తెలుగు సినీపాట చరిత్రలో ఆత్రేయకు ప్రత్యేకమైన స్థానముంది. అది ఆయనకున్న ప్రత్యేకమైన రచనా శైలివల్లే వచ్చిందని చెప్పాలి.
నేను గమనించినంత వరకూ ఆత్రేయ క్లిష్టమైన పదాలు వాడడు. సహజంగా మాట్లాడుకునే భాషలోనే ఉంటాయి ఆయన పాటలు. అయితే వాటి భావం మాత్రం మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోతుంది.
“మూగమనసులు” సినిమాకు ఆయన వ్రాసిన పాటలు అత్యుత్తమంగా అనిపిస్తాయి…
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా
కునుకుపడితే మనసు కాస్త కుదుట పడతది
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది
కలలె మనకు మిగిలిపోవు కలిమి సివరకు
ఆ కలిమి కూడ దోసుకునే దొరలు ఎందుకు
నాకూ ఒక మనసున్నాది
నలుగురిలా ఆసున్నాది
కలలు కనే కళ్ళున్నాయి
అవి కలతపడితే నీళ్ళున్నాయి
ఇలాంటివి సార్వజనికంగా వ్రాస్తాడు ఆత్రేయ. సందర్భానుసారంగా సినిమాలో ఆ పాట పాడేది ఆడ, మగ ఇలా ఏ పాత్రైనా కావచ్చు కానీ అందులోని సాహిత్యాన్ని లింగభేదం లేకుండా ఎవరికైనా ఆపాదించుకోవచ్చు. ఎందుకంటే, అవి మనసుకు సంబంధించిన భావాలను ఆవిష్కరిస్తాయి.
ఒక ఆడదాని అందాన్ని వర్ణించినా మరొకరితో పోలికుండదు…
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో
నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో
అని వర్ణించిన విధానం ఈ పాట యొక్క వయసును ఇప్పటికీ పెంచలేకపోయింది.
ఆత్రేయ సున్నితమైన భావాలే కాదు విప్లవ భావాలనూ తట్టిలేపగలడు…
మన తల్లి అన్నపూర్ణ
మన అన్న దానకర్ణ
మన భూమి వేద భూమిరా తమ్ముడు
మన కీర్తి మంచుకొండ రా
దేవుడిలోనూ లోపాలుంటాయని, ఎప్పటికైనా దేవుడికన్నా మనిషే ముఖ్యమంటాడు, మనిషికే విలువిస్తాడు…
రాముడు కాదమ్మా నిందను నమ్మడు
కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండరు
నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు
రెండు పాత్రలు సంభాషించుకునే సందర్భానికి పాటలు వ్రాయడంలో ఆత్రేయ తరువాతే ఎవరైనా…
ఆమె : నేనేంటి! నాకింతటి విలువేంటి! నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి!
అతడు : నీకేంటి? నువ్వు చేసిన తప్పేంటి? ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి?
ఆమె : తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా?
అతడు : నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా?
ఆమె : అది కథే కదా?
అతడు : మన కథ నిజం కాదా?
ఈ సంభాషణ ప్రక్రియలో “ఆకలి రాజ్యం”లోని “కన్నె పిల్లవని” పాట మరో అద్భుతంగా చెప్పొచ్చు.
బాణీకి పాట వ్రాయడం ఆత్రేయకు అస్సలు ఇష్టముండేది కాదట. అది కవిని బంధించేస్తుందని భావించేవాడట. కానీ ప్రజాదరణ పొందిన అనేక ఆత్రేయ గీతాలు బాణీలకు వ్రాసినవే కావడం విశేషం. బాణీకి వ్రాసినా కూడా ఒక్క పదమూ దాన్ని దాటి వెళ్ళదు. అందులోనూ కేవలం భావ వ్యక్తీకరణే కాక పదజాలాన్ని కూడా ప్రయోగించగలడు…
నా తోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి
నీ పైన ఆశలు ఉంచి ఆ పైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ ఉంటిని నిన్నంటి
ఇక హృదయ వేదనను వ్యక్తపరచడంలో తనకు తానే సాటి…
శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతి, లయలాగ జత చేరినావు
నువ్వులేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ
శృంగార రసాన్ని ఒలికించడంలోనూ సిద్ధహస్తుడే ఆత్రేయ…
పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది
ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆయన ముట్టుకోని అంశం, ఆయన వ్రాయని సందర్భం తెలుగు సినిమా సృష్టించలేదేమో.
వేటూరి గురువులుగా భావించేవారిలో ఒకడు, సిరివెన్నెలను ప్రభావితం చేసినవారిలో ముఖ్యుడు ఆత్రేయ.
“వ్రాయక వాడేడిపించు నిర్మాతలను… వ్రాసి వాడేడిపించు ప్రేక్షకులను” అన్న “ఎం.ఎస్.రెడ్డి” గారి మాట చాలు ఆత్రేయను పూర్తిగా వర్ణించడానికి.
మనుషులకు మనసులున్నంత కాలం ఈ మనసు కవికి జననమే తప్ప మరణం లేదు, రాదు!!
– యశ్వంత్ ఆలూరు