రామాయణాన్ని మొదట వాల్మీకి రచించారు. ఆ తరువాత మొల్ల, గోన బుద్దారెడ్డి లాంటి కవులు కూడా రచించారు. అలాగే మహాభారతాన్ని మొదట వేదవ్యాసుడు రచించారు. ఆ తరువాత తెలుగు కవిత్రయం రచించారు. ఒకే కథను పలు రచయితలు మళ్ళీ మళ్ళీ రచించినా ప్రేక్షకులు చదివారు. దానికి కారణం, ఒకే కథను వేర్వేరు రచయితలు చెప్పిన కోణాలు. “అరవింద సమేత వీరరాఘవ” సినిమా కూడా అంతే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్ళీ అదే నేపథ్యంతో ఎన్నో ఏళ్ళ తరువాత ఈ సినిమా తనదైన కోణంలో వచ్చింది.
“త్రివిక్రమ్” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్, పూజ హెగ్డే, జగపతిబాబు, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. “హారిక & హాసిని క్రియేషన్స్” పతాకంపై “సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)” నిర్మించారు.
సినిమా చూడనివారు దీన్ని చదవొద్దని నా మనవి!
కథ :
ముప్పై ఏళ్ళుగా పగలతో రగిలిపోతూ కత్తులు దూసుకునే రాయలసీమ ప్రాంతంలోని రెండు ఊర్లు కొమ్మద్ది, నల్లగుడి. మొదటిది నారపరెడ్డి (నాగబాబు) ఆధ్వర్యంలో ఉండగా రెండోది బసిరెడ్డి (జగపతిబాబు) ఆధ్వర్యంలో ఉంటుంది. ఓ రోజు బసిరెడ్డి చేసిన దాడిలో నారపరెడ్డి మరణించగా, అదే దాడిలో అతడి కొడుకు వీరరాఘవ రెడ్డి (ఎన్టీఆర్) బసిరెడ్డిపై తిరగబడి అనేకమందిని చంపుతాడు.
ఆ మారణహోమం తరువాత కొమ్మద్దిలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలు ఎలాంటివి? వాటిని వీరరాఘవ ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు? అందుకు అరవింద (పూజ హెగ్డే) ఎలా సాయపడింది? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇదివరకు వచ్చిన సినిమాలు పట్టించుకోని ఓ అతి ముఖ్యమైన విషయాన్ని ఈ సినిమా వందశాతం ఆచరించింది. అదే “యాస”. ఓ ప్రాంత నేపథ్యంలో కథను చెబుతున్నప్పుడు, కథలో ఆ ప్రాంతానికి కూడా ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, మనస్తత్వాలు, జీవన శైలి ఇలా అన్ని విషయాల్లో పరిశోధన చాలా అవసరం. ఇదివరకు వచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యపు సినిమాలైన “సమరసింహారెడ్డి”, “నరసింహనాయుడు”, “చెన్నకేశవరెడ్డి”, “ఇంద్ర” లాంటి సినిమాలు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాయి. కథానాయకుడి చేతిలో ఓ కత్తి పెట్టి, ప్రతినాయకుడికి ఓ పంచ కట్టి, సగం సగం యాసతో చేతులు దులుపుకున్నాయి ఆ సినిమాలు. రాయలసీమ నేపథ్యంలో నివసించే ఈ సినిమాలోని పాత్రలన్నీ (హీరోతో సహా) అదే యాసలో మాట్లాడతాయి. ఈ విషయంలో “పుట్టా పెంచలదాసు”ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న దర్శకనిర్మాతలకు పూర్తిగా మార్కులు వేయాలి.
“సమరసింహారెడ్డి” నుండి ఇప్పటివరకు ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లోని మూలకథలకు, ఈ సినిమా మూలకథకు ఏమీ తేడాలేదు. సంగ్రహంగా, “ఇంద్ర” సినిమాలో ఒక డైలాగులా “నరుక్కుంటూ పోతే అడవి అన్నది మిగలదు, చంపుకుంటూ పోతే మనిషి అన్నవాడు మిగలడు” అనే కథాంశంతోనే అన్నీ వచ్చాయి. మరి ఆ ట్రెండ్ ముగిసిన చాలాకాలం తరువాత అదే కథాంశంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకుడు ఎందుకు చూడాలి? ప్రధాన కారణం “త్రివిక్రమ్”. త్రివిక్రమ్ అందరు ఒకలా చూసే ఓ అంశాన్ని తనదైన కోణంలో మరోలా చూడగలడు. ఉదాహరణ, “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమా మొదట్లో సత్యమూర్తి చెప్పే “పులి కథ”. అబద్ధానికి, నిజానికి మధ్యన చేసే తర్కం గురించే అప్పటివరకు అందరు ఆ కథలో చూసింది. కానీ వాటన్నిటినీ దాటుకొని వెళ్తే ఓ మనిషి ఉంటాడు. ఒక మనిషి ప్రాణం కన్నా గొప్పవేమి కావు అబద్ధాలు, నిజాలు అనే ఒక ఆలోచనాత్మక కోణాన్ని అందులో చెప్పాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో కూడా అంతే. ఇప్పటివరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లో కథానాయకుడి కోణంలోనే కథను చెప్పబడింది. అంతా ముగిశాక, అందరూ పోయాక, తాను చేయాల్సింది ఇంకేమి లేదని తెలిశాక కథానాయకుడు వైరాగ్యంతో ఓ హోటల్లో సర్వరుగానో లేదా కాశిలో డ్రైవరుగానో మారుతాడు. అనగా, వాడిదైన రోజు వాడు తన యుద్ధాన్ని తాను చేసేసి, ఆ తరువాత అన్ని బాధ్యతల నుండి తప్పుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆ యుద్ధం వల్ల ఎగిరిపోయిన ప్రాణాలెన్ని? చెదిరిపోయిన కుటుంబాలెన్ని? అనే ప్రశ్నలు తనలో తాను వేసుకున్నా వాటిని ప్రేక్షకులకు చివరివరకు చెప్పే ప్రయత్నం చేయలేదు ఆ సినిమాల దర్శకరచయితలు. కానీ ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ పైన చెప్పిన పులి కథలోలాగ తన కోణాన్ని మొదట్లోనే ఆవిష్కరించాడు. కథను ఫ్యాక్షన్ కుటుంబాల్లోని ఆడవాళ్ళ కోణంలోంచి చెప్పాడు. మొదటి ఇరవై నిమిషాల్లోనే భీకరమైన యుద్ధాన్ని చూపించేసి, ఆ తరువాత దాని తదుపరి పరిస్థితులను చూపించాడు. మాములుగా, ఓ స్టార్ హీరో సినిమాలో అతడిని చూపించిన మొదటి షాట్లోనే అతడి పేరు తెరపై వేయడం ఆనవాయితి. కానీ ఇందులో ఇరవై నిమిషాల తరువాత వేశాడు దర్శకుడు. ఎందుకంటే, ఈ కథలో హీరో యుద్ధం చేసేవాడు కాదు, యుద్ధాన్ని ఆపేవాడు. ఆ ఆపే ప్రయత్నంలోనే అతడు “అరవింద సమేత వీరరాఘవ” అయ్యాడు. కనుక, యుద్ధం ముగిశాక అతడి పేరు వేయడమే ఈ కథకు కావాల్సింది. ఒక స్టార్ హీరోని ఇలా పరిచయం చేసిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. అందుకే మూలకథ ఒకటే అయినా, అది చెప్పబడిన విధానం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. త్రివిక్రమ్ వ్రాసిన ఓ డైలాగుని కాస్త మార్చి తనకే ఆపాదిస్తే, “తెలిసిన కథే అయినప్పటికీ, చెప్పే కథకుడు, చెప్పే కోణాన్ని బట్టి కథ విలువే మారిపోతుంది”.
తన ఇదివరకటి సినిమాల్లా, చెప్పాల్సిన కథ నుండి ఎక్కడా తప్పలేదు త్రివిక్రమ్. రాఘవుడు తెలుగు సినిమా హీరో కాబట్టి తాను సంకల్పించిన పనిని ఖచ్చితంగా పూర్తిచేస్తాడు. కానీ అది ఎలా అన్న ఉత్కంఠను దర్శకుడు ప్రేక్షకుడిలో స్థిరంగా ఉంచగలిగాడు. “మార్పు” ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం, అందులో మొదటిది కథానాయకుడిలో మార్పు, తరువాత కథానాయకుడు తీసుకోనివచ్చే మార్పు. కరుడుకట్టిన ఈ రెండింట్లో మార్పు రావడానికి సమయం కావాలి. అందుకే దర్శకుడు త్రివిక్రమ్ 167 నిమిషాల సమయం తీసుకొని ఒక్కో అంశాన్ని మెల్లగా మార్చుకుంటూ చివరికి ఆ మార్పుని బలంగా నెలకొల్పగలిగాడు.
తనలో పరిపక్వత వచ్చాకే ఈ సినిమాను తీయాలనుకున్నానని త్రివిక్రమ్ చెప్పాడు. అది నిజమే. “ఖలేజా” తరువాత త్రివిక్రమ్ రచనలో పరిపక్వత కనబరిచింది ఈ సినిమాలోనేనని చెప్పాలి. అందులోనూ ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం, త్రివిక్రమ్ తన కథల్లో స్త్రీలకు (హీరోయిన్లకు) ఇచ్చే విలువ. తన మొదటి సినిమా “నువ్వే నువ్వే” నుండి “అజ్ఞాతవాసి” వరకు తాను సృష్టించిన ఏ కథానాయికలోనూ పరిపక్వత ఉండదు. అందరూ అయోడిన్ ఉప్పు తినని మందబుద్ధి రాకుమారిలే. మొదటిసారి మెదడున్న, కథానాయకుడికి కూడా సలహాలు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్న “అరవింద”ను పరిచయం చేశాడు. ఇది త్రివిక్రమ్ తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడం లాంటిదేనని చెప్పాలి.
మూలకథాంశంలోని పాయింట్లను చెప్పడంలో త్రివిక్రమ్ నెగ్గినప్పటికీ, సైడ్ ట్రాక్ గా వచ్చే కామెడీలో మాత్రం మరోసారి విఫలమయ్యాడని చెప్పాలి. “జల్సా” నుండి త్రివిక్రమ్ తన సినిమాల్లో వ్రాసిన కామెడీ ట్రాకులు ఒకింత కృతిమంగా ఉంటాయి. ఈ పోకడ ఆ సినిమాతో అవసరంగా మొదలై, “జులాయి”తో వారసత్వమై, “సన్నాఫ్ సత్యమూర్తి”తో లక్షణంగా మారి, చివరకు “అజ్ఞాతవాసి”తో లోపమయ్యింది. ఆ లోపాన్ని పూడ్చుకునే ప్రయత్నం ఈ సినిమాలో కొంత కనిపించినా, రాబోయే సినిమాల్లో మరింత శ్రమించాల్సివుంది. ఉబుసుపోని “ఆకు పోక” కామెడీ ట్రాకుని త్వరగానే ముగించినప్పటికీ, రాఘవుడిని అరవిందకు దగ్గర చేయడానికి మరో మార్గం వెతికుంటే బాగుండేది.
“పెనిమిటి” పాటతో కూడా త్రివిక్రమ్ కొంత నిరాశకు గురిచేశాడు. కథానాయకుడి గొంతులో ఆ పాటను మొదలుపెట్టడం బలమైన పాయింట్ అయినప్పటికీ, మధ్యలో మాంటేజ్లను చూపించే సమయంలో అతడి తల్లి గొంతులో వినిపించివుంటే ఆ మాంటేజ్లు మరింత బలంగా ఉండేవి. ఆల్బమ్ కోసం కాలభైరవ వెర్షన్ ఉంచినా, సినిమాలో “చిత్ర”లాంటి గాయనితో పాడించివుంటే భావోద్వేగాలు బాగా పలికేవి. అలా చేసుంటే, “రంగస్థలం”లో “ఓరయ్యో” పాట స్థాయిలో ఈ పాట ప్రేక్షకుడిని బలంగా తాకుండేది.
మొత్తానికి, ఈ సినిమా చాలాకాలం తరువాత త్రివిక్రమ్ రచనలో చూపించిన కసి కోసం, మాయమైపోయాడనుకున్న అతడిలోని లోతైన మాటకారి మళ్ళీ తిరిగొచ్చినందుకు చూడొచ్చు.
నటనలు :
ఓ చురుకైన దెబ్బ కొట్టాలంటే పదునైన ఆయుధం కావాలి. అలాంటి ఆయుధమే త్రివిక్రమ్ కు ఈ సినిమాలో “ఎన్టీఆర్“. వీరరాఘవుడిలోని వీరుడిగా అతడి నటన ఎంత వీరోచితంగా ఉందో, రాఘవుడిగా పాత్రలో అంతే ఒదిగి నటించాడు. త్రివిక్రమ్ వ్రాసిన బలమైన మాటలను లోతుగా అనుభవించి ప్రేక్షకుడికి సూటిగా వెళ్ళేలా చెప్పిన విధానం చాలాబాగుంది. ముఖ్యంగా, కిడ్నాప్ అయిన అరవిందను, ఆమె తమ్ముడిని కాపాడే సన్నివేశంలో ఎన్టీఆర్ చాలా శక్తిమంతంగా కనిపించాడు. రాయలసీమ యాసను కూడా బాగా మాట్లాడాడు ఎన్టీఆర్.
త్రివిక్రమ్ కలంలో పుట్టిన మొట్టమొదటి తెలివైన అరవింద పాత్రను పూజ హెగ్డే కైవసం చేసుకుంది. ఫరవాలేదు అనిపించింది.
మిగతా నటుల గురించి చెప్పవలసివస్తే, మొదటగా “జగపతిబాబు” గురించే చెప్పాలి. “బసిరెడ్డి” పాత్రను త్రివిక్రమ్ ఎలా ఊహించుకున్నాడో తెలియదు కానీ ఆ పాత్రలో తనని తప్ప మరెవరినీ ఊహించుకోలేనంత స్థాయిలో జగపతిబాబు దాన్ని పోషించారు. ఇది కూడా ఓ ఊరి పెద్ద పాత్రే అయినప్పటికీ, “రంగస్థలం”లోని ప్రెసిడెంటు పాత్రను మరిపింపజేశారు. కానీ రాయలసీమ యాసను పలకడంలోనే కొంచెం ఇబ్బంది పడ్డారు.
గుర్తుంచుకోగల మరో నటుడు “నవీన్ చంద్ర“. సీమ యాస దగ్గర నుండి పాత్రకు కావాల్సిన అన్ని విషయాలలో సరిగ్గా సరిపోవడమే కాక మంచి నటనను కూడా ప్రదర్శించాడు.
మిగతా నటులైన సునీల్, బ్రహ్మాజీ, శతృ, దేవయాని, సితార, ఈశ్వరిరావు, సుప్రియ పాఠక్, ఈషా రెబ్బా, నరేష్, శ్రీనివాసరెడ్డి, రావు రమేష్, శుభలేఖ సుధాకర్ మరియు నాగబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు.
బలాలు :
- కథ, మాటలు. త్రివిక్రమ్ కథను చెప్పిన కోణం, దానికి తన మాటలతో పోసిన ప్రాణం ఈ సినిమాకు ప్రధాన బలం.
- యాస. మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఓ కమర్షియల్ సినిమాలో పూర్తిస్థాయి సీమ యాసలో పాత్రలు మాట్లాడాయి. ఆ శ్రద్ధను వహించిన త్రివిక్రమ్ తో పాటు, ఆయనకు సాయపడిన “పుట్టా పెంచలదాసు” అభినందనీయులు.
- ఛాయాగ్రహణం. కథ జరిగే ప్రదేశాలను బట్టి, లైటింగ్, కలరింగ్ విషయాల్లో ప్రామాణికతను పాటించారు పీ.ఎస్.వినోద్.
- సాహిత్యం. ఒక బలమైన కథాంశానికి భావోద్వేగపు సాహిత్యం యొక్క అవసరం ఎంతైనా ఉంది. అందులో తమ వంతు సహకారాన్ని పరిపూర్ణంగా అందించారు గీతరచయితలు సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి మరియు పెంచలదాసులు. ముఖ్యంగా, “యాడ పోయినాడో” పాటలోని సాహిత్యం అత్యుత్తమమైనది.
- సంగీతం. పాటల బాణీలు గొప్పగా అనిపించకపోయినా నేపథ్య సంగీతంతో సినిమాకు బలంగా మారాడు తమన్. మొదటి పోరాటం మరియు రెండో సగంలో బసిరెడ్డి-బాలరెడ్డి మధ్యన వచ్చే సన్నివేశాల్లోని నేపథ్య సంగీతం ఆ సన్నివేశపు భావోద్వేగానికి బాగా అతికింది.
- పోరాటాలు. ఓ యుద్ధం తదుపరి పరిణామాలు కథాంశం అయినప్పుడు, ఆ యుద్ధం చాలా భీకరమైనదిగా ఉండాలి. తమకిచ్చిన స్వేచ్చను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు రామ్ – లక్ష్మణులు.
- నిర్మాణ విలువలు. ఎలాంటి సినిమానైనా ప్రేక్షకుడి వరకు తీసుకొనిరావాలంటే కావాల్సిన మొదటి వ్యక్తి మరియు ఆఖరి వ్యక్తి నిర్మాత. ఎక్కడా రాజీలేని తత్వంతో సినిమాను అత్యున్నతమైన స్థాయిలో నిర్మించారు సూర్యదేవర రాధాకృష్ణ.
బలహీనతలు :
- ఉబుసుపోని త్రివిక్రమ్ మార్కు కృత్రిమ కామెడీ ట్రాకు.
- పెనిమిటి పాట చిత్రీకరణ.
– యశ్వంత్ ఆలూరు
Congratulations Dear
On Sun, 14 Oct 2018 at 23:55, Yashwanth Chronicle wrote:
> [image: Boxbe] This message is eligible
> for Automatic Cleanup! (comment-reply@wordpress.com) Add cleanup rule
>
> | More info
>
> Yashwanth Aluru posted: ” రామాయణాన్ని మొదట వాల్మీకి రచించారు. ఆ తరువాత
> మొల్ల, గోన బుద్దారెడ్డి లాంటి కవులు కూడా రచించారు. అలాగే మహాభారతాన్ని మొదట
> వేదవ్యాసుడు రచించారు. ఆ తరువాత తెలుగు కవిత్రయం రచించారు. ఒకే కథను పలు
> రచయితలు మళ్ళీ మళ్ళీ రచించినా ప్రేక్షకులు చదివారు. దానికి కారణం, ”
>
LikeLike
Thanks
LikeLike