జై లవ కుశ (2017)

సినిమాకు కథే ప్రాణం కానీ ఆ కథకు ఊపిరి పోసి దాన్ని ప్రేక్షకుడి వరకు తీసుకొని వెళ్ళేది మాత్రం నటులే. అందుకే, ఒక్కోసారి అద్భుతమైన కథలు సరైన నటులు లేక మరుగునపడిన సందర్భాలు, ఓ మోస్తరు కథ కూడా నటుల వల్ల బ్రహ్మరథం పట్టించుకున్న దాఖలాలు సినీచరిత్రలో ఉన్నాయి. ఈ రెండో కోవకు చెందిన సినిమానే “జై లవ కుశ“. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “బాబీ” దర్శకుడు. “ఎన్టీఆర్ ఆర్ట్స్” పతాకంపై “కళ్యాణ్ రామ్” ఈ సినిమాను నిర్మించారు. రాశి ఖన్నా, నివేథా థామస్ కథానాయికలుగా నటించారు.

కథ :

ఒకే తల్లికి జన్మించిన కవలలు జై (ఎన్టీఆర్), లవ కుమార్ (ఎన్టీఆర్) మరియు కుశ (ఎన్టీఆర్) చిన్నతనంలోనే విడిపోయి విడివిడిగా పెరిగి ఒక్కొక్కరు ఒక్కో రకమైన జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్ళు విడిపోవడానికి కారణమేంటి? తరిగి ఎలా కలిశారు? ఆ తరువాత ఏమైంది? అన్నవి కథాంశాలు.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

తన భార్య సీతను అపహరించుకొని పోయినందుకు రాక్షస రాజు రావణుడితో యుద్ధానికి దిగి అతడిని చంపి దేవుడయ్యాడు రాముడు. ఇది రామాయణాన్ని అందరూ చూసే కోణం. దీనికి రెండో కోణముంది. అదే, “సీతను రావణుడు ఎందుకు అపహరించాడు?” అన్న ప్రశ్న. దానికి సమాధానం రావణుడి దగ్గర కాదు, రాముడి దగ్గరే దొరుకుతుంది. కారణం లేకుండా రావణుడు ఆ పని చెయ్యలేదు, ఆ కారణమే లేకపోతే, రావణుడు కూడా మంచోడే అనేది ఈ కోణం చెబుతుంది. ఈ కోణంలో కథను వ్రాసుకున్న దర్శకుడు బాబీని మొదటగా అభినందించాలి.

తను ఎలాంటి కథను చూపించబోతున్నాడో ట్రైలర్లో చూపించిన దర్శకుడు సినిమా అసలు కథేంటో మొదటి ఇరవై నిమిషాల్లోనే చాలా చక్కగా నెలకొల్పాడు. కథకు ముఖ్యం జై పాత్ర కనుక మిగతా రెండు పాత్రలను ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా పరిచయం చేశాడు. తన పాత్రలకు ఓ స్టార్ కథానాయకుడిని ఎన్నుకున్నందుకో ఏమో కొన్ని అర్థంలేని, అవసరంలేని ఘట్టాలు, హాస్యాలను జోడించాడు.

ఈ క్రమంలో లవకుశుల పాత్రలు ప్రక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. చిన్నప్పుడు అన్నయ్యను గేలి చేసిన లవుడు పెద్దయ్యాక అందరి కష్టాలను తన కష్టాలుగా భావించే అతి మంచివాడుగా ఎదగడానికి కారణమేమిటో అంతుచిక్కదు. పరిస్థితుల వల్ల దొంగగా మారిన కుశుడి స్వార్థానికి కారణమేమిటో కూడా తెలియదు. ఓ క్షణంలో లవకుశులు ఇద్దరు కాకుండా లవుడో లేదా కుశుడో, ఎవరో ఒక్కరే ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. మరి అలా అయితే సినిమా టైటిల్ ఏమైవుంటుంది అన్న ఆలోచన కూడా కలగకమానదు. ఇలా, ఏదో దారిలో కథనం నడిపిస్తూ, ఇంతకు అసలు పాత్ర ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుడు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే స్థితికి తీసుకొని వెళ్ళాడు దర్శకుడు.

ఇక మొదట్లో చెప్పుకున్నట్టు, ఓ మోస్తరు ఘట్టానికి కూడా బలమైన ఊపిరిని ఊది పరుగులు పెట్టించే నటుడు దర్శకుడికి దొరికాడు. అందుకే, పేపరుపై మామూలుగా అనిపించే ఘట్టాలు కూడా తెరపై బలంగా రిజిస్టర్ అవుతాయి. ఇందుకు మొదటి ఉదాహరణ జై పరిచయం.

జై ఇచ్చిన ఊపుతో రెండో సగంలో ప్రేక్షకుడిని కుదురుగా కుర్చోబెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం దర్శకుడికి పెద్దగా లేకపోయింది బాబీకి. అతడికి ఎన్టీఆర్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఒకానొక సందర్భంలో దర్శకులు మణిరత్నం “నాయకుడు” సినిమా అనుభవాలను పంచుకుంటూ “కమలహాసన్” గురించి “కొంతమంది నటులకు దర్శకుడు కూడా ఒక ప్రేక్షకుడే అవుతాడు. అతడి పనల్లా యాక్షన్ చెప్పి ప్రక్కన నిలబడి చూడడమే” అని అన్నారు. ఇప్పుడు ఇది బాబీ విషయంలో మళ్ళీ నిరూపితమైంది. సినిమా రెండో సగమంతా, బాబీ కేవలం రచయితగానే మిగిలిపోయాడు తప్ప దర్శకుడిగా ఎక్కడా కనిపించలేదు. అంతలా తను ముగ్గురిగా విడిపోయి సినిమాను భుజాలపై మోశాడు ఎన్టీఆర్. ఘట్టమేదైనా, పాత్రేదైనా నేను రెడీ అన్న జై డైలాగుని అనుక్షణం నిజం చేసుకుంటూ, కథనాన్ని అంతకంతకు రసవత్తరంగా మార్చుకుంటూపోయాడు. ఎంతటి నిరంకుశుడు అయినప్పటికీ, చేసే ఏ పనిలోనూ మంచి లేకపోయినప్పటికీ, ప్రేక్షకుడు రావణుడిని గౌరవిస్తాడు, అతడు మారాలని కోరుకుంటాడే తప్ప ఎక్కడా అతడిపై ద్వేషం కలగదు. ఇందుకు మళ్ళీ ఎన్టీఆర్ ను, కథ, కథనాలను రావణుడి కోణంలోంచే నెలకొల్పిన రచయిత బాబీని మరొక్కసారి మెచ్చుకోవాలి.

ఇక, ఈ సినిమాకు ఉత్తమమైన ఘట్టంగా “ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్“ని చెప్పుకోవచ్చు. జై లవకుశుల బాల్యం తరువాత పాత్రలను మళ్ళీ బలంగా నెలకొల్పిన ఘట్టం ఇదే. ఇక్కడ ఎన్టీఆర్ నటన తారాస్థాయికి చేరుకోవడంతో పాటు, “సిరాశ్రీ” వ్రాసిన పౌరాణిక డైలాగులు (తక్కువే అయినా) కూడా అబ్బురపరిచాయి. సినిమాకు కథతో పాటు మంచి నటులెంత ముఖ్యమో ఈ ఘట్టం కళ్ళకు కట్టింది. అప్పటివరకు అవసరంలేని పాటలు, పోరాటాలు ఎందుకనిపించినా, క్లైమాక్స్ లో వచ్చే ఆఖరి పోరాటం మాత్రం కథనాన్ని బలపరిచిందని చెప్పాలి.

ఇదిలావుండగా, లవుడి అసలు సమస్యను దర్శకుడు రెండో సగంలో ఎక్కడా స్పృశించకపోవడం గమనార్హం.

అలా, రెండుంటే సరిపోయే కథలో మూడు పాత్రలు కలిగి ఉన్నప్పటికీ, ఈ సినిమాలో తల్లి చెప్పిన “మీ ముందు జై ఉంటేనే మీరు జై లవకుశులు” అనే మాటను అక్షరాల నిజం చేస్తూ ఒక మంచి ప్రయత్నంగా అనిపించే సినిమా “జై లవ కుశ”.

నటనలు :

జూనియర్” అనే పదానికి ఎన్టీఆర్ ఇక ఏమాత్రం అర్హుడు కాదని ఈ సినిమా బల్లగుద్ది చెప్పింది. మునుపటి ఎన్టీఆర్ కు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు ఎన్టీఆర్. మూడు విభిన్నమైన పాత్రలను ఒకే నటుడు పోషించడం, ఆ తేడాలను స్పష్టంగా చూపించడం ఆషామాషీ విషయం కానేకాదు. ఈ విషయంలో రెండొందల శాతం ఉత్తీర్ణుడయ్యాడు ఎన్టీఆర్.

రాశి ఖన్నా, నివేథా థామస్ లకు కొద్దిపాటి విలువ ఉంది కథలో. ఉన్న కొద్దిపాటి విలువను కూడా గుర్తుపెట్టుకునేలా లేదు సాయికుమార్ పాత్ర. పోసానికి మంచి పాత్రే దక్కింది ఈసారి. దాన్ని బాగా పోషించాడు కూడా.

బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, ప్రదీప్ రావత్, అభిమన్యు సింగ్, హంసానందిని, రోనిత్ రాయ్ ఇలా అందరూ ఉన్నారు.

బలాలు :

  1. ఎన్టీఆర్.
  2. కథ. పురాణాన్ని ఒక కొత్త కోణంలో చూపించే కథను వ్రాశాడు బాబీ.
  3. ఛాయాగ్రహణం. ఈ సినిమాకు మురళీధరన్ మరియు ఛోటా.కే.నాయుడు చేసిన ఛాయాగ్రహణం పాత్రలను నెలకొల్పడంలో బాగా సాయం చేసింది.
  4. నేపథ్య సంగీతం. దేవీశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు బలాన్నిచ్చింది.
  5. కళాదర్శకత్వం. జై కోటను పాత్ర అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దారు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్.
  6. నిర్మాణ విలువలు. సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు కళ్యాణ్ రామ్.

బలహీనతలు :

  1. మూడు పాత్రలు. జై ని ప్రక్కనబెడితే, సినిమాలో విడివిడిగా లవ కుశుల పాత్రలు బాగున్నాయి కానీ రెండు పాత్రలు అవసరం లేదనిపిస్తుంది దాదాపుగా. ఏదో ఒక్కటి సరిపోయేది.
  2. దేవీశ్రీప్రసాద్ సంగీతం. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు.
  3. మొదటి సగం.

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s