ఈ సినిమా పేరు తలచుకోగానే గుర్తొచ్చేది మూడు అతి ముఖ్యమైన ఘట్టాలు. అవి కథనంలో క్రమంలోనే వస్తాయి.
మొదటి ఘట్టం – సూర్య, పద్మల వివాహం
నాకు అమితంగా నచ్చిన సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో ఉండడానికి కారణం ఈ ఘట్టం. మణిరత్నం ఎంత గొప్ప రచయితో ఓ దృష్టాంతం చూపింది కూడా ఈ ఘట్టమే.
పురిటిలోనే తల్లికి దూరమైన కొడుకుగా, శాపగ్రస్తుడైన మహావీరుడుగా, మోసం చేత అర్థాంతరంగా చనిపోయిన రాజుగా మిక్కిలి సానుభూతి కలిగించేలా మహాభారతంలో కర్ణుడి పాత్ర చిత్రించబడినది. ఒకవేళ, అదే కర్ణుడికి కావలనుకున్నవన్నీ దక్కితే అతడి జీవితం ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో తీసిన సినిమా దళపతి. సరిగ్గా ఈ ఘట్టం ముందే సూర్య (రజనీకాంత్) ప్రేమించిన సుబ్బలక్ష్మి (శోభన)కి కలెక్టర్ అర్జున్ (అరవింద స్వామి)తో వివాహం జరుగుతుంది. ముందెక్కడో ఒక్క సన్నివేశంలో పరిచయమైన పద్మ (భానుప్రియ) పాత్ర మళ్ళీ ప్రవేశిస్తుంది. అలా సినిమాలోని అతి ముఖ్యమైన ఘట్టానికి తెర లేస్తుంది.
ఈ ఘట్టం కొన్ని పాత్రలలోని ప్రశ్నలకు సమాధానం తెలుపుతూ అతి ముఖ్యమైన సమస్య పరిష్కారానికి కూడా నాంది పలుకుతుంది. తన బిడ్డ లోకాన్ని చూడక ముందే భర్తను కోల్పోయిన అభాగ్యురాలు పద్మ. భర్త బ్రతుకు, చావు రెండూ తన పాలిట శాపంగా మారగా ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్ళిపోవాలనుకుంటుంది. తన దగ్గర పనిచేసి ప్రాణాలు కోల్పోయిన రమణ భార్యకు అన్ని విధాలా సాయం చేసే దేవరాజు (మమ్ముట్టి)కి పద్మ పడుతున్న కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది. ప్రేయసిని దూరం చేసుకొని ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సూర్యకు ఓ తోడు దొరికి అతడు సంతోషంగా ఉండాలన్న కోరిక కూడా దేవరాజుకు ఉంది. రమణను చంపడం తప్పు కాకపోయినా దానివల్ల పద్మకు జరిగిన అన్యాయానికి సూర్యే కారణం. ఇన్ని ముళ్ళను పద్మను సూర్యకు ఇచ్చి వివాహం చేయించడంతో దేవరాజు పాత్ర ద్వారా రచయిత విప్పడం జరిగింది.
పెళ్ళి ఘట్టంతో ఇన్ని పాత్రల్లోని అంతర్మధనాలకు ఓ రకమైన పరిష్కారం దొరికింది. పద్మలాగే సినిమా మొదట్లో పరిచయమై మళ్ళీ ఈ ఘట్టంతో సాంత్వన పొందే మరో పాత్ర కూడా ఉంటుంది ఈ సినిమాలో. అదే, సూర్యను పెంచిన తల్లి (నిర్మలమ్మ). ఈ పాత్ర సూర్యతో ఓసారి అంటుంది, “ఏదో ఒకరోజు నిన్ను కన్న తల్లి వచ్చి నా బిడ్డను ఇలా పెంచావేంటని అడిగితే నేనేమీ సమాధానం చెప్పగలను?” అని.
ఆ ఒక్క మాటతో ఆ తల్లి పాత్ర సూర్య పట్ల ఉండే బాధ్యతను, భయాన్ని చూపిస్తుంది. తరువాత సూర్యకు ఓ తోడు దొరికిందని తెలియడంతో సంతోషం పట్టలేకపోతుంది. బాధను మాటల్లో చెప్పిన తల్లి సంతోషాన్ని మాత్రం చేతల్లో చూపిస్తుంది.
నిజంగా, ఇక్కడ మాటలు పెట్టవలసివస్తే, “ఆహా! ఇన్నాళ్ళకు నీకొక తోడు దొరికింది!” అనో, “నీపట్ల నా బాధ్యత తీరిపోయింది!” అనో లేదా ఈ రెండు మాటలు కలిపి కూడా పెట్టవచ్చు. అయితే, ఇక్కడెన్ని మాటలు అవసరమో అన్ని మాటలూ పై రెండు షాట్లలో చెప్పేసింది ఆ పాత్ర. ఇక మాటలుండాల్సిన అవసరమేముంది? “Show, don’t tell” అనే ప్రాథమిక సినిమా సూత్రాన్ని దర్శకుడు ఇక్కడ వందశాతం ఆచరించాడు. పైగా, ముఖ్యమైన పాత్రలకు అనుభవజ్ఞులైన నటులను ఎంపిక చేసుకోవడంలో ఉన్న సౌలభ్యం కూడా ఇదే. వెరసి, సినిమాలో ఇదొక “డైరెక్టర్స్ మొమెంట్”గా చెప్పొచ్చు.
రెండవ ఘట్టం – సూర్యకు తన తల్లి గురించి తెలియడం
మూలకథలోని ముఖ్యమైన ఘట్టం ఈ సన్నివేశంతో ఆరంభమవుతుంది. అనుకున్నట్టుగా, కర్ణుడు (సూర్య) ఓ తోడుని సంపాదించుకున్నాడు. ఇక మిగిలింది కుంతీదేవి (తల్లి) గురించి తెలుసుకోవడమే.
సినిమా మొదటినుండి సూర్యకు తన తల్లి పట్ల కోపం ఉంటుంది, తనను పురిట్లోనే విడిచి వెళ్ళిపోయిందని. దానికి కారణమేంటో తెలియకుండా, తనలో ఏదో లోపముండడం వల్లే అలా వదిలి వెళ్ళిందని, బహుశా అది తన రూపమే కావచ్చునని అనుకుంటూవుంటాడు. ఆ ఆత్మనూన్యతతోనే సుబ్బలక్ష్మిని దూరం చేసుకుంటాడు. నిజం చెప్పడానికి వచ్చిన అర్జున్ తండ్రి (జైశంకర్)తో అలా తనని వదిలేసి వెళ్ళిన ఆవిడ తన అమ్మే కాదని వాదిస్తాడు. అలాంటి తల్లి తనకు వద్దంటాడు.
అసలు తన తల్లి తప్పేమీ లేదని, “అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు” అని అసలు నిజం తెలుసుకున్నప్పుడు అతడిలో ఓ కనువిప్పు కలుగుతుంది. అంతే, ఆ తరువాత ఒక్కమాట కూడా తల్లిని అనడు. ఇన్నాళ్ళు నిజం తెలియక తన తల్లిని దూషించినందుకు కుమిలిపోతాడు. ఆ పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా, అప్పటివరకు ఆవిడ తన తల్లి కాదన్న సూర్య, తను ఆవిడ కొడుకన్న నిజం ఆవిడకు తెలియకూడదని మాట తీసుకుంటాడు.
ఓ పాత్రలో కరుడుకట్టిపోయిన ఓ భావాన్ని ఓ చిన్నమాటతో బద్దలుకొట్టి, ఆ పాత్ర భావజాలాన్నే మార్చేస్తుంది ఈ ఘట్టం.
మూడవ ఘట్టం – సూర్య తల్లి అతడిని కలవడం
సూర్య పాత్రకు పరిపూర్ణమైన సాంత్వననిచ్చిన ఘట్టమిది. ఇక్కడ మాటలు నిజంగా అవసరం. ఎందుకంటే, దాదాపు ముప్పైయేళ్ళ క్రితం విడిపోయిన తల్లీకొడుకులు మళ్ళీ కలిసినప్పుడు, అప్పటివరకు వారిద్దరూ పడిన బాధేంటో తెలిసినప్పుడు, ఖచ్చితంగా వారు మాట్లాడుకొని తీరాలి. అది సహజం. కానీ ఇక్కడ కూడా మాటలను చాలా పొదుపుగా వాడడం జరిగింది. తల్లిని చూసిన సూర్య ఎక్కడా ఆమెను నిలదీయడు. తన తల్లిని కలిసిన ఆనందంలో తన కోపాన్నంతా మర్చిపోతాడు. “నిన్ను వేయి ప్రశ్నలు అడగాలనుకున్నాను కానీ నిన్ను చూస్తుంటే కోపమంతా పోయింది!” అంటాడు.
అన్ని సంవత్సరాలు బిగపట్టిన బాధను, కోపాన్ని ఈ ఒక్క మాటతో వదిలేసిన సూర్యకే కాకుండా ప్రేక్షకుడికి కూడా సంతోషాన్ని కలిగించిన ఘట్టమిది. ఈ కథలో జరిగేదేంటో ప్రేక్షకుడికి మొదటినుండి తెలుసు. కానీ అది పాత్రలకు ఎప్పుడు తెలుస్తుందా అన్న ఆత్రుతని ఈ సన్నివేశంలో తీర్చడం జరిగింది.
ఈ సినిమాను కలకాలం గుర్తుంచుకోవడానికి ఈ మూడు ఘట్టాలు చాలు.
– యశ్వంత్ ఆలూరు