ఒక సినిమాలో ఎంతమంది హీరోలున్నా వాళ్ళందరినీ మించిన హీరో ఒకటి ఉంటుంది. అదే కథ. ఇటీవల కథే హీరోగా వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఒకటి “శమంతకమణి“. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది మరియు రాజేంద్రప్రసాద్ ప్రాధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు “భలే మంచి రోజు”తో పరిచయమైన “శ్రీరామ్ ఆదిత్య” దర్శకత్వం వహించారు. “భవ్య క్రియేషన్స్” పతాకంపై “ఆనంద్ ప్రసాద్” నిర్మించారు.
కథ :
శమంతకమణి పేరు గల అయిదు కోట్ల విలువైన తన కారు పోయిందని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేస్తాడు కృష్ణ (సుధీర్). ఆ స్టేషను ఇన్స్పెక్టర్ రంజిత్ (నారా రోహిత్) విచారణలో భాగంగా మహేష్ బాబు (రాజేంద్రప్రసాద్), శివ (సందీప్ కిషన్), కార్తీక్ (ఆది) లను విచారిస్తాడు. వీళ్ళకు కారుకు ఏంటి సంబంధం? విచారణలో వాళ్ళేమి చెప్పారు? నిజానికి, ఆ కారుని ఎవరు చోరి చేశారు? అన్నవి కథాంశాలు.
విశ్లేషణ :
కథ బలంగా లేనప్పుడు ప్రేక్షకుడికి బోరు కొట్టించకుండా ఉండేలా కథనంపై దృష్టి సారించాలి. ఇటీవల చాలా సినిమాల్లో కనిపించిన విషయమిది. అందుకే, కథనే పక్కాగా వ్రాసుకోవాలి. ప్రేక్షకుడికి అక్కడక్కడ ఆశ్చర్యం కలిగించాలి, అతడి ఊహకు అందని విషయాన్ని చూపించాలి. ఇలాంటి కథ ఉన్నప్పుడు, ప్రేక్షకుడికి సినిమా బోరు కొట్టే ఆస్కారం చాలా తక్కువ. అలాంటి కథే ఈ సినిమాకు వ్రాసుకున్నాడు దర్శకుడు “శ్రీరామ్”. అందుకు అతడిని అభినందించాలి.
సినిమా ప్రారంభం నుండి కథనాన్ని ఆసక్తికరంగా నడుపుతూనే నవ్విస్తూ వచ్చాడు దర్శకుడు. దీనికి కారణం అతడు సృష్టించిన పాత్రలన్నీ మనం నిజజీవితంలో తరచూ చూసేవి, వారి జీవితాలన్నీ మనం తరచూ వినేవి కావడం. ఇందులో నలుగురు హీరోలు ఉన్నప్పటికీ సినిమా మొదలయ్యే కొద్ది సేపటికే వారు మాయమైపోతారు. కనిపించకుండా పోయిన శమంతకమణి కారు అందరిని మించిన హీరోగా ఎదుగుతుంది. ఆ విషయం చివరివరకు ప్రేక్షకుడు కూడా పసిగట్టకుండా లీనమయ్యేలా సినిమాను నడిపాడు దర్శకుడు.
విచారణలో భాగంగా నిందితుల పాత్రలు చెప్పే విషయాలు బాగా నవ్విస్తాయి. దీనికి ఆయా పాత్రలతో పాటు సత్యనారాయణ (రఘు కారుమంచి) పాత్ర కూడా కారణం. నవ్విస్తూనే ప్రతి పాత్రపై ఒకింత జాలి కూడా కలిగేలా చేశాడు దర్శకుడు. విడిగా కామెడీ ట్రాక్ అన్నది లేకుండా, డైలాగుల్లో ప్రాసలు లేకుండా సందర్భానుసారంగా వచ్చే హాస్యం బాగా ఆకట్టుకుంటుంది. “మన యూత్ అందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లెమ్స్ బ్రదర్” అని మహేష్ బాబు చెప్పే డైలాగు ఉదాహరణ.
సినిమాలో చూపించిన ప్రతి సన్నివేశానికి, పరిచయం చేసిన ప్రతి పాత్రకు ఒక అర్థం ఇస్తూ నవ్విస్తూ, ఆశ్చర్యపరుస్తూ సినిమాను ముగించాడు దర్శకుడు. థ్రిల్లర్ సినిమా కావడంతో ఎక్కువగా వ్రాయడం వీలుపడదు కనుక ఈ సినిమాను తప్పకుండా చూడమని సిఫార్సు చేస్తున్నాను.
నటనలు :
నారా రోహిత్ పొలిసు ఇన్స్పెక్టర్ గా సరిగ్గా సరిపోయాడు. తనకు ప్రాధాన్యం ఉందా లేదా అన్న విషయాన్ని పట్టించుకోకుండా మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. సుధీర్ బాబు పాత్రకు సరిపోయాడు కానీ భావోద్వేగాలు చూపించాల్సిన సమయంలో ముఖంలో పలికించే హావభావాల మీద కొంచెం దృష్టి సారించాల్సి ఉంది. తన తల్లి గురించి చెప్పే సన్నివేశంలో అతడు ఏడుస్తున్నాడో, నవ్వుతున్నాడో తెలియని అయోమయంలో పడేశాడు. సందీప్ కిషన్ పాత్రకు సహజంగా అనిపించాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే కుర్రాడిగా ఆది కూడా సరిపోయాడు.
విడిగా చెప్పుకోవాల్సింది రాజేంద్రప్రసాద్ గురించి. ఆయనకున్న అద్భుతమైన కామెడీ టైమింగుతో మహేష్ బాబు పాత్రకు ప్రాణం పోశారు. ముఖ్యంగా, పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు తన కథే తను వింటున్నప్పుడు ఆయన పలికించిన హావభావాలు అద్భుతం. “శమంతకమణి” తరువాత ఈ సినిమాకు ఈయనే హీరో అని చెప్పొచ్చు.
కానిస్టేబుల్ పాత్రలో రఘు కూడా కడుపుబ్బా నవ్వించాడు.
సుమన్, ఇంద్రజ, తనికెళ్ళ భరణి, హేమ, సురేఖ వాణి, గిరి, సత్యం రాజేష్, చాందిని చౌదరి ఇలా అందరూ తమ పాత్రలకు సరిపోయారు.
బలాలు :
- శ్రీరామ్ ఆదిత్య కథ, కథనం, మాటలు & దర్శకత్వం.
- ప్రవీణ్ పూడి ఎడిటింగ్. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. ప్రవీణ్ పూడి పూర్తి న్యాయం చేశాడు.
- సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం. కథకు కావాల్సిన మూడ్ ని బాగా సెట్ చేసింది ఛాయాగ్రహణం.
- మణిశర్మ సంగీతం. పాటలు పెద్దగా రిజిస్టర్ అయ్యేలా లేవు కానీ నేపథ్య సంగీతంలో తన మార్కును చూపించారు మణిశర్మ.
- భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
– యశ్వంత్ ఆలూరు
Reblogged this on harishaluru.
LikeLike