ఫిదా (2017)

సినిమా హిట్టా కాదా అన్న విషయం పక్కనబెడితే ఆ సినిమా ద్వారా దర్శకుడు తను చెప్పాలనుకున్న అంశాలను కూలంకషంగా చెప్పాడా లేదా అన్నది చాలా ముఖ్యం. అలాంటి క్లారిటీ ఉన్న దర్శకుల్లో “శేఖర్ కమ్ముల” ముందువరుసలో ఉంటారు. సినిమాకు సామాజిక బాధ్యత ఉందని నమ్మి అదే బాధ్యతతో సినిమాలు తీసే దర్శకుల్లో కూడా శేఖర్ ఒకడు. సుదీర్ఘమైన విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఫిదా“. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను “శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్” పై “దిల్ రాజు“, “శిరీష్” నిర్మించారు.

కథ :

తన అన్నయ్య పెళ్ళి కోసం భారతదేశానికి వచ్చిన వరుణ్ (వరుణ్ తేజ్)కి అతడికి కాబోయే వదిన చల్లెలు భానుమతి (సాయి పల్లవి)తో పరిచయమవుతుంది. స్నేహంగా ఎదిగి ప్రేమగా మారిన వారిద్దరి పరిచయం ఆ తరువాత ఎలా మారింది అన్నది కథాంశం.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

ఒక్క వాక్యంలో చెబితే శేఖర్ కమ్ముల సినిమాలు ఎప్పుడూ బలంగా అనిపించవు. కానీ ఆ ఒక్క వాక్యం చుట్టూ అతడు పాత్రలు, వాటి తాలూకు భావోద్వేగాలు, కథ జరిగే ప్రాంతం, మాటలు, పాటలు, ఇలా అన్ని విషయాలను చాలా బలంగా పొందుపరుస్తాడు. అప్పుడు ప్రేక్షకుడు ఆ సినిమాను ఇలా ఒక్క వాక్యంగా చూడడం మానేస్తాడు. దీనికి ఉదాహరణలే శేఖర్ ఇదివరకు తీసిన “ఆనంద్”, “గోదావరి”, “లీడర్” సినిమాలు.

శేఖర్ తన సినిమాల్లో కథ జరిగే ప్రాంతానికి కూడా బాగా ప్రాముఖ్యతను ఇస్తాడు. ఈ సినిమాలో “తెలంగాణ“లోని “భన్సువాడ” ప్రాంతాన్ని తన కథ కోసం ఎంచుకొని పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా సృష్టించిన శేఖర్ తెలంగాణలోని పలు సంప్రదాయాలను కూడా తెరపై ఆవిష్కరించాడు. ఉదాహరణే, అక్కడి పెళ్ళి సంప్రదాయం, బతుకమ్మ పండుగ. ఇదే కాకుండా, ఆ ఊరిలో కనిపించే ప్రతీ ఒక్క పాత్ర (హీరోయిన్ తో సహా) ఆద్యంతం తెలంగాణ యాసలోనే మాట్లాడతాయి. ఆ పాత్రలు పాడుకునే “వచ్చిండే” పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలోనే ఉంటుంది. కేవలం తెలుగు డైలాగులున్న సినిమాను కాదు, ఇలా తెలుగు సంప్రదాయాలను, యాసలను పరిచయం చేసే సినిమానే నిజమైన తెలుగు సినిమా. ఇది ఏ భాషలో తీసే సినిమాకైనా వర్తిస్తుంది.

పైన చెప్పుకున్నట్టుగా, సినిమాకు సామాజిక బాధ్యత ఉందని నమ్మే శేఖర్ తన సినిమాల్లోని ముఖ్య పాత్రలకు కూడా ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. ప్రేమ, పెళ్ళి కాకుండా తన సినిమాల్లోని పాత్రలకు జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. ఈ సినిమాలో కూడా అంతే. తల్లి కోరిక మేరకు “డాక్టర్” అయిన వరుణ్, తన ఊరిని బాగుచేసుకోవాలి అనుకునే “అగ్రికల్చర్ కోర్స్” చదివే భానుమతి.

ఇకపోతే, సున్నితైన భావోద్వేగాలను కూడా చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. పెళ్ళి తరువాత తన ఇంట్లోకి అడుగుపెడుతున్న భానుమతి అక్కను తన పైటకొంగుకున్న బ్రహ్మముడి ప్రక్కకు లాగే సన్నివేశం హృదయాన్ని హత్తుకుంటుంది. అలాగే, భానుమతి – వరుణ్ ల స్నేహం బలపడే సన్నివేశాలను కూడా బాగా చిత్రీకరించాడు దర్శకుడు. ఆ క్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది “హేయ్ పిల్లగాడ” పాట. ఇందులో ప్రకృతిని ఆవిష్కరించిన తీరు, పాత్రల మధ్య స్నేహాన్ని చూపించిన తీరు, పాత “మల్లీశ్వరి” సినిమాలోని “పరుగులు తీయాలి” పాటను వాడుకున్న తీరు, పాట కోరియోగ్రఫీ అన్నీ అద్భుతం.

అలా, మొదటి సగమంతా ఆహ్లాదంగా నడిచిన కథనం తరువాత రెండో సగంలో పాత్రల తాలూకు సమస్యలను బాగా రిజిస్టర్ చేయగలిగిన దర్శకుడు వాటికి పరిష్కారం వెతకడంలోనే జాప్యం చేశాడు. బహుశా, సమస్యకు పరిష్కారం వెంటనే చెప్పేస్తే సినిమా అయిపోతుంది అనుకున్నాడేమో, అనవసరమైన పాత్రలను, సన్నివేశాలను చూపించి కథనాన్ని సాగదీశాడు. మొదటి సగంలో కలిగిన ఆహ్లాదం రెండో సగంలో బాగా నీరసించిపోయిన సమయానికి మంచి క్లైమాక్స్ తో సినిమాను ముగించాడు. తద్వారా, ప్రేక్షకుడు ఓ మంచి సినిమా చూసిన భావనతో బయటకు రావచ్చు.

ఈ క్రమం అంతా మెచ్చుకోదగిన విషయమేమిటంటే, సినిమాకు ముఖ్యమైన భానుమతి పాత్ర ఔచిత్యాన్ని ఎక్కడా దెబ్బతీయలేదు దర్శకుడు.

మొత్తానికి, చాలారోజుల తరువాత వచ్చి తన సినిమాతో ప్రేక్షకులను “ఫిదా” చేసే ప్రయత్నం విజయవంతంగా చేశాడు శేఖర్ కమ్ముల.

నటనలు :

మళయాళ సినిమా “ప్రేమమ్” చూసినవారికి ఈ సినిమా చూడడానికి ప్రధాన కారణం “సాయి పల్లవి“. చూడనివారికి ఈ సినిమాను ఇష్టపడడానికి కూడా కారణం “సాయి పల్లవి“. ఎందుకంటే, సినిమా మొత్తం తనే ఉంటుంది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా బాగా బలాన్ని చేకూర్చింది. తెలంగాణ యాసను ఎక్కడా ఎటువంటి తప్పు లేకుండా మాట్లాడడం అద్భుతం. వరుణ్ తేజ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. పలుచోట్ల భావోద్వేగాలు చక్కగా పలికించాడు. భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

భానుమతి అక్కగా నటించిన శరణ్య, తండ్రిగా నటించిన సాయి చంద్, మేనత్తగా నటించిన గీత భాస్కర్ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. వరుణ్ కి అన్నగా నటించిన రాజా, ఫ్రెండ్ గా చేసిన సత్యం రాజేష్ కూడా బాగా చేశారు. హర్షవర్ధన్ రానే ఒక చిన్న పాత్రలో కనిపించాడు.

బలాలు :

  1. శేఖర్ కథ, కథనం, మాటలు & దర్శకత్వం. ఈ విభాగాలు అన్నింటిలో శేఖర్ మెప్పించాడు.
  2. రాజీవ్ నాయర్ కళాదర్శకత్వం. తెలంగాణ వాతావారణాన్ని చాలా చక్కగా సృష్టించారు.
  3. విజయ్ సి కుమార్ ఛాయాగ్రహణం. రాజీవన్ సృష్టించిన వాతావరణాన్ని తెరపై ఇంకా అందంగా ఆవిష్కరించారు.
  4. శక్తికాంత్ కార్తిక్ సంగీతం. పాటలన్నీ బాగా కుదిరాయి. ముఖ్యంగా, “హేయ్ పిల్లగాడ” అనే పాట.
  5. జీవన్ బాబు నేపథ్య సంగీతం. సన్నివేశాలకు తన నేపథ్య సంగీతంతో పూర్తి న్యాయం చేశారు.
  6. నిర్మాణ విలువలు. ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరు అయిన “శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్” మంచి నిర్మాణ విలువలతో సినిమాలో ఎక్కడా నాణ్యత లోపించకుండా చేశారు.

బలహీనతలు :

  1. రెండో సగంలో నెమ్మదించిన కథనం.

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s