జీవన వాహిని – గంగోత్రి

Jeevana Vahini

ఎన్నిసార్లు చెప్పినా, ఎవరెంత వాదించినా సినిమా సాహిత్యం చాలా కష్టమైనది, అంతే గొప్పది కూడా. స్వతంత్ర కవితకు ఎల్లలు లేవు. ఎల్లలు లేని సినీకవిత లేదు. మరో విధంగా చెప్పాలంటే, స్వతంత్ర సాహిత్యం ఆకాశంలో ఎగిరే పక్షి అయితే సినిమా సాహిత్యం పంజరంలో ఉండే పక్షి. పంజరపు ఎల్లలలో కూడా ఆ పక్షిని స్వేచ్ఛగా ఎగిరేలా చేయగల కవులున్నారు. వారిలో ప్రముఖుడు “వేటూరి సుందరరామ్మూర్తి”. ఆయన వ్రాసిన అలాంటి ఓ పాటే “గంగోత్రి” సినిమాలోని “జీవన వాహిని”. తన కెరీరుకి మైలురాయి అయిన 100వ సినిమాలో ఇలాంటి గొప్ప పాటను వ్రాయించుకున్న దర్శకుడు “రాఘవేంద్రరావు”కి, మంచి సంగీతం అందించిన “కీరవాణి”కి, ఆమోదించిన నిర్మాత “అశ్వనీదత్”కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

విశ్లేషణ:

ఈ సినిమాలో మిగతా పాటలంత ప్రాచుర్యం ఖచ్చితంగా ఈ పాట పొందలేదని చెప్పాలి. ఇప్పటి ప్రేక్షకులకు ఈ సినిమా గుర్తుంటే ఈ పాట మాత్రం దాదాపుగా గుర్తుకురాదు. బహుశా, ఇదేదో భక్తి పాటనుకొని వదిలేసినవారు చాలామందే ఉండుంటారు. నిజానికి, ఇది భక్తి పాట కానే కాదు. వేటూరి “చూడాలనివుంది”లో వ్రాసిన “యమహా నగరి” కలకత్తా నగర విశిష్టతను, “అర్జున్”లో వ్రాసిన “మదుర మధురతర మీనాక్షి” మదురై పట్టణ విశిష్టతను తెలిపినట్టే ఈ పాట గంగానది విశిష్టతను తెలుపుతుంది. ఈ పాటను వేటూరి రెండు పార్శ్వాలలో వ్రాశాడు. ఒకటి భౌగోళిక శాస్త్రం ఆధారంగా గంగకున్న విశిష్టత. మరొకటి పురాణాల్లో చెప్పబడిన విశిష్టత. అదెలాగంటే…

జీవన వాహిని… పావని…

భారతదేశంలో ప్రవహించే నదులలో అతి ముఖ్యమైనది గంగ. పశ్చిమ హిమాలయ పర్వతాల్లో పుట్టి భారతదేశం మీదుగా బంగ్లాదేశ్ లోకి కూడా ప్రవేశించి, మొత్తానికి 2,525 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇది జీవనది. అది ప్రవహించే దారంతా వేల ఎకరాల పంటభూములను తడుపుతూ, ఎన్నో జీవరాశులకు ఆశ్రయమిస్తూ, అనేక మానవ అవసరాలను తీరుస్తూ వెళ్తుంది. అందుకే, “జీవన వాహిని… పావని…” అని పాటను భౌగోళిక అంశంతోనే ప్రారంభించాడు వేటూరి.

కలియుగమున కల్పతరువు నీడ నీవని

కనులు తుడుచు కామధేను తోడు నీవని

వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగాదేవి

ఇక్కడ మొదట “కల్పతరువు”ని ప్రస్తావించాడు. కోరుకున్నవి ప్రసాదించే దేవ వృక్షంగా దీన్ని పురాణాల్లో వర్ణించారు. తరువాత “కామధేనువు”తో పోల్చాడు. మానవాళి జీవనానికి కావాల్సినవన్నీ ప్రసాదించి ఆదుకున్న గోమాతగా దీనికీ హిందూ పురాణాల్లో విశిష్టమైన స్థానం ఉంది. కృతయుగం నాటి కల్పతరువు, కామధేనువుల ధర్మాన్నే కలియుగంలో గంగ నిర్వర్తిస్తోందని ఈ వాక్యాల భావం.

ఇక్కడ వేటూరి “రూపకాలంకారము“ను ప్రయోగించాడు. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని కానీ, తాద్రూప్యాన్ని కానీ వర్ణించటం రూపకం. గంగను కల్పతరువుతోనో లేదా కామధేనువుతోనో పోల్చకుండా “కల్పతరువు నీడ”, “కామధేను తోడు” అని నైరూప్య సామ్యం (Abstract Comparison) చేశాడు. ఇది వేటూరి రచనలో ఉండే సౌందర్యానికి ఓ మచ్చుతునక.

నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావని

భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి

గంగని నమ్ముకుంటే చాలు పంటలు, త్రాగునీరు, ఇలాంటి ఎన్నో సౌభాగ్యాలు చేకూరుస్తుంది. ఇక్కడ, గంగని జాగ్రత్తగా చూసుకోవాలన్న భావం కూడా వస్తుంది. అంటే, మనిషికి ప్రకృతి పట్లున్న బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది ఈ వాక్యం. రెండో వాక్యంలో దాని లక్షణాన్ని చెప్పడం జరిగింది. భూమి మీద ప్రవహిస్తూ దాన్ని స్వర్గంగా మార్చినప్పటికీ సుడులు తిరిగే లక్షణం కూడా కలిగినది గంగ.

గల గల గల గంగోత్రి

హిమగిరిదరి హరిపుత్రి

గంగోత్రి అంటే “గంగ పుట్టిన స్థలం” అని, ఈ పాటలో వేటూరి “గల గల గల గంగోత్రి” అంటూ గంగోత్రి “నది” అని చెబుతూ తప్పుగా వ్రాసినట్టు ఒక విమర్శ ఉందని మిత్రులు “ఫణీంద్ర” ద్వారా విన్నాను. అయితే, దీన్ని రెండు వాక్యాలుగా కాక ఒకే వాక్యంగా చదవాలని నా అభిప్రాయం. “గల గల గల గంగోత్రి హిమగిరిదరి హరిపుత్రి”. అంటే, “గంగోత్రి మంచుకొండ దగ్గర గలగల పారుతున్న హరిపుత్రి (గంగ)” అని అర్థం వస్తుంది. పురాణాల ప్రకారం విష్ణువు పాదాల నుండి పుట్టింది గంగ. భౌగోళికంగా “గంగోత్రి” దగ్గరున్న హిమాలయాల్లో పుడుతుంది. ఈ రెండు విషయాలనూ ఒకే వాక్యంలో చెప్పాడు వేటూరి. ఇది బాణీకి వ్రాసిన పాట కనుక “గల గల గల గంగోత్రి” దగ్గర ఓ అరక్షణం విరామం రావడంతో, ఒక వాక్యం రెండు వాక్యాలుగా వినబడి శ్రోతలకు అయోమయం కలిగించివుండొచ్చు.

మరో విషయమేమిటంటే, “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకం ప్రకారం వేటూరి “హిమగిరిజని” అని వ్రాశాడు. పాటలో “హిమగిరిదరి” అని పాడారు. అర్థం, భావం ప్రకారంగా, రెండు పదాలూ సరిపోయినప్పటికీ, “హిమగిరిజని” అనేది రచయిత ఉద్దేశాన్ని మరింత బలంగా వ్యక్తపరిచే పదం.

మంచుకొండలో ఒక కొండవాగులా

ఇల జననమొందిన విరజావాహిని

మొదటి చరణాన్ని భౌగోళిక ప్రస్తావనతోనే ప్రారంభించాడు వేటూరి. పశ్చిమ హిమాలయాల్లోంచి ఒక వాగులా తన ప్రవాహాన్ని మొదలుపెడుతుంది గంగ. అందుకే “ఇల జననమొందిన” అని అన్నాడు. ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే “విరజా వాహిని” అన్నాడు. “విరజ” అంటే “రజం లేనిది”. అంటే దుమ్ము లేనిది, శుభ్రమైనదని అర్థం.

విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా

శివగిరికి చేరిన సురగంగ నీవని

గంగానది పుట్టుక వెనుకనున్న పురాణకథను ఈ వాక్యాల్లో ప్రస్తావించడం జరిగింది. విష్ణువు పాదాల్లోంచి పుట్టిన గంగ పరవళ్ళు తొక్కుతూ వస్తుండగా, ఆ ధాటిని భూమి భరించలేదని శివుడు తన జటాజూటంలో బంధించి, భూమి తట్టుకునేంత ప్రవహాన్ని మాత్రమే వదిలాడన్నది పురాణ కథనం. మొదటి రెండు వాక్యాల్లో భూమి మీద జన్మించిందని చెప్పి ఇక్కడ “సురగంగ”, అంటే దేవలోకానికి చెందినదని చెప్పాడు.

అత్తింటికి సిరులనొసగు అలకనందవై

సగర కులము కాపాడిన భాగీరథివై

భౌగోళికంగా, అలకనంద భారత్-టిబెట్ ల సరిహద్దులోనున్న “సటోపంత్” అనే గ్లేషియర్ నుండి పుడుతుంది. అక్కడినుండి భారతదేశంలో ప్రవేశించి, చాలా దూరం ప్రవహిస్తూ, ఆ మేర ఉన్న భూమినంతా సస్యశ్యామలం చేస్తుంది. చివరగా, “దేవ ప్రయాగ”లో భాగీరథితో కలుస్తుంది. అక్కడినుండి ప్రవహించే ఆ సంగమం “గంగ” అని పిలువబడుతుంది. అందుకే, “అత్తింటికి సిరులనొసగు అలకనందవై” అన్నాడు వేటూరి.

రెండో వాక్యం మళ్ళీ పురాణ ప్రస్తావనను తెస్తుంది. కోసల దేశపు మహారాజు “భగీరథుడు” తన సగర (సూర్యవంశానికి చెందిన ఓ రాజు సగరుడు) కులములోని పెద్దలను కపిల మహర్షి పెట్టిన శాపం నుండి విముక్తులను చేయడానికి ఆకాశగంగకై తపస్సు చేశాడు. ఆ గంగ ధాటిని శివుడు నిలువరించి, భగీరథుని వెంట పంపాడు. అలా, అతడి వెంట నడిచినందున “భాగీరథి”గా పేరు పొందింది గంగ.

అలా, “గంగ” పుట్టుకకు కారణమైన ఆ రెండు నదులలో, ఒక నది గురించి భౌగోళిక వివరణను, మరో నది గురించి పౌరాణిక వివరణను ఈ రెండు వాక్యాల్లో ఇచ్చాడు వేటూరి.

బదరీవన హృషీకేష హరిద్వార ప్రయాగముల

మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి

అలా, బదరీవనం (బద్రీనాథ్), పంచ ప్రయాగాలు (విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ మరియు దేవప్రయాగ) మీదుగా హృషీకేష్ (ఋషికేశ్), హరిద్వార్ లను దాటుకొని వారణాసికి చేరుకుంటుంది. ఇది భౌగోళికంగా గంగ ప్రవహించే దారి. అయితే, బాణీలోని మాత్రలకు సరిపోయేట్టుగా వేటూరి ఆ ప్రదేశాలను అటుఇటుగా వేసినట్టు అనిపిస్తుంది.

వారణాసిలోని “మణికర్ణిక” ముక్తికి మార్గం చూపే ద్వారంగా చెప్పబడుతుంది. ఆ మణికర్ణిక కూడా గంగ ఒడ్డునే ఉంటుంది. అలా, రెండో వాక్యంలో హిందూ మతానికి సంబంధించిన ఓ నమ్మకం గురించి ప్రస్తావించాడు.

పసుపు కుంకుమతో పాలు పన్నీటితో

శ్రీగంధపు ధారతో పంచామృతాలతో

అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ

గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం

గంగోత్రి” సినిమాలో ఈ పాట మొదటి సగం వరకూ టైటిల్స్ పడే సమయంలో వస్తుంది. రెండో సగం ఇక్కడ మొదలవుతుంది. కథానుసారంగా, జలగండం ఉన్న కథానాయికను గంగోత్రికి తీసుకొని వస్తారు. అక్కడ వివిధ జలాలతో ఆవిడకు అభ్యంగన స్నానం చేయిస్తారు. దాని గురించి చెప్పేవే ఈ వాక్యాలు.

అమ్మా గంగమ్మ!

కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని

యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని

గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి

కురిసేటి జడివానకి దూకే జలపాతానికి

నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా మా గంగమ్మా

ఈ వాక్యాలు కథానాయకుడి పాత్రను దృష్టిలో ఉంచుకొని వ్రాసినవి. ఓ బావిలో పడిపోయిన కథానాయికను అతడు కాపాడిన తరువాత, ఆమెకి జలగండం ఉందని, అందుకు గంగోత్రికి తీసుకెళ్ళాలని గ్రహించి అందరూ అక్కడికి పయనమవుతారు. ఓ ప్రక్క కథానాయికకు అభ్యంగన స్నానం చేయిస్తుండగా, మరోప్రక్క ఆమెని చిన్నప్పటి నుండి కాపాడే స్నేహితుడు (కథానాయకుడు), మరే జలగండము ఆమెకి ఉండరాదని గంగను ప్రార్థిస్తూ పాడేవే పై వాక్యాలు. భారతదేశంలో అత్యంత దూరం ప్రవహించే నది గంగ. కనుక నదులకు రాణిగా దాన్ని గౌరవిస్తూ, కథానాయకుడు తన స్నేహితురాలికి ఎక్కడా ఎటువంటి ఆపద కలిగించొద్దని దేశంలోని ఇతర నదులకు చెప్పవలసిందిగా గంగను వేడుతున్నాడు.

జీవనదివిగా ఒక మోక్షనిధివిగా

పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా

మొదటి చరణంలోని వాక్యాల్లో మొదట భౌగోళిక విషయాలు చెప్పి తరువాత పురాణాలు, నమ్మకాల ప్రస్తావన చేశాడు వేటూరి. ఇక్కడినుండి వచ్చే వాక్యాల్లో మొదట పురాణాలు, నమ్మకాల ప్రస్తావన తెచ్చి తరువాత భౌగోళిక, శాస్త్రీయ విషయాలను ప్రస్తావించాడు.

గంగ జీవనది. వారణాసిలోని గంగలో శవాలను, చనిపోయినవారి అస్తికలను గంగలో వదిలితే మోక్ష సిద్ధి కలుగుతుందని హిందూమతములో ఓ నమ్మకముంది. మొదటి వాక్యంలో ఆ ప్రస్తావన తెచ్చాడు.

తాను ప్రవహించే దారినంతా సస్యశ్యామలం చేస్తూ వెళ్ళే గంగ భారతదేశానికి తలమానికంగా మారింది. అందుకే, వేటూరి పండ్లు, పూలు తన కాళ్ళకు పసుపు పారాణిగా వ్రాసుకున్న రాణిగా గంగను అభివర్ణించాడు.

శివుని జటలనే తన నాట్య జతులుగా

జలకమాడు సతులకు సౌభాగ్య దాత్రిగా

ఓ పాటను విశ్లేషించడానికి అందులోని ఓ భాగం ముఖ్యప్రేరణ అవుతుంది. ఈ పాటలో నాకు అలంటి భాగం ఇదే.

పురాణ ప్రస్తావనకే మళ్ళీ వస్తే, భీకరమైన హోరుతో దూకిన ఆకాశగంగను అదుపు చేయడానికి శివుడు వచ్చాడు. ఆ గంగను తన జటాజూటంలో బంధించాడు. అయినప్పటికీ, శివుడి శిరస్సునే వేదికగా చేసుకొని నాట్యం చేసే గంగ భూమి పైకి వస్తే, సాధారణ మానవుల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఈ రెండు వాక్యాలు. భూమిపైకి వచ్చిన గంగ భూమంత నిలకడగా ఉంటూ అందులో స్నానాలను ఆచరించేవారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సకల శుభాలను చేకూరుస్తున్నది.

గండాలను, పాపాలను కడిగివేయగా

ముక్తినదిని మూడు మునకలే చాలుగా

జలదీవెన తలకుపోసే జనని గంగాభవాని

అతి పవిత్రమైన గంగానదిలో మూడు మునకలు వేస్తే సర్వదోషాలు, పాపాలు పోతాయని హిందూమతములో ఓ ప్రగాఢమైన నమ్మకముంది. దాన్నే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

పసిపిల్లకు తలంటు పోసే తల్లి చివరి చెంబుడు నీళ్ళు పోసే సమయంలో “శ్రీరామరక్ష”, “నూరేళ్ళు ఆయుష్షు” అని దీవిస్తుంది. అలాంటి తనలో దిగి స్నానం చేసే ఎందరో పిల్లలకు (మనుషులకు) తల్లిలా గంగ దీవెనలందిస్తోందని చివరి వాక్యంలో చెప్పాడు వేటూరి.

ఆమె అండ మంచుకొండ, వాడని సిగపూదండ

ఈ వాక్యానికి రెండు సమన్వయాలు చేసుకోవచ్చు.

మొదటిది… మానవాళికి గంగానది అండ ఓ మంచుకొండ లాంటిది. అంటే, అన్ని శుభాలు చేకూరుస్తూ చల్లగా చూసేది. “వాడని సిగపూదండ” అంటే జీవనది, ఎల్లప్పుడూ మానవ మనుగడకి తనవంతు సాయం అందిస్తూనేవుంటుందని అర్థం.

రెండవది… గంగ ఓ మంచుకొండలోంచి పుడుతుంది. అనేక సంవత్సరాలుగా ఆ మంచుకొండ కరుగుతున్నా తరగడం లేదు. కనుక గంగా ప్రవాహం ఆగదు. అందుకే జీవనది అయ్యింది. భారతదేశానికి తలమానికంగా నిలిచిన ఈ జీవనది గంగ భారతమాత జడలో వాడని కుసుమమని చెబుతూ, “వాడని సిగపూదండ” అని వేటూరి భావం అవ్వొచ్చు.

సాహిత్యం:

జీవన వాహిని… పావని…

 

కలియుగమున కల్పతరువు నీడ నీవని

కనులు తుడుచు కామధేను తోడు నీవని

వరములిచ్చి భయము తీర్చి శుభము కూర్చు గంగాదేవి

నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావని

భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి

గంగోత్రి… గంగోత్రి…

గల గల గల గంగోత్రి

హిమగిరిదరి(జని) హరిపుత్రి        || జీవన వాహిని… పావని…||

 

మంచుకొండలో ఒక కొండవాగులా

ఇల జననమొందిన విరజావాహిని

విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా

శివగిరికి చేరిన సురగంగ నీవని

అత్తింటికి సిరులనొసగు అలకనందవై

సగర కులము కాపాడిన భాగీరథివై

బదరీవన హృషీకేష హరిద్వార ప్రయాగముల

మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి

 

గంగోత్రి… గంగోత్రి…         || గల గల గల గంగోత్రి ||

 

పసుపు కుంకుమతో పాలు పన్నీటితో

శ్రీగంధపు ధారతో పంచామృతాలతో

అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ

గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం

 

అమ్మా గంగమ్మ!

కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని

యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని

గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి

కురిసేటి జడివానకి దూకే జలపాతానికి

నీ తోబుట్టువులందరికీ చెప్పమ్మా మా గంగమ్మా

 

జీవనదివిగా ఒక మోక్షనిధివిగా

పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా

శివుని జటలనే తన నాట్య జతులుగా

జలకమాడు సతులకు సౌభాగ్య దాత్రిగా

గండాలను, పాపాలను కడిగివేయగా

ముక్తినదిని మూడు మునకలే చాలుగా

జలదీవెన తలకుపోసే జనని గంగాభవాని

ఆమె అండ మంచుకొండ, వాడని సిగపూదండ…

 

గంగోత్రి… గంగోత్రి…         || గల గల గల గంగోత్రి ||

చివరిమాట:

తెలుగు సినిమా సాహిత్యానికి వేటూరి అండ మంచుకొండ, వాడని సిగపూదండ…

యశ్వంత్ ఆలూరు

05/06/2019

5 thoughts on “జీవన వాహిని – గంగోత్రి

 1. మన గ్రూపులో చెప్పినట్టు చాలా చక్కని వ్యాసం యశ్వంత్! బాగా రీసెర్చ్ చేసి వేటూరి ప్రయోగాలని బాగా పట్టుకున్నావు! అభినందనలు!

  నాకు తోచినవి కొన్ని –

  >> “ఈ పాటలో వేటూరి “గల గల గల గంగోత్రి” అంటూ గంగోత్రి “నది” అని చెబుతూ తప్పుగా వ్రాసినట్టు ఒక విమర్శ ఉందని మిత్రులు “ఫణీంద్ర” ద్వారా విన్నాను. అయితే, దీన్ని రెండు వాక్యాలుగా కాక ఒకే వాక్యంగా చదవాలని నా అభిప్రాయం”

  ఈ వాక్యాలకు ముందున్న “గంగోత్రి గంగోత్రి” అన్న హుక్ ని పరికిస్తే ఈ పాటలో గంగనే గంగోత్రిగా వర్ణించారు అన్నది స్పష్టం. సినిమా పేరు అది కనుక, ఇది సినిమా కోసం జరిగిన కాంప్రమైజ్ అనుకోవచ్చు. దానికి వేటూరిని తప్పుపట్టొచ్చు. అయితే గంగోత్రి వద్ద ఉన్న గంగా నదిని కూడా స్థానికులు గంగోత్రి అనే పిలుస్తారని నా అనుకోలు! ఎందుకంటే హిందీ వాళ్ళు కొందరు గంగోత్రిని నదిగా వాడడం నేను విన్నాను. ఇది నిజమో కాదో తెలిసినవాళ్ళు చెప్పాలి.

  >> ఈ వాక్యాలు కథానాయకుడి పాత్రను దృష్టిలో ఉంచుకొని వ్రాసినవి. ఓ బావిలో పడిపోయిన కథానాయికను అతడు కాపాడిన తరువాత, ఆమెకి జలగండం ఉందని, అందుకు గంగోత్రికి తీసుకెళ్ళాలని గ్రహించి అందరూ అక్కడికి పయనమవుతారు. ఓ ప్రక్క కథానాయికకు అభ్యంగన స్నానం చేయిస్తుండగా, మరోప్రక్క ఆమెని చిన్నప్పటి నుండి కాపాడే స్నేహితుడు (కథానాయకుడు), మరే జలగండము ఆమెకి ఉండరాదని గంగను ప్రార్థిస్తూ పాడేవే పై వాక్యాలు.

  ఈ వాక్యాలకు సినిమా కథ పరంగా కాక విడిగా చూసుకుంటేనే అర్థం ఇంకా బావుంటుంది అనిపిస్తుంది. నదులు జీవధారలు. అయితే అవి మన కన్నీటి ధారలు కాకుండా ఉండాలంటే ఒక క్రమపద్ధతిలో మనకి కష్టం కలిగించకుండా సాగాలి (అంటే వరదలూ గట్రా లేకుండా!). అందుకే మమ్ము చల్లగా చూడు తల్లీ గంగమ్మా అంటూ నీ తోబుట్టువులు అయిన మిగతా నదులకీ చెప్పు అనడం బావుంది.

  >> వారణాసిలోని గంగలో శవాలను, చనిపోయినవారి అస్తికలను గంగలో వదిలితే మోక్ష సిద్ధి కలుగుతుందని హిందూమతములో ఓ నమ్మకముంది. మొదటి వాక్యంలో ఆ ప్రస్తావన తెచ్చాడు

  “మోక్షనిధి” అంటే ఇలాగే అర్థం తీసుకోవాలని లేదు. మన గొప్ప ఆధ్యాత్మిక సంపదని అంతా తనలో నింపుకుంది కనుక, కోరిన అందరికీ అందిస్తోంది కనుక (స్నానం చేసిన వారు, నది నీళ్ళు భక్తిగా జల్లుకునే వారు, కేవలం నదికి మొక్కే వారు..ఇలా అందరికీ) గంగ మోక్షనిధి.

  >> ఆమె అండ మంచుకొండ, వాడని సిగపూదండ

  గంగమ్మ తల్లి అండ మంచుకొండలా చల్లనిదీ, వాడని సిగపూదండలా పచ్చనిదీ అని చెప్పడమే కవి ఉద్దేశ్యం. నీ మొదటి అన్వయమే సరైనది.

  Like

  • చాలా బాగుంది మీ కామెంటు…

   అయితే మీరన్న “గంగోత్రి గంగోత్రి” అనే హుక్ కీరవాణిది అయ్యుంటుందని నా అభిప్రాయం. బహుశా వేటూరి వ్రాసుండకపోవచ్చు. 🙂

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s