సినిమా ప్రకటించినప్పటి నుండే ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడోనని ఆసక్తిని రేకెత్తించే దర్శకుల జాబితాలో “మనం”తో చేరిపోయాడు “విక్రమ్ కుమార్“. “24”లాంటి క్లిష్టమైన కథను కూడా అతి సులువుగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పిన విక్రమ్ ఈసారి “హలో!” అంటూ అఖిల్, కళ్యాణి ప్రియదర్శిని జంటగా సినిమాను రూపోదించాడు. “అన్నపూర్ణ స్టూడియోస్” మరియు “మనం ఎంటర్ప్రైసెస్” నిర్మించిన ఈ సినిమాకు “అక్కినేని నాగార్జున” నిర్మాత.
కథ :
విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి) కోసం కొన్ని సంవత్సరాలుగా ప్రతి రోజు తమకు ముఖ్యమైన చోట వేచి చూస్తుంటాడు శీను (అఖిల్). అనుకోకుండా వచ్చిన ఓ ఫోను కాల్, చేజారిన ఫోను శీను జీవితానికి ముఖ్యమైనదిగా మారుతుంది. ఆ తరువాత ఏమైంది? విడిపోయిన శీను, జున్ను మళ్ళీ కలుసుకున్నారా? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
“మనం”, “24” లాంటి అసాధారణ కథలను కూడా సాధారణ ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందించి తన ఆలోచన విధానమేంటో రుచిచూపించాడు విక్రమ్ కుమార్. అలాంటి దర్శకుడి నుండి మరో సినిమా వస్తోంది అంటే ఆసక్తి రేగడం సాధారణమే. కానీ విక్రమ్ ఈసారి అతి సాధారణమైన కథని ఎంచుకున్నాడు.
ట్రైలర్ నుండే సినిమా కథాంశం మాములుగా అనిపించినా, విక్రమ్ సినిమా కనుక ఇందులో కొత్తగా అనిపించే అంశం ఏదోకటి ఉంటుంది అనుకుంటే పొరపాటు. పాటలు కథలోని భావాన్ని, భావోద్వేగాన్ని విజయవంతంగా చేరవేశాయి కానీ సినిమా మాత్రం ఆ స్థాయిని చేరుకోలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం తెలుగు సినిమాకు అలవాటైన విషయమే అయినప్పటికీ, విక్రమ్ లాంటి కొత్త కథలను చెప్పే దర్శకులు కనీసం కథనమైనా కొత్తగా చెప్పకపోవడం ఓ విధంగా ఆశ్చర్యపరిచే విషయమే.
శీను-జున్నుల బాల్యం మనసుకు హత్తుకునేలా తీసిన దర్శకుడు, శీను ఎదిగే క్రమంలో వచ్చే సన్నివేశాలను మరింత హృద్యంగా తీశాడు. ఇందుకు రమ్యకృష్ణ ఓ కారణమని చెప్పాలి. కానీ ఆ తరువాత శీను, అతడి తల్లిదండ్రుల మధ్య వచ్చే సన్నివేశాలను అసహజమైన మెలోడ్రామాతో పేలవంగా తీశాడు.
మన జీవితంలో మనకు పరిచయమయ్యే ఏ వ్యక్తీ కారణం లేకుండా పరిచయం కారని చెప్పే నాగార్జున వాయిస్ ఓవర్ లోని మాటను దర్శకుడు ప్రతి సన్నివేశంలో, కనిపించే ప్రతి పాత్రలో చూపించాడు. అందుకే, ఈ సినిమాలో ప్రేక్షకుడికి పరిచయమయ్యే ప్రతి కొత్త పాత్ర వెనుక “బటర్ఫ్లై ఎఫెక్ట్” తరహాలో బలంగా పొందుపరిచాడు దర్శకుడు. అక్కడ అతడికి మార్కులు వేయాలి. కానీ అలా పరిచయమయ్యే కొన్ని ముఖ్యమైన పాత్రలను సరిగ్గా వాడుకోకపోవడం ఆ పాత్రలకే కాక వాటిని పోషించిన నటులకు కూడా న్యాయం చేయలేదు. ఉదాహరణే జగపతిబాబు పాత్ర. పాత్రలోనూ, దాన్ని పోషించిన నటుడిలోనూ హుందాతనం ఉంది కానీ అది సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు.
ఇలాంటి కథాంశాలకు అవి జరిగే కాలాన్ని పరిగణలోకి తీసుకోవడం ఎంతో అవసరం. హీరోహీరోయిన్ల చిన్నతనంలోనే ఆ కాలపు స్మార్ట్ ఫోన్లను చూపించిన దర్శకుడు ప్రస్తుత కాలంలో అసలు కథను వ్రాసుకొని ఇప్పటి సాంకేతికతను ఎక్కడా వాడుకోకుండా, పాత పద్ధతిలోనే కథనాన్ని డీల్ చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ కాలంలో ఒక ఫోను నెంబర్ కనుక్కోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. పైగా ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తికి అది అసలు ఓ విషయమే కాదు. పోనీ శీను ప్రేమ గురించి తన తల్లిదండ్రులకు తెలియనిదీ కాదు, వారు అడ్డుకునేవారు కాదు. ఇది వదిలేస్తే, కేవలం ఒక్క రోజులో జరిగే అసలు కథలో కొన్ని ఏళ్ళ ఎడబాటుకి తెరదించే అవకాశం చేజారిపోయినప్పుడు కలిగిన అసహనంలో హీరోకి ఆ ఆలోచన రాలేదని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక తుపాకిని ఎలా విడదీసి కలపాలో క్షణాల్లో పసిగట్టగల తెలివైన, వేగవంతమైన మనిషి అతడు. హీరో వేగాన్ని సరిగ్గా వాడుకున్న దర్శకుడు అతడి తెలివిని మాత్రం సరిగ్గా వాడుకోలేకపోయాడు. పాత్ర కోణంలోంచి చూస్తే, అతడు తీరికగా కూర్చుని ఆలోచించే అవకాశం దర్శకుడు కల్పించలేదు కానీ మధ్యలో వచ్చే మరో కొత్త అనవసరమైన ఘట్టంతో ఆ అవకాశం ప్రేక్షకుడికి పుష్కలంగా కల్పించాడు దర్శకుడు. సినిమా నిడివి 131 నిమిషాల్లో మొదటి సగం కాస్త మెరుగ్గా నడిచినా, రెండో సగం చాలా సేపు నడించిన భావనను కలిగిస్తుంది. క్లైమాక్స్ లో శీను-జున్నులను కలపడానికి దర్శకుడు ప్రేక్షకుడిని బాగా శ్రమపెట్టాడు.
అలా, “హలో” అనే ఈ సినిమా “మనం”, “24” సినిమాల దర్శకుడు విక్రమ్ తీసిన సినిమా అనుకుంటే నిరాశాపరించే సినిమా. “ఇష్క్” తీసిన విక్రమ్ సినిమా అనుకుంటే అదే స్థాయిలో తీసుంటే బాగుండేదేమో అనిపించే సినిమా.
నటనలు :
హలో సినిమా కేవలం అఖిల్ కోసమే తీయబడినదిగా అనిపించేది కనుక తన పాత్రకు సరైన న్యాయమే చేశాడు అఖిల్. మొదటి సినిమా కన్నా ఈసారి హావభావాలు పలికించడంలో పరిణితి సాధించాడు. ముఖ్యంగా, యాక్షన్ సన్నివేశాల్లో, క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా చేశాడు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టాలన్న కసిని చూపించాడు. పాత్రకి ఎంతో విలువ ఉన్నప్పటికీ, తెరపై ఆ పాత్రలో పెద్దగా మెప్పించలేకపోయింది కళ్యాణికి.
రమ్యకృష్ణ పాత్ర ఫరవాలేదు అనిపించినా, జగపతిబాబు పాత్ర పూర్తిగా వ్యర్థమైపోయింది. అజయ్, ప్రవీణ్, అతిథి పాత్రలో వెన్నెల కిషోర్, కృష్ణుడు ఇలా అందరూ ఉన్నారు.
బలాలు :
- పీ.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం. ఈ సినిమాకు అత్యంత బలమైన అంశం ఇదే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా పనితనం అద్భుతంగా ఉంది.
- అనుప్ సంగీతం. పాటలతో ఆకట్టుకున్న అనుప్ నేపథ్య సంగీతంతో మరింత ఆకట్టుకున్నాడు. “హలో” పాటలోని సంగీతాన్ని యాక్షన్ సన్నివేశాల్లో వాడిన విధానం అభినందనీయం.
- బాబీ బ్రౌన్ పోరాటాలు. నమ్మశక్యమైన పోరాటాలు హీరో ఆహార్యానికి తగట్టుగా రూపొందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ ని చాలా బాగా కంపోజ్ చేశాడు బాబీ.
- నిర్మాణ విలువలు. ఏమాత్రం కథాబలం లేని సినిమాకు కూడా ఎక్కడా నాణ్యత లోపించకుండా నిర్మించారు అన్నపూర్ణ స్టూడియోస్.
బలహీనతలు :
- కథ, కథనం. పాతకాలం కథకు కొత్త తరం సాంకేతికతను సరిగ్గా అనుసంధానం చేయలేక, బోరుకొట్టే కథనంతో నడిపాడు దర్శకుడు విక్రమ్.
– యశ్వంత్ ఆలూరు