మొదటగా మంచి విషయాలకు వస్తే…
ఖచ్చితంగా మొదటి పార్టు “ఎన్టీఆర్ కథానాయకుడు” కంటే బెటర్ గా అనిపించింది. మొదటి దాంట్లో అసలు కథ కన్నా తండ్రి వేసిన పాత్రలన్నీ నేను మళ్ళీ వేయాలన్న బాలకృష్ణ తాపత్రయమే ప్రధానంగా కనిపించింది. అందుకే, అందులో బాలకృష్ణ తప్ప ఎన్టీఆర్ కనిపించలేదు. కానీ ఇందులో ఎన్టీఆర్ కనిపించాడు. ఆయనతో పాటు అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా కనిపించాయి. అసలు ఎన్టీఆర్ తన ఆధిక్యతని ఎలా నిరూపించుకుంటాడు అన్న క్రమంలో వచ్చే సన్నివేశాలు కాస్త ఉత్కంఠను రేపాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అసెంబ్లీ సన్నివేశం. స్వతహాగా ఉద్వేగపూరితమైన వ్యక్తిత్వం కలిగిన రామారావు సంయమనం ఎలా పాటించాడు అన్న విషయాన్ని బాగా చూపించారు.
మొదటి పార్టులో అస్సలు చూపించకుండా వదిలేశారు అనుకున్న భార్యాభర్తల బంధాన్ని ఇందులో బాగా ఆవిష్కరించారు. ముఖ్యంగా, ఎన్టీఆర్-తారకం అమెరికాలో ఉన్న సన్నివేశాలు చాలా హృద్యంగా ఉన్నాయి. “రోజంతా నాతో ఉండి ఎన్నేళ్ళయ్యింది బావ?” అని తారకం అడగడం, “సమస్యలు – సంపదలు, ఆశయాలు – ఆవేశాలు, పిల్లలు – పెళ్ళిళ్ళు… ఇప్పుడు ఈ రోగాలు రొష్టులు” అని ఎన్టీఆర్ చెప్పడం మనసును హత్తుకుంది. తారకం చనిపోయే సన్నివేశమూ మనసును అంతే హత్తుకుంది. ఈ అంశంలో దర్శకుడు క్రిష్ మరియు సంగీత దర్శకుడు కీరవాణిలను అభినందించాలి.
మిగతా విషయాలకు వస్తే…
ఈ సినిమా చూశాక మొదట నాకు అనిపించింది “అసలు మొదటి పార్టు ఎందుకు?” అని. సినిమాగా ఆయన రాజకీయ జీవితాన్నే తీసివుంటే బాగుండేదేమో అనిపించింది. ఇది పూర్తిగా మొదటి భాగం తెప్పించిన ఆలోచనే. ఒకవేళ ఆయన కథను పూర్తిగా చెప్పాలి అనుకుంటే రెండింటిని కలిపి ఒక్క సినిమాగానే తీసివుండొచ్చు. మొదటి పార్టులో చూపించాల్సిన ఎన్టీఆర్ బాల్యం, పెళ్ళి ఇందులో చూపించారు. దానికి ఇందులో ఎలాంటి విశిష్టత లేదు.
రాజకీయాల్లోకి వచ్చాక “నాదెండ్ల భాస్కరరావు” ఉదంతమే ప్రధానంగా ఈ సినిమా సాగింది. అయితే, ఎన్టీఆర్ ప్రజలకు చేసిన మంచి పనులు విపులంగా చూపించివుంటే బాగుండేది. కేవలం ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం మాత్రమే విపులంగా చూపించారు. మిగతా కార్యక్రమాలు కూడా కొన్ని అలాగే చూపించివుంటే, ప్రజలు కూడా ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలని కోరుకుంటున్నారో స్పష్టత ఉండేది. చాలావరకు హైదరాబాదు – ఢిల్లీల మధ్య ఒక రాజకీయపోరుగానే దీన్ని చిత్రీకరించారు. ఈ క్రమంలో “మహానాయకుడు” మరుగైపోయాడు. “నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బ్రతకడానికి వచ్చాను” అన్న మనిషి “చంద్రబాబునాయుడు” సాయంతో తనకు సపోర్టుగా ఉన్న ఎం.ఎల్.ఏలను ఎలా కాపాడుకోగలిగాడు అన్నదే సినిమా ప్రధాన కథాంశం చేశారు. అలాంటప్పుడు “మహానాయకుడు” అన్న టైటిల్ ఈ సినిమాకు సరిపోదు. క్రిష్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా “తారకరాముడు” అన్న పేరు సరిగ్గా సరిపోయేది.
మరి ఈ సినిమా చూడొచ్చా? అని అడిగితే చూడమనే చెబుతాను. ఎందుకంటే, ఎన్టీఆర్ జీవితం ఒక మహాభారతం లాంటిది. అందులోనూ రాజకీయ జీవితం మరింత ఆసక్తికరమైనది. అందులో ప్రతీ ఘట్టంపై ఒక్కోకరిది ఒక్కో కోణముంది. క్రిష్ (బాలకృష్ణ) కోణమేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. మొదటి సినిమాలాగే ఇది కూడా బోరు కొట్టదు. పైగా కేవలం రెండు గంటల ఎనిమిది నిమిషాల నిడివితో త్వరగా సాగిపోతుంది.
– యశ్వంత్ ఆలూరు