వై.ఎస్.రాజశేఖర రెడ్డి – దాదాపు పాతికేళ్ళు పైన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అలాగే ప్రతిపక్షంలోనే మిగిలిపోతాడని అప్పట్లో చాలామంది అనుకునేవారు. కానీ ఓ “పాదయాత్ర”కు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెప్పించిన భూకంపం ఢిల్లీ వరకు చేరేలా చేసి, గొప్ప విజయంతో ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ట్ర రాజకీయ చరిత్రలో నందమూరి తారకరామారావు తరువాత ఎప్పటికీ గుర్తుండిపోయే, గుర్తుపెట్టుకోవాల్సిన నాయకుడిగా నిలిచిపోయాడు.
ఒక వ్యక్తి గురించి ఇంతగా తెలిసినప్పుడు (అలా అనుకుంటున్నప్పుడు) మళ్ళీ అతడి మీద తీసిన సినిమాను ఎందుకు చూడాలి? అందరికీ చరిత్ర తెలుసు కానీ దానికి పునాది వేసిన ఆలోచనలు గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి సినిమాలు చూడాల్సిందే. ఇది కేవలం “మహి వి రాఘవ” తీసిన “యాత్ర” సినిమా గురించి నా అభిప్రాయం మాత్రమే. ఎలాంటి రాజకీయం కోణం లేదు ఇందులో.
జెండాకర్రపై రెపరెపలాడే పతాకంతో పాటు అది అక్కడి దాక వెళ్ళడానికి చేసిన ప్రయాణం ఎంతో ముఖ్యం. అందుకే, చరిత్రలో ముఖ్యులైన రాజశేఖర రెడ్డి లాంటి వారి జీవితాల్లో సాధించిన గెలుపు కన్నా దానికోసం వాళ్ళు పడిన శ్రమ, చేసిన యుద్ధం గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇదే అంశాన్ని పట్టుకున్నాడు దర్శకుడు. అతడిలోని వివిధ కోణాలని చూపించడంలో ఉత్తీర్ణుడయ్యాడు. “సాయం కోసం మన గడప తొక్కినవాళ్ళతో రాజకీయం ఏందిరా?” అన్నప్పుడు పాత్రలోని కరుణను చూపించాడు. వ్యక్తి లేకపోయినా అతడికి సంబంధించిన జెండాను చూడగానే దారిచ్చే మనుషుల ద్వారా అతడి బలమెంతో చూపించాడు. తను మద్దతిచ్చిన వ్యక్తి నామినేషనుకి పోటీయే లేకుండా చేసిన రాజకీయ ఎత్తుగడను చూపించాడు. అలాగే, ఓ చోట “ఎలక్షనులో పోటీ చేయకుండానే డబ్బు ఎందుకు ఖర్చుపెడుతున్నావ్?” అని కూడా అంటాడు. “రాజశేఖర! నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. నీలో ఒకప్పటి ఆవేశం, కోపం లేవు!” అనే మాటతో, ఒకప్పుడు తనను అడ్డుకున్నవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించేవాడు, ఆ తరువాత ఎలా మారాడు అన్న కోణం చూపించాడు. “నాకు భయమేస్తుంది క్యాప్స్టన్” అని రామచంద్రరావుతో అన్నప్పుడు అతడిలోని భయాన్ని కూడా చూపించాడు. పార్టీ ప్రకటించిన లిస్టు కాకుండా తన సొంత లిస్టునిచ్చి వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత తనదే అన్నప్పుడు అతడి పంతాన్ని చూపించాడు. ఇలాంటి విషయలాతో రాజశేఖర రెడ్డిని పూర్తిగా ఆవిష్కరించాడు దర్శకుడు.
ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం, “రాజారెడ్డి”తో ఉన్న సన్నివేశాలు. వాటితో పాటు తండ్రి సమాధి దగ్గరున్న సన్నివేశం. ఆ తరువాత వచ్చే “మందితో పాటుగా” అనే పాట, తరువాత “వినాలని ఉంది, ఈ కడపను దాటి ప్రతి గడపలోకి వెళ్ళాలనివుంది” అనే సన్నివేశం వరకూ కళ్ళప్పగించి చూసేలా ఉంది కథనం. సినిమాలోని ఆత్మ అక్కడ ప్రస్పుటంగా కనిపించింది. ఇక అక్కడినుండి “పల్లెల్లో కళ ఉంది” అనే పాట, “ఎవరు ముఖ్యమంత్రైనా మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్తు ఫైల్ మీదే పెట్టాలి. నేను పెట్టిస్తాను” అనే మాట పాత్రపై గౌరవాన్ని అమాంతం పెంచేసింది. “సోన మసూరి పండించే రైతు పండగొస్తే, అది కాకుండా రేషన్ బియ్యమే తింటున్నాడు”, “రైతు చెట్టు కింద వ్యవసాయం చేస్తున్నాడా?” లాంటి మాటలు గుండెను బలంగా తాకాయి.
మిగతా విషయాలకు వస్తే, సినిమా పేరు “యాత్ర” అని పెట్టినప్పుడు, దాని ముఖ్య ఉద్దేశ్యం రాజశేఖర రెడ్డి పాదయాత్రనే ప్రధానంగా చూపాలి అన్నప్పుడు, అదే నేపథ్యంగా కథనపు స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు, మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రైతులకు ఉచిత విద్యుత్తు ఫైల్ మీద సంతకం చేయడంతో సినిమాను ఆపేసివుంటే బాగుండేది అనిపించింది. తరువాత చూపించిన రియల్ ఫూటేజీలు సినిమాకు అవసరం లేదనిపించింది. అందులో ప్రజలు టీవీలో చూడనివో, పేపర్లలో చదవనివో చూపించలేదు. అన్నీ తెలిసినవే చూపించారు. అంతగా ఈ విషయాలన్నీ చూపించాలని అనుకుంటే, టైటిల్సులోలాగ ఫోటోలతో చూపించి ఉంటే బాగుండేది. లేదా పూర్తిస్థాయి బయోపిక్ లాగా రాజశేఖర రెడ్డి బాల్యం నుండి మరణం వరకూ సినిమాలోనే చూపించి ఉండవచ్చు. ఇది కూడా నా అభిప్రాయం మాత్రమే.
నటనల విషయానికి వస్తే, మమ్ముట్టి నటన గురించి ఏమీ వ్రాయాలి అనిపించడంలేదు. ఎందుకంటే, మమ్ముట్టి ఉన్నాడని చెప్పిన ఈ సినిమాలో ఎక్కడా అతడు నాకు కనబడలేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరొక వ్యక్తి “వీ.హెచ్.హనుమంతరావు” పాత్ర వేసిన “తోటపల్లి మధు”. హనుమంతరావే వయసు తగ్గి సినిమాలో కనిపించాడా అనేలా ఉన్నాడు. “కె” సంగీతం సినిమాకు మరో బలం.
తప్పకుండా చూడాల్సిన సినిమా “యాత్ర”
– యశ్వంత్ ఆలూరు