లక్ష్మీ’s NTR (2019)

Lakshmi's NTR

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ “నందమూరి తారకరామారావు” జీవితం మహాభారతం స్థాయికి ఏమాత్రం తీసిపోనిది. దానిలాగే ఎన్నో ఘట్టాలు కలిగిన జీవితం ఆయనది. అందులో ఓ ముఖ్యమైన ఘట్టం “లక్ష్మీపార్వతితో వివాహం”. ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి వైవాహిక జీవితం అప్పటి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాయన్నది ఈ సినిమా కథాంశం.

బయోపిక్కులలో తనదైన మార్కు వేసిన రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజుతో కలిసి తీసిన ఈ సినిమా 1989 ప్రాంతంలో మొదలవుతుంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన కొన్ని మంచి అంశాలున్నాయి. మొదటగా, మేకింగ్ క్వాలిటీ బాగుంది. అక్కడక్కడ కనిపించినా దాదాపుగా కెమెరాతో వర్మ ఇదివరకు చేసే సర్కస్ విన్యాసాలు ఈ సినిమాలో లేవు. “మేజర్ చంద్రకాంత్” విజయోత్సవ సభలోని అతిథుల లిస్టు చంద్రబాబు చేతిలోకి వచ్చే షాట్ అద్భుతంగా ఉంది. అక్కడ ఎడిటింగ్ డిపార్టుమెంటు కృషి కూడా కనబడింది. తరువాత సంగీతం. వర్మ సినిమాలో వినసొంపైన పాటలు వినబడి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈమధ్య కాలంలో వర్మ సినిమాలు కలిగించిన కర్ణభేరి సమస్యకు ఈ సినిమా సంగీతం ఉపశమనం ఇచ్చింది. అందుకు సంగీత దర్శకుడు “కళ్యాణి మాలిక్“ని మనస్పూర్తిగా అభినందించాలి. వర్మలో వచ్చిన ఈ మార్పుకి అతడిని కూడా అభినందించాలి. విడిగా చదివితే బాగున్నప్పటికీ ఇప్పటివరకూ వర్మ సినిమాల్లోని సంగీతంలో కొట్టుకుపోయిన “సిరాశ్రీ” సాహిత్యం ఈ సినిమాలో నిటారుగా నిలబడింది. “నీ ఉనికి”, “క్షమించు లక్ష్మి” పాటలు ఈ సినిమాకు ప్రత్యేకం. సినిమాలో ఈ రెండు పాటలకు లీడ్ కూడా అంతే బాగా తీసుకున్నారు దర్శకులు.

ఇక కథ, కథనాల విషయాలకు వస్తే, సినిమా ప్రారంభంలోనే నేరుగా కథలోకి వెళ్ళిపోయారు దర్శకులు. రామారావు, లక్ష్మీపార్వతిల పరిచయం, వారిద్దరి స్నేహం బలపడే క్రమాలు బాగున్నాయి. ఒంటరి జీవితాన్ని గడుపుతూ పార్వతి స్నేహంతో స్వాంతన పొందే రామారావు భావోద్వేగాలను బాగా ఆవిష్కరించారు దర్శకులు. ఆ క్రమంలో వచ్చే “నీ ఉనికి” పాట చెప్పుకోదగ్గది. అక్కడ రామారావు పాత్ర వేసిన “విజయకుమార్” బాగా చేశాడు. అలాగే, “నేను చావకూడదని నిర్ణయించుకున్నాను” అని రామారావు పార్వతితో చెప్పే సన్నివేశం కూడా హృద్యంగా తెరకెక్కించారు. అతి ముఖ్యమైన “వైస్రాయ్ హోటల్” ఘట్టం, ఆ సంఘటన తరువాత రామారావు భావోద్వేగాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రామారావు జీవితంలోని చివరి రోజును కూడా అంతే హృద్యంగా చూపించారు. వర్మ, మంజులను ఇక్కడ అభినందించాలి.

సినిమా కోణంలో చూస్తే, కథకు ఎంతో ముఖ్యమైన లక్ష్మీపార్వతి పాత్ర చిత్రణలోనే దర్శకులు శ్రద్ధ వహించలేదు అనిపిస్తుంది. ఇదివరకే “వీరగ్రంథం సుబ్బారావు” అనే వ్యక్తికి భార్యగా ఉన్న పార్వతికి అతడితో మంచి అనుబంధం ఉన్నట్టుగానే సినిమాలో చూపించారు. “భారీగా వర్షం కురుస్తోంది, లక్ష్మీపార్వతి గారికి ఈ రాత్రికి మా ఇంట్లోనే బస ఏర్పాటు చేస్తాను” అన్న మాటకు “నేను అర్థం చేసుకోగలను సర్” అని, వార్తల్లో ఏవేవో పుకార్లు వస్తుంటే “లోకులు కాకులు. మన గురించి మనకు అవగాహన ఉన్నప్పుడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదు” అన్న అభ్యుదయ భావాలు 1990లలోనే కలిగిన వ్యక్తిని నిజానికి ఏ ఆడది వదులుకోదు. పైగా రెట్టింపు ప్రేమ, గౌరవాలు అతడిపై చూపిస్తుంది. కానీ ఎన్టీఆర్ తనని పెళ్ళి చేసుకోమని అడిగినదే తడవుగా లక్ష్మీపార్వతి ఒప్పేసుకుంటుంది, అక్కడికి ఆయన అడగడం మరో రెండు రోజులు ఆలస్యం చేసినట్టైతే ఆవిడే అడిగేసేలా. ఒంటరి జీవితాన్ని గడిపే రామారావుకు పార్వతి నచ్చడం నమ్మదగ్గ విషయమే. సుబ్బారావు కన్నా రామరావంటేనే ఆవిడకు ఎక్కువ అభిమానం కలిగిందని అనుకోవడంలో కూడా తప్పులేదు. కాలంతోపాటు ఓ వ్యక్తి ఇష్టాయిష్టాలు మారే అవకాశాలుంటాయి కనుక. అయితే, ఈ క్రమంలో పూర్తిగా అన్యాయం అయిపొయింది సుబ్బారావు పాత్రే. పార్వతి తన ఆలోచనను తెలిపిన తరువాత చేతిలోని రేడియోని పడేసిన అతడు ఆమెతో ఎందుకు వాదించలేదో, ఆ పాత్రను నడిపిన దర్శకరచయితలకే తెలియాలి. నిజజీవితంలో “సుబ్బారావు – లక్ష్మీపార్వతి”ల వైవాహిక జీవితంపైన కూడా కొన్ని వార్తలు, కథనాలు వచ్చాయి. సినిమాలో వాటిని ప్రస్తావించడం దర్శకులకు ఇష్టం లేదో, చూపించే అవకాశం దొరకలేదో తెలియదు కానీ వాళ్ళు ఆ విషయాన్ని అర్థాంతరంగా వదిలేశారు. కనీసం “డ్రామాటిక్ లిబర్టీ”ని తీసుకొని ఆ విషయాన్ని నమ్మదగిన రీతిలోనైనా కొన్ని సన్నివేశాలను నడపలేదు. “మీరు పెళ్ళి చేసుకోమని అడిగిన మరుక్షణమే నేను నా భర్తకు భౌతికంగా, మానసికంగా దూరమైపోయాను” అనే బలమైన మాటను పార్వతి పాత్ర అన్నప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇవ్వడం దర్శకరచయితలకున్న బాధ్యత. దాన్ని వారు విస్మరించారు. ఫలితం, పార్వతి పాత్రలో ఎమోషనల్ కంటెంట్ తగ్గిపోయి, పాత్ర నెలకొల్పబడలేదు. తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకున్న రామారావు తిరుపతి సభలో అందరిముందు పార్వతిని వివాహం ఆడబోతున్నట్టు ప్రకటించడం, ప్రతీ రాజకీయ సభకు ఆవిడను తోడుగా తీసుకొనివెళ్ళడం పాత్ర పట్ల చాలా గౌరవాన్ని పెంచింది. ఇలాంటి శ్రద్ధ పార్వతి పాత్రలో కూడా దర్శకులు వహించివుంటే, ఎంతో ప్రేమించి, ఎన్నో సేవలు చేసి, ఆఖరులో వెనుకకు నెట్టబడిన లక్ష్మీపార్వతి పాత్ర బాగా రిజిస్టర్ అయ్యేది.

నటనలు:

నటనల విషయానికి వస్తే, రామారావు పాత్రను పోషించిన “విజయకుమార్” చాలా బాగా చేశాడు. అతడికి గాయకుడు, రచయిత “విశ్వ” చెప్పిన డబ్బింగ్ రామారావుని పూర్తిగా ఆవిష్కరించింది. ముఖ్యంగా, “నేను జూచాను”, “గినానం” (“జ్ఞానం”) లాంటి పదాలను రామారావు ట్రేడ్మార్క్ ఉచ్చారణలో వందశాతం తీసుకొనివచ్చాడు. లక్ష్మీపార్వతిగా చేసిన యజ్ఞ శెట్టి పాత్రకు బాగుంది కానీ డబ్బింగ్ విషయంలో శ్రద్ధ వహించివుంటే బాగుండేది. పైగా చాలా సన్నివేశాల్లో ఆమె నటన కృత్రిమంగా అనిపించింది. చంద్రబాబునాయుడుగా శ్రీతేజ్ బాగా చేశాడు. మిగతా కాస్టింగ్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.

సాంకేతిక నిపుణులు:

సాంకేతిక నిపుణుల్లో మొదటి వీరతాడు సంగీత దర్శకుడు “కళ్యాణి మాలిక్”కు వేయాలి. పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా ఇచ్చాడు. రెండోది రచయిత “సిరాశ్రీ”కి. “నీ ఉనికి” పాటలో సాహిత్యం చాలా బాగుంది. ఇదివరకటి వర్మ సినిమాలకు కూడా సిరశ్రీ అందించిన మంచి సాహిత్యం కర్ణకఠోరమైన సంగీతంలో కొట్టుకుపోయిన సందర్భాలు అనేకం. ఆ ఖ(వ)ర్మఫలం నుండి విమోచనం ఈ సినిమాతో దొరికింది. జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ, రాకేశ్ రెడ్డి – దీప్తిల నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిమాట:

వర్మ ఈ సినిమాను ఒక serious cum satirical political drama గా తీశాడు. “వెన్నుపోటు” అనే అంశాన్నే ప్రధానంగా చేసుకొని ప్రచారం కూడా అదే దిశగా చేసి ప్రేక్షకుల్లో సినిమాపైన అంచనాలు మాత్రం పెంచాడు. కానీ సినిమాలో పలు సన్నివేశాలు సీరియస్ గా తీశాడు. ఉదాహరణకు, వైస్రాయ్ హోటల్ ఘట్టం మరియు క్లైమాక్స్. మరోప్రక్క ముఖ్యమైన రామారావు పిల్లల పాత్రలకు (మరీ ముఖ్యంగా హరికృష్ణ, బాలకృష్ణ) చూస్తేనే నవ్వొచ్చేలా ఉన్న నటులను ఎంపిక చేశాడు. వాళ్ళు తెర మీద సీరియస్ సన్నివేశంలో ఉన్నా కూడా థియేటరులో ప్రేక్షకులు నవ్వుతున్నారు (నేను కూడా). ఇవి కాకుండా “అసలు కథ” అని చెప్పుకుంటూనే లక్ష్మీపార్వతి జీవితంలో చూపించాల్సిన అసలు ఘట్టాన్ని వదిలేశాడు. ఒకరిని చెడ్డగా చూపించాలంటే ఇంకొకరిని మంచిగా చూపించాలి అన్నట్టే సాగుతుంది సినిమా అంతా.

మరో మాట… రామారావు జీవితాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే బయోపిక్కులు తీసినట్టైతే, “ఎన్టీఆర్ కథానాయకుడు”, “ఎన్టీఆర్ మహానాయకుడు” పదవిలోకి రావడానికి, “లక్ష్మీస్ ఎన్టీఆర్” పదవి నుండి తొలగించడానికి ఏమాత్రం పనికిరావు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s