మహానటి (2018)

Mahanati Posterకనిపించే ప్రతి నవ్వు వెనుక సంతోషమే ఉండాలని లేదు. కనిపించే ప్రతి కన్నీటి వెనుక బాధ ఉండాలని కూడా లేదు. సినిమా నటుల విషయంలో ఇది వందశాతం నిజం. తెర మీద వాళ్ళు పంచే ఆనందమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కానీ అక్కడి వరకు రావడానికి వాళ్ళు తెర వెనుక వదిలేసిన విషాదం ఎవరికీ కనబడదు. ఆ విషాదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తారలు కూడా భూమి మీద పుట్టినవారే అన్న సంగతి అవగతం అవుతుంది.

అసలు ఎప్పుడో మరణించిన సావిత్రి కథను ఇప్పుడు ఎందుకు చెప్పాలి? మనం ఎందుకు చూడాలి? అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒకానొక ముఖాముఖిలో నటులు “రాజేంద్రప్రసాద్” గారు “మనల్ని బాగా సంతోషపెట్టే వ్యక్తికి చిన్న దెబ్బ తగిలినా కూడా, ఆ వ్యక్తి కంటే ఎక్కువగా మనమే బాధపడతాం” అన్న మాట సమాధానంగా వినిపిస్తుంది. సావిత్రి కూడా అంతే. భౌతికంగా లేకపోయినా కూడా, “మాయ శశిరేఖ“గా తెలుగు సినిమాలో, ప్రేక్షకుల గుండెల్లో ఇంకా బ్రతికే ఉంది. తెరపై కనిపించినప్పుడల్లా మనల్ని ఆనందపరిచే “సావిత్రి” ఒక మహానటిగానే అందరికి తెలుసు. కానీ ఆ స్థాయికి రావడానికి ఆవిడ చేసిన కృషి, అంత ఎత్తుకి ఎదిగినా కూడా వదులుకోని ఆవిడ వ్యక్తిత్వం, ఆ తరువాత అర్థాంతరంగా మరణించడానికి గల కారణాలు అతి కొద్దిమందికే తెలుసు. వీటన్నిటినీ “మహానటి” సినిమా ద్వారా కళ్ళకు కట్టిన దర్శకుడు “నాగ అశ్విన్“, అతడి ఆలోచనకు ప్రాణం పోసిన “వైజయంతి మూవీస్” సంస్థ, నిర్మాతలు “అశ్వినిదత్“, “స్వప్న దత్“, “ప్రియాంక దత్” అభినందనీయులు, ధన్యులు కూడాను.

ఈ సినిమా విషయానికి వస్తే, దీన్ని కాలంలో ప్రయాణించే ఒక యంత్రంలా తీశాడు దర్శకుడు. ప్రేక్షకుడికి, సావిత్రికి మధ్య “డేని” కెమెరా ఒకటి ఉందన్న విషయాన్ని సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే మరిమింపజేశాడు. సావిత్రి జీవితంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్ళి వదిలేశాడు.

ఆ తరువాత ప్రేక్షకుడు, చిన్ననాటి సావిత్రి అల్లరిని చూసి మురిసిపోయాడు. అక్కినేని నాగేశ్వరరావు మీద అభిమానంతో డైలాగు సరిగ్గా చెప్పలేక “సంసారం” సినిమాను వదులుకున్న సావిత్రిని చూసి నవ్వుకున్నాడు. భవిష్యత్తు కాలం నుండి వచ్చిన ప్రేక్షకుడు, జరగబోయేది ఎంతోకొంత ఇదివరకే తెలుసు కనుక, తనని పెళ్ళి చేసుకోమని అడిగిన “దేవదాసు గణేశన్“ని ఒప్పుకోవద్దని సావిత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అతడికి ఇదివరకే పెళ్ళి అయిందని తెలిసి ఆ బాధలో “దేవదాసు” సినిమాను రక్తికట్టించిన ఆమెను చూసి “ఇవేం పిచ్చి పనులమ్మా?” అని వారించాడు. తన వాళ్ళను అందరినీ కాదని గణేశన్ కోసం అర్ధరాత్రి వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళే సావిత్రిని చూసి, “ఎందుకు అతడంటే నీకంత ఇష్టం?” అని ప్రశ్నించాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నా వినని మొండితనం ఎందుకని బాధపడ్డాడు. షూటింగ్ ఆగకూడదని గ్లిజరిన్ లేకుండానే “కె.వి.రెడ్డి” అడిగినదే తడవుగా ఎడమ కంటిలో నుండి రెండంటే రెండే కన్నీటి చుక్కలు రాల్చిన మొండిఘటాన్ని చూసి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాడు. ఎప్పుడూ సీను పేపరు చూసుకోకుండా నటించే “రంగారావు” సైతం “ఇవాళ సీను సావిత్రితో రా!” అని సీను పేపరు తెప్పించుకొని మరీ చూసుకుంటుంటే, ఆశ్చర్యపోయాడు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఎదుటివారి కష్టాన్ని చూసి కరిగిపోయి ఉన్నదంతా ఇచ్చేస్తుంటే ఆ మంచితనానికి కరిగిపోయాడు. ఒక సాధారణ నటిగా ప్రారంభమై “మహానటి”గా ఎదిగిన సావిత్రిని చూసి గర్వంతో పొంగిపోయాడు.

ఎంతగా పేరు సంపాదించిన సినిమా నటులు కూడా భూమి మీద పుట్టిన మనుషులే కదా! అందుకే, తన బలహీనతను జెమినీ అదుపు చేసుకోలేకపోయాడు. ఒక భార్యతో తీరని ప్రేమ రెండో భార్యతో కూడా తీరదని సావిత్రీ గ్రహించలేకపోయింది. భర్తతో సహా సంపాదించిన ఒక్కోటి పోగొట్టుకొని, చివరకు ఒక మందు సీసా కోసం కన్న కూతురినే కొట్టే స్థాయికి తన జీవితాన్ని తగలబెట్టుకొన్న సావిత్రిని చూసిన ప్రేక్షకుడు తల్లడిల్లిపోయాడు, “ఇంక చాలు!” అని గట్టిగా గదమాయించి చెప్పాలని సావిత్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే తెలిసింది అసలు నిజం, అతడు ఎప్పటికీ సావిత్రిని చేరుకోలేడని. మధ్యలో ఒక కెమెరాతో పాటు ఎన్నో సంవత్సరాల కాలం, ఆ కాలంలో వెనక్కి వెళ్ళలేని చేతకానితనం అతడికి అడ్డుగా ఉన్నాయని. గుండె బరువెక్కిపోయింది. “ఇది కలికాలం. భోజనం పెట్టిన చేతికున్న ఉంగరాలు కూడా తీసుకొని వెళ్ళిపోయే మనుషులున్నారు” అని రంగారావు అన్నప్పుడు, “పోనిలెండి బాబాయి గారు! మన ఉంగరాలు వేరే వాళ్లకు పనికొస్తే అంతకన్నా సంతోషం ఏముంది!” అన్న ఆవిడ మొక్కవోని మంచితనానికి, ఆవిడ చేత్తో అన్నం తిని, ఆవిడ డబ్బు కాజేస్తే వచ్చిన దర్జాతో “సత్యం” అనే అనామకుడు ఎదురుపడినప్పుడు, కంట నీరు, పెదాలపై చిరునవ్వు చూపించిన సావిత్రిని చూసి ప్రేక్షకుడూ కంటతడి పెట్టుకున్నాడు. నిజంగా, కాలంలో ప్రయానించే శక్తే కనుక మనిషికి ఉంటే, పరిశ్రమ కంటే ముందు ప్రేక్షకుడే సావిత్రిని కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా చేసేవాడు కదా! ఒకవేళ అదే జరిగినా, ఎవరి సాయం పొందడం ఇష్టం లేని వ్యక్తిత్వం సావిత్రి కనుక ఇప్పుడు జరిగింది అప్పుడు కూడా జరగక మానదు. ఇది గ్రహించినప్పుడు, వర్తమానంలోకి వచ్చి తడి కన్నులను తుడుచుకోవడమే ప్రేక్షకుడి వంతు అయ్యింది.

కనిపించే ప్రతీ దానికి పతనం ఉన్న ఈ సృష్టిలో “సావిత్రి”కి మాత్రం పతనం లేదు. జెమినీ, మద్యం, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, చివరకు కోమా వల్లే కాలేదు సావిత్రిని తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే, “సావిత్రి” అంటే కేవలం నటి కాదు, ఒక స్ఫూర్తి అన్న విషయాన్ని “మధురవాణి” ఎలాగూ ఋజువు చేసింది. తాను చేసిన పాత్రల వల్ల గయ్యాళిగా ముద్ర వేయించుకున్న “సూర్యకాంతం“గారు నిజజీవితంలో అలాంటి వ్యక్తి కాదని తెలిసినప్పుడు ఓడిపోయాడు ప్రేక్షకుడు. ఇందుకు బోలెడు ఉదాహరణలు. సినిమాల్లో సుశీలగా కనిపించే సావిత్రి నిజజీవితంలో కూడా సుశీలే అని తెలిసినప్పుడు, ప్రేక్షకుడు గెలిచాడు. దీన్ని బట్టి సావిత్రి అంటే ఒక “గెలుపు” కూడా. మధురవాణి అన్నట్టు “సావిత్రికి చావెక్కడిది?

సీతారామశాస్త్రి” వ్రాసినట్టు, “గడిచే కాలాన గతమేదైనా స్మృతి మాత్రమే కదా చివరకు మిగిలేది… ఎవరు నువ్వంటే నీవు ధరించిన పాత్రలు అంతే… నీదని పిలిచే బ్రతుకేదంటే తెరపై కదిలే చిత్రమే అంతే…” సావిత్రి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది అన్న నిజాన్ని ఇంతకన్నా ఎవరూ చెప్పలేరు.

సావిత్రి జీవితంలోకి ప్రేక్షకుడిని తీసుకొని వెళ్ళింది దర్శకుడు నాగ అశ్విన్ మాత్రమే కాదు, సావిత్రిని ప్రేమించి అతడికి సహకరించిన నటులు కూడా. అందుకే, వారి గురించి చెప్పుకోవడం కూడా ప్రేక్షకుడి ధర్మమే…

కేవలం సావిత్రి లాంటి నటి మళ్ళీ దొరకదు అని, సాంకేతికత ఎంత అభివృద్ది అయినా “మాయాబజార్“, “గుండమ్మ కథ” లాంటి సినిమాలను మళ్ళీ తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మరి ఆ సావిత్రి మీదే సినిమా అంటే మాటలా? ఆ అందాన్ని ప్రకృతే పూర్తిగా సృష్టించలేకపోయింది. తనకి తన మీదే అసూయ పుట్టి “కీర్తి సురేష్” ని సృష్టించే క్రమంలో కూడా 70 శాతమే ఉత్తీర్ణత సాధించింది. అది తెలుసుకున్న నాగ అశ్విన్ ఆ మిగిలిన 30 శాతం పూర్తి చేసి ఆవిడను సావిత్రిగా మలిచాడు. ఆ వెంటనే “సావిత్రి” ఆవిడలో పరకాయ ప్రవేశం చేసి మూడు గంటల పాటు తన కథ తానే చెప్పుకుంది. సినిమా నడిచే క్రమంలో కీర్తిని కూడా మాయం చేసి “ఆహా నా పెళ్ళంట” అంటూ సావిత్రే తెరపైకి వచ్చేసింది. ఎవరైనా ఎప్పుడైనా “నువ్వేం సాధించావు జీవితంలో?” అని అడిగితే “నేను మహానటి సినిమా చేశాను!” అని గర్వంగా చెప్పుకునే అవకాశం కీర్తికి ఇచ్చింది సావిత్రి. కీర్తి గురించి చెప్పడానికి ఇంతకంటే పదాలు లేవు.

మిగతా వారి విషయానికి వస్తే, “దుల్కర్” అనే నటుడు ఎలాంటి పాత్రనైనా పోషించగలడు అన్న విషయం ఇదివరకే ఋజువు అయిపొయింది. జెమినీగా అతడు కనిపించిన విధానంతో పాటు, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం అతడిని తెలుగు ప్రేక్షులకు మరింత దగ్గర చేసింది. కీర్తి, దుల్కర్ ల తరువాత ఈ సినిమాలో సరిగ్గా సరిపోయింది “మోహన్ బాబు“. కనిపించింది కాసేపే అయినా, రంగారావుగా మోహన్ బాబు అభినయం అద్భుతం. ముఖ్యంగా, “వివాహ భోజనంబు” పాటలో ఆయన అభినయం అభినందనీయం. వెంకటరామయ్య చౌదరిగా రాజేంద్రప్రసాద్, కె.వి.రెడ్డి గా క్రిష్, ఎల్.వీ.ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్, దుర్గామాంబగా భానుప్రియ, అంటోనీగా విజయ్ దేవరకొండ, సింగీతంగా తరుణ్ భాస్కర్, వేదాంతం రాఘవయ్యగా సందీప్ రెడ్డి, ఇలా అందరూ చక్కగా కుదిరారు. కానీ ప్రకాష్ రాజ్ గా చక్రపాణి గారు మాత్రమే సరిగ్గా కుదరలేకపోయారు.

మరి కొందరు నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొదటగా “మధురవాణి”గా చేసిన “సమంత“. సావిత్రి జీవితంలోకి వెళ్ళడానికి గల ద్వారం లాంటిది ఈ పాత్ర. సావిత్రి గురించి వ్రాయాలంటే ఒక అర్హత కావాలని చెప్పిన ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా చేసింది సమంత. మహానటి అంటే కీర్తితో పాటు సమంతని కుడా గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. మరో నటుడు “అక్కినేని నాగేశ్వరరావు”గా కనిపించిన “నాగ చైతన్య“. ఒక నిజాయితి గల ప్రయత్నానికి తనవంతు సహకారం అందించడమే కాకుండా, కొన్నిచోట్ల చిన్న వయసులోని అక్కినేనిలా సరిగ్గా సరిపోయాడు. ముఖ్యంగా, “దేవదాసు” పాత్రలో.

“సాయిమాధవ్ బుర్రా” మరోసారి మెప్పించారు. “ఆడవాళ్ళ బాధ అందరికి తెలుస్తుంది. మగవాళ్ళ బాధ మందు గ్లాసుకి మాత్రమే తెలుస్తుంది“, “నేను హాస్పిటల్లో చేరితేనే వస్తావని తెలిసుంటే పది రోజుల ముందే చేరేదాన్ని కదా నాన్న!” లాంటి మాటలతో ఆకట్టుకున్నారు.

“మిక్కీ జే మేయర్” సంగీతం కూడా అంతే బలాన్నిచ్చింది ఈ సినిమాకు.

ఈ సినిమాలో “ఎన్టీఆర్” పాత్ర విషయంలో కొన్ని విమర్శలు, నిరాశలు వినిపిస్తున్నాయి. నిజానికి, ఎన్టీఆర్ పాత్ర లేని సావిత్రిని ఊహించుకోవడం కష్టమే. దర్శకుడు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు వ్రాసుకోవడం కూడా జరిగింది. కానీ ఆ పాత్రను తారక్ పోషించడం కుదరకపోవడంతో, ఆ పాత్రలో వేరేవరినీ ఊహించుకోలేక, ఆ పాత్రనే తీసేయడం జరిగింది. తీయడమంటే, అసలు సావిత్రిపై తీసే సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అవసరం ఏమి లేదు అన్నంతలా చేయడం పూర్తిగా దర్శకుడి నేర్పరితనమే.

చివరిమాట :

సావిత్రి చేసిన సినిమాలు “క్లాసిక్స్”. సావిత్రి మీద సినిమా చేసినా కూడా “క్లాసిక్”.

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s