ప్రతి ప్రేమకథలో రెండు ఘట్టాలుంటాయి, కలవడం, విడిపోవడం. ఈ రెండు అనుభవాలు క్షణకాలంలో జరిగిపోయినా, వాటి జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం నిలిచిపోతాయి. ఆ జ్ఞాపకాల బరువుని మోయలేని సమయంలోనే అనిపిస్తుంది “మళ్ళీ రావా” అని. అదే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించారు. “గౌతమ్ తిన్ననూరి” దర్శకత్వం వహించగా “స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “రవి యాదవ్” నిర్మించారు.
కథ :
తను ప్రాణంగా ప్రేమించే తన చిన్ననాటి స్నేహితురాలు అంజలి (ఆకాంక్ష) కార్తీక్ (సుమంత్) జీవితంలోని పలు దశలలో, పలు పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తూవుంటుంది. దానికి కారణాలు ఏమిటి? ఇలాంటి క్రమంలో కార్తీక్ తన ప్రేమను గెలుచుకున్నాడా? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
ముందుగా కథకుడు, దర్శకుడు గౌతమ్ ని కొన్ని విషయాల్లో అభినందించాలి. తను ఎలాంటి కథ చెబుతున్నాడో ప్రచార చిత్రాలలోనే చెప్పిన దర్శకుడికి ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించే అంశాలు “అంజలి కార్తీక్ జీవితంలోంచి వెళ్ళిపోవడానికి గల కారణాలు“. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి తన ట్రైలర్స్, పాటల ద్వారా పూర్తిగా కలిగించేశాడు. కొంతకాలం దగ్గరగా, మరికొంత కాలం దూరంగా ఉండడమే కథాంశం కనుక దానికి తగ్గట్టుగా “మళ్ళీ రావా” అనే పేరు సినిమాకు పెట్టాడు.
ఇక సినిమా విషయానికి వస్తే, అంజలి కార్తీక్ ని ప్రతీ దశలో వదిలి వెళ్ళిపోవడానికి గల కారణాలను చూపించడానికి దర్శకుడు నాన్ లినియర్ పద్దతిలో కథనాన్ని చెప్పాడు. ఇదే ఈ సినిమాకు సరైన పద్ధతి అయినప్పటికీ కొన్నిచోట్ల సన్నివేశాలు సడన్ గా కట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఏ సన్నివేశాన్ని కట్ చేసి ఏ సన్నివేశానికి వెళ్ళాలి అన్న స్పష్టత మాత్రం దర్శకుడికి ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది.
కార్తీక్ – అంజలి ల చిన్ననాటి స్నేహాన్ని చాలా బాగా చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా, వర్షంలో ఆడుకునే సన్నివేశాన్ని ఇద్దరి కోణాల్లో వేర్వేరు సమయాల్లో, “చినుకు చినుకు” అనే పాట యొక్క రెండు వెర్షన్లు చూపించిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కవితాత్మకమైన ఘట్టాలు సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా ఆరంభం, ముగింపు కూడా ఇదే పద్ధతిలో చేసి మార్కులు కొట్టేశాడు దర్శకుడు గౌతమ్.
ఇక, హీరో పాత్ర చుట్టూ హాస్యం కోసం అల్లిన పలు పాత్రలతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు తప్ప మరొకరు ఏకీభవించే అవకాశం తక్కువే. దర్శకుడు తెలివిగా వాటికి విడిగా ఒక ట్రాక్ ఎక్కువగా ఇవ్వకుండా, అలాంటి సన్నివేశం తరువాత ఒక మంచి పొయెటిక్ సన్నివేశంతో ఆకట్టుకున్నాడు.
సినిమా ముగిసే సమయానికి పూర్తిగా మూల కథాంశంలోకి వెళ్ళిపోయి, “మళ్ళీ రావా” అనే తన టైటిల్ కి పూర్తిగా న్యాయం చేకూర్చి కవితాత్మకంగా మొదలైన సినిమాకు అంతే కవితాత్మకంగా ముగింపు పలికి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అక్కడక్కడా మంచి మాటలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, “నువ్వు లేవన్న బాధ కన్నా మళ్ళీ కలిస్తే ఎప్పడు దూరమైపోతావోనన్న భయమే ఎక్కువగా ఉంది” అంటూ సాగే మాటలు చాలా బాగున్నాయి.
అలా, “మళ్ళీ రావా” అనే ఈ సినిమా ఫీల్ గుడ్ సినిమాలను ఆదరించే మల్టీప్లెక్స్ ప్రేక్షకులను మెప్పించగల ఒక మంచి సినిమా.
నటనలు :
ప్రేమకథల్లో ఓడిగిపోవడం సుమంత్ కి కొత్తేమీ కాదు. ఆ అనుభవం ఈ సినిమాకు బాగా ఉపయోగపడి దర్శకుడి పని సులువు అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అంజలి పాత్రలో ఆకాంక్ష కొత్తగా ఉండడమే కాక, పాత్రకు సరిగ్గా సరిపోయింది. పాత్ర తాలూకు అమాయకత్వం, భయం ఇలాంటి హావభావాలు బాగా పలికించింది. హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రలు చేసిన సాత్విక్, ప్రీతీ అశ్రాని కూడా పాత్రలకు సరిగ్గా కుదిరారు.
హీరో స్నేహితుడి పాత్ర చేసిన అభినవ్ తో పాటు మిగతా నటులు అందరూ బాగా చేశారు.
బలాలు :
- గౌతమ్ కథ, కథనం, మాటలు & దర్శకత్వం. జీవమున్న కథాంశానికి కవితాత్మకమైన కథనంతో, అర్థవంతమైన మాటలతో సినిమాను తీశాడు గౌతమ్.
- సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం. ప్రేమకథను హృద్యంగా చెప్పడానికి ఛాయాగ్రహణం ఎంతో ఉపయోగపడుతుంది. సంతోషకరమైన సన్నివేశానికి, బాధాకరమైన సన్నివేశానికి తన లైటింగ్ లోనే తేడా చూపించి ఆకట్టుకున్నారు సతీష్.
- శ్రవణ్ భరద్వాజ్ సంగీతం. ప్రతిభ ఉండీ పేరు పెద్దగా వినబడని సంగీత దర్శకుల్లో శ్రవణ్ తప్పకుండా ఒకరు. ప్రేమకథకు దృశ్యం ఎంత కీలకమో సంగీతం కూడా అంతే కీలకం. “చినుకు చినుకు” పాట రెండు వెర్షన్లు, “మళ్ళీ రావా” రెండు వెర్షన్లు పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతంతో కూడా బాగా ఆకట్టుకున్నాడు శ్రవణ్. ముఖ్యంగా, అంజలి కార్తీక్ తో తన ప్రేమను చెప్పే సన్నివేశంలో వచ్చే నేపథ్య సంగీతం చాలా బాగుంది.
- సత్య గిదుటూరి ఎడిటింగ్. నాన్ లినియర్ కథనాలకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. అందులో దాదాపుగా ఉత్తీర్ణుడయ్యారు సత్య.
- నటనలు. సుమంత్, ఆకాంక్షల నటనలు పాత్రలకు పూర్తి న్యాయం చేశాయి.
- నిర్మాణ విలువలు. సినిమా తక్కువ బడ్జెట్ లో చేసినప్పటికీ ఎక్కడా నాణ్యత లోపించదు. అందుకు పూర్తి క్రెడిట్ నిర్మాత రవి యాదవ్ కే ఇవ్వాలి.
బలహీనతలు :
- సత్య గిదుటూరి ఎడిటింగ్. అక్కడక్కడా సన్నివేశాలు సడన్ గా కట్ చేసినట్టు అనిపిస్తాయి.
– యశ్వంత్ ఆలూరు
Good keep it up dear
LikeLiked by 1 person