సినిమాకు కథ ఎంత ముఖ్యమో, ఆ కథను ఎంత నిజాయితీగా సదరు దర్శకుడు ప్రేక్షకులకు చెప్పాడన్నది కూడా అంతే ముఖ్యం. అలా, నిజాయితీగా తీసిన సినిమా “మెంటల్ మదిలో”. శ్రీవిష్ణు, నివేథా, అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా “వివేక్ ఆత్రేయ” దర్శకుడిగా పరిచయమయ్యాడు. “పెళ్ళిచూపులు”తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన “రాజ్ కందుకూరి” తన “ధర్మపథ క్రియేషన్స్” పతాకంపై నిర్మించగా, “సురేష్ ప్రొడక్షన్స్” సంస్థ సమర్పణలో ఈ సినిమా విడుదలయింది.
కథ :
ప్రపంచంలో ప్రతీ మనిషికి కొన్ని సందర్భాల్లో అయోమయ స్థితి (confusion) ఎదురవ్వడం సహజం. కానీ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లున్న ప్రతీ సందర్భంలో అయోమయానికి గురవుతుంటాడు అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు). అతడికి స్వేచ్చ (నివేథా) అనే అమ్మాయితో పెళ్ళి నిశ్చయమవుతుంది. ఆ తరువాత వారి బంధం ఎలా సాగింది? అరవింద్ కృష్ణ కన్ఫ్యూషన్ వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొని వచ్చింది? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
శారీరకంగానో లేదా మానసికంగానో ఏదో ఒక లోపమున్న హీరో పాత్రల ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో “హీరోకి కన్ఫ్యూషన్” అనే అంశంపై సినిమా రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ అయోమయం అనేది జబ్బు కాదు, ఒక మానసిక స్థితి మాత్రమే కనుక దర్శకుడు దాన్ని అలాగే చూపించాడు. అది అందరిలోనూ ఉండే మానసిక స్థితి కనుక అరవింద్ కృష్ణ పాత్ర ప్రవర్తన కూడా సహజంగా మనకు తెలిసిన వ్యక్తి లాగో, లేదా మనలాగో అనిపిస్తుంది.
హీరో పాత్ర చిత్రణే కాకుండా అతడి కుటుంబంలోని పాత్రలను చిత్రీకరించిన తీరు కూడా చాలా సహజంగా ఉంటుంది. ఇక స్వేచ్చ పరిచయంతో అరవింద్ కే కాదు, ప్రేక్షకుడికి కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఇందుకు రెండు కారణాలు. ఒకటి “నివేథా” నటన అయితే మరొకటి ఆమెకు “వీణ ఘంటసాల” చెప్పిన డబ్బింగ్. పాత్ర తీరుతెన్నులు సహజంగా, ఇదివరకే ఎక్కడో పరిచయమున్నట్టుగా అనిపిస్తాయే తప్ప, లేని వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టుకున్నదిలా అనిపించవు. ఇది పూర్తిగా వివేక్, నివేథా, వీణల గొప్పతనమని చెప్పాలి.
అరవింద్ – స్వేచ్చల ప్రయాణం చూపించిన తీరు చాలా అందంగా ఉంటూ, సినిమా జరిగేది హీరో కోణంలో కనుక ప్రతి అబ్బాయి జీవితంలో ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది అనిపించేలా సన్నివేశాలను సున్నితంగా నడిపాడు దర్శకుడు. అలా, మొదటి సగమంతా ఆహ్లాదకరంగా సాగిపోతుంది.
సినిమాకు రెండో సగమే కీలకం, పైగా కథాంశం కూడా చిన్నది కనుక దర్శకుడు కథనం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. ముంబై ఘట్టం అంతా పలుచోట్ల బలవంతంగా చొప్పించినట్టుగా, ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్న భావన కలిగించడం, మధ్యలో వచ్చే ఒకట్రెండు పాటలు కూడా ఇబ్బందిగా అనిపించడం ఒక కారణం అయితే, కథ అంతా హీరో కోణంలోంచే చెప్పినప్పుడు అతడికున్న కన్ఫ్యూషన్ ప్రేక్షకుడు కూడా అనుభవించేలా చేయడంలో దర్శకుడు ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలగదు. కథనం కాస్త నీరసించినా, అనవసరపు ఆర్భాటాలకు పోకుండా తాను అనుకున్న కథను దానికున్న పరిధులలో నిజాయితీగా చెప్పినందుకు దర్శకుడికి మార్కులు వేయాలి. పైగా, హీరో పాత్రకున్న కన్ఫ్యూషన్ ని చూపించడానికి కొన్ని పొయెటిక్ షాట్స్ కూడా పెట్టాడు దర్శకుడు. ఉదాహరణకు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయంలో ఉన్న హీరోను టేబుల్ టెన్నిస్ నెట్ దగ్గర కూర్చోబెట్టడం, వేర్వేరు సలహాలు ఇచ్చే స్నేహితులను నెట్ కి ఇరువైపులా కూర్చోబెట్టి, మధ్యలో టేబుల్ టెన్నిస్ బంతిని చూపించే షాట్ చాలా బాగుంది.
చివరకు, ప్రేక్షకుడు ఊహించిన ముగింపే ఇచ్చినా అక్కడ మంచి హాస్యం పండించడంతో, అంతకుముందు జరిగినవేవి ప్రేక్షకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండాపోయి, ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగించాడు దర్శకుడు.
అలా, “మెంటల్ మదిలో” అనే ఈ సినిమాలో కాబోయే దర్శకులకు ఏదైనా నేర్చుకోవడానికో, లేదా ప్రేక్షకుడు సీటు చివర కూర్చొని ఉత్కంఠగా చూడడానికో ఏమి లేకపోయినా, ఆరోగ్యకరమైన హాస్యం, రోజువారి జీవితంలో చూసే పాత్రలు, సన్నివేశాలు ఉండడంతో హాయిగా ఓసారి చూసేయచ్చు.
నటనలు :
అరవింద్ కృష్ణగా శ్రీ విష్ణు సరిపోయాడు. పాత్ర తాలూకు కన్ఫ్యూషన్ ని బాగా చూపించగలిగాడు. ఈ సినిమా హీరో పాత్ర కోణంలోంచి జరిగేదే అయినప్పటికీ, అతడికంటే ఎక్కువగా మెప్పించింది నివేథా. సహజంగా చిత్రించిన పాత్రలో అంతే సహజంగా ఒదిగిపోయింది. అమృత శ్రీనివాసన్ పాత్ర బలవంతంగా చొప్పించినట్టు అనిపించడంతో నటన కూడా అలాగే బలవంతంగా చేసినట్టు ఉంటుంది.
హీరో తండ్రి పాత్రలో శివాజీరాజా ఆద్యంతం నవ్వించగా, హీరోయిన్ తండ్రిగా రాజ్ మాదిరాజు తన పాత్ర ద్వారా హీరో తండ్రి పాత్రకు తగినంత సాయం చేశారు. అనిత చౌదరి, కిరీటి ధర్మరాజు ఇలా అందరూ పాత్రలకు సరిపోయారు.
హీరో నారా రోహిత్ ఓ అతిథి పాత్రలో కనిపించారు.
బలాలు :
- వివేక్ ఆత్రేయ కథనం, దర్శకత్వం. కథాంశం చిన్నదే అయినా, కథనంలో కొత్తదనం లేకపోయినా, కథ పరిధిని దాటి ఏ విషయాన్ని చెప్పకుండా, నిజాయితీగా ఉన్న కథను చెప్పాడు వివేక్. అక్కడక్కడా మాటలు కూడా బాగున్నాయి.
- నివేథా నటన. ఈ సినిమా “స్వేచ్చ” కోసం చూడొచ్చు అనేంతలా పాత్రలో ఒదిగిపోయింది
- వీణ ఘంటసాల డబ్బింగ్. స్వేచ్చ పాత్రను మరింత బలంగా నెలకొల్పింది.
- వేదరామన్ ఛాయాగ్రహణం. ముంబై ఘట్టంలో కొన్నిచోట్ల షార్ట్ ఫిలిం చూస్తున్న భావన (పూర్తిగా దర్శకుడి ఆలోచన) కలిగినప్పటికీ, గోవాలోని సన్నివేశాలు చాలా అందంగా తీశాడు వేదరామన్. సినిమా అంతా లైటింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
- నిర్మాణ విలువలు. ఒక ఫీల్ గుడ్ మూవీ ప్రొడ్యూసర్ గా రాజ్ కందుకూరిని ఈ సినిమాతో అనుకోవచ్చు. సహజమైన ప్రదేశాల్లో షూటింగ్ చేసినా కూడా సినిమాలో ఎక్కడా నాణ్యత లోపించలేదు అంటే పూర్తిగా రాజ్ కందుకూరి నిర్మాణ విలువలే కారణం.
బలహీనత(లు) :
- రెండో సగంలోని బలవంతపు సన్నివేశాలు.
– యశ్వంత్ ఆలూరు