సినిమా సాహిత్యం చాలా గొప్పది. ఓ రచయిత స్వతహాగా వ్రాసుకునే కవితలకు, నవలలకు ఎలాంటి ఎల్లలుండవు. తన ఊహలు ఎంత దూరం వెళతాయో అంత దూరం తన కలాన్ని ప్రయాణం చేయించగలడు. కానీ సినిమా సాహిత్యం రచయితను ఓ నిర్ణీత ప్రహరీలో బంధించేస్తుంది. ఆ బంధనంలో కూడా స్వేచ్చగా ఎగరగలగడంలోనే ఉంది రచయిత గొప్పతనం.
అలాంటి గొప్ప సినిమా సాహిత్యానికి ఎన్నో మచ్చుతునకలు. అందులో ఒకటి “మహానటి” సినిమాలోని “గెలుపు లేని సమరం” అనే పాట. దర్శకుడు “నాగ అశ్విన్”కు సావిత్రి కథను చెప్పడానికి మూడు గంటల సమయం తీసుకోగల స్వేచ్చ దొరికింది. కానీ అదే సావిత్రి కథను చెప్పడానికి రచయిత “సిరివెన్నెల సీతారామశాస్త్రి”కి కేవలం మూడున్నర నిమిషాల సమయమే దొరికింది. ఆ కాస్త సమయంలో తన కలాన్ని ఓ అర్థవంతమైన వేగంతో పరుగులు పెట్టించారు శాస్త్రి.
“ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమి” అనే తన పాటను తన జీవిత సూత్రంగా, అదే జీవిత సూత్రాన్ని తిరిగి తన ఇతర పాటలకు ఆపాదించడం శాస్త్రి గారి శైలి. మనుషులు స్వతాహాగా మంచివారో చెడ్డవారో కాదు, పరిస్థితులు మనిషిని మారుస్తాయి అన్న తాత్పర్యం ఆయన పాటల్లో ధ్వనిస్తూనేవుంటుంది. సినిమా సందర్భాన్ని బట్టి ఆ సినిమా కథను పాటలో ఇమిడింపజేయడంతో పాటు, తన సొంత తత్వాన్ని కూడా పాటలో పొందుపరచడం సీతారామశాస్త్రికున్న మరో ప్రత్యేకమైన శైలి. అందుకే, ఎన్నో లక్షలమంది ఆదరణను గెలుచుకున్న మహానటి సావిత్రి కూడా పరిస్థితులకు అతీతం కాదని తెలుపుతూనే పాటను మొదలుపెట్టారు.
గెలుపు లేని సమరం జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం?
హఠాత్తుగా జీవితంలో జరిగిన పరిణామాలు సావిత్రిని క్రుంగదీస్తూనే వెళ్ళాయి. వాటికి పరిష్కారం లేదు. ఉన్నా అది సావిత్రికి కనబడడం లేదు. పైన చెప్పినట్టుగా, సావిత్రి తానుగా ఈ ఉచ్చులో చిక్కుకోలేదు, పరిస్థితులు ఆమెను అందులోకి నెట్టాయి.
మధురమైన గాయం మరిచిపోదు హృదయం
ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం?
జెమిని గణేషన్ తో పరిచయం, ప్రేమ, పెళ్ళి సావిత్రి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. అతడి కోసం అయినవాళ్ళను సైతం వదిలేసింది. ఇంతా చేస్తే చివరికి అతడి వల్ల తన మనసుకు కష్టమే కలిగింది. ఇంకేదో జరిగుంటే సులువుగా మరిచిపోయేదేమో కానీ సావిత్రి అతడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది, అదే ఆమెను బాధిస్తోంది. ఆ ప్రేమకు ఎన్నటికీ చావులేదు, అలాగని అతడిని మళ్ళీ చేరుకోలేదు. ప్రేమ మధురమైనది, అది పెట్టే బాధ కఠినమైనది. రెండూ ఒకేసారి కలిగి సావిత్రి హృదయానికి ఓ మధురమైన గాయం చేశాయి. “మధురమైన గాయం” అనేది ఓ “అతిశయోక్తి” ప్రయోగం ఇక్కడ.
గతంలో విహారం కలల్లోని తీరం
అదంతా భ్రమంటే మనస్సంతమంటే
భూతకాలాన్ని, భవిష్యత్తు కాలాన్ని ఒకే వాక్యంలో పొందుపరిచారు శాస్త్రి. అవే “గతం”, “తీరం”. “విహారం” అనేది సంతోషానికి సంబంధించిన అంశం. గతంలో విహారం అంటే సావిత్రి ఆనందంగా గడిపిన కాలం. కలల్లోని తీరం అంటే తాను కలగన్న జీవితం (నటి అవ్వడం, జెమినితో జీవితం). ఇవన్నీ క్షణంలో మాయమైపోయి, అంతా భ్రమలా అనిపిస్తుంటే, మనసు రగిలిపోయింది.
ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు
దహిస్తుంటె దేహం వెతుక్కుంది మైకం
ఆ భ్రమ తాలూకు జ్ఞాపకాలు పదే పదే వెంటాడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయత. వాటివల్ల మనసెలాగూ అలసిపోవడం లేదు. కనీసం దేహానికైనా అలుపొస్తే కాసేపు కన్ను మూయొచ్చు. ఆ బలవంతపు అలుపు కోసం మైకాన్ని (మందు) ఆశ్రయించాల్సి వచ్చింది సావిత్రికి.
అలలుగ పడిలేచే కడలిని అడిగావా
తెలుసా తనకైనా తన కల్లోలం?
ఇలా ఎందుకు జరుగుతోందని ఒక ప్రశ్న వస్తే, దానికి సమాధానం సావిత్రికి కూడా తెలియదు. ఎందుకంటే, గెలుపు లేని సమరాన్ని, ఓడిపోని సమయంతో చేస్తోంది సావిత్రి. అయినా సరే అడగాలి అంటే, తనలోని అలలు పడిలేస్తూ ఎందుకంత అల్లరి చేస్తాయో ఏనాడైనా ఆ సముద్రాన్ని ఎవరైనా ప్రశించారా? ఒకవేళ అడిగినా అది జవాబివ్వగలదా? ఆ అలలకు కారణమైన తనలోని అలజడిని గురించి చెప్పగలదా? దాంతో మౌనంగా పోరాడుతుందే తప్ప! చిరాకాలం నిలిచిపోయే సముద్రంలోనే అంత కల్లోలం ఉన్నప్పుడు క్షణికమైన మనిషి జీవితంలో ఇంకెంత ఉంటుంది? ఇక్కడ సావిత్రిని కూడా సముద్రంతో పోల్చడం జరిగింది. ఎందుకంటే, ఆవిడ సాధారణమైన మనిషి కాదు. ఓ మహానటి. సముద్రంలాగానే చిరకాలం నిలిచిపోయేది. తనలోని కల్లోలం గురించి మాటల్లో ఎలా చెప్పగలదు, అలల్లా ఎగిసిపడడం తప్ప!
ఆకసం తాకే ఆశ తీరిందా?
తీరని దాహం ఆగిందా?
దేనికైనా ఒక ముగింపు ఉంటుంది ఈ ప్రకృతిలో. చివరికి ఆశలకైనా, కోరికలకైనా. ఆశ నెరవేరిన తరువాత దానిపై మోజు ఉండదు. అలాగే, ఎన్నోసార్లు ప్రయత్నించినా, ఎంతగానో శ్రమించినా కొన్ని కోరికలు తీరకుండా మిగిలిపోతాయి. ఒకానొక సమయంలో వాటిని సాధించే ప్రయత్నం చేయడానికి మనసు ఉత్తేజాన్ని కోల్పోతుంది. సావిత్రికి కూడా అంతే. నటిగా ఎదగాలన్న ఆశ తీరిపోయింది. అందులో ఉన్నత శిఖరానికి చేరుకుంది. దీనితో పాటు తీరని కోరిక కూడా ఉంది. అదే తన వ్యక్తిగత జీవితం. ఇక, ఎంత శ్రమించినా అది తీరేలా లేదు. కనుక, దాన్ని తీర్చుకునే ప్రయత్నం ఇక చేయలేని పరిస్థితి ఏర్పడింది.
జరిగే మథనంలో విషమేదో రసమేదో
తేలేనా ఎపుడైనా ఎన్నాళ్ళైనా
పొగలై, సెగలై ఎదలో రగిలే
పగలూ రేయి ఒకటై
నరనరాలలోన విషమయింది ప్రేమ
చివరకు మిగిలేది ఇదే అయితే విధిరాత తప్పించతరమా?
ఆ కృతయుగపు పాలకడలి మథనంలో అమృతం (మంచి), విషం (చెడు) వేరుగా కనిపించాయి. కానీ ఈ కలియుగపు మానవ మేథోమథనంలో వాటిని వేరు చేసి చూడడం ఎంతో కష్టం. ఎందుకంటే, అవి పాలునీళ్ళలా కలిసిపోయుంటాయి. తన జీవితంలోని పరిస్థితులకు ఎవరు కారణం? ఎవరు మంచి, ఎవరు చెడ్డ? ఇది తేలే పరిస్థితి లేదు. కానీ వాటి తాలూకు ఆలోచనలు హృదయంలో మరిగి సావిత్రిని తాగుడుకు బానిసను చేశాయి. దేహం వెతుకున్న ఆ మైకంలో పగలు, రాత్రికి కూడా తేడా తెలియడం లేదు. అలా, తన నరనరాల్లో విషం నిండిపోయింది. ఇక్కడ రచయిత ఒక చక్కని ఉపమానం చేయడం జరిగింది. మద్యపానం చేసే వ్యక్తి నరాల్లో విషమయ్యేది మద్యం. కానీ ఇది మనసుకు సంబంధించిన సందర్భం కనుక సావిత్రిలో మద్యం తాలూకు విషం కన్నా దానికి తనను బానిసను చేసిన ప్రేమ మరింత విషపూరితమైనదని చెప్పడం జరిగింది. ఇక్కడే, “ప్రేమనగర్” సినిమాలోని ఓ మాట గుర్తొస్తుంది, “ప్రేమకన్నా మత్తు పదార్ధం ఏముంది గనక?” మరి శరీరమంతా ఆ విషంతో నిండిపోతే, తరువాత జరిగేదేమిటి? అలా జరగడమే విధిరాత అయినప్పుడు దాన్ని తప్పించడం ఎవరి తరం?
మొదటి నుండి పాటను క్షుణ్ణంగా పరిశీలిస్తే, రెండు అంశాలుంటాయి. మొదటిది, సినిమాలోలాగే, ఎక్కడా సావిత్రి తప్పు చేసిందని పాటలో చెప్పబడదు. అదంతా కేవలం పరిస్థితుల ప్రభావమేనని, విధిరాతని మాత్రమే చెప్పబడుతుంది.
రెండవది, సినిమా కథనం పోకడనే ఈ పాట కూడా అనుసరిస్తుంది. సినిమా కోమాలోకి వెళ్ళిన సావిత్రి అనే అంశంతో మొదలై, ఆవిడకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో క్రమంగా చెప్పుకుంటూ పోతుంది. ఈ పాట ఆరంభ వాక్యాలను గమనిస్తే, “గెలుపు లేని సమరం…” అనగా, “చావుతో పోరాటం” అని మొదలవుతుంది. ఆ తరువాత “మధురమైన గాయం…”, అనగా, “ప్రేమ, అది చేసిన గాయం”. ఇది కథనంలో ఓ ముఖ్య ఘట్టం. అదంతా, క్షణంలో గతంలోకి జారిపోవడంతో సావిత్రి తట్టుకోలేకపోయింది. ఆ క్రమంలో తన జీవితంలో వచ్చిన మార్పులను సూచించే వాక్యాలే మిగతావి. సమయంతో చేసిన పోరాటంలో సావిత్రి ఓడిపోయింది. గెలుపులేని సమరమని ముందే తెలిసినప్పుడు ఇక విధిరాత ఏమైవుంటుంది? దాన్ని తప్పించడం ఎవరి తరమవుతుంది?
“మహానటి” సినిమాలోని మిగతా పాటలన్నీ ఒక ఎత్తు, ఈ పాట ఒక ఎత్తు. అప్పటివరకు జరిగిన కథను అతి తక్కువ సమయంలో మళ్ళీ సంగ్రహంగా చెప్పాలంటే, దానికి ఎంతో మేథోమథనం అవసరం. అందుకే, ఆ బాధ్యతను దర్శకుడు మళ్ళీ సీతారామశాస్త్రికే అప్పజెప్పాడు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఈ పాట. దీన్ని తెరపై కూడా అంతే గౌరవించాడు దర్శకుడు. ఈ పాటలో తెరపై కనిపించే సన్నివేశాలన్నీ దాదాపుగా పాటలోని వాక్యాలకు దృశ్యరూపంగానే ఉంటాయి. అందులో ఎడిటింగ్ విభాగం కృషి కూడా అభినందనీయం.
ఉదాహరణకు, “జరిగే మథనంలో విషమేదో, రసమేదో…” అనే వాక్యాలకు ఈ క్రింది దృశ్యాలు,
ఎవరు మంచి (రసం), ఎవరు చెడ్డ (విషం) నమ్మే పరిస్థితి లేని సమయం. ఇక్కడ కనిపిస్తుంది సత్యం పాత్ర.
“పొగలై సెగలై…”
“ఎదలో రగిలే…”
కవితాత్మకమైన సాహిత్యానికి ఇంతకంటే కవితాత్మకమైన దృశ్యం బహుశా దర్శకుడు తెరపై చూపించలేడు.
ఇంతటి నరకంలో పగలేదో రేయేదో తెలియని పరిస్థితిలో ఫ్లాష్బ్యాకులోని రాజేంద్రప్రసాద్ డైలాగుని పెట్టడం కూడా అంతే కవితాత్మకమైన ముగింపు ఈ పాటకు. “అంతా నాశనం చేసేశావు!” చివర్లో ఈ డైలాగు పెట్టడం దర్శకుడు తీసుకున్న డ్రామాటిక్ లిబర్టీ. ఈ మాటకు అది వచ్చిన అసలు సన్నివేశంలోకన్నా ఇక్కడే ఎక్కువ విలువ దక్కిందని చెప్పాలి.
– యశ్వంత్ ఆలూరు