిమా విరామం సమయానికి మంచి మలుపునే తిప్పింది ప్రేక్షకుడిని. అక్కడి వరకు చేరుకోవడానికి ప్రేక్షకుడు కాస్త సహనం వహించాల్సిందే. మధ్యమధ్యలో పోసాని తన వెక్కిలి ఆహార్యంతో ఇబ్బందిపెట్టినా దర్శకుడు దాన్ని ఎక్కువ పొడిగించకుండా మంచి పని చేశాడు.
విరామంలో తిరిగిన మలుపు ప్రేక్షకుడికి జరగబోయే విషయమేమిటో ఊహించుకునే వీలు కలిపించినా, రెండో సగంలో సున్నితమైన భావోద్వేగాలతో కథనాన్ని బాగా నడిపించాడు దర్శకుడు. ఎలాగు జరగబోయేది తెలుసు కాబట్టి జరుగుతున్న దాన్ని చూసిన ప్రేక్షకుడికి ఒకింత జాలి కూడా కలుగుతుంది. అక్కడే దర్శకుడికి మార్కులు వేయాలి. “అవ్వ బుజ్జి” పాట వచ్చే ఘట్టం సినిమాకే ఉత్తమమైనదిగా చెప్పొచ్చు. పటేలు పగలో అర్థముందని అనిపించేలా చేసింది ఈ ఘట్టం. దీనికి దర్శకుడు పాత్రలను, వాటి మధ్య భావోద్వేగాలను చిత్రీకరించిన విధానాలతో పాటు జగపతిబాబు కూడా ఒక కారణం. అక్కడక్కడ మాటలు కూడా బాగా కుదిరాయి. “క్షమించడం, ప్రేమించడం రెండూ ఒకటే రా! ఒకసారి క్షమించి చూడు, ప్రేమించడం అంటే ఏంటో తెలుస్తుంది. ఒకసారి ప్రేమించి చూడు, క్షమించడం అంటే ఏమిటో తెలుస్తుంది!” అని పటేల్ స్నేహితుడు రావు (శుభలేఖ సుధాకర్) చెప్పిన డైలాగు చాలా బాగుంది.
దర్శకుడి మరో ఆలోచనను కూడా మెచ్చుకోవాలి. క్లైమాక్స్ ని ఎక్కువగా సాగదీయకుండా త్వరగా ముగించేశాడు. కానీ కొన్ని పాత్రలు సినిమాలో పెద్దగా ఇమడవు. ఉదాహరణే, “తాన్య హోప్” పోషించిన పాత్ర. ఏదో హడావుడి చేయడానికే తప్ప ఆ పాత్ర వల్ల పటేలుకి నష్టం కానీ ప్రేక్షకుడికి లాభం కానీ ఉండదు.
అలా, తెలిసిన కథ, కథనాలతో వచ్చినప్పటికీ, సున్నితమైన భావోద్వేగాలు కలిగి పెద్దగా బోరు కొట్టించడు “పటేల్ S.I.R”.
నటనలు :
జగపతిబాబు ఈ సినిమాను పూర్తిగా తన భుజాల మీద వేసుకున్నాడు. అతడు లేని సన్నివేశం ఉండదు, “అతడు” కనిపించే సన్నివేశం కూడా ఉండదు. సినిమా అంతా “పటేల్” మాత్రమే కనిపించేంతలా పాత్రలో లీనమయ్యాడు. “సెకండ్ ఇన్నింగ్స్” అని ఒక ముద్ర వేసుకొని కేవలం సహాయ నటుడిగా మిగిలిపోవాల్సిన అవసరం లేదని, మంచి పాత్ర దక్కితే కథానాయకుడిగా కూడా చేయవచ్చని నిరూపించాడు. పటేలుగా కళ్ళలో, గొంతులో చూపించిన తీవ్రతే దీనికి నిదర్శనం.
సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, ఆమనిలకు మంచి పాత్రలు, భావోద్వేగాలు దక్కాయి.
తాన్య హోప్, పోసాని, కబీర్ దుహాన్, సుబ్బరాజు, ప్రభాకర్ ఇలా అందరూ మామూలే. “అందరి బంధువయ” సినిమాలో హీరోయిన్ గా నటించిన “పద్మప్రియ” ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది.
బలాలు :
- వాసు పరిమి కథనం. థ్రిల్లర్, రివెంజ్ డ్రామాలో సున్నితమైన భావోద్వేగాలను ఇమిడేలా చేసిన రెండో సగం చాలా బాగుంది.
- డీజే వసంత్ సంగీతం. “అవ్వ బుజ్జి” పాట మరియు నేపథ్య సంగీతం సినిమాకు బాగా బలాన్నిచ్చాయి.
- శ్యాం కె నాయుడు ఛాయాగ్రహణం. మాఫియా నేపథ్యంలో జరిగే సన్నివేశాలకు, పటేల్ పగ తీర్చుకునే సన్నివేశాలకు, కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు మధ్య మార్పుని స్పష్టంగా చూపించాడు శ్యాం కె నాయుడు.
- వారాహి నిర్మాణ విలువలు. సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు నిర్మాతలు. ఎక్కడా నాణ్యత లోపించదు.
బలహీనతలు :
- నెమ్మదిగా సాగే మొదటి సగం.
- ఆకట్టుకోని పాత్రలు, కామెడీ.
– యశ్వంత్ ఆలూరు