పూలనే కునుకేయమంటా – ఐ

తమిళ సినిమాలు తెలుగులో అనువాదం చేసే క్రమంలో పాటల అనువాదం తాలూకు బాధ్యతను ఒకప్పుడు “రాజశ్రీ” అనే రచయిత తన భుజాలపై వేసుకొని చక్కగా నిర్వర్తించేవారు. తరువాత “వేటూరి”, “ఏ.ఎం.రత్నం – శివగణేష్”, “భువనచంద్ర”, “వెన్నెలకంటి రాజేశ్వరరావు”,  అడపాదడపా “సీతారామశాస్త్రి” లాంటివారు తీసుకున్నారు. రత్నం ద్వయాన్ని ప్రక్కనబెడితే, మిగతా రచయితలు కొన్నిసార్లు తమ రచనలతో మెప్పించినా, మరికొన్నిసార్లు అర్థాన్ని విడిచి శబ్దానికి బానిసైన తమ పదజాలంతో, శ్రోతకు తాను అద్దెకు తెచ్చుకున్న పాట వింటున్న భావనకలిగించారు. క్రమేణా, అనువాద సాహిత్య బాధ్యతను ఇప్పటి రచయితలు తీసుకున్నారు. శబ్ద బానిసత్వం కొనసాగుతున్న క్రమంలో ఆ బంధాలను కొంతమేర తెంచుకున్నది “శంకర్” తీసిన “” సినిమాలోని “పూలనే కునుకేయమంటా” అనే పాట. తమిళంలో “మదన్ కర్కి” రచించిన ఈపాటను తెలుగులో “అనంత శ్రీరామ్” రచించారు.

“ఐ” సినిమాలాగే ఈ పాట కూడా పెద్దగా గుర్తింపుకు నోచుకోలేకపోయింది. అందుకే, మన సినిమా పాటల విశ్లేషణ కార్యక్రమంలోని ఈ సంచిక కోసం ఎంపిక చేయబడింది…

సినిమా : ఐ

పాట : పూలనే కునుకేయమంటా

దర్శకుడు : శంకర్

రచయిత : అనంత శ్రీరామ్

గానం : హరిచరణ్, శ్రేయా ఘోషాల్

సంగీతం : ఏ. ఆర్. రెహమాన్

తనతో పాటు యాడ్ ఫిలింలో నటించడానికి వచ్చిన హీరో లింగేశ (విక్రమ్) తనకు రాని నటనతో ఆ షూటింగ్ కి ఇబ్బంది కలిగించే క్రమంలో, ఆ ఫిలిం సరిగ్గా రావడానికి, మరో నటుడి వల్ల తనకున్న ప్రమాదం నుండి బయటపడడానికి హీరోయిన్ దియా (ఎమీ జాక్సన్) లింగేశనుప్రేమిస్తున్నట్టు అబద్ధం చెబుతుంది. అది నిజమని నమ్మిన లింగేశ షూటింగ్ కి సహకరించడం మొదలుపెట్టే సందర్భంలో వచ్చే పాట ఇది.

పూలనే కునుకేయమంటా

తను వచ్చేనంట తను వచ్చేనంట

పైన చెప్పుకున్నట్టుగా, పాటలను అనువదించే క్రమంలో అర్థానికన్నా శబ్దానికే ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. తమిళంలో “పూక్కలే…” అంటూ సాగే పదం యొక్క శబ్దం రాబట్టే ప్రయత్నంలో “పూలనే…” అని పల్లవిని మొదలుపెట్టాడు రచయిత. నిజానికి అక్కడ “పూవులనే…” అనే పదం కూడా సరిపోయేది. అది ఉండుంటే, పాట మరింత మెరుగ్గా మొదలయ్యేది.

హేయ్  అంటే మరి నేనను అర్థము తెలుసోయ్ నిన్నా మొన్న

అరె  అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా

ఈ సినిమా పేరు “”. దానికి రకరకాల అర్థాలను దర్శకుడు సినిమాలో చెప్పుకుంటూ వెళ్ళాడు. కథాపరంగా, ఈ పాట వచ్చే సమయంలో హీరోహీరోయిన్లు “” అనే ఒక పెర్ఫ్యూమ్ తాలూకు యాడ్ ఫిలిం చేస్తుంటారు. దానికి అనుగుణంగా, తమిళంలో ఈ రెండు వాక్యాలు “ఒకవేళ ఐ అంటేఅందం అయితే ఆ ఐలకే (అందాలకే) ఐ (అందం) ఈమె… ఒకవేళ ఐ అంటే దైవం అయితే ఆ దైవం లాంటిదే ఈమె” అనే తాత్పర్యం వచ్చేలా తమిళ రచయిత వ్రాశాడు. కానీ తెలుగులో రచయిత “” అంటే ఇంగ్లీషులో “ఐ (నేను)” అనే మాటతో సమన్వయం చేస్తూ వ్రాశాడు. ఇది చాలాచక్కని సమన్వయం. దీని ద్వారా తెలుగులోని హీరో పాత్ర “” అనే పదాన్ని అర్థం చేసుకున్న కోణమే మారిపోయింది. “నేను, తాను ఒకటై నేనే తానైపోయాను” అనే తాత్పర్యాన్ని తీసుకొనివచ్చాడు.

అయ్యో నాకు ఎదురై ఐరావతమే నేలకు పంపిన తెలికలువై

తను విచ్చెనంట తను వచ్చెనంట

స్వర్గంలో ఉంటాయని చెప్పబడినవి “ఐరావతం” మరియు “తెల్ల కలువలు”. సందర్భానుసారంగా, హీరోయిన్ చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్ముతాడు హీరో. స్వతహాగా ఆవిడ అభిమాని అయిన హీరో, ఆమె అతడిని ప్రేమిస్తున్నది అని తెలిసినప్పుడు ఉప్పొంగిపోతాడు. ఎక్కడోపేదవాడలో ఉండే అతడికి ఇంత పెద్ద అదృష్టం దక్కడాన్ని నమ్మలేకపోతాడు. నేల మీద బ్రతికే అతడికి స్వర్గం నుండి ఒక తెల్ల కలువ (హీరోయిన్) ని ఐరావతం (అదృష్టం) మోసుకొని వచ్చిందన్న అతడి మనోభావాన్ని తెలిపాడు రచయిత ఇక్కడ.

అసలు ఇపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడు నా మనిషై

అది జరగదని ఇలా అడుగు వేసినా నిను వలచిన మనసై

ఇవి రెండు మామూలు వాక్యాలే కానీ ఇక్కడ శబ్దానికి రచయిత లొంగినట్టు అనిపిస్తుంది. హీరోకన్నా ఘనుడు ఈ లోకాన కనబడడు అన్న నమ్మకంతో అతడిని వలచింది హీరోయిన్. ఇది ఆ వాక్యాల తాత్పర్యం. కానీ “కనబడు నా మనిషై…” అనే దగ్గర బాణీలో ఒక చిన్న విరామం రావడం, అక్కడ “కనబడు” అనే మాట ఇమడకపోవడం వాక్యాన్ని అసంపూర్ణంగా మార్చింది. బహుశా, ప్రతి వాక్యం చివర్లో “ఐ” అనే శబ్దం రావాలన్న తాపత్రయంతో రచయిత ఈ విధంగా వ్రాసి ఉంటాడు.

ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ”…

ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి  నిజమై

ఈ పాటపై విశ్లేషణ వ్రాయడానికి ప్రేరేపించినవి, ఈ పాటలో ఉత్తమమైనవి ఈ రెండు వాక్యాలు. పల్లవిలో, “” అంటే ఆంగ్లంలోని “ఐ (నేను)” అనే అర్థంతో సమన్వయం చేసుకున్న రచయిత ఇక్కడ “” అంటే “కన్ను”కి ఆంగ్ల పదమైన “”తో సమన్వయం చేసుకున్నాడు. తనప్రియురాలు ఎలా ఉండాలో క్షణక్షణం కలలు కంటూ వచ్చిన హీరోకి, ఆ రూపం వాస్తవంలో అతడిని కలిసింది. “ఇన్ని కలల ఫలితమున…” అని కలలను ఒక తపస్సుతో పోల్చాడు రచయిత.

నా చేతిని వీడని గీత నువ్వై

నా గొంతుని వీడని పేరు నువ్వై

తడి పెదవుల తళుకవనా నవ్వునవనా

ఎంత మధురం!!

“తడి పెదవుల తళుకు” అంటే ముద్దు పెట్టిన అతడి ఎంగిలితో తడిసిన ఆవిడ పెదవుల మెరుపు, “నవ్వునవానా” అంటే ఆమె సంతోషానికి కారణాలుగా మారాలన్న అతడి కోరికలను ఈ వాక్యాల తాత్పర్యంగా తీసుకోవచ్చు.

నీరల్లె జారే వాడే నాకోసం ఒక ఊడయ్యాడా

నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా

మొదట్లో, స్థిమితంగా యాడ్ ఫిలింలో నటించకుండా సహకరించని హీరో, హీరోయిన్ ప్రేమిస్తున్నదని తెలిసిన వెంటనే నిలకడగా ఉంటూ సహకరిస్తున్నాడు. ఈ కథలో హీరో ఒక పేదవాడు. అలాంటి వ్యక్తి తనకోసం నిలబడి, తనకు అండగా ఉన్నాడని హీరోయిన్ కోణాన్ని చెప్పేదే రెండోవాక్యం.

నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా

నా రాతి గుండెని తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా

తన ప్రేమతో అతడిలోని కొత్త కోణాన్ని (నటన) ఆవిష్కరించిందని హీరో హీరోయిన్ గురించి చెప్పేవి ఈ రెండు వాక్యాలు.

యుగములకైనా మగనిగా వీణ్నే పొగడాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే

ప్రతి ఉదయాన తన వదనాన్నే నయనము చూసేలాగ వరమేదైనా కావాలె

రెండూ మామూలు వాక్యాలే కానీ శబ్దం కోసం అర్థాన్ని కాస్త పణంగా పెట్టినది మొదటి వాక్యం. అక్కడ, “పొగడాలి”కి బదులు “పొందాలి” అని ఉండుంటే మరింత మంచి వాక్యంగా అది మారి ఉండేదేమో. రెండో వాక్యం బాణీకి, అర్థానికి న్యాయం చేసింది.

అలా, శబ్దం, బాణీల బంధాలను కొంతమేర తెంచుకొని దాదాపుగా “తెలుగు” సినిమా పాటలా అనిపించే ఈ పాట “అనంత శ్రీరామ్” రచనా పటిమకు ఒక నిదర్శనం. దీన్ని మెచ్చి తన సినిమాలో పెట్టుకున్న దర్శకుడు శంకర్, వినసొంపైన బాణీ కట్టిన సంగీత దర్శకుడు రెహమాన్, హృద్యంగా, స్పష్టంగా పాడిన గాయకులు హరిచరణ్, శ్రేయా ఘోషాల్ కు అభినందనలు తెలుపుకోవాలి. ఈ పాట తాలూకు యూట్యూబ్ లింక్ ను క్రింద ఇస్తున్నాను. ఓసారి సాహిత్యాన్ని గమనించండి. 🙂

“Wayback Machine”లో గల నవతరంగం వ్యాసం ఇక్కడ.

–      యశ్వంత్ ఆలూరు

30/07/2017

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s