“మనిషి ఎలా బ్రతకాలో నిర్ణయించేది వ్యవస్థ కాదు. మనిషే వ్యవస్థ!” అని “ఆటోనగర్ సూర్య” సినిమాలో ఒక మాట ఉంది. ఇది “సినిమా” విషయంలో కూడా వర్తిస్తుంది. ఒక సినిమా అలా తీయాలి, ఇలా తీయాలి అని రూల్స్ ని పాటిస్తూ అదే చట్రంలో ఇరుక్కుపోతే సినిమా ఎప్పటికీ మారలేదు, ఎదగలేదు. మూస ట్రెండ్ తాళాలను బద్దలుగొట్టిన ఎలాంటి సినిమానైనా ప్రేక్షకుడు నెత్తిమీద పెట్టుకుంటాడు. “శివ“, “ఖుషి“, “అతడు” లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు ఇదే కోవలోకి చేర్చవచ్చు “అర్జున్ రెడ్డి” అనే సినిమాను. విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా నటించిన ఈ సినిమాతో “సందీప్ రెడ్డి వంగ” దర్శకుడిగా పరిచయమయ్యాడు. “భద్రకాళి పిక్చర్స్” పతాకంపై “ప్రణయ్ రెడ్డి వంగ” నిర్మించారు.
కథ :
డాక్టర్ అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) వ్యక్తిత్వం, ప్రేమ, జీవితం.
విశ్లేషణ :
“సినిమా అనేది ఒక అనుభూతి“. ఈ అనుభూతులు పలురకాలు. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు “మనం ఒక మంచి సినిమా చూస్తున్నాం” అనే అనుభూతి కలుగుతుంది. మరికొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు “మనం ఈ సినిమా చూడకుంటే బాగుండేది” అనే అనుభూతి కలుగుతుంది. ఇంకొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అసలు సినిమా చూస్తున్న అనుభూతే కలగదు. మనకు తెలిసిన వ్యక్తుల జీవితాలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అలాంటి వ్యక్తే “అర్జున్ రెడ్డి“.
ఇలా ఒక పాత్ర జీవితం మీద తీసే సినిమాల్లో ఆ పాత్ర పుట్టుక నుండో లేదా పసితనం నుండో దాన్ని నెలకొల్పుకుంటూ వస్తారు దర్శకులు, మాములుగా. ఉదాహరణకు, “ఆర్య 2“. కానీ ఈ సినిమాలో దర్శకుడు సందీప్ ఆ పని పెట్టుకోలేదు. అలాగని పాత్ర తత్త్వాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయకుండా కూడా వదిలేయలేదు. Hope is a good thing అని నమ్మే అతడి తత్త్వాన్ని బామ్మ (కాంచన) మాటల్లో చాలా బలంగా నెలకొల్పాడు. దీనికి కాంచన గారిని కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. సరిగ్గా గమనిస్తే, అర్జున్ పాత్రలోని ఈ తత్త్వాన్ని సినిమాలో ఎక్కడా దెబ్బతీయలేదు దర్శకుడు. ఇక పాత్ర ప్రవర్తించే తీరు ప్రేక్షకుడు తన జీవితంలోని ఓ ఘట్టాన్ని గుర్తుచేసుకునేలాగో లేదా తాను కూడా అలా ప్రవర్తిస్తే బాగుండు అని అనిపించేలాగో ఉంటుంది. సమాజాన్ని బాగా చదివేశాడా అన్నట్టుగా అర్జున్ రెడ్డి పాత్రను తీర్చిదిద్ది ప్రీతి (షాలిని) పాత్ర విషయంలో అన్యాయం చేశాడు దర్శకుడు. అర్జున్ కి కనీసం పోటీగా ఆ అమ్మాయికి ఒక వ్యక్తిత్వాన్ని, తత్త్వాన్ని ఎందుకు ఇవ్వలేకపోయాడో తెలియదు. మొదట్లో, సీనియర్ కాబట్టి అందరి ముందు ముద్దు పెట్టుకుంటే ఊరుకుంది అనుకోవచ్చు, అతడంటే కాలేజీలో అందరికీ భయం కనుక అతడు చెప్పే పాఠాలు విన్నది అనుకోవచ్చు. ఆవిడ వ్యక్తిత్వం, ఆలోచనలు ఏమిటో ప్రేక్షకుడికి ఏమాత్రం తెలియజేయకుండా నేరుగా అర్జున్ ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆమెకి తెలియజేసి ఆమెకి అతడంటే పిచ్చి ప్రేమను కలిగేలా చేశాడు. దానితో కథనం మొత్తం అర్జున్ వైపుకే పూర్తిగా తిరిగిపోయింది.
ఈ సినిమా మొత్తానికి అత్యుత్తమ ఘట్టం కూడా అర్జున్ ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆమెకి తెలియజేసేదేనని చెప్పుకోవచ్చు. ప్రీతిని అవమానించిన అమిత్ కోసం అతడి కాలేజీ కారిడార్ లో నడిచే దగ్గర నుండి ప్రీతిని హత్తుకునే వరకు ఒకే షాట్ లో నడుస్తుంది సన్నివేశం. అక్కడ ఎటువంటి ఎడిటింగ్ కట్స్ ని ఎంచుకోకపోవడం, రకరకాల భావోద్వేగాలను విజయ్ దేవరకొండ వెంటనే మార్చి పలికించడం, ఆ అమ్మాయంటే అతడికి ఎంత ఇష్టమో చెప్పే అద్భుతమైన డైలాగులు, చివర్లో మంచి నేపథ్య సంగీతంతో సన్నివేశాన్ని ముగించడంతో “అర్జున్ రెడ్డి” అనే ఫుల్ బాటిల్ కిక్కుని తలకు ఎక్కించేశాడు దర్శకుడు “సందీప్ రెడ్డి”.
అర్జున్ రెడ్డి ఆసాంతం అలరించడానికి కారణం సినిమా వినబడిన విధానం. సినిమాలో చూపించే ప్రతీ భావోద్వేగానికి వెనుక చిన్నగానైనా, పెద్దగానైనా ఒక నేపథ్య సంగీతాన్ని వినిపించడం మన దర్శకులకు అలవాటు. ఈ అలవాటుని “శివ”తో బద్దలుగొట్టాడు “వర్మ”. మాట వినబడే చోట మాటను మాత్రమే వినిపించి, మాట లేకుండా సన్నివేశపు ఔన్నత్యాన్ని పెంచాల్సిన చోట మాత్రమే సంగీతాన్ని వినిపించి తెలుగు సినిమాలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. చాలాకాలం తరువాత “తరుణ్ భాస్కర్” తన “పెళ్ళిచూపులు”తో తుడుచుకుపోయిన ఆ శ్రీకారాన్ని ఇంకొంచెం చుట్టగా, “సందీప్ రెడ్డి” ఈసారి దాన్ని పరిపూర్ణం చేశాడు. ఈ పద్ధతి తెర ముందున్న ప్రేక్షకుడిని తెరలోకి తీసుకొనిపోయి అక్కడ జరిగే సంఘటనలకు అతడిని ప్రత్యక్ష సాక్షిని చేసింది. అర్జున్-ప్రీతిలు పెళ్ళి విషయంలో గొడవపడే సన్నివేశం ఇందుకు ఉత్తమ ఉదాహరణ. రెండు ఎదురెదురు ఇళ్ళ మధ్యనున్న రోడ్డు మీద మనుషులు గట్టిగా మాట్లాడుకుంటే ఎలా వినబడుతుందో సరిగ్గా అలాగే సౌండ్ రికార్డింగ్ చేయడం అభినందనీయం. “అర్జున్ రెడ్డి” ఒక అనుభూతి అని అనిపించడానికి కొన్ని సన్నివేశాల్లో “సుమనస వందిత” లాంటి కర్నాటిక్ సంగీతాన్ని, ఇతర పాశ్చాత్య సంగీతాన్ని వాడుకోవడం, దానికి తగ్గ వాతావరణాన్ని సన్నివేశంలో సృష్టించడం కూడా కారణమే. ఇందుకు దర్శకుడి ఆలోచనతో పాటు సౌండ్ డిజైన్ చేసిన “సింక్ సినిమా” బృందాన్ని కూడా మెచ్చుకోవాలి.
సహజంగా, కథా చర్చలు జరిగే సమయంలోనే గీతరచయితలకు సందర్భాలు చెప్పి పాటలు వ్రాయించుకొని వాటిని చిత్రించడం జరుగుతుంది. ఈ సినిమాలోని “మధురం” పాట విషయంలో అలా జరగలేదు. ముందు సన్నివేశాలను చిత్రీకరించేసి ఆ తరువాతే రచయితతో పాటను వ్రాయించడం జరిగింది. కళ్ళముందు జరిగే విషయాన్ని వర్ణించడమే “ఆశువు కవిత్వం” అంటారు. ఆ విషయంలో రచయిత “శ్రేష్ఠ”కు పూర్తిగా మార్కులు వేయాలి. ఉదాహరణకు, “మధురమే ఈ క్షణమే… మధురమే వీక్షణమే…”, “ఊరించే రుచులను మరిగె ఉడికించే తాపాలే…” మరియు “తీరం ముడివేసిన దారం తీర్చే ఎద భారాలే…” లాంటి వాక్యాలు తెరపై జరిగే సన్నివేశాలకు కవితాత్మక విశ్లేషణ. ఇదే పద్ధతి వేరే ఏ పాటకైనా అనుసరిచారో లేదో తెలియదు.
మొదటి సగం అంతా అర్జున్ పాత్రలోని రకరకాల భావోద్వేగాలను చూపిస్తూ విరామం సమయానికి సినిమా టైటిల్ వేయడంతో “This is Arjun Reddy!” అనిపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ షాట్ నే “అర్జున్ రెడ్డి” టైటిల్ బాక్గ్రౌండ్ యానిమషన్ లో వాడుకోవడం కూడా సృజనాత్మకంగా ఉంది.
మొదటి సగంలో తెరలోకి ప్రేక్షకుడిని తీసుకొని వెళ్ళిన దర్శకుడు రెండో సగంలో అతడిని మళ్ళీ తెర ముందు కూర్చోబెట్టాడు. జియా శర్మ (జియా శర్మ) పరిచయం, ఆమెతో అర్జున్ స్నేహం ఇలా అన్నీ తరచూ వచ్చే సినిమాల్లోని డ్రామాలాగే సాగాయి. “Break Up” పాటలో బైక్ పై నుండి క్రింద పడిన తరువాత కూడా లేచి ముద్దుపెట్టుకొనే సన్నివేశం చాలా కొత్తగా అనిపించడమే కాకుండా పాత్రల ఎమోషన్స్ ని కూడా బాగా రిజిస్టర్ చేసింది.
నీరసిస్తున్న కథనం వల్ల తెర ముందుకి వచ్చేసిన ప్రేక్షకుడికి అర్జున్ స్నేహితుల్లో ముఖ్యుడు అయిన శివ (రాహుల్ రామకృష్ణ) మళ్ళీ తెర తలుపులు తెరిచాడు. ఉదాహరణలే, అతడు పనిమనిషితో మరియు తన తండ్రితో మాట్లాడే సన్నివేశాలు. ఈ రెండింటిలో ఉన్న మాటలు నిజంగా దర్శకడు స్క్రిప్ట్ దశలో వ్రాసినవా లేక షూటింగ్ సమయంలో అలా ఆ నటుడు మాట్లాడేశాడా అన్నట్టుగా ఉంటాయి. అలాగే, శివ డాక్టర్ వృత్తిని గురించి అర్జున్ అతడి మరో స్నేహితుడికి చెప్పే సన్నివేశం కూడా కెమెరాతో షూట్ చేసినట్టు కాకుండా ఏదో కళ్ళముందు అలా జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది.
డ్రామా ఉన్నప్పటికీ, రెండో సగంలో అర్జున్ రెడ్డి పడే బాధ ప్రేక్షకుడి మనసులో బలంగా రిజిస్టర్ అవుతుంది కానీ కథనం క్లైమాక్స్ వరకు వెళ్ళే క్రమంలో బాగా నెమ్మదించి, ఇక ఎలాగోలా ఈ కథను ముగించాలి అన్న తాపత్రయంతో చేసిన ప్రయత్నం అన్నట్టుగా సినిమాను పడేసిన ఫీలింగ్ వస్తుంది. అక్కడ దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఒకానొక ఇంటర్వ్యూలో క్లైమాక్స్ కి వేరే వెర్షన్ ఉందని, అప్పటికే మూడు గంటల వరకు కూర్చోబెట్టిన ప్రేక్షకుడిని ఇంకా ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక క్లైమాక్స్ అలా ముగించాల్సి వచ్చిందని దర్శకుడు సందీప్ చెప్పాడు. కానీ ఆ ఇంటర్వ్యూలో అతడు చెప్పిన ఇంకో వెర్షన్ తీసుంటే నిజంగా ఈ సినిమా అందరూ అంటున్న “కల్ట్ క్లాసిక్”గా మిగిలిపోయేది. మిగతా సినిమా అంతా విస్కీ అయితే క్లైమాక్స్ మాత్రం ఆ కిక్కుని దించేసే మజ్జిగని చెప్పొచ్చు.
అలా, “అర్జున్ రెడ్డి” తెలుగు సినిమాలో గొప్ప సినిమాకు కేవలం అంగుళం దూరంలో ఆగిపోయిన చాలా మంచి సినిమా. ఎంతో నిజాయితీగా తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి కనుక రెండుమూడు సార్లు చూసినా కూడా తప్పు లేదనిపించే సినిమా.
నటనలు :
మాములుగా, మన పరిశ్రమలో సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్న దాఖలాలున్నాయి. కానీ ఈ సినిమాతో తన అసలు పేరుని కూడా మార్చేసుకొని “అర్జున్ రెడ్డి”గానే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా పాత్రను రక్తికట్టించాడు విజయ్ దేవరకొండ. సినిమాను తీయడంలో దర్శకుడికి ఉన్న నిజాయితే ఇతడి నటనలోనూ నిమిషనిమిషాన కనబడింది. అర్జున్ రెడ్డి ధాటికి శాలిని పాండేకు చేసిన పాత్రకు అన్యాయం జరిగింది. ప్రీతి కోసమే కదా అర్జున్ అలా అయిపోయాడు అనుకుంటే పొరపాటే. సినిమా అంత అర్జున్ ప్రీతి గురించి ఆలోచిస్తే, ప్రేక్షకుడు మాత్రం కేవలం అర్జున్ గురించే ఆలోచిస్తాడు. నటనపరంగా ఫరవాలేదు అనిపించినా, పాత్రకు కొత్తగా ఉంది శాలిని.
చాలాకాలం తరువాత తెరపై కనిపించిన కాంచన, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు, జియా శర్మ, ప్రియదర్శి, గోపీనాథ్ భట్, పద్మజ తమ పాత్రలకు న్యాయం చేశారు.
చివరగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన నటుడు “రాహుల్ రామకృష్ణ”. షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రామకృష్ణకు ఇదే మొదటి సినిమా. అర్జున్ రెడ్డిని ఎంతగా ప్రేమించినా, “శివ” అనే పాత్ర లేకపోతే అర్జున్ అసంపూర్ణంగానే మిగిలిపోతాడు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, రామకృష్ణ నటించలేదు, అది అతడి ప్రవర్తన అనేలా చేశాడు. “శంకరాభరణం” సినిమాకు “అల్లు రామలింగయ్య”, “అర్జున్ రెడ్డి” సినిమాకు “రాహుల్ రామకృష్ణ”.
బలాలు :
దాదాపుగా అన్నీ బలాలే ఈ సినిమాకు.
- సందీప్ రెడ్డి వంగ.
- విజయ్ దేవరకొండ.
- రాహుల్ రామకృష్ణ.
- రాజ్ తోట. ఇతడి ఛాయాగ్రహణం సినిమాకు చాలా పెద్ద బలం. పైన చెప్పుకున్న సింగల్ షాట్ సన్నివేశం మరియ “Break Up” పాట అతడి బలమెంతో చూపిస్తాయి.
- హర్షవర్ధన్ రామేశ్వర్. ఎక్కువగా లేకపోయినప్పటికీ, సినిమాలో నేపథ్య సంగీతం అవసరమైనప్పుడు హర్షవర్ధన్ రెచ్చిపోయాడు. అర్జున్ రెడ్డికి కోపం వచ్చినప్పడు వచ్చే సంగీతం, ప్రీతి పెళ్ళి అయిపోయిందని తెలిసినప్పుడు అర్జున్ ఆమెకోసం పరుగెత్తే సమయంలో వచ్చే వయోలిన్ నేపథ్య సంగీతం ఉత్తమమైనవి.
- రధన్. కథలో భాగంగా సాగే పాటలకు కథను మరింత బలపరిచే బాణీలు సమకూర్చాడు రధన్.
- ప్రణయ్ రెడ్డి వంగ. దర్శకుడి అన్నే ఈ సినిమాకు నిర్మాత అవ్వడం మంచి స్వేచ్చను ఇచ్చాయి దర్శకుడికి. తమ్ముడి తపనను పూర్తిగా అర్థం చేసుకొని ఈ ప్రణయ్ సినిమా చేశారని సినిమా నాణ్యత చెబుతుంది.
బలహీనతలు :
- ప్రీతి. సినిమా అంతా అర్జున్ రెడ్డి కోణంలోంచి జరిగినప్పటికీ హీరోయిన్ పాత్రకు ఒక వ్యక్తిత్వం ఇవ్వాల్సిన అంశంపై అస్సలు దృష్టి సారించినట్టు అనిపించింది.
ఈ చిత్రం నేర్పిన పాఠం :
నిజాయితీగా తీసిన సినిమాకు విజయం తథ్యం.
– యశ్వంత్ ఆలూరు