ఈ సినిమా “డ్రామాటిక్ లిబర్టీ“ విపరీతంగా తీసుకొని తీయబడిన బయోపిక్కులా అనిపించింది. అది తప్పు కాదు, ఎందుకంటే డ్రామా లేని తెలుగు సినిమా కథ ఉప్పు, కారం లేని వంటకంలాంటిదని నా అభిప్రాయం.
ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలున్నాయి. మొదటగా, ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్యనున్న స్నేహాన్ని చూపించిన విధానం, ఏయన్నారున్న సన్నివేశాల్లో ఆయనకు కూడా తగినంత గౌరవమిచ్చిన విధానం చాలా బాగున్నాయి. “సీతారామ కళ్యాణం” సినిమా కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ “ఔరా!” అనిపించింది. “గుండమ్మ కథ” షూటింగులో “సావిత్ర”తో సంభాషణ మరో మంచి విషయం. “సాయానికి కూడా కాపలా ఉండాలా?” అనే హత్తుకునే ప్రశ్నకు “మన కష్టానికి కాపలా ఉండాలి” అన్న ఆలోచింపజేసే సమాధానం బాగుంది. “అన్నదమ్ముల అనుబంధం” సినిమా విడుదల విషయంలో ఎన్టీఆర్ చూపిన తెగింపుకి “రానున్న శకం రామన్న శకం” అని ఇప్పుడు సినిమా చూస్తున్న నాకే అనిపించిందంటే అప్పటి ప్రజలు ఏమనుకున్నారో యిట్టే ఊహించవచ్చు. చాలాకాలం తరువాత “కీరవాణి” సంగీతం అలరించింది. ముఖ్యంగా దివిసీమ నేపథ్యంలోని సన్నివేశాలలో ఆయనిచ్చిన నేపథ్య సంగీతం అద్భుతం.
తారకమ్మకు, తారకరాముడికి మధ్యనున్న బంధాన్ని ఎలా ఆవిష్కరించారో చూద్దామన్న ఆసక్తితోనే ఈ సినిమాకు వెళ్ళడం జరిగింది. అందుకు రెండు కారణాలు. ఒకటి మానవ సంబంధాలను తెరపై బాగా ఆవిష్కరించే “క్రిష్” మరియు “శాస్త్రి” గారి “బంటురీతి కొలువు” పాట. ఈ విషయాల్లో నాకు నిరాశే మిగిలింది. కార్యసాధనలో ఉన్న భర్తకు భార్య ఎలా తోడుగా నిలిచిందో శాస్త్రిగారు పాటలో వ్రాసినంతలో సగం కూడా తెరపై చూపలేదు. అంత మంచి పాటను పూర్తిగానూ ఉంచలేదు. దివిసీమ ఘట్టంలో, కీరవాణి గారు స్వయంగా వ్రాసి, బాణీ కట్టి, “ఆలపించిన” ఓ పాట ముగిసేవరకు, దానికోసమే సన్నివేశాలు తీసినట్టు అనిపించింది.
అన్నింటినీ మించి, సినిమా చూస్తున్నంత సేపు నాపై నాకే ఓ సందేహం, “నేను ఎన్టీఆరుని ఓన్ చేసుకోలేదా?” అని. పలు సినిమాలలో ఆయనను చూసి అబ్బురపోయిన సందర్భాలున్నాయి. “భూకైలాస్”లో “రావణ బ్రహ్మ“ పాత్ర ఇప్పటికీ మరపురానిది నాకు. మరో సినిమాతో పోల్చడం అని కాదు కానీ “మహానటి” మొదలైన ఇరవై నిమిషాలకే కథలో లీనమైన నేను ఈ సినిమా నడిచిన మూడు గంటలూ తెరకు ఇవతలే మిగిలిపోయాను. తెరను చొచ్చుకొని లోపలికి వెళ్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరో బలంగా తన్నినట్టుగా బయటకొచ్చి పడ్డాను. అందులో కీర్తిలా కనిపించిన సావిత్రి కనబడగా ఇందులో ఎంత ప్రయత్నించినా ఎన్టీఆరులా కనిపించిన ఆయన తనయుడు బాలకృష్ణే కనిపించారు, పైన చెప్పిన సినిమా విడుదల ఘట్టం మరియు సెకండాఫులో అక్కడక్కడ తప్ప. బహుశా నాకు స్క్రీన్ పాసు దొరక్కపోవడానికి ఇదే కారణమై ఉండొచ్చు.
మరి ఈ సినిమా బాగోలేదా? అని అడిగితే ఖచ్చితంగా బాగుందంటాను. మూడు గంటలు నడిచినప్పటికీ ఎక్కడా బోరు కొట్టలేదు. ఇందుకు దర్శకుడు క్రిష్ కే వీరతాడు వేయాలి. ప్రతీ సినిమాను సినిమాలా చూసేవారు ఈ సినిమాను ఓసారి చూసేయొచ్చు, చూడాలి, చూస్తారని తెలుసు కూడా. ఏ సినిమానూ సినిమాలా చూడలేని నేను మాత్రం మరోసారి చూస్తాను!
ప్రతి దృష్టి వెనుకా ఓ కోణముంటుంది. ఇది నా దృక్కోణం!
– యశ్వంత్ ఆలూరు