“ఎన్టీఆర్” సినిమాలో “సీతారామశాస్త్రి” గారు వ్రాసిన రెండు పాటల్లో నాకు అమితంగా నచ్చింది ఈ పాట…
ప: బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ
కంటపడని నీడై వెంటనడుచు తోడై
నీ సేవలన్నీ నిర్వహించగలిగే…
బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ
చ: నిన్ను తలచువారి నిన్ను పిలచువారి
కోరుకున్న రూపై కనిపించు స్వామి
గుండెలోన కొలువై కంటజూడ కరువై
ప్రాణ వల్లభునిలా పలకరించవేమి
బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ
చ: ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావో
బతుకు బరువులేన్ని తలను దాల్చినావో
సేదతీరు నెలవు ఇక్కడుంది స్వామి
సేదతీర్చు నెలవు ఇక్కడుంది స్వామి
అర్థభాగమైన నీ వంతు సైతం నిర్వహించగలిగే…
నిర్వహించగలిగే బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ
కమర్షియల్ సినిమాలలో ఇలాంటి పాటలుంటే అదో తెలియని ఆనందం. ఇలాంటిదే “గౌతమిపుత్ర శాతకర్ణి”లో “మృగనయన” పాట కూడా. బహుశా, ఈ రెండు సందర్భాలలో ఇలాంటి సాహిత్య విలువలున్న పాటలు పెట్టిన దర్శకుడు “క్రిష్” గారు సంస్కారవంతులు. అలాంటి సందర్భాలకు పాటలు అలవోకగా వ్రాయగలిగిన “సీతారామశాస్త్రి” గారు మహానుభావులు. వాటిని ఆమోదించి అభినయించిన “బాలకృష్ణ” గారు కూడా అభినందనీయులు.
ఈ పాట విన్నప్పుడు, ఎన్నో బాధ్యతలతో తలమునకలుగావున్న భర్తకు తాను అండగా ఉంటానని భార్య చెప్పే సందర్భం కావచ్చనిపించింది. భర్త పేరు “రామారావు” కనుక “బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ” అనే త్యాగరాజ కీర్తనను దత్తత తీసుకోవాలనే ఆలోచన పాట ఆరంభం గొప్పగా ఉండడానికి దోహదపడింది. “కంటపడని నీడై, వెంటనడుచు తోడై” అని భర్తకు కూడా తెలియకుండా అతడిని అన్ని విధాలుగా కాపాడుకుంటానని చెబుతుంది భార్య.
భద్రగిరిగా మారిన భద్రుడు శ్రీరాముడి పునర్దర్శనం కొరకు చేసిన తపస్సును మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం కాగా, త్రేతాయుగంలోని రామురూపాన్నే చూపమని అర్థించాడు భద్రుడు. అప్పుడు మహావిష్ణువు మళ్ళీ రాముడిగా కనిపించి భద్రుడిని కరుణించాడు. భక్తుడు కోరిన రూపంలోనే కనిపించి భద్రాచలంలో వెలిశాడు. ఈ రెఫెరెన్సు “నిన్ను తలచువారి, నిన్ను పిలచువారి కోరుకున్న రూపై కనిపించు స్వామి” అనే వాక్యానికి తీసుకోవచ్చు. భర్తను దేవుడిగా చూసుకునే బసవరామ తారకం పాత్రకు దీన్ని ఆపాదించారు శాస్త్రి. “తలచువారు” అనగా సన్నిహితులు, బంధువులు వస్తారు. కానీ ఇక్కడ ప్రధానంగా బసవరామ తారకం అని తీసుకోవాలి. “పిలచువారు” అనగా రామారావు నాయకత్వం కోరుకున్న ప్రజలను పరిగణించవచ్చు. ఇలా తలచువారు, పిలచువారు వేర్వేరు అంచనాలను రామారావుపై పెట్టుకున్నారు. ఆ అంచనాలన్నింటినీ అందుకోవాలని చెబుతోంది ఈ వాక్యం.
ఈ పాటలో రెండో చరణమే ఈ విశ్లేషణ వ్రాసేందుకు నన్ను ప్రేరేపించింది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో బాధ్యతలను మోసే భర్తకు సేద తీరే తావు కల్పిస్తూ, భార్యాభర్తలు బండికున్న రెండు చక్రాలు, దాంపత్య జీవితంలోని బాధ్యతలను చెరిసగం పంచుకోవాలని చెప్పిన పెళ్ళి ప్రమాణాలన్నీ తానే నెరవేరుస్తానని భర్తకు ఊరటను కలిగిస్తున్న భార్య భావాన్ని “అర్థభాగమైన నీ వంతు సైతం నిర్వహించగలిగే బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ” అనే వాక్యంలో చెప్పిన తీరు అద్భుతం. ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేసిన వాక్యం ఇది.
పీ.యస్ : ఈ పాటను చిత్ర, శ్రీనిధి అని ఇద్దరు గాయనిమణులు పాడారు. పల్లవి మరియు రెండో చరణం “చిత్ర” గారి గాత్రంలో వినిపిస్తే, మొదటి చరణం మాత్రం “శ్రీనిధి” గారి గాత్రంలో వినిపిస్తుంది. దీనికి కారణమేమిటో, అసలు ఈ పాటకు సందర్భమేమిటో సినిమాలోనే చూడాలి. ఇది కేవలం నాకు ఈ పాట అర్థమైన విధానం మాత్రమే.
– యశ్వంత్ ఆలూరు