సరైన సమయంలో సరైన కథను చెప్పడం కూడా ఆర్టే. అలా, సరైన టైంలో సరైన కథాంశంతో వచ్చిన సినిమా “మహర్షి”. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “వంశీ పైడిపల్లి” దర్శకత్వం వహించాడు. “దిల్ రాజు”, “అశ్వనీదత్”, “పీవీపి” నిర్మించారు.
కథ:
డబ్బు సంపాదించడమే జీవితాశయంగా కలిగిన రిషి (మహేష్ బాబు) ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీకి సీ.ఈ.ఓగా ఎదుగుతాడు. సంవత్సరానికి 950 కోట్లు సంపాదించే రిషికి ఓ సందర్భంలో తన జీవితంలో గడిచిపోయిన రోజులను గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. రిషి గుర్తుచేసుకున్న ఆ గతంలో రవి (అల్లరి నరేష్) మరియు పూజ (పూజ హెగ్డే) ఎవరు? రిషి జీవిత ప్రయాణం ఎలా మొదలై ఎలా సాగింది? అన్నవి కథాంశాలు.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ:
ఈ సినిమా కథలో జీవముంది. డబ్బే సర్వస్వమనుకొని జీవితంలో పరుగులుపెట్టే వ్యక్తి ఆ క్రమంలో తన చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకోలేక వారికి దూరమవుతాడు. చివరకు, డబ్బుకన్నా మనుషులే గొప్పని తెలుసుకుంటాడు. తను వదులుకున్న గతాన్నే తన భవిష్యత్తుగా మార్చుకోవడానికి తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెడతాడు. ఆ ప్రయాణంలో అతడేమి సంపాదించాడన్న దిశగా కథనం సాగుతుంది. యండమూరి కథల్లో ఇలాంటివి కనబడుతూ ఉంటాయి.
ఇంతమంచి కథాంశం, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఈ కథలో నటించడం, ముగ్గురు పెద్ద నిర్మాతలు నిర్మించడం, ఇలా అన్నీ మంచి శకునములే. అయితే, ఈ అంశాలే కథనంలో చొరబడి కథాంశాన్ని దెబ్బతీశాయని చెప్పాలి. ఎందుకంటే, హీరోకు 25వ సినిమా. అతడికేమో అభిమానులు ఎక్కువ, ఈ సినిమాపై ముగ్గురు నిర్మాతలకు అంచనాలెక్కువ. వాటిని అందుకోవాల్సిన అవసరం పడిందేమో దర్శకుడికి. అయితే అతడు ఎక్కడ కూడా కథాంశం నుండి దూరంగా వెళ్ళాడని చెప్పడానికి కూడా లేదు. కథ యొక్క పరిమితుల్లోనే ఉంటూ దానికి పూర్తి న్యాయం చేకూర్చలేదు. అదెలాగంటే…
హీరోని పరిచయం చేయడం, అతడి గొప్పతనాన్ని ఓ పాటలో వివరించడం ఇవంతా మామూలే, ఇలాంటివి స్టార్ హీరోల సినిమాల్లో కథకు అడ్డం కూడా తగలవు. ఎప్పుడైతే హీరో గతం మొదలైందో అప్పటినుండి కథనం అసలు కథాంశాన్ని స్పృశిస్తుంది. చేసిన అప్పులను తీర్చలేక అందరితో మాటలు పడే తండ్రిని చూసి ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ధ్యేయాన్ని ఏర్పరుచుకున్న కొడుకుని (చైల్డ్ ఆర్టిస్ట్) బాగా నెలకొల్పాడు దర్శకుడు. అయితే, అతడు పెద్దయి మహేష్ అంత ఎదిగాక మాత్రం ఆ అంశాన్ని లోతుగా స్పృశించలేదు. మేడ మీదనుంచి తండ్రిని చూసి “మా నాన్నే నాకు రోల్ మోడల్, ఎలా బ్రతకకూడదు అన్న విషయంలో” అని చెప్పే సన్నివేశంలో పాత్ర తాలూకు భావాలను చెప్పగలిగాడే తప్ప దాని భావోద్వేగాలను ప్రేక్షకుడి దగ్గర రిజిస్టర్ చేయించలేకపోయాడు దర్శకుడు. ఆ సందర్భంలో అతడికి సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కూడా సాయం చేయలేదు.
కాలేజీ సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఆ ట్రాకులో “మహేష్ – నరేష్” పాత్రలు “త్రీ ఇడియట్స్”లోని “అమీర్ – శర్మాన్ జోషి” పాత్రలను గుర్తుచేశాయి కానీ అవి చూపినంత ప్రభావాన్ని ఇవి చూపించలేకపోయాయి. ఇందుకు, కాలేజీ స్టూడెంట్సు ఆహార్యానికి మహేష్, నరేష్ నప్పకపోవడం కూడా ఓ కారణమని చెప్పాలి. ఆ మధ్యలో “ముఖేష్ ఋషి”తో ఉన్న సన్నివేశం కథకు అవసరం లేకపోగా, హీరో అభిమానుల కోసం ఓ ఫైట్ పెట్టాలన్న తాపత్రయాన్నే ఎక్కువగా చూపించింది. మొదటి స్థానంలో రావొద్దని అజయ్ (కమల్ కామరాజు) తండ్రి చెప్పడం కన్నా ఎలాగైనా రిషిని ఓడించి తనే మొదటి స్థానంలో రావడానికి అజయ్ తన ప్రయత్నాలు (కనీసం కుట్రలు) తాను చేసినట్టు చూపించినా బాగుండేది. ఇక కాలేజీ నుండి మహేష్ రస్టికేట్ అవ్వకుండా ఉండే సన్నివేశంలో అసలు నిజమేంటో ప్రేక్షకుడు పసిగట్టేయగల ఆస్కారం కల్పిస్తూ కథనాన్ని అమెరికాకు తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు. ఈ మధ్యలో తెలుగు కమర్షియల్ సినిమా రూల్స్ ఫాలో అవ్వాలన్నట్టుగా రిషి- పూజల ప్రేమకథను ఇరికించడం, భారీ సెట్టింగులో వారికో పాట పెట్టడం, తరువాత అతడు తన క్యారెక్టరుకి న్యాయం చేసుకోవడానికి అటు పూజతో, ఇటు రవితో విడిపోవడం చాలా వేగంగా వెళ్ళిపోతాయి. నిజానికి, దర్శకుడు సమయం తీసుకోవాల్సింది ఇక్కడే. రిషి ఆశయాన్ని, పూజ ప్రేమను, రవి స్నేహాన్ని ప్రేక్షకుడు ఫీల్ అవ్వడానికి ఇక్కడ హీరోహీరోయిన్ల మధ్య ఒకట్రెండు ప్రేమ సన్నివేశాలు అవసరముంది. అది చూపించనందున, కనీసం వాటిని జస్టిఫై చేస్తూ ఒకట్రెండు డైలాగులన్నా పెట్టక వాటిని రిజిస్టర్ చేయలేదు దర్శకుడు.
రిషికి, అతడి తండ్రికి మధ్యనున్న దూరం గురించి కాస్త వివరంగా చూపిస్తూ మరికొన్ని సన్నివేశాలు ఉండుంటే బాగుండేది. తన తండ్రి ఓ ఫెయిల్యూరని కొడుకు కోణంలోంచి మొదట బలంగా నెలకొల్పివుంటే, రిషి తన తండ్రి వ్రాసిన ఉత్తరాన్ని చదివే సన్నివేశం మరింత బాగా రిజిస్టర్ అయ్యుండేది. ప్రకాష్ రాజ్ లాంటి నటుడు అక్కడుండడం వల్ల ఇప్పుడున్న కథనంలో కూడా ఆ సన్నివేశం బాగుంది. అయితే, అక్కడ కూడా సంగీత దర్శకుడి సాయం లభించలేదు దర్శకుడికి.
ఈ సినిమాలో ఒక్క మూల కథాంశాన్ని కథనం రెండు కథాంశాలుగా విడగొట్టింది. మొదటి సగం “త్రీ ఇడియట్స్” తరహాలో సాగితే రెండో సగం “స్వదేస్” తరహాలో సాగుతుంది. అయితే, మొదటి సగంలోని అమీర్ (మహేష్), శర్మాన్ (నరేష్) పాత్రలు రెండో సగంలో షారుఖ్ (మహేష్), కిశోరి బల్లాల్ (నరేష్)గా రూపుదిద్దుకుంటాయి. దర్శకుడు వంశీ స్వదేస్ పాత్రలను ఆంధ్రీకరించాడు. స్వదేస్ గ్రామాల్లో అనేక సమస్యలను స్పృశిస్తే, ఇక్కడ ప్రధానంగా రైతుల సమస్యనే చర్చించాడు. స్నేహితుడిని తీసుకొని వెళ్ళాలంటే ముందు అతడు పోరాడుతున్న ఆ ఊరి సమస్యను తీర్చాలనుకున్న రిషికి ఆ సమస్య తనదిగా భావించే కథనక్రమం పూర్తిగా స్వదేస్ తరహాలో సాగేదే. ఇక్కడ పూజకు మళ్ళీ అన్యాయమే జరిగింది. “వాడు ఏదోటి చేస్తాడు” అని అస్తమానం నమ్మే రవికి పెళ్ళి కుదిరినప్పుడు “పాలపిట్ట”గా మారి కలలు కని, తరువాత చావబోతున్న అతడిని కాపాడి ఆసుపత్రిలో చేర్చిన రిషితో “నువ్వు నాకింకా అర్థంకాలేదు” అనడం ఆమెలోని కన్ఫ్యూషనో లేక ఆమె పాత్రని అలా సృష్టించిన దర్శకరచయితల కన్ఫ్యూషనో అర్థంకాదు. అందరితో పాటే ఆమెను కూడా కలిపేశారు.
ఇక ఆ తరువాత కథనం బాగా సాగుతుంది. రైతుల సమస్యను సూటిగా చెబుతూ దేశంలోని ప్రతీ వ్యక్తికి రైతుతో సంబంధముందని చెప్పిన విధానం చాలా బాగుంది. ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యమో తెలియని “వీకెండ్ ఫార్మింగ్” అనే అంశం కూడా చాలా బాగుంది. దీని తరువాత “ఇదే కదా నీ కథ” పాట నుండి వచ్చే సన్నివేశాలు మళ్ళీ స్వదేస్ సినిమా ఫార్మాటులోకి వెళ్ళిపోయి కథకు ప్రేక్షకుడు ఆశించే సరైన ముగింపునిస్తాయి.
అలా, “మహర్షి” మూల కథాంశం, స్పృశించిన సామాజిక సమస్యలు బాగున్నప్పటికీ పేలవమైన కథనం, నేపథ్య సంగీతాలతో మిగిలిపోయింది.
నటనలు:
మహేష్ నటనలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాలేదు. “కొరటాల శివ” సినిమాలోని మహేషే “వంశీ పైడిపల్లి” సినిమాలోనూ కనిపించాడు. అల్లరి నరేష్ కి దొరికింది మంచి పాత్రే అయినా అతడికి పూర్తిగా దాన్ని పండించగల ఆస్కారం దొరకలేదు. పూజ హెగ్డేకు నటించేంత నిడివి, విలువ ఉన్న పాత్ర దక్కలేదు. ప్రకాష్ రాజ్ ఉన్నది కాసేపే అయినా తన ముద్రను వేశాడు. జయసుధకు రొటీన్ తల్లి పాత్రే దక్కింది.
జగపతిబాబు, సాయికుమార్, రావు రమేష్, వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, రాజీవ్ కనకాల గుర్తుంచుకోగల పాత్రలను పోషించలేదు. అతిథులుగా కనిపించిన కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, అన్నపూర్ణ వీళ్ళసలు గుర్తుకేరారు.
బలాలు:
- మూలకథ, కథాంశాలు. ఈ సమయంలో, ఇప్పటి జీవన విధానానికి చెప్పాల్సిన అంశాలివి.
- మోహనన్ ఛాయాగ్రహణం. సినిమాలో ఇతడు చేసిన లైటింగ్ అద్భుతం.
- నిర్మాణ విలువలు. ఈ సినిమా నిర్మాణంలో ముగ్గురు పెద్ద నిర్మాతలు భాగస్వాములని ప్రతీ ఫ్రేమూ తెలుపుతుంది.
బలహీనతలు:
- దేవీశ్రీప్రసాద్ సంగీతం. మానవీయ కోణాలను ఆవిష్కరించే ఇలాంటి కథలకు సంగీతం, నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. ఈసారి దేవి ఆ రెండు అంశాల్లోనూ విఫలమయ్యాడు.
- కథనం. కథలోని భావోద్వేగాన్ని కథనంలోని సన్నివేశాలు చేరవేయలేకపోయాయి.
– యశ్వంత్ ఆలూరు