ఓసారి వచ్చిన ఓ సినిమా కథతో మళ్ళీ ఇంకో సినిమా తీయడం సర్వసాధారణం. కానీ మాతృక కంటే రీమేక్ సినిమానే బాగున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందులో చెప్పుకోదగినది “పెళ్ళినాటి ప్రమాణాలు” (మాతృక), “ఆహ్వానం” (రీమేక్). ఈ ఆర్టికల్ లో ఈ రెండు సినిమాల గురించి విశదీకరించి చెప్పదలిచాను.
పెళ్ళినాటి ప్రమాణాలు:
1958వ సంవత్సరంలో “కె.వి.రెడ్డి” స్వీయనిర్మాణంలో తీసిన సినిమా ఇది. అక్కినేని నాగేశ్వరరావు, జమున, రాజసులోచన ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్డిగారి ఆస్థాన రచయిత “పింగళి నాగేంద్రరావు” కథ, మాటలు, పాటలు అందించగా, “ఘంటసాల” సంగీత దర్శకత్వం వహించారు.
కథగా…
చదువు పూర్తి చేసుకున్న కృష్ణారావు (నాగేశ్వరరావు) బాబాయి సలహాలరావు (రమణారెడ్డి) సిఫార్సుతో భీమసేనరావు (రంగారావు) ఇంటికి ఉద్యోగానికై వెళ్తాడు. కానీ ఓ ఉత్తరం తారుమారు అవ్వడంతో కృష్ణారావుని ఆ ఇంట్లో వంటవాడుగా భావిస్తారు. అసలు నిజం తెలిపేందుకు సలహాలరావు భీమసేనరావు ఇంటికి వెళ్ళి, అతడి కూతురు రుక్మిణి (జమున)ని కృష్ణారావుకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా సిఫార్సు చేస్తాడు. మొదట్లో ఒప్పుకోని భీమసేనరావుని తన కొడుకు ప్రతాప్ (ఆర్. నాగేశ్వరరావు) కృష్ణారావు తన స్నేహితుడేనని, మంచివాడని నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. రుక్మిణికి కూడా కృష్ణారావు నచ్చడంతో వారిద్దరి పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి రోజు దంపతులు ఇద్దరు అనేక ప్రమాణాలు చేస్తారు. కాలక్రమంలో ముగ్గురు పిల్లలు కలిగాక, ఇంటి పనులకే అంకితమైన రుక్మిణి పట్ల విసుగొచ్చిన కృష్ణారావు తన సెక్రటరీ రాధాదేవి (రాజసులోచన)కు దగ్గరవుతాడు. ఇది తెలుసుకున్న సలహాలరావు, ప్రతాప్ రుక్మిణి పట్ల బాధ్యతను కృష్ణారావుకి తెలిసేలా చేసి వారి సంసారాన్ని ఎలా చక్కబెట్టారు అన్నది మిగిలిన కథ.
సినిమాగా…
ఇది సాంఘిక సినిమానే అయినప్పటికీ, రచయిత పింగళి ఇందులోని పాత్రలకు, మూలకథకు స్ఫూర్తి పురాణాల నుండే పొందారు. కృష్ణుడు, రుక్మిణి, రాధ పాత్రల స్ఫూర్తితో అల్లుకున్నవే ఇందులోని కృష్ణారావు, రుక్మిణి, రాధాదేవి పాత్రలు. రుక్మిణి దేవి రాజ్యానికి కృష్ణుడు వెళ్ళి ఆమెని వివాహం చేసుకొని ద్వారకకు తీసుకొనిపోయిన ఘట్టం, రుక్మిణికి కృష్ణుడి మీదనున్న ఎనలేని ప్రేమ, భక్తి భావాలు, కృష్ణుడు రుక్మిణిని వదిలి వేరే భామకు ఆకర్షితుడవ్వడం లాంటి అంశాలను కథ, కథనాల్లో సాంఘీకరించి పొందుపరిచారు పింగళి. ఆ కాలపు తెలుగు సినిమా రచనలో ఓ సిద్దాంతం ఉండేది. పాత్ర స్వభావాన్ని బట్టి దానికి పేరు పెట్టడం, ఆ పాత్ర స్వభావం నిక్కచ్చిగా ఉండడం అప్పటి సినిమాల్లో పరిపాటి. ఈ సినిమాలో దాన్ని స్పష్టంగా గమనించవచ్చు.
ఇక మిగతా విషయాలకు వస్తే, కె.వి.రెడ్డి మునుపటి సినిమాల స్థాయిలో ఈ సినిమా తప్పకుండా లేదనే చెప్పాలి. ముఖ్య కారణం, మూలకథలో బలమైన సమస్యలు లేకపోవడం. తద్వారా కథనంలో డ్రామాను ఎక్కువగా పండించలేకపోయాడు దర్శకుడు. సినిమా నిడివి మూడు గంటల్లో ఎక్కువ కృష్ణారావు పాత్ర చుట్టే తిరుగుతుంది. అతడిపై వల్లమాలిన ప్రేమను చూపించే రుక్మిణిని, అతడిని వెంట తిప్పుకునే రాధను విడివిడిగా చూపించినట్టే ఉంటుంది తప్ప ఎక్కడా ఆ రెండు పాత్రల మధ్య ఓ బలమైన సమస్యను కానీ సంఘర్షణను కానీ చూపించలేదు దర్శకుడు. బహుశా, దీనికి కారణం రచనలో మారని పాత్రలే కాబోలు. దీనివల్ల ప్రేక్షకుడికి కథనంలో ఆసక్తి లోపిస్తుంది. ప్రధాన పాత్రలతో పాటుగా కథతో సంబంధంలేని అమ్మకాలు (కుటుంబరావు), ప్రకటనలు (అల్లు రామలింగయ్య) పాత్రలకూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు దర్శకరచయితలు. ఇది తగ్గించివుంటే సినిమా నిడివి కాస్త తగ్గి ఉపశమనం కలిగేది. ఈ రెండు పాత్రలు “మాయాబజార్” లో తానా శర్మ, తందానా శాస్త్రిలను గుర్తుచేసినప్పటికీ ఆ స్థాయిలో రక్తికట్టలేదు.
ఈ సినిమా కథనం అంతా పెళ్ళినాడు చేసిన ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా, వాటిని తరచుగా మననం చేసుకుంటూ “ప్రేమగండం”లో చిక్కుకోకుండా జీవించాలి అనే కథాంశం చుట్టూ నడుస్తుంది. హిందూ విడాకు చట్టం 1955లో వచ్చింది, ఈ సినిమా 1958లో వచ్చింది. బహుశా, అది ఈ చట్టాన్ని ఉపయోగించడానికి ఏ జంటా పూర్తిగా ధైర్యం చెయ్యలేని కాలం అయ్యుండొచ్చు. అందుకే, దర్శకరచయితలు “ప్రమాణాలు” అనే అంశం చుట్టూ కథను అల్లి ఉండొచ్చు. ప్రమాణం అనేది భావోద్వేగానికి సంబంధించినది అయినప్పుడు, అది పాత్రల మధ్యన ఒక సమస్యగా మారి, ఆ సమస్యను ప్రేక్షకుడి దాక తీసుకొనివెళ్తే పండినట్టు.
తన భర్తను ఎవరో మార్చే ప్రయత్నం చేస్తుంటే కూడా అతడికి ఇబ్బంది కలుగుతోందని వారిని వారించేంత ప్రేమ రుక్మిణికి కృష్ణారావు మీద ఉంది. కానీ స్వతహాగా తన భర్తను మార్చుకునే ప్రయత్నం మాత్రం రుక్మిణి ఎక్కడా చేయదు. పైన చెప్పుకున్నట్టుగా, ఈ పాత్రను పురాణాల్లో “రుక్మిణి”ని ఆధారంగా తీసుకొని చిత్రించిన రచయితకు, భర్తను ఇబ్బందిపెట్టేలా దాని స్వభావాన్ని మార్చే ఉద్దేశ్యం లేదు కాబోలు. అందుకే, కృష్ణారావులో మార్పు వచ్చే సన్నివేశం అంత ప్రభావితంగా అనిపించదు.
ఈ సినిమా అప్పట్లో విజయం సాధించిందో లేదో తెలియదు కానీ ఇప్పటి ప్రేక్షకుడికి మాత్రం చేరువయ్యేలా లేదనే చెప్పాలి. కానీ పోల్చి చూస్తే, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, పాత్రల ప్రవర్తనలు అన్నీ ఈ సినిమా కాలానికి కొంచెం ముందున్నట్టుగానే అనిపిస్తాయి. ఈ విషయంలో దర్శకరచయితలు అభినందనీయులు.
ఆహ్వానం:
1997లో “ఎస్వీ కృష్ణారెడ్డి” దర్శకత్వంలో వచ్చిన సినిమా. శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా ప్రధాన పాత్రలు పోషించారు.
కథగా…
నిరుద్యోగి అయిన రవికుమార్ (శ్రీకాంత్) డబ్బు పిచ్చి గల మనిషి. కష్టపడకుండా ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కంటుంటాడు. దానికి మార్గం బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసుకొని పెళ్ళి చేసుకోవడమేనని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో సిరిపురం సత్యనారాయణ (సత్యనారాయణ) తన కూతురు రాజేశ్వరి (రమ్యకృష్ణ)కి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడని, కట్నంగా పాతిక లక్షలు ఇవ్వగలడని తన బాబాయి శలభయ్య (సాక్షి రంగారావు) ద్వారా తెలుసుకొని ఆయన సిఫార్సు చేసిన ఉద్యోగంలో చేరాలనుకుంటాడు. ఉత్తరం తారుమారు అవ్వడంతో సిరిపురంలో వంటవాడి అవతారం ఎత్తాల్సివస్తుంది రవికి. ఆ తరువాత సత్యనారాయణ దృష్టిని ఆకర్షించి, శలభయ్య ద్వారా నిజం తెలిశాక రాజేశ్వరిని పెళ్ళాడతాడు రవి.
శిరీష (హీరా) అనే కోటీశ్వరురాలు ఉద్యోగరీత్యా రవిని కలిసి, ఆ తరువాత అతడిపై మనసుపడుతుంది. ఆవిడ ఆస్తి పట్ల ఆకర్షితుడైన రవి తన భార్య రాజేశ్వరికి విడాకులు ఇవ్వడానికి పూనుకొని రాజేశ్వరికి నోటిసులు పంపుతాడు. ఆ తరువాత రాజేశ్వరి తన భర్త మనసును మార్చి తన సంసారాన్ని ఎలా చక్కదిద్దుకున్నది అనేది ఈ సినిమా కథాంశం.
సినిమాగా…
కృష్ణారెడ్డి “పెళ్ళినాటి ప్రమాణాలు” ఆధారంగా రెండు సినిమాలు రూపోదించారు. మూలకథాంశం ఆధారంగా “ఆహ్వానం”, కథ, కథనాల ఆధారంగా “సర్దుకుపోదాం రండి”.
ఈ సినిమాకు సంబంధించి, లీడ్ కారెక్టర్ల వివాహం జరిగే వరకు “పెళ్ళినాటి ప్రమాణాలు” కథనే ఎంచుకున్న దర్శకుడు, ఆ తరువాత వచ్చే కథాంశాల్లో పెనుమార్పులు చేశాడు. భారతీయ పీనల్ కోడ్ లోని అనేక చట్టాలను ప్రశ్నిస్తూ సినిమాలు వచ్చాయి. అదే కోవలో విడాకు చట్టాన్ని ప్రశ్నించే కథాంశంగా ఈ సినిమాను మలిచాడు దర్శకుడు. 1997 అంటే విడాకు చట్టానికి బాగా అలవాటుపడిన కాలం కనుక అదే కథాంశంగా ఎంచుకున్నాడు. శాస్త్రోక్తంగా ముడిపడిన ఓ బంధాన్ని తెంచే హక్కు చట్టానికి లేదని, అది శాస్త్రానికే ఉందని వాదించి, శాస్త్రంలో బంధాన్ని కలపడమే కానీ విడదీసే పద్ధతి లేదని, కనుక విడిపోయే ఆలోచనలు మానాలని ఈ సినిమా ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పాడు కృష్ణారెడ్డి. మాతృక సినిమాలో కనిపించని ఓ బలమైన సమస్య ఈ సినిమాలో ఉంటుంది. ఇది “పెళ్ళినాటి ప్రమాణాలు” అనే కథకు, “ప్రమాణం” అనే అంశానికి ఇచ్చిన సరైన విలువ.
పాత్రల విషయానికి వస్తే, “పెళ్ళినాటి ప్రమాణాలు”లో మంచివాడుగా పరిచయమైన కృష్ణారావు బాధ్యతను మర్చిపోతాడు. అతడికి ఎదురు చెప్పలేక రుక్మిణి తనలో తాను కుమిలిపోతూవుంటుంది. కృష్ణారావు అన్న ఓ మాటకు నొచ్చుకున్న రాధ అతడికి బుద్ది చెప్పాలని తన వెంట తిప్పుకుంటుంది. కానీ “ఆహ్వానం”లో పాత్రల తీరుతెన్నులు పూర్తిగా మార్చాడు దర్శకుడు. మొదటి సన్నివేశంతోనే రవికుమార్ స్వభావాన్ని బలంగా నెలకొల్పి, దాన్ని అలాగే తీసుకొనివెళ్ళాడు. రాజేశ్వరిని మొదట్లో సున్నితమైన అమ్మాయిగా పరిచయం చేసి, ఆ తరువాత వచ్చే పరిస్థితుల వల్ల ఎలా బలపడిందో చూపించాడు. ఇక, మొదటినుండి చివరివరకు శిరీష పాత్రను మార్చలేదు. రెండు సినిమాలను పాత్రల విషయంలో పోల్చుకొని చూస్తే, అంతా సవ్యంగా సాగిపోతున్న కృష్ణారావు జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో మొదట్లో తెలియదు కనుక ఆ పరిస్థితి కోసం ఎదురుచూస్తాడు. మొదట్లోనే రవి ఎలాంటివాడో తెలిసిపోయాక, అతడిలో మార్పే కథలోని అంతిమ లక్ష్యమని, అది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందోనని వేచిచూస్తాడు ప్రేక్షకుడు. మాతృక సినిమా, కృష్ణారావు చుట్టూ తిరిగితే, ఈ సినిమా రాజేశ్వరి చుట్టూ తిరుగుతుంది. ఇది పెళ్ళినాటి ప్రమాణాలు నుండి ఆహ్వానంకు వచ్చిన ఓ పెద్ద మార్పు.
ఈ సినిమాకు అతికష్టమైన ఘట్టం ముగింపు. ఓ విధంగా వీడని చిక్కువంటి సమస్యే అది. డబ్బు పిచ్చితో మొదలైన రవి పాత్రకు చివరికి తన భార్య విలువ, వివాహ బంధం విలువ తెలియాలి అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమంలో సన్నివేశాలు బాగున్నప్పటికీ, రవికి కనువిప్పు కలగల్సింది డబ్బు ఏ విషయంలో అనే ప్రశ్న వచ్చినప్పుడు, దర్శకుడు రెండో అంశాన్నే ఎంచుకున్నాడు. దానికి భార్యలో దేవతను చూడాలన్న సమాధానం ఇస్తూ, రాజేశ్వరిని “అమ్మోరు”గా చూపించడం అక్కడ ఉండాల్సిన అంశం కాదనిపిస్తుంది. అమ్మోరుగా కనిపించిన భార్యను చూసి రవి భయపడతాడే తప్ప ఆమె విలువ తెలుసుకొని గౌరవాన్ని ఎలా చూపించగలడు అన్న ప్రశ్న వస్తుంది. కానీ దానికంటే వేరే ముగింపు ఇవ్వలేని పరిస్థితిలోకి దర్శకుడు కథ, కథనాలను బిగించేశాడు. నిజానికి, రవి విడాకులు కావాలనేది, రాజేశ్వరి మీద ప్రేమ తగ్గిపోయి కాదు, డబ్బు మీద వ్యామోహంతో. ఒకానొక సమయంలో రాజేశ్వరితో “నేను శిరీషను కేవలం డబ్బు కోసమే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను. అల చేస్తే మనకు బాగా కలిసొస్తుంది. ఆ తరువాత కూడా నువ్వే నా భార్యవి” అని కూడా అంటాడు రవి. దీన్నిబట్టి రవికి తన భార్యంటే ప్రేముందని తెలుస్తుంది. “మా ఆయనకు డబ్బు జబ్బు చేసింది. దాన్ని నయం చేస్తే చాలు” అని రాజేశ్వరి కూడా తన తల్లిదండ్రులతో చెబుతుంది. డబ్బు పిచ్చి పట్టిన రవి పాత్రను మార్చకుండా, ఆషామాషీగా విడాకులు కోరకూడదని, పెళ్ళినాటి ప్రమాణాలు తప్పకూడదని, వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెబుతూ సినిమా కథాంశాన్నే మార్చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో రవి పాత్రకు నెలకొల్పిన స్వభావం, దానిలో మార్పు రావాలనే ప్రేక్షకుడి కోరిక అంతర్లీనంగా మిగిలిపోతాయి. “పెళ్ళినాటి ప్రమాణాలు”లో దర్శకరచయితలు ఇలాంటి అయోమయ స్థితి కల్పించలేదు. ఎందుకంటే, కృష్ణారావుకి డబ్బు పిచ్చి లేదు. కాలక్రమంలో తన భార్య పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తించి, పెళ్ళినాడు చేసిన ప్రమాణాలను మరిచిపోయాడు. చివర్లో ఆమె విలువ తెలుసుకొని ఆమెని గౌరవించాడు. వారు అనుకున్న కథాంశానికి, సృష్టించిన పాత్రలకు అక్కడ అన్యాయం జరగలేదు.
మాతృక సినిమాను మించి ఆహ్వానం సినిమాకున్న ముఖ్య బలాలు సంగీత సాహిత్యాలు. ఈ రెండింటిలో కూడా సాహిత్యానిదే అగ్రతాంబూలం. ముఖ్యంగా, “పందిరి వేసిన ఆకాశానికి” అనే పాట రాజేశ్వరి పాత్ర స్థాయిని, తద్వారా సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. “దీర్ఘ సుమంగళీభవ!” అనే పదానికి వ్యతిరేకంగా “దీర్ఘ సహనమస్తు!” అనే పదం వాడడం “సీతారామశాస్త్రి”కే చెల్లింది.
చివరిమాట:
మొత్తంగా చూస్తే, “పెళ్ళినాటి ప్రమాణాలు” కన్నా “ఆహ్వానం” సినిమాకే ఎక్కువ మార్కులు పడతాయి. విడదీసి ఒక్కో అంశం పోలిస్తే, రెండింటి మధ్య హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
– యశ్వంత్ ఆలూరు