కథలకు కొరత ఉందని చెప్పుకునే సినీపరిశ్రమలో ఇదివరకు చెప్పిన కథనే ప్రేక్షకుడికి మళ్ళీ చెప్పి అతడి మెప్పు పొందాలంటే, చెప్పే విధానం మార్చాలి. అందుకే, కొందరు దర్శకులు కథ మీద కన్నా కథనం మీద, పాత్రల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇదే పద్ధతిని పాటించిన సినిమా “రాజా ది Great”. “అనిల్ రావిపూడి” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, మెహ్రీన్ జంటగా నటించగా, “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” పతాకంపై “దిల్ రాజు”, “శిరీష్” నిర్మించారు.
కథ :
ఓ నిజాయితీ పోలీసు ఆఫీసర్ ప్రకాష్ (ప్రకాష్ రాజ్)ని చంపిన దేవరాజ్ (వివన్) అతడి కూతురు లక్కీ (మెహ్రీన్)ని కూడా చంపడానికి వెతుకుతుంటాడు. అలాంటి క్రమంలో ఓ సీక్రెట్ పోలీసు ఆపరేషన్ లో లక్కీని కాపాడడానికి వెళ్తాడు రాజా (రవితేజ). పుట్టుకుతో అంధుడైన రాజా లక్కీని ఎలా కాపాడాడు? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
ఈ కథాంశం అటు ఇటుగా దర్శకుడు అనిల్ ఇదివరకు తీసిన “సుప్రీమ్” కి బాగా దగ్గరగా ఉంటుంది. అక్కడి చిన్నపిల్లాడిని ఇక్కడ హీరోయిన్ గా, అక్కడి టాక్సీ డ్రైవర్ ని ఇక్కడ ఓ అంధుడిగా చేశాడు. అక్కడి ఊరి సమస్యను ఇక్కడ ఓ కుటుంబ సమస్యగా మార్చాడు దర్శకుడు. కనుక, కథ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏమి లేదు. మాట్లాడుకోవాల్సింది అంతా కథనం, పాత్రల చిత్రణల గురించే.
కథానాయకుడు అంధుడు, పైగా ఓ పేరుమోసిన హీరో అనగానే ప్రేక్షకుడిని (ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుడిని) ఒప్పించడం కత్తి మీద సాము లాంటిది. కానీ పాత్రని పరిచయం చేసిన మొదటి క్షణం నుండి దర్శకుడు దాన్ని నెలకొల్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది. దాన్ని తెరపై రవితేజ పోషించిన విధానం ఇంకా అద్భుతం. సినిమా మొత్తం మీద, రాజా అంధుడు అన్న విషయం అంతర్లీనంగా ఉంటుందే తప్ప, అది ఒక సమస్యని, అతడిని చూసి “అయ్యో” అనుకునే పరిస్థితి ఎక్కడా ప్రేక్షకుడికి కలిగించకపోవడంలోనే దర్శకుడి గొప్పతనం ఉందని చెప్పాలి. అసలు హీరోకి కళ్ళున్నాయా లేవా అన్న విషయాన్ని ప్రేక్షకుడి స్పురణకే రాదంటే పాత్ర చిత్రణలో అనిల్ పడ్డ కష్టం, దాన్ని తెరపై పండించిన రవితేజ నైపుణ్యం ఏంటో తెలిసిపోతుంది. ఇదే కథాంశం ఓ పదేళ్ళ ముందు వచ్చుంటే దర్శకుడు ఇంకాస్త శ్రమించాల్సి వచ్చేది. టెక్నాలజీ పెరిగిపోవడం కూడా దర్శకుడికి బాగా కలిసొచ్చింది. కనుక, పాత్ర చిత్రణ విషయంలో దర్శకుడు అనిల్ కి నూటికి నూరు మార్కులు వేయాల్సిందే.
సినిమాలో చాలా చోట్ల దర్శకుడిగా కన్నా రచయితగానే రాణించాడు అనిల్. ఉదాహరణలే, రాజా చిన్ననాటి సన్నివేశాలు, తల్లి – కొడుకుల బంధాన్ని చూపించిన సన్నివేశాలు. తల్లి పాత్రలో రాధికను ఎంచుకోవడం ఆ సన్నివేశాల ఔన్నత్యాన్ని మరింత పెంచాయని చెప్పాలి. ఇదే కాకుండా, మొదటి సగమంతా, తనదైన మార్కు కామెడీతో నవ్వించాడు. ముఖ్యంగా, రాజేంద్రప్రసాద్ – అన్నపూర్ణమ్మల కాంబినేషన్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఇంటర్వెల్ సన్నివేశం కూడా బాగా పండింది. రాజా లక్కీని కాపాడగలడన్న నమ్మకం లక్కీతో పాటు ప్రేక్షకుడికి కూడా కలుగుతుంది. ఇక్కడ ఫైట్ మాస్టర్ “వెంకట్”ని కూడా అభినందించాలి.
రెండో సగంలో కథనం కాస్త నెమ్మదించినా “గున్న గున్న మామిడి” పాటను వాడుకున్న సన్నివేశం కొంచెం ఊరట కలిగిస్తుంది. రాజా దేవరాజ్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం సినిమాలో అతి శక్తివంతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అనిల్ మాటలు, రవితేజ నటన, మోహన కృష్ణ కెమెరా పనితనం బాగా ఆకట్టుకుంటాయి. క్లాస్, మాస్ అనే భేదాలు లేకుండా అందరూ ఆనందించగల సన్నివేశమది.
అంతా బాగున్నప్పటికీ, ప్రీక్లైమాక్స్ నుండి అనవసరపు సన్నివేశాలు, పాటలు, పోరాటాలు ఎక్కువైపోయాయి. నిజానికి, ప్రీక్లైమాక్స్ నే క్లైమాక్స్ గా చేసుంటే సినిమా నిడివి అయినా తగ్గేది. తన మునుపటి సినిమాల్లాగే ఒక హై వోల్టేజ్ సన్నివేశం తరువాత అనవసరపు పాటను పెట్టి, మళ్ళీ విలన్ హీరోతో అదేపనిగా ఓ ఛాలెంజ్ చేసే పద్ధతి ఈ సినిమాలో కూడా పాటించాడు దర్శకుడు. “బ్లాక్”, “బ్యాంగ్” అనే పద్ధతిలో కథనాన్ని వ్రాసుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి కాబోలు. అస్తమానం ఓడిపోయే ఛాలెంజులు చేయడానికి తెలుగు విలన్లకు, ప్రతిసారి ఛాలెంజ్ ని అవలీలగా గెలవడానికి తెలుగు హీరోలకు ఎప్పుడు బోరు కొడుతుందో తెలియదు.
మొత్తానికి, పెట్టిన ఖర్చుకి నవ్విస్తూ, గొంతు తడుపుతూ సరైన న్యాయం చేకూర్చే సినిమా “రాజా ది Great”.
నటనలు :
ఓ దర్శకుడు ఎంత కష్టపడి పాత్రను చిత్రించినా, దాని భవిష్యత్తు పోషించే నటుల చేతిలోనే ఉంది. రవితేజ నటన ఈ సినిమాకు ఆయువుపట్టు. ఈ పాత్రలో మరో హీరోని ఊహించుకోలేని విధంగా చేశాడు. తనతోపాటు దర్శకుడిని కూడా గెలిపించాడు. మెహ్రీన్ కి అతి ముఖ్యమైన పాత్ర దొరికింది కానీ నటించే ఆస్కారం పెద్దగా లేకపోయింది. ఉన్నంతలో బాగా చేసిందని చెప్పాలి. రాధిక, ప్రకాష్ రాజ్ లు తమ పాత్రలను బాగా పోషించారు. ప్రతినాయకుడిగా వివన్ సరిపోయాడు.
రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డిలు తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. పోసాని, సంపత్ రాజ్, రాజేష్, ప్రభాస్ శ్రీను, చిత్రం శ్రీను, సన, హరితేజ, పవిత్ర లోకేష్, విద్యురామన్, పృథ్విరాజ్, ఇలా అందరూ ఉన్నారు.
సాయికుమార్, రవితేజ కొడుకు మహాధన్ అతిథి పాత్రలు పోషించారు.
బలాలు :
- అనిల్ కథనం, మాటలు, దర్శకత్వం. కథ పేలవంగా ఉన్నా కథనం, మాటలు, దర్శకత్వంతో ఆకట్టుకున్నాడు అనిల్.
- రవితేజ నటన.
- మోహన కృష్ణ ఛాయాగ్రహణం. మంచి విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా, “నాకే నే నచ్చేస్తున్నా” పాటలో.
- వెంకట్ పోరాటాలు. అంధుడి పాత్రకు సరిపోయే పోరాటాలు సమకూర్చాడు.
- నిర్మాణ విలువలు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు రాజు, శిరీష్.
బలహీనతలు :
- రెండో సగంలో అనవసరపు పోరాటాలు, పాటలు.
– యశ్వంత్ ఆలూరు