యుద్ధంలో ఒక్కోసారి పోరాడే వీరుడికన్నా అతడిని నడిపించే సారథే ముఖ్యం. ఇది మహాభారతం సైతం చాటిన సత్యం. సినిమా విషయంలో కూడా అంతే. ఒక్కోసారి కథ, కథనాల కన్నా వాటిని తెరపై నడిపించే నటులే ముఖ్యమైపోతుంటారు. అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. ఎటువంటి కథలకు ఎలాంటి నటులను ఎంపిక చేసుకోవాలో దర్శకుడికి స్పష్టత ఉంటే చాలు. అలా, సినిమాల్లో కాస్టింగుకున్న ప్రాముఖ్యతను చాటే చిత్రమే ‘సైరా నరసింహారెడ్డి’. ‘మెగాస్టార్ చిరంజీవి’ నటించిన 151వ సినిమా ఇది. అతడి ఓ దశాప్దపు కలగా చెప్పబడ్డ ఈ సినిమాకు ‘సురేందర్రెడ్డి’ దర్శకత్వం వహించాడు. ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పతాకంపై ‘రాంచరణ్’ నిర్మించాడు. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఝాన్సీ లక్ష్మీబాయిగా అనుష్క అతిథి పాత్రను పోషించింది.
గమనిక: ఈ సినిమాను చూడనివారు ఈ విశ్లేషణను చదవకపోవడమే మంచిది.
కథ:
1857 నాటి సిపాయిల తిరుగుబాటుకి పదేళ్ళ ముందే రేనాటి ప్రాంతంలో నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా పిలువబడే మజ్జారి నరసింహారెడ్డి (చిరంజీవి) తన తోటి పాలెగాళ్ళని, ప్రజలను కలుపుకొని ఆంగ్లేయులను ఎదిరించి పోరాటం చేస్తాడు. అతడి జీవిత విశేషాలను, స్వేచ్ఛకోసం అతడు చేసిన పోరాటం గురించి చెప్పడమే ఈ సినిమా కథాంశం.
కథనం, దర్శకత్వం – విశ్లేషణ:
చరిత్ర పట్ల ఎలాంటి ఖచ్చితత్వాన్ని ధృవీకరించకుండా నాటకీయ స్వేచ్ఛని బాగా తీసుకొని ఈ సినిమా కథనాన్ని తయారుచేశారు అనిపించింది. అయితే కథను చెప్పడంలో సహజమైన తెలుగు సినిమా పోకడనే అనుసరించారు. నేరుగా కథలోకి వెళ్ళకుండా అసలు కథతో సంబంధంలేని ఝాన్సీ లక్ష్మీబాయి (అనుష్క) ద్వారా కథను చెప్పడం అనేక సంవత్సారాలుగా వస్తున్న పోకడ. అయితే, ఎక్కడ సినిమాలో ‘డ్రమాటిక్ హై’ ఇవ్వాలో బాగా చూసుకున్నారు దర్శకరచయితలు. ఇందుకు వారికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి.
ఇక కథనంలోకి వెళ్తే, బాల్యంలో నరసింహారెడ్డి ఆంగ్లేయులపై యుద్ధం చేయాలని నిశ్చయించుకోవడం అనే అంశాన్ని ఇంకాస్త బలంగా నెలకొల్పి ఉండాల్సిందేమోనని అనిపించింది. కేవలం ఉరేసుకున్న రైతులను చూసో, తాతయ్య చెప్పిన మాములు మాటలు వినో కాక, అసలు ఆంగ్లేయుల పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని రగిలిపోయి గోసాయి వెంకన్న (అమితాబ్ బచ్చన్) వద్దకు వెళ్ళుంటే బాగుండేది. అయితే, వెంకన్న శిక్షణలో నరసింహారెడ్డి ఎలా ఆరితేరాడో చాలా బాగా చూపించారు. ఎదిగిన నరసింహారెడ్డి (చిరంజీవి)ని మాములు కమర్షియల్ సినిమాలోలాగ కాకుండా కథ, కథనాలకు అవసరమయ్యే జలస్తంభన విద్యతో పరిచయం చేయడం బాగుంది.
19వ శతాబ్దం నాటి కథను ఆధునిక పద్ధతిలో చూపించగలడన్న నమ్మకంతోనే ఈ సినిమాకు దర్శకుడిగా ‘సురేందర్రెడ్డి’ని ఎంచుకున్నట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు చిరంజీవి, రాంచరణ్. మరి వెనుకనుండి భూమినంతా ఆదరగొడుతూ, జనాలను బెదరగొడుతూ భీబత్సం సృష్టిస్తున్న ఎద్దుల అలజడికి కనీసం చలించకుండా ఓ అమ్మాయి ఓ అబ్బాయిని అలా చూస్తూ తన్మయత్వంలో మునిగిపోవడం ఏ కాలంనాటి సన్నివేశమో దర్శకుడు ఆలోచించలేదు అనిపిస్తుంది. అంతకుముందే కథానాయకుడు రెండు బాణాలు వేసి కుండలను పగలగొట్టినా కూడా ఆయనే వచ్చి ప్రక్కకు లాగేవరకు కదిలేది లేదు అన్నట్టుగా ఆ అమ్మాయి అక్కడే నిలబడి ఉంటుంది. అలా కాకుండా, అందరితోపాటుగా ముందే ప్రక్కకు జరిగిపోయి ఒంటరిగా నీటిలో ధ్యానం చేసుకుంటూ కనబడిన ఓ శాంతమూర్తి మదమెక్కిన గొడ్లను ఎలా అదుపు చేశాడో చూసి అతడి వీరత్వం గురించి తెలుసుకొని ఆ తరువాత అతడి పట్ల ఆకర్షితురాలు అయినట్టు చూపించివుంటే బాగుండేదేమో. ఇది కూడా తెలిసిన పోకడే కానీ ఈ సందర్భాన్ని కాస్త అర్థవంతంగా మార్చి ఉండేదేమో.
ఆ తరువాత జాతర నేపథ్యంలో వచ్చే ‘జాగో నరసింహా జాగోరే’ అనే పాట ఈ సినిమాకే ఉత్తమమైన పాటగా చెప్పుకోవచ్చు. అటు సంగీత సాహిత్యాల పరంగా, ఇటు చిత్రీకరణ పరంగా కూడా ఈ పాటకు సంపూర్ణ న్యాయం చేకూరింది. నృత్య దర్శకుడు ‘ప్రేమ్ రక్షిత్’ని, ఛాయాగ్రాహకుడు రత్నవేలుని, దర్శకుడు సురేందర్రెడ్డిని, నిర్మాత రాంచరణ్ ని అందుకు అభినందించాలి. అలాగే, ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి జగన్నాథ పర్వతంపై నరసింహారెడ్డి దీపం వెలిగించే ఘట్టాన్ని కూడా కథలో బాగా వాడుకున్నారు. ఆ తరువాత నరసింహారెడ్డి – లక్ష్మి (తమన్నా)ల మధ్య వచ్చే సన్నివేశాలు మాములుగానే అనిపిస్తాయి. ఆ క్రమంలో వారిద్దరి మధ్య ఓ డ్యూయెట్ పెట్టి ప్రేక్షకుడి ధ్యాసను మళ్ళించకుండా అసలు కథలోకి వెళ్ళి మంచిపనే చేశాడు దర్శకుడు.
ప్రతి చిన్న పాత్రకీ పేరుమోసిన నటులను పెట్టుకోవడం బాగా కలిసోచ్చింది సినిమాకు. ఒకప్పుడు భారతదేశం ఎంతో సంపన్న దేశమని మొదట్లో చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తుచేయడానికి ఓ మహిళ (రోహిణి) తన ఇంటిని తానే తగలబెట్టుకునే సన్నివేశాన్ని రూపొందించాడు దర్శకుడు. ‘బువ్వ దొంగతనం సేయడం ఏందయ్యా?’ అనే మాటతో దాన్ని నెలకొల్పాడు. రోహిణి నటన దాన్ని బలపరిచింది. ‘మనదైతే అది మన హక్కు. వదలకూడదు’ అనే మాటను తరువాతి కథనంలో సరైన సమయంలో వాడుకున్నాడు.
ఆ తరువాతే కథనంలో ఒక అయోమయం మొదలవుతుంది. నరసింహారెడ్డికి ఆరేళ్ళ వయసులోనే సిద్దమ్మ (నయనతార)తో పెళ్ళి అయ్యిందన్న విషయం సిద్దమ్మకు చిన్నప్పుడే చెప్పి అతడికి ఎందుకు చెప్పలేదో ఎటువంటి వివరణ ఇవ్వలేదు. చారిత్రాత్మక ఖచ్చితత్వం లేదు అని ముందే నిర్థారించిన ఈ సినిమాలో ఇక్కడ కూడా తగినంత నాటకీయ స్వేచ్ఛని తీసుకొని అందుకు ఓ కారణాన్ని చెప్పి ఉండొచ్చు. లేదా సిద్దమ్మకు కూడా చెప్పకుండా ఈ ఘట్టాన్ని వేరేలా చేసి ఉండొచ్చు. ఏదేమైనా బలమైన కాస్టింగుంటే దర్శకుడి పని ఎంత సులువవుతుందో సిద్దమ్మ నరసింహారెడ్డితో మాట్లాడే సన్నివేశం మరో మంచి ఉదాహరణ. తెరపై నయనతార లాంటి నటి ఉంటే ఆమె నటనకు ప్రేక్షకుడు కరిగిపోతాడే తప్ప దాని వెనుకనున్న కథనపు లోపాలను పట్టించుకోడు.
ఈ సన్నివేశం తరువాత వచ్చే లక్ష్మీతో ఉన్న సన్నివేశం కూడా కథనం పరంగా ఒప్పించేలా లేదు. నరసింహారెడ్డి తన వల్ల జరిగిన పొరపాటు గురించి కాకుండా లక్ష్మీ ఏదో పిరికి నిర్ణయం తీసుకొని పొరపాటు చేసినట్టు ఆమెకే నీతులు వల్లిస్తాడు. కనీసం జరిగిన పొరపాటుకి పరిష్కారం కూడా చెప్పడు. ‘నేను త్వరలో ఉద్యమం మొదలుపెడతాను, దాని ప్రచార బాధ్యతలు నీవే తీసుకోవాలి’ అని చెప్పకనే చెబుతాడు. దానికి లంకె తన కళని పదిమందికి ఉపయోగపడేలా ప్రయత్నించమని ముందు ఒక సన్నివేశంలో చెప్పడంతో వేశారు. అయితే ఇక్కడ రచయిత సాయిమధవ్ బుర్రా తన కలాన్ని బలంగా ఉపయోగించి ఈ బలహీనతలన్నింటినీ కప్పేశాడు.
తరువాత వచ్చే పొలం సన్నివేశం నుండి కథనం ఊపందుకొని చిరంజీవిలోని ఉత్తేజాన్ని పూర్తిగా వాడుకుంటూ సాగుతుంది. ఇక్కడ కూడా కాస్టింగే సగం పని చేసుకొనిపోయింది. సుబ్బయ్యగా సాయిచంద్ నటన ఖచ్చితంగా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సరిగ్గా అతడిని కాపాడాల్సిన సమయానికి నరసింహారెడ్డి పొలంలో అడుగుపెడతాడు. బలమైన నేపథ్య సంగీతం వినిపిస్తుండగా ‘ఎందుకు కట్టాలి నీకు శిస్తు?’ అని రౌద్రరసం ఒలికిస్తూ, ఎదురొచ్చిన తెల్లవారిని మట్టి కరిపిస్తూ, చివరకు దొరను కూడా తల దించుకొని వెళ్ళేలా చేసే సన్నివేశం రక్తాన్ని పొంగిస్తుంది. “సైరా నరసింహారెడ్డి!” అని ప్రేక్షకుడి చేత కూడా అనిపిస్తుంది. తరువాత దొర నరసింహారెడ్డిని బలహీనపరించేందుకు వేసే పథకం, అతడికి సవాలు విసిరే ఘట్టం ఇలా అన్నింటినీ బాగా నెలకొల్పాడు దర్శకుడు. దీన్ని అనుసరిస్తూ కోయిలకుంట్ల నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టం సినిమాకే అత్యుత్తమ పోరాట ఘట్టంగా చెప్పొచ్చు. ఇక్కడ చిరంజీవి చూపించిన వేగం, ఆవేశాలను ఎంత మెచ్చుకోవాలో వాటిని కెమెరాలో బంధించిన రత్నవేలు పనితనాన్ని కూడా అంతే మెచ్చుకోవాలి. ముగింపు మాల నేపథ్య సంగీతం అందించిన జూలియస్-ప్యాకియంకి వేయాలి.
ఈ క్రమంలో అంతర్లీనంగా సాగే మరో విషయం గురించి చెప్పాలి. నరసింహారెడ్డి మొదట నీటిలో శివుడి ముందు ధ్యానం చేస్తూ పరిచయం అవుతాడు. తరువాత అన్నిటినీ ఛేదించుకుంటూ వచ్చి చివరిలో నీటిలో దొరను చంపే ఘట్టంతో హిరణ్యకశిపుడి వధను తలపిస్తాడు (అది మాటల్లో కూడా చెప్పారు). వధించి నీటిలోంచి బయటకు వస్తుండగా నేపథ్యంలో రుద్రాష్టకం వినబడుతుంది. ఆ తరువాత విరామం షాటులో కొండపై మళ్ళీ ధ్యానం చేసుకుంటూ కనిపిస్తాడు నరసింహారెడ్డి. దీన్ని బట్టి దర్శకరచయితలు అతడి పాత్రను శివకేశవుల సమాహారంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. దాన్ని మరింత బలపరుస్తూ జుట్టు మొదలుకొని నరసింహారెడ్డి ఆహార్యం శివుడిని తలపిస్తే, అతడి నుదుటిపైన వైష్ణవ నామముంటుంది.
ఇక రెండో సగం మొదలయ్యాక కథనం కాస్త పరుగులు పెడుతుంది. పాలెగాళ్ళ సమావేశం ముగిశాక సుబ్బయ్య తదితరులు నరసింహారెడ్డికి సహాయం వస్తామనే ఘట్టంలో సాయిచందే మళ్ళీ హీరోగా నిలిచాడు. అక్కడినుండి 300 మంది ఆంగ్లేయులతో పోరాడే ఘట్టం వరకూ కథనపు స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఆ పోరాటం చివర్లో ఓ ప్రక్క సుబ్బయ్య మరణం మరోప్రక్క నరసింహారెడ్డి బిడ్డ జననం జరిగే సన్నివేశం కమలహాసన్ ‘హే రాం’ సినిమాలో షారుఖ్ ఖాన్ పాత్ర మరణించే సన్నివేశం నుండి ప్రేరణ పొందినట్టు అనిపిస్తుంది.
హీరో పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలను, పోరాట సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించిన దర్శకుడు డ్రామా సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ ఎందుకు తడబడ్డాడో అర్థంకాదు. అలాంటిదొకటి రెండో సగంలో సిద్దమ్మతో ఉండే సన్నివేశం. నరసింహారెడ్డితో ఉంటే సిద్దమ్మ ప్రాణాలకు ప్రమాదం రావచ్చు కనుక తనకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతను చూసుకోమని సూటిగా చెప్పకుండా “నేను ఎప్పుడైనా నిన్నేమైనా అడిగానా?” అని నరసింహారెడ్డి చేత మొదలుపెట్టించి “మీరు మాట తప్పకూడదు. అందుకే నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను” అని సిద్దమ్మ చేత చెప్పించేవరకూ అన్నీ డొంకతిరుగుడు సంభాషణలతో వ్యవహారం సాగించాడు. అందుకే ఆ సన్నివేశం ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఆ తరువాత రాజపాండి (విజయ్ సేతుపతి) పరిచయం, ఉద్యమం గురించి లక్ష్మీ పాడే ప్రచారగీతంగా ‘ఓ సైరా’ పాట, ఆ తరువాత సిద్దమ్మ – లక్ష్మీల సంవాదం అన్నీ బాగా నడిచాయి. ఈ క్రమంలో లక్ష్మీ ఆత్మాహుతి చేసుకునే ఘట్టం మరో అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోయింది ఈ సినిమాలో. ఇందుకు తమన్నా ఓ కారణమైతే, సన్నివేశాన్ని బలపరిచిన నేపథ్య సంగీతం మరియు ఛాయాగ్రహణం మరో కారణం.
ఇక ఆ తరువాతే మళ్ళీ దర్శకుడి తడబాటు మొదలవుతుంది. బలమైన కాస్టింగు సినిమాకు ఎంత మేలు చేయగలదో అంతే కీడుని కూడా చేయగలదు అన్నదానికి ఉదాహరణ కూడా ఈ సినిమా కథనమే చెబుతుంది. నరసింహారెడ్డిని చంపడానికి బసిరెడ్డి (రవికిషన్) వేసే పథకంలో మళ్ళీ ఔకురాజు (సుదీప్) పాలుపంచుకోవడం ఒకింత నమ్మశక్యంగా అనిపించదు. దానికి తోడు కేవలం ఓ రెండు సన్నివేశాల ముందే పరిచయమైన రాజపాండిని చాలా సులువుగా చంపేసినట్టు చూపించే షాటుని ఏ ప్రేక్షకుడైనా ఎలా నమ్ముగలడు? ఒకవేళ రాజపాండిని ఏదో కారణం చెప్పి వేరే పని మీద పంపినట్టు చూపించి, అతడు పడుకున్న చోట ఓబన్న (బ్రహ్మాజీ) ఉన్నా నమ్మశక్యంగా ఉండేదేమో. ఓ మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతోకొంత పరిచయమున్న విజయ్ సేతుపతి పాత్ర అంత సులువుగా ముగియడం నమ్మలేని విషయం. ‘పరుచూరి గోపాలకృష్ణ’ గారు తన పాఠాల్లో చెప్పినట్టు ‘పాత్ర కన్నా ప్రేక్షకుడికే ముందుగా చెప్పడం’ అనే అంశాన్ని ఇక్కడ వాడినట్టు కూడా అనిపించలేదు. కానీ ఈ ఘట్టాన్ని మొదట్లో దెబ్బకొట్టిన కాస్టింగు చివర్లో మేలే చేసింది. వీరారెడ్డిగా జగపతిబాబు నటనతో పాటు నేపథ్య సంగీతం కూడా దీనికి మంచి ముగింపుని ఇచ్చింది.
ఆఖరి పోరాట ఘట్టం ఈసారి చిరంజీవిలోని వేగాన్ని కాక నటుడిని పరిచయం చేసింది. పలు ముఖ్యపాత్రలను కూడా అక్కడే ముగించాడు దర్శకుడు. అందులోనూ సేతుపతి, బ్రహ్మాజీ, నిహారిక పాత్రలు చనిపోయే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం, చిరు హావభావాలు, ఆ తరువాత అతడి విజృంభణ గుండెను తాకుతాయి. ఇక సినిమా ముగుస్తున్నదేమోనని అనిపించే ఈ ఘట్టం తరువాత ప్రేక్షకుడిని కూర్చోబెట్టే ప్రయత్నం బాగా చేశారు దర్శకరచయితలు. ఎందుకంటే, ఆ తరువాతే ఉంది అసలు కథ. సహజంగా తెలుగు సినిమాల్లో కనిపించే సన్నివేశమే అయినా, ప్రేక్షకుడు ఇదివరకే ఊహించినదే అయినా తన కొడుకు బ్రతికేవున్నాడని వీరారెడ్డికి తెలియడం, ఆ తరువాత అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోవడం, ఆత్మహత్యం చేసుకోవడం, తెరపై పండింది. జగన్నాథ పర్వతం ఎక్కే దగ్గరనుండి చనిపోయేవరకూ అతితక్కువ మాటలతో జగపతిబాబు కనబరిచిన నటన అద్భుతం. ఇక్కడే అంతర్లీనంగా మరో అంశాన్నీ చూపించాడు దర్శకుడు. ఏది ఏమైనా భారతీయులు తాము నమ్ముకున్న నమ్మకాలను విడిచిపెట్టరని, నమ్మకానికి అంత గౌరవమిస్తారని ‘కొండపై దీపం వెలిగించడం’ అనే అంశంతో బలంగా నెలకొల్పాడు. ఇక ఆ దీపాన్ని వెలిగించాక మీసం తిప్పుతూ చిరంజీవి కళ్ళలో ఒలికించిన రాజసం అద్వితీయం.
రీళ్ళతో సినిమాలు తీసే సమయంలో ఓ సూత్రాన్ని పాటించేవారట దాసరి లాంటి దిగ్దర్శకులు. విరామం ముందు రెండు రీళ్ళు, ముగింపు ముందు రెండు రీళ్ళలో వచ్చే సన్నివేశాలతో కనుక ప్రేక్షకుడిని రంజింపజేయగలిగితే సినిమా విజయం తథ్యం. ఎందుకంటే, ఆ రీళ్ళ తరువాతనే విశ్రాంతి దొరుకుతుంది కనుక ప్రేక్షకుడిపై సదరు సన్నివేశాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో ఆ సూత్రాన్ని వందశాతం అమలు చేశారు దర్శకరచయితలు. విరామం ముందొచ్చే ఘట్టాలను మించి చివరి ఘట్టాలను తెరపై ప్రెజెంట్ చేశారు. అటు రచన పరంగా, ఇటు సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దారు. వాటన్నిటినీ మించి చిరంజీవి కనబరిచిన నటన ఘట్టాన్నే కాక సినిమానే మరోస్థాయికి తీసుకొనివెళ్ళింది. కేవలం తన కళ్ళతోనే సన్నివేశాలను రక్తికట్టించేశాడు చిరు. అప్పటివరకు సినిమాలో ‘రేనాటి సూర్యుడు’ అన్నదానికి నేపథ్యంలో విజువల్ రిఫరెన్సుగా వాడుకుంటూ వచ్చిన సూర్యుడిని చివరగా తల తెగిన తరువాత దాని స్థానంలో చూపించడం, ఆ తరువాత ఉరికొయ్యకు వేలాడదీసిన తలను కూడా సూర్యకాంతితోనే మమేకం చేసి చూపించడం సినిమాకు అద్భుతమైన ముగింపునిచ్చింది. అలాగే, చిరంజీవిలోని నటనను మరోసారి పరిచయం చేసి బలమైన ముద్రవేసింది. ఈ ఘట్టం గోవర్ధన పర్వతమైతే దాన్ని తన నటనతో పైకెత్తి దానిక్రింద అప్పటివరకూ జరిగిన కథనంలో ఉన్న లోపాలన్నింటినీ దాచేసి సినిమాను కాపాడిన శ్రీకృష్ణుడిలా చిరంజీవి కనిపించాడు.
చివరగా, “శ్వాసలోన దేశమే” అనే అద్భుతమైన గీతంతో ముగించి మరిన్ని మార్కులు కొట్టేశాడు దర్శకుడు సురేందర్రెడ్డి.
సాంకేతిక విషయాలు:
మొదటగా చెప్పుకోవాల్సింది ‘రత్నవేలు’ ఛాయాగ్రహణం గురించి. సినిమా అంతా 19వ శతాబ్దం నాటి వాతావరణంలో జరుగుతుంది కనుక దానికి తగ్గట్టుగానే కలరింగ్ మరియు లైటింగ్ చేశాడు. సినిమాను ఎంతో ఉన్నతంగా చూపించాడు.
తరువాత చెప్పుకోవాల్సింది ‘అమిత్ త్రివేది’ సంగీతం గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇండస్ట్రీకి మరో ఏ. ఆర్. రెహమాన్ దొరికేశాడు’.
ఆ తరువాత చెప్పుకోవాల్సింది ‘జూలియస్ – ప్యాకియం’ నేపథ్య సంగీతం గురించి. ఎన్నో ఘట్టాలను మరో స్థాయికి తీసుకొనివెళ్ళింది నేపథ్య సంగీతం. ముఖ్యంగా, నరసింహారెడ్డి పాత్రకు నేపథ్యంలో వాడిన రుద్రాష్టకం అద్భుతంగా ఉంది.
చాలా సన్నివేశాలను సాయిమధవ్ బుర్రా మాటలే నడిపాయి. ముఖ్యంగా, ఆఖరులో ఉరికంబం మీద నరసింహారెడ్డి చెప్పే మాటలు అత్యుత్తమమైనవి.
ఈ సినిమాలో సాహిత్యానికి కూడా పెద్దపీట వేశారు. ‘సిరివెన్నల సీతారామశాస్త్రి’ రచించిన ‘జాగో నరసింహా జాగోరే’ మరియు ‘ఓ సైరా’ పాటలు కథతో బలంగా ముడిపడిపోయాయి. చివర్లో ‘చంద్రబోస్’ వ్రాసిన ‘శ్వాసలోన దేశమే’ పాట సినిమాకు మంచి ముగింపునిచ్చింది.
చివరగా చెప్పుకోవల్సిన, వీటన్నటి వెనుకా ఉన్న అతి ముఖ్యమైన విషయం నిర్మాణం. తన తండ్రి కలను నెరవేర్చడానికి ఓ నిర్మాతగా రాంచరణ్ ఎక్కడా రాజీపడలేదు. అతడు పెట్టిన ఖర్చుకి సంపూర్ణ న్యాయం తెరపై జరిగింది.
బలహీనత:
కథనం గురించి విశ్లేషణలో చెప్పే ప్రయత్నం చేశాను కనుక ఇక్కడ మరో బలహీనతను ప్రస్తావించాలి. అదే డబ్బింగ్. ఈ సినిమాలో గోసాయి వెంకన్న పాత్రకు అమితాబ్ సరిగ్గా సరిపోయారు. అయితే ఆయన డబ్బింగ్ విషయంలోనే కాస్త అజాగ్రత్తగా ఉన్నట్టు కనిపించింది చిత్రబృందం. ఎలాగూ ఓ డబ్బింగ్ ఆర్టిస్టు చేత చెప్పించాలి కనుక అతడితో మాములుగానే మాట్లాడించి ఉంటే సరిపోయేది. అమితాబ్ సహజమైన టైమింగులోనే డబ్బింగ్ చెప్పించడం గోసాయి వెంకన్న పాత్రకు నప్పినట్టు అనిపించలేదు. అది తెరపైన అమితాబ్ నే ఆవిష్కరించింది. ఇదే పొరపాటు మరి విధంగా సుదీప్ విషయంలో జరిగింది. అతడు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు కనుక మరిన్ని డబ్బింగ్ రిహార్సల్స్ చేపించి ఉండాల్సింది. కర్నూలు జిల్లా ఔకు మండలం పాలెగాడు కన్నడ యాసలో మాట్లాడడం అంత సులువుగా మింగుడు పడే విషయం కాదు.
చివరి మాట:
తెలుగు సినిమా చరిత్రలో గుర్తుంచుకోదగ్గ సినిమాగా, చిరంజీవి కెరీరులో మరో మైలురాయిగా ‘సైరా నరసింహారెడ్డి’ మిగిలిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
– యశ్వంత్ ఆలూరు