“ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలో మనసుని హత్తుకున్న ఒక (ఒకేఒక్క) సన్నివేశం…
ప్రీ క్లైమాక్సులో సొంత రాజకీయపార్టీని ప్రకటించడానికి రామారావు సిద్ధమవుతాడు. రోజూ బయటకు వెళ్ళే సమయంలో తానుగా ఎదురువచ్చే భార్య తారకం ఆ రోజు ఎన్నిసార్లు పిలిచినా పలకదు. దిగులుపడ్డ రామారావు బయటకు రాగానే “ఎయిరుపోర్టు వరకే అన్నయ్య!” అంటాడు తమ్ముడు త్రివిక్రమరావు. కారులో కూర్చోవడానికి ముందుప్రక్కనున్న డోరు తీస్తాడు రామారావు. అప్పుడు కారు వెనుక సీటులో కూర్చొనివున్న తారకం కనబడుతుంది. రాజకీయాల్లోకి వెళ్ళడానికి మరోసారి ఆలోచించమని ముందురోజు అడిగిన భార్య ఇప్పుడు అతడితో పాటు ఎయిరుపోర్టుకి రావడానికి సిద్ధంగా ఉంది. అతడిని చిరునవ్వుతో పలకరిస్తుంది.
ఈ సన్నివేశానికి నేపథ్యంలో ఓ శ్రావ్యమైన వేణుగానం. ఎయిరుపోర్టులో విమానం ఎక్కబోతున్న రామారావుకి ఎదురువచ్చినప్పుడు నేపథ్యంలో కోరస్సులో మళ్ళీ అదే బాణీ. ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే సీను కట్టు, విమానమెక్కి వెళ్ళిపోతాడు రామారావు. అతిశయోక్తి కాదు, నేను ఈ సినిమాను కేవలం ఈ నేపథ్య సంగీతం కోసమే రెండోసారి థియేటరుకి వెళ్ళి చూశాను. కీరవాణికి పలుమార్లు మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇదే సంగీతం ఆడియోలోని “రామన్న కథ” పాట మధ్యలో హార్మోనియంలో వినిపిస్తుంది.
అమేజాన్ ప్రైములో విడుదలైన ఈ సినిమాని మళ్ళీ ఆ సంగీతం వినడానికే అదోచ్చే సీను వరకు ఫార్వర్డు చేసుకోని చూశాను. ఆ సంగీతం విన్న వెంటనే మా అత్త ఇది ఎన్టీఆర్ నటించిన ఓ పాత సినిమా పాటని, “ఓ తారక ఓ జాబిలి” అని పాట మొదటి లైను చెప్పడం, నేను గూగుల్ ని ఆశ్రయించగా నాకు ఈ పాట దొరకడం, రెండూ జరిగాయి.
1953లో నటి “భానుమతి రామకృష్ణ” మొదటిసారిగా దర్శకత్వం వహించిన “చండీరాణి” సినిమాలోని పాట ఇది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన జానపద సినిమా. భానుమతి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లలో “రామారావు” నటించిన పాత్రను హిందీలో “దిలీప్ కుమార్” వేశారు. ఇక ఈ పాట గురించి వస్తే, “సీ.ఆర్.సుబ్బరామన్ – ఎమ్మెస్ విశ్వనాథన్“లు స్వరపరిచారు (అయితే ఆ ఇద్దరిలో ఈ పాట ఎవరిదో తెలియదు), “సముద్రాల సీనియర్” రచించారు, “ఘంటసాల” మరియు “భానుమతి” ఆలపించారు.
ప్రేక్షకులకు, రివ్యూ వ్రాసే వాళ్ళకు సినిమాలో “ల్యాగ్” ఉంటే ఈమధ్య నచ్చడంలేదు. కానీ కొన్ని భావాలు రిజిస్టర్ కావాలంటే ఆ ల్యాగ్ అవసరం. పాత సినిమా పాటలు విజువల్స్ తో సహా గుర్తుండిపోవడానికి ఇదో ప్రధాన కారణం. అందుకు ఈ పాట ఒక మచ్చుతునక. శరీర వాంఛలు కాకుండా కేవలం మనసులోని భావాలను మాత్రమే పాత్రలు ఒకరికొకరు తెలుపుకుంటాయి. పాట మొదలులో ఈ ప్రక్కనున్న హీరో, ఆ ప్రక్కనున్న హీరోయిన్ వద్దకు పాటలో రెండో చరణం వచ్చే సమయానికి చేరుకుంటాడు. ఎక్కువ నిడివి ఉన్న షాట్స్ ఈ మధ్య సినిమాల్లో, పాటల్లో చాలా అరుదు. అలా వచ్చినవాటిని చూసి “ఇది సింగల్ షాట్లో చేశారంట!” అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాటలో అలాంటి సింగల్ షాట్లు అనేకం. ఓ పాత్ర పాటలో తన లైన్లు పాడుకునేంతవరకూ కెమెరా సదరు ఆర్టిస్ట్ ముఖాన్ని దాదాపుగా క్లోజప్పులోనే చూపిస్తూ రవ్వంతైన కదలదు. సాహిత్యాన్ని గమనిస్తే, “ఓ తారక నవ్వులేల ననుగని?” అని అబ్బాయి అడిగితే “అందాలు చిందెడి చందమామ నీవని, ఓ జాబిలి! ఆ తారక నవ్వునోయి నినుగని” ఇలా సాగుతాయి. పాటంతా హీరోహీరోయిన్ల మధ్య ఇలాంటి ఓ రొమాంటిక్ సంభాషణ. దాదాపు నాలుగు నిమిషాలపాటు ఎంతో ఆహ్లాదంగా సాగుతుంది. 1953 అంటే, ఎన్టీఆర్ పరిశ్రమలో అడుగుపెట్టిన మూడవ సంవత్సరం. “ఓ తారక” అని అమ్మాయికి నక్షత్రంతో చేసిన పోలిక, “ఓ జాబిలి” అని అబ్బాయికి చేసిన పోలిక ఆయా నటీనటులకు సరిగ్గా సరిపోయింది. ముఖ్యంగా, “అందాలు చిందెడి చందమామ నీవని, ఓ జాబిలి! ఆ తారక నవ్వునోయి నినుగని” అనే లైను ఎన్టీఆర్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. అంత అందంగా ఉంటాడు ఈ పాటలో ఎన్టీఆర్.
ఇక “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమా విషయానికి వస్తే, ఆ సందర్భంలో ఈ పాట బాణీని నేపథ్యంలో పెట్టడానికి కారణం, “ఓ తారక” అనే పల్లవి. దాంతో “బసవరామ తారకం” పాత్రను రెఫెర్ చేశారు. ఈ ఆలోచన దర్శకుడు “క్రిష్”దో లేక సంగీత దర్శకుడు “కీరవాణి”దో తెలియదు కానీ ఓ సమిష్టి కృషిగా ఇద్దరినీ అభినందించాలి. కారులో ఎక్కబోతూ ఎన్టీఆర్ తారకంని చూసినప్పుడు, “ఓ తారక…” అనే మాటను,
హరికృష్ణ డైలాగు తరువాత తారకం నవ్వినప్పుడు “…నవ్వులేల ననుగని” అనే మాటను,
తరువాత తారకం డైలాగు వచ్చే సమయంలో “అందాలు చిందెడి చందమామ నీవని, ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని” అనే మాటను నేపథ్య సంగీతం రూపంలో అద్భుతంగా సింక్ చేశారు.
చివరగా, ఎయిర్పోర్టులో ఎన్టీఆర్ కి తారకం ఎదురువస్తూ నవ్విన స్లో మోషన్ షాట్లో “ఓ తారక నవ్వులేల ననుగని” అనే లైను మళ్ళీ వస్తుంది.
నిజానికి, ఇది క్రిష్ తీసిన సినిమా అని అనిపించిన ఘట్టం ఇదొక్కటే.
“చండీరాణి” సినిమా పాట యూట్యూబ్ లింక్ ఇది,
– యశ్వంత్ ఆలూరు