కథ :
గర్భం దాల్చిన సమయంలో పోషకాల లోపం మూలంగా వచ్చే Vanishing Twin Syndrome వల్ల రెండు పిండాలు ఒకే పిండంగా మారి విక్రమ్ (నాగచైతన్య) జన్మిస్తాడు. అతడికి విపరీతమైన ఆనందమేసినా, బాధేసినా అతడి ఎడమ చేయి తన అధీనంలో ఉండదు. అలాంటి వ్యక్తికి ఓ పెద్ద సమస్య వస్తుంది. దాన్ని విక్రమ్ ఎలా జయించాడు? ఆ క్రమంలో తన అధీనంలో లేని ఎడమచేయిని ఎలా అదుపు చేసుకున్నాడు? అనేవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ :
ఈ సినిమాకు దర్శకుడు చందు ఎంచుకున్న మూలకథ బలమైనదే. ప్లాట్ పాయింట్స్ చాలా బాగున్నాయి. చాలామందికి తెలియని ఓ సిండ్రోమ్ ని ఎంచుకోవడంతో పాటు తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై సరైన శ్రద్ధ వహించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయన్న అంశాన్ని అంతర్లీనంగా చెప్పుకుంటూపోయాడు. కథను ఆరంభించడమే ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో చేసిన చందు క్రమంగా సిండ్రోమ్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో కథానాయిక పాత్రను, ఆరోగ్యకరమైన హాస్యాన్ని కథనంలో బాగా పొందుపరిచాడు. “ప్రేమమ్” సినిమాలో తాను చేసిన వింటేజ్ రీసెర్చిని ఇక్కడ మళ్ళీ వాడుకొని తీసిన “1980,81,82” తీసిన పాట తెరపై చాలా బాగుంది. అమెరికా ఎపిసోడ్ “అమెరికా”లో చిత్రించాల్సిన అవసరం లేకపోయినా, మొదటి సగమంతా ఆహ్లాదకరంగానే సాగుతుంది. కథలోని ముఖ్యమైన సమస్యని కూడా సరైన సమయంలోనే ప్రవేశపెట్టాడు దర్శకుడు.
“సవ్యసాచి” అనగానే గుర్తొచ్చేది భారతంలో అర్జునుడు. దర్శకుడు కథానాయకుడి పాత్రను అలాగే చిత్రించాడు. అర్జునుడు సవ్యసాచిగా పద్మవ్యూహంలో విజ్రుమ్భించిన ఘట్టాన్ని తన కథలో బాగా ఇనుమడింపజేశాడు. మరో ప్రత్యేకమైన అంశమేమిటంటే, భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి అడుగుపెట్టడం మాత్రమే తెలుసు, అర్జునుడికి దాన్ని చేధించడం తెలుసు. అయినా సరే, అభిమన్యుడు పోరాటం ఆపలేదు. ఆ రెండు పాత్రల సామర్థ్యాలను, లక్షణాలను ఇక్కడ ఒకే పాత్రలో పొందుపరిచాడు దర్శకుడు. పద్మవ్యూహంలో అర్జునుడు సైంధవుడిని ఎప్పుడు చేరుకుంటాడో ఇందులో కూడా కథానాయకుడు ప్రతినాయకుడిని అప్పుడే చేరుకుంటాడు. కథానాయకుడికి వచ్చిన అసలు సమస్యేమిటన్న విషయాన్ని చివరి వరకూ చెప్పకపోవడం, కానీ అతడికి పోరాడే పరిస్థితిని కల్పించడం అభిమన్యుడు పాత్రకు న్యాయం చేస్తే, చివర్లో సమస్యేమిటో తెలిశాక దాన్ని చేధించడం అర్జునుడి పాత్రను నెలకొల్పింది. అక్కడే “సవ్యసాచి” అనే టైటిల్ కి కూడా న్యాయం జరిగింది.
ఇన్ని మంచి కథాంశాలున్నా, దీన్ని మామూలు కమర్షియల్ సినిమాగా మలచడానికి, నాగచైతన్య ఇమేజ్ ని నిలబెట్టడానికి కథనంలో వచ్చే కొన్ని అనవసరపు ఘట్టాలు కథలోని ఆత్మని, ప్రేక్షకుడిలోని ఆసక్తిని దెబ్బతీసే అంశాలుగా మారాయి. అందులో మొదటిది “సుభద్ర పరిణయం”. అది బాగున్నప్పటికీ, అదొచ్చిన సమయం దాన్ని పంటి క్రింద రాయిని చేసింది. హీరోని పౌరాణిక పాత్రలో చూపించి అతడి అభిమానులను ఆకట్టుకోవాలని చేసిన ఇదే ఘట్టాన్ని మొదటి సగంలోనే ఎక్కడైనా పెట్టేసుంటే ఇంకా బాగుండేది. మొదటి సగంలో ఆ స్పేస్ కూడా దర్శకుడికి లేకపోలేదు. సీరియస్సుగా పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోతున్న అర్జునుడితో సైంధవుడి తలను నరికించకుండా మధ్యలో లాక్కొచ్చి, అతడిని సుభద్రతో “లగ్గాయిత్తు” అనిపించి, ప్రేక్షకుడి మూడ్ ని మార్చి, మళ్ళీ వెంటనే పద్మ్యవ్యూహంలోకి తీసుకెళ్ళిపోవడం దర్శకుడు చేసిన పొరపాటుగా చెప్పొచ్చు. ఏదేమైనా, సంగీత దర్శకుడు “కీరవాణి” సాయంతో కథనాన్ని నిలబెట్టే ప్రయత్నం దర్శకుడు మళ్ళీ చేసినప్పటికీ, మునుపటి స్థాయిలో ఆసక్తిని మాత్రం తీసుకొని రాలేకపోయాడు. తాను అనుకున్న ప్లాట్ పాయింట్స్ ని మాత్రం పరిపూర్ణంగా చెప్పగలిగాడు.
ఈ సినిమాలో కూడా “ధృవ”లోలాగ కథానాయకుడికి ధీటుగా చిత్రించబడిన ప్రతినాయకుడి పాత్రను ఇంకాస్త చూపించివుంటే బాగుండేది. అతడు తన మెదడుని ఎలా వాడుకున్నాడన్నదానికి ఒక బలమైన దృష్టాంతం ఉండాల్సింది.
మొత్తానికి, “సవ్యసాచి” మూలకథ బలంగా ఉండి, కథనం ఆసక్తిగా మొదలై, మళ్ళీ ప్రక్కదారి పట్టి ఓసారి మాత్రమే చూడగల సినిమాగా మిగిలిపోయింది.
నటనలు :
నాగచైతన్య విక్రమ్ పాత్రను చాలా బాగా పోషించాడు. ముఖ్యంగా, “ఊపిరి ఉక్కిరిబిక్కిరి” అనే పాటలో అతడి నటన చాలా బాగుంది. ప్రతినాయకుడిగా మాధవన్ ఈ సినిమాకు సరిగ్గా సరిపోయాడు. అతడికి హేమచంద్ర చెప్పిన డబ్బింగ్ కూడా అద్భుతంగా నప్పింది.
నిధి అగర్వాల్ కు మామూలు కమర్షియల్ సినిమా హీరోయిన్ కి దక్కే ప్రాధ్యాన్యమే దక్కింది. వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య నవ్వించగా, భూమిక పాత్ర గుర్తుంచుకునేలా లేదు.
బలాలు :
- కథ, పాత్రలు. భారతంలోని పాత్రలను, వాటి లక్షణాలను పొందుపరిచిన తీరుకి, ముఖ్యమైన కథాంశాలకి చందుకి మార్కులు వేయాలి.
- సంగీతం. వినడానికి “టిక్ టిక్ టిక్” పాట బాగుంది. “సవ్యసాచి” పాటతో నేపథ్య సంగీతాన్ని చేసిన తీరు “ఛత్రపతి”ని తలపించింది. బాహుబలి మొదటి భాగం తరువాత కీరవాణి నేపథ్య సంగీతం మళ్ళీ ఈ సినిమాలో అలరించింది.
- పోరాటాలు. పాత్రకు, కథకు సరిపోయే పోరాటాలను రామ్-లక్ష్మణులు మళ్ళీ అద్భుతంగా చేశారు. రెండో సగంలో బైక్ చేజ్ మరియు ఆఖరి పోరాట ఘట్టాలు చెప్పుకోదగినవి.
- ఛాయాగ్రహణం. యువరాజ్ చేసిన లైటింగ్ ఆకట్టుకుంది.
- ప్రొడక్షన్ డిజైన్. రంగస్థలంకి పనిచేసిన రామకృష్ణ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైన్ చేశారు. వింటేజ్ వస్తువుల సేకరణతో పటు ప్రతినాయకుడి ప్రదేశాన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం.
- నిర్మాణ విలువలు. మైత్రీ సంస్థ పెట్టిన ఖర్చు సినిమాలోని ప్రతి ఫ్రేములో అందంగా కనిపించింది.
బలహీనతలు :
- ప్రతినాయకుడి పాత్ర భావోద్వేగానికి బలమైన దృష్టాంతం చూపించకపోవడం.
- అసలు కథను ప్రక్కదారి పట్టించి “లగ్గాయిత్తు” అనిపించడం.
– యశ్వంత్ ఆలూరు