డబ్బింగ్ పాటల్లో శబ్దానికి సాహిత్యం లొంగడం పరిపాటి. ముఖ్యంగా, “ఏ.ఆర్.రెహమాన్” స్వరపరిచిన తమిళ పాటలు తెలుగలో అనువాదమైనప్పుడు ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కారణం, ఇదివరకే పాటను తమిళంలో రికార్డు చేయడం, దానికి తగ్గట్టుగా తెరపై నటుల లిప్ సింక్ ఉండడం, దాన్ని అనువదించే క్రమంలో ప్రేక్షకుడికి అనుభూతిని దూరం చేయకుండా ఆ లిప్ సింకుకి దగ్గరగా ఉండేలా పదాలుంటే బాగుంటుందని వారి అభిప్రాయం. ఈ అభిప్రాయం ఎన్నో పాటల పాలిట శాపంగా మారింది. తమిళంలో వ్రాసిన కవిత కాస్త తెలుగులో బూతుగా మారిన సందర్భాలు అనేకం. ఆ పాటలను తెలుగులో పేరుమోసిన రచయితలే వ్రాయడం గమనార్హం.
తన సినిమాలకు తెలుగులో ఎక్కువగా “వేటూరి” గారి చేత పాటలు వ్రాయించుకున్న “మణిరత్నం” వేటూరి గారు పరమపదించిన తరువాత “కడలి” సినిమా మినహా తరువాత తీసిన మూడు సినిమాలకు “సిరివెన్నెల సీతారామశాస్త్రి” గారిని ఎంచుకున్నారు. మిగతావారితో పోలిస్తే, డబ్బింగ్ పాటలు తక్కువ సంఖ్యలో వ్రాసిన శాస్త్రిగారు ఈ రంగంలో అడుగుపెట్టాక డబ్బింగ్ పాట సాహిత్యం మళ్ళీ కొత్త వైభవాన్ని సంతరించుకుంది. అంతకుమునుపు “రాజశ్రీ”, “భువనచంద్ర” లాంటి రచయితలు డబ్బింగ్ పాటలకు పెట్టింది పేరు. డబ్బింగ్ పాటే అయినప్పటికీ అది అచ్చ తెలుగు పాటలా వినిపించడం వారి ప్రతిభ. వారి తరువాత అది శాస్త్రి గారికే దక్కిందని చెప్పాలి.
మణిరత్నం తీసిన “కాట్రు వెలియిడై” అనే సినిమా తెలుగులో “చెలియా”గా అనువదించబడినది. అందులో అన్ని పాటలను శాస్త్రిగారే వ్రాయడం జరిగింది. శబ్దానికి ఎప్పుడు లొంగని శాస్త్రి ఈసారి కూడా లొంగలేదు. సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీలో స్వల్ప మార్పులు (తీక్షణంగా వింటే తప్ప తెలియనివి) చేసి (చేయించి?) తమిళంలో వ్రాసిన భావాన్ని ఏమాత్రం స్పృశించకుండా తనదైన కొత్త భావాన్ని కథకు, సందర్భానికి సరిపోయేలా పాటను వ్రాశారు. తమిళంలో “వైరముత్తు” వ్రాసిన “నల్లై అల్లై” అనే పాటను తెలుగులో “అల్లై అల్లై” అని వ్రాశారు. వైరముత్తు పురాతన తమిళ పదాలు వ్రాయగా శాస్త్రి మామూలు తెలుగు పదాలలో పాటను వ్రాశారు.
ఈ సినిమాలోని కథానాయకుడి పాత్ర చాలా అహంకారి. కోపం ఎక్కువ. ఆ కోపంలో ఓసారి తన ప్రేయసిని అందరి ముందు కసురుకొన్నాడు. దాన్ని అవమానంగా భావించి ఆ అమ్మాయి అతడిని వదిలి వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకున్న కథానాయకుడు ఆమెకు క్షమాపణ చెప్పడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయంటే తనకెంత ఇష్టమో చెప్పాలనుకున్నాడు. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది.
కథానాయకుడి కోణంలో సాగే ఈ రెండు పాటల సాహిత్యాల మధ్య వ్యత్యాసాన్ని తెలుపడానికి రెండు పాటల భావాలను పోల్చుకుంటూ ఇక్కడ చెబుతాను.
తమిళం :
వానిల్ తేడి నిండ్రే ఆళి నీ అడయిన్దాయ్
ఆళి నాన్ విళుందాల్ వానిల్ నీ ఎళుందాయ్
ఎన్నై నచ్చతిర కాట్టిల్ అలయవిట్టాయ్
నాన్ ఎండ్ర ఎన్నమ్ తోలైయవిట్టాయ్
నల్లై అల్లై, నల్లై అల్లై
నన్నిలవే నీ నల్లై అల్లై
నల్లై అల్లై, నల్లై అల్లై
నళ్ళిరవే నీ నల్లై అల్లై
అర్థానికి వస్తే, “నీకోసం ఆకాశంలో వెదుకుతుంటే నువ్వు సముద్రంలోకి చేరుకున్నావు. నేను సముద్రంలోకి పడిపోతే నువ్వు ఆకశాన్ని ఎగిశావు. నన్ను నక్షత్రాల అడవిలో సంచరించేలా చేసి నా గురించి నేను ఆలోచించుకోకుండా చేశావు. ఇది మంచిది కాదు. ఓ నిండు జాబిలి, ఓ నడిరేయి ఇది మంచిది కాదు”.
భావానికొస్తే, కథానాయకుడు అహంకారం కలిగిన వ్యక్తి కనుక అతడి చూపు ఎప్పుడూ ఆకాశం వైపే ఉంటుంది. అందుకే అతడు ఆమె కోసం మొదట ఆకాశంలో వెతికాడు. ఇక్కడ “అహంకారం”కి “ఆకాశం” అనే రూపకం కూడా తీసుకోవచ్చు. ఆమె తనంత ఎత్తులో లేదని తెలుసుకొని ఆమె ఉన్న స్థాయికి (సముద్రం) చేరుకున్నాడు. అహంకారం లేని అమ్మాయి (కథానాయకుడి దృష్టిలో) మనసుకి “సముద్రం” అనే రూపకం ఇక్కడ తీసుకోవచ్చు. అలా వచ్చిన అతడికి అమాంతం ఆమె ఆకాశంలో కనబడింది. అంటే అహంకారం చూపిస్తోంది (అని అతడి ఆలోచన). “నక్షత్రాల అడవి” అంటే “ఊహా ప్రపంచం”. ఆమెకోసం ఆలోచిస్తూ ఊహల్లోకి వెళ్ళిపోయిన అతడు తన గురించి తాను ఆలోచించడం మానేశాడు. ఇందుకు కూడా ఆ అమ్మాయే కారణమని చెబుతున్నాడు. ఇక్కడ కూడా అహంకారమే ఉంది, “నేను తప్పు చేశాను” అని నేరుగా చెప్పకుండా “నీ గురించి ఆలోచిస్తూ నన్ను నేను వదులుకున్నాను” అని చెప్పాడు.
తెలుగు :
ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లై అల్లై, అల్లై అల్లై
నా చిట్టిచిలకా జట్టై అల్లై
అల్లై అల్లై, అల్లై అల్లై
ఏమంత అలక చాల్లే అల్లై
తమిళంలో అహంకారంతో మొదలైనది తెలుగులో విరహంతో మొదలైంది. తమిళంలో కవిత, తెలుగులోనూ కవితే. ఆమెను చూడకపోతే “ఆశ” తీరడంలేదు. ఇక్కడ ఆశ అంటే చూడాలన్న ఆశ. కానీ తదుపరి వాక్యంలోకి వెళ్తే అది “కోరిక” అని కూడా అనుకోవచ్చు. మాములుగా, మనుషులు దగ్గరగా ఎక్కువసేపు నిలబడివున్నా, కూర్చొనివున్నా శ్వాస ఆడడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ కథానాయకుడు తన ప్రేయసికి దూరంగా ఉంటే శ్వాస ఆడదు అంటున్నాడు. అంటే, దగ్గర తీసుకోమని, కౌగిలించుకోమని అడుగుతున్నాడు. ఇలాంటిదే దీని తదుపరి వాక్యం కూడా.
పందిరిని బట్టి తీగ అల్లుకోవడం సహజంగా జరిగేది. తీగ ఉనికి పందిరి మీద ఆధారపడుతుంది. కానీ శాస్త్రి ఇక్కడ దాన్ని తిరగేశారు. తీగ (కథానాయిక) వల్లే పందిరికి (కథానాయకుడు) విలువుందని చెప్పారు. ఆ తీగ పందిరిని అల్లకుంటే ఆ పందిరికి ఉనికి లేదని చెప్పారు. అందుకే, “నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే నిలువెత్తు ప్రాణం నిలవదటే” అని వ్రాశారు. శ్వాస ఆడదాని ముందు వాక్యంలో చెప్పారు కనుక దానికి కొనసాగింపుగా అతడి ప్రాణం పోకుండా గట్టిగా బంధించమని కూడా కథానాయకుడు చెబుతున్నాడు ఈ వాక్యంలో. తమిళంలోని పురుషాహంకారాన్ని కాదని ఇక్కడ అమ్మాయిని గౌరవించాడు.
అయితే, ఇక్కడే ఒక సమస్య ఉంది. ఈ కథలో కథానాయకుడికున్న “అహంకారం” కథలో ముఖ్యమైన అంశం. అతడు ఇలా అమ్మాయిని గౌరవించుకుంటూపోయి తనను తాను తగ్గించుకుంటూపోతే కథకు న్యాయం జరగదు. పైగా, కథలో ఈ పాట వచ్చే సందర్భానికే హీరో అహంకారం పూర్తిగా అణగదు. కథాంశాన్ని తన పాటలో పొందుపరచడం శాస్త్రి శైలి కనుక అన్ని వాక్యాలు వ్రాసి చివర్లో “ఏమంత అలక చాల్లే అల్లై” అన్నారు.
తమిళం:
ఒలిగళిన్ తేడల్ ఎన్బదెల్లాం
మౌనత్తిల్ ముడిగిన్రదే
మౌనత్తిన్ తేడల్ ఎన్బదెల్లాం
జ్ఞానత్తిల్ ముడిగిన్రదే
నాన్ ఉన్నై తేడుమ్ వేళయిలే
నీ మేఘం సూడి ఓడివిట్టాయ్
అర్థానికి వస్తే, “ధ్వని కోసం చేసే అన్వేషణ మౌనంతో ముగుస్తుంది. మౌనం కోసం చేసే అన్వేషణ జ్ఞానంతో ముగుస్తుంది. నేను నిన్ను వెతికే సమయంలో నువ్వు మేఘాన్ని ధరించి పరుగిడినావు”.
భావానికి వస్తే, ఓ శబ్దానికి అంతం మౌనంలో (నిశ్శబ్దంలో) ఉంది. ఇద్దరు వ్యక్తులు మాటలు లేక దూరమై మౌనాన్ని పాటిస్తుంటే, ఆ మౌనం యొక్క అంతం దాన్ని ముగించాలన్న జ్ఞానంలో ఉంటుంది. ఇలా, ప్రతి శోధన ఓ అంశంతో ముగుస్తుంది. కానీ ఆ అబ్బాయి అమ్మాయికోసం చేసే శోధనకు మాత్రం ముగింపు లేదు. ఎందుకంటే, ఆ సమయంలో ఆ అమ్మాయి ఆగని మేఘంలా అతడికి దొరకకుండా దూరంగా వెళ్ళిపోతోంది.
మొదటి రెండు వాక్యాలకు కథానుగుణంగా మరో భావాన్ని అనువ్యక్తీకరిస్తే, శబ్దానికి అంతం మౌనంలో ఉంది. అనగా, హీరో అహంకారాన్ని శబ్దంగా తీసుకుంటే, దానికి అంతం ఆ అమ్మాయి మౌనంలో ఉంది. మౌనానికి అంతం జ్ఞానంలో ఉంది. అనగా, ఆ అమ్మాయి మౌనానికి అంతం ఆమెని బ్రతిమాలి క్షమాపణ చెప్పాలనే హీరో జ్ఞానం(కనువిప్పు)లో ఉంది.
తెలుగు:
నిను వెతికే నా కేకలకు మౌనమే బదులయ్యిందే
మౌనములోని మాటిదని మనసు పోల్చుకుందే
లాలన చేసే వీలేలేని పంతం వదిలి పలకవటే
కథనంలో ఈ పాట ఆరంభమయ్యే ముందు అబ్బాయి అమ్మాయి ఇంటి బయట నిలబడి ఆమె పేరుని గట్టిగా పిలుస్తుంటాడు (అరుస్తుంటాడు). దాన్ని విని కూడా ఆ అమ్మాయి బదులివ్వదు. ఈ సందర్భానికి ఈ చరనంలోని మాటలు అచ్చుగుద్దినట్టుగా సరిపోతాయి.
తాను గట్టిగా ఆమె పేరుని పిలుస్తున్నప్పటికీ భౌతికంగా ఆ అమ్మాయి జవాబివ్వలేదు. కానీ ఆమె మౌనం అతడితో మాట్లాడింది. “మౌనం మాట్లాడడం” అనేది ఒక “అతిశయోక్తి” ప్రయోగమిక్కడ. ఆవిడ మౌనానికి కారణం అతడికి తెలిసింది. అందుకే “మౌనములోని మాటిదని మనసు పోల్చుకుందే” అని అన్నాడు అతడు. ఆ పంతాన్ని (మౌనం) వదిలి అతడితో మాట్లాడితే సంజాయిషీ చెప్పుకొని ఆమెని బుజ్జగించో, బ్రతిమాలో ప్రసన్నం చేసుకోగలడు. ఆ అమ్మాయి అతడికి ఆ అవకాశం కూడా ఇవ్వడంలేదు.
మొదటి చరణం తరువాత తమిళంలో “నల్లై అల్లై” అనే అనుపల్లవి మళ్ళీ వచ్చినప్పుడు “ఓ నిండు జాబిలి, ఓ నడిరేయి ఇది మంచిది కాదు” అనే భావమే వ్రాశారు వైరముత్తు. తెలుగులో శాస్త్రి “అల్లై అల్లై పుప్పొడి తునకా, గాలై అల్లై, అల్లై అల్లై పన్నీటి చినుకా, జల్లై అల్లై” అని వ్రాశారు.
తమిళం:
ముగై ముగిళ్ మొత్తెండ్ర నిలైగళిలే
ముగమ్ తోడ కాత్తిరుందే
మలర్ ఎండ్ర నిలైవిట్టు పూత్తిరున్దాయ్
మనమ్ కొల్ల కాత్తిరుందే
మగరందం తేడి ముగరుం మున్నే
వెయిల్ కాట్టి వీళిన్దువిట్టాయ్
అర్థానికి వస్తే, “నా మనసు నువ్వు మొగ్గలా ఉన్నప్పుడు నీ ముఖం తాకడానికి వేచింది. నువ్వు పువ్వై వికసించాక నిన్ను తెంచడానికి వేచింది. మకరందాన్ని వెతికి వాసన చూసే ముందే వెచ్చదనం చూపి నేలకొరిగావు”
ఈ చరణం యొక్క అర్థం కన్నా భావం ముఖ్యం. రచయిత అమ్మాయిని పూవుతోనూ, ఆ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుని ఓ మనిషి పూవు పట్ల ప్రవర్తించే విధానంతోనూ పోల్చడం జరిగింది. మొగ్గ దశలోవున్న ప్రేమలో గౌరవం ఉంటుంది. కాలంతో పాటు అది తగ్గిపోయి అపార్థాలు, అహంకారాలు చోటుచేసుకుంటాయి. ఆ అబ్బాయికి ఆ అమ్మాయితోవున్న బంధం పూర్తిగా తీరకముందే ఆమె అతడిని వదిలేసి వెళ్ళిపోయింది.
తెలుగు:
ముడిపడిపోయాం ఒక్కటిగా విడివడిపోలేక
కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికిక
పదునుగా నాటే మన్మథ బాణం నేరం ఏమి కాదు కదే
తెలుగులో శాస్త్రి మళ్ళీ తనదైన భావాన్ని కథానుగుణంగా వ్రాశారు. జీవితకాలం సాగించాలనుకున్న ప్రయాణంలో ఒడిదుడుకులు సహజం. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ గమ్యం వైపు పయనించే తరుణంలో వచ్చే కష్టాలను చూసి ఒకరినొకరు కాదనుకున్నంత మాత్రాన ఆ ప్రయాణం ఆగిపోదు. మరి వాదనలు ఎందుకు? ఇలా ఆ అబ్బాయి అమ్మాయిని ప్రశ్నిస్తున్నాడు. పైగా అహంకారి కనుక “కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికిక?” అని కూడా వాదిస్తున్నాడు కూడా.
మామూలు బాణం గుండెల్లో దిగితే గాయమవుతుంది. కానీ మన్మథ బాణంలో ప్రేమ ఉంటుంది. ఆ అబ్బాయి అమ్మాయిని తన మాటలతో గాయపరిచాడు, ఆమె బాధపడింది. అందుకు అతడు తన కోపంలో కూడా ప్రేమ ఉందని సమర్థించుకోవడమే ఈ మూడవ వాక్యం. అమ్మాయిని ఒప్పించడానికి వచ్చిన అతడు తన చేష్టని కూడా సమర్థించుకుంటున్నాడు.
ఆఖరుగా, తమిళ రచయిత “నల్లై అల్లై నారుమ్ పూవే నీ నల్లై అల్లై…నల్లై అల్లై ముల్లై కొల్లై నీ నల్లై అల్లై” అనగా, “ఓ సువాసన గల పువ్వా ఇది మంచిది కాదు… ఓ మల్లె తోట ఇది మంచిది కాదు” అని వ్రాశారు. తెలుగులో శాస్త్రి “అల్లై అల్లై నా జత గువ్వా జట్టై అల్లై… అల్లై అల్లై నా చిరునవ్వా జల్లై అల్లై” అని వ్రాశారు.
సందర్భానుసారంగా వచ్చే ఈ రెండు భాషల పాటలూ గొప్పవే. అయితే, “వైరముత్తు” ప్రాచీన తమిళ పదాలు వాడి ఓ కవిత్వంగా ఈ పాటు వ్రాయగా “సీతారామశాస్త్రి” సులువైన తెలుగును వాడి, తమిళ రచయిత వ్రాసిన భావాన్ని స్పృశించకుండా తనదైన భావాన్ని సందర్భానుసారంగా, కథ, పాత్రలకు అనుగుణంగా వ్రాశారు. డబ్బింగ్ పాట అంటే శబ్దానికి లొంగాల్సిన అవసరంలేదని, సూటి అనువాదం చేయడం కన్నా కథకు సరిపోయే స్వంత భావాన్ని వ్యక్తపరిస్తే చాలని ఈ పాటతో మంచి ఉదాహరణ ఇచ్చారు సీతారామశాస్త్రి.
ఈ రెండు పాటల యూట్యూబ్ లింకులు క్రింద ఇస్తున్నాను.
నల్లై అల్లై…
అల్లై అల్లై…
– యశ్వంత్ ఆలూరు
Beautifully written!
LikeLiked by 1 person