30 నవంబర్, 2019న హైదరాబాదులో జరిగిన Voice of Legends సంగీత విభావరిలో పాల్గొంటున్న గాయకుల గురించి నేను వ్రాసిన పరిచయం. సమయాభావం వల్ల ఇది ఆరోజు వినబడలేదు. అందుకే ఇక్కడ పంచుకుంటున్నాను.
శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ప్రతీ చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. అవి లేకపోతే చరిత్ర గొప్పగా లేకపోవడమే కాకుండా కొన్నిసార్లు ఊహకు కూడా అందదు. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి ఒక ముఖ్యమైన ఘట్టం, 1967లో సంగీత దర్శకులు శ్రీ కోదండపాణి గారు శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న అనే సినీ కోదండం నుండి వదిలిన సంగీత శరం శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు తీసిన ప్రైవేటు మాస్టారులో శ్రీ కె. వి. మహదేవన్ గారి సంగీత సారథ్యంలో మొదటి సోలో పాటను పాడిన బాలు గారు ఆ తరువాత శ్రీ శోభన్ బాబు, శ్రీ కృష్ణ, శ్రీ చలం వంటి యువ నటులకు పాడిన పాటలు జనాదరణను చూరగొన్నాయి. అదే క్రమంలో తాను గురువుగా ఆదరించే శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారితో కలిసి ఏకవీరలో ప్రతీ రాత్రి వసంత రాత్రి అనే పాటను పాడారు బాలు గారు. ఆ తరువాత ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో ఆలీబాబా 40 దొంగలు సినిమాలో ఓ పాటను పాడారు.
ఘంటసాల గారి తరువాత శ్రీ నందమూరి తారకరామారావు, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గార్లకు పాడడం మొదలుపెట్టిన బాలు గారు వెనుదిరిగి చూసుకోలేదు. ఆ ఇద్దరు అగ్రనటుల నుండి యువ నటుల వరకూ, శ్రీ రాజబాబు, శ్రీ అల్లు రామలింగయ్య లాంటి హాస్యనటులు కూడా ఈయన పాటలకు అభినయించిన వారే. ఓ పాట పాడేటప్పుడు సందర్భం, సాహిత్యాలను పూర్తిగా ఆకళింపు చేసుకోవడంతో పాటు దాన్ని అభినయించబోయే నటుడి హావభావాలు, శైలికి తగ్గట్టుగా కూడా పాడడం బాలు గారి ప్రత్యేకత. నటులు పలికించే నవరసాలన్నీ తన గొంతులోనే ఒలికించేస్తారీయన.
శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేని బాలు గారు శంకరాభరణం లాంటి శాస్త్రీయ సంగీతాధారిత సినిమాలో పాటలు పాడి జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందారు. “బాలు లేకపోతే నా శంకరాభరణం లేదు” అని ఆ సినిమా దర్శకుడు విశ్వనాథ్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మెగాస్టార్ శ్రీ చిరంజీవి తరం నటులకు పాడిన పాటలు జనాలని ఉర్రూతలూగించిన సంగతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క తెలుగులోనే కాక పదిహేను ఇతర భారతీయ భాషల్లోనూ పాడి ఆయా ప్రజల ఆదరాభిమానాలను కూడా చూరగొన్నారు బాలు గారు. శ్రీ కె. వి. మహదేవన్, శ్రీ ఇళయరాజా గార్లకి పాడిన పాటలు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు సుస్థిర స్థానాన్ని ఏర్పరిచాయి. శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి, శ్రీ సిరివెన్నెల సీతారామాశాస్త్రి గార్లు రచించిన పాటల్లో అధిక శాతం బాలు గారి గళంలోనే శ్రోతలకు చేరాయి. శ్రీమతి పి. సుశీల, శ్రీమతి ఎస్. జానకి, శ్రీమతి చిత్ర గార్లతో కలిసి పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే. మొత్తం పదహారు భాషల్లో నలభైవేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించారు. వాటిలో ఏ పాట గొప్పదని అడిగితే చెప్పడం ఎవరికి సాధ్యం? ఒకవేళ ప్రయత్నించినా ఒక సాయంత్రం సరిపోదు.
1977లో దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు తీసిన కన్యాకుమారి సినిమాతో సంగీత దర్శకుడిగా మారి, ఆ తరువాత శ్రీ బాపు గారు తీసిన తూర్పు వెళ్ళే రైలుతో మంచి గుర్తింపు పొంది, సుమారు 60 సినిమాల ద్వారా సంగీత దర్శకుడిగానూ తన ప్రతిభను చాటారు బాలు గారు.
గానం, సంగీత దర్శకత్వమే కాకుండా నటుడిగా, నిర్మాతగా మరియు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేశారు బాలు గారు. 1997లో వచ్చిన పవిత్ర బంధం సినిమాకి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని పొందారు. ఉత్తమ గాయకుడిగా ఆరు జాతీయ పురస్కారాలు, ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు, పందొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా మయూరి సినిమాకు, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా అన్నమయ్య, శ్రీ సాయి మహిమ సినిమాలకు నందులు అందుకున్నారు. మిథునం సినిమాలో నటనకు నంది జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక గాయకుడిగా అందుకున్న సన్మాన సత్కారాలకు లెక్కేలేదు. నిర్మాతగా శుభ సంకల్పం, భామనే సత్యభామనే, తెనాలి లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. విలక్షణ నటుడు శ్రీ కమలహాసన్ గారికి చేసిన గాత్రదానం తెలుగు ప్రేక్షకులకు కమల్ ని మరింత దగ్గర చేసింది. బాలు గారి ప్రతిభను పద్మశ్రీ, పద్మభూషణ్ లతో గౌరవించింది భారత ప్రభుత్వం.
తననింత వాడిని చేసిన సినిమాకు తన వంతుగా, పాడుతా తీయగా అనే అద్భుతమైన కార్యక్రమం ద్వారా రెండు దశాబ్దాలుగా ఎంతోమంది ప్రతిభావంతులైన గాయనీగాయకులను పరిచయం చేస్తున్నారు బాలు గారు. ఇదే కాక తన తండ్రి శ్రీ ఎస్. పి. సాంబమూర్తి గారి పేరిట మొదలుపెట్టిన ఎస్.పి.ఎస్. చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా అనేక సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఎన్నో కచేరీలు నిర్వహించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఆసరా కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి తోడ్పాటుని అందిస్తున్నారు. మనకు సాయపడే సమాజానికి మనం కూడా సాయపడాలన్న ఆయన అడుగుజాడల్లోనే అభిమానులు SPB Fans Charitable Foundationని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
1967 నుండి ఇప్పటిదాకా తెలుగు సినిమాలో తరాలు మారాయి, నటులు మారారు, దర్శకులు మారారు, సంగీత దర్శకులు మారారు, సాంకేతికత మారింది. ఈ క్రమంలో మారనిది బాలు గారి గానమే అనడంలో అతిశయోక్తి లేదు. ఇన్నేళ్ళ ప్రస్థానంలో సినీ పరిశ్రమలో ‘అజాతశత్రువు’గా మెలగడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. తన కృషి, పట్టుదల, నిబద్ధతతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ స్వర్ణాక్షరాలతో ఓ పుటను పొందారు బాలు గారు. ఓ మహావృక్షంగా ఎదిగినప్పటికీ “నేనింకా బాలుడినే, మీ బాలునే” అనే ఆయనకున్న ఒదిగే లక్షణం ఎంతో స్ఫూర్తిదాయకమైనది.
అలా, బాలసుబ్రహ్మణ్యంగా సినీ పరిశ్రమకు పరిచయమై, తన ప్రతిభతో సుబ్రహ్మణ్యస్వామిలా సంగీత ప్రపంచాన్ని చుట్టేసి, పామరులనే కాక పండితులను కూడా మెప్పించిన పండితారాధ్యులై, అశేషమైన ప్రజల ఆదరాభిమానాలను ధనముగా పొందిన శ్రీపతి… సార్థక నామధేయులు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు… ఎప్పటికీ ప్రేమగా, మన బాలు! ఈ సాయంత్రం మనల్ని ఆనందింపజేయడానికి గళం విప్పడం మన అదృష్టం.
శ్రీమతి కె. ఎస్. చిత్ర
“తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం…” అని అన్నారు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ మాటకు ఓ గొప్ప ఉదాహరణగా, తెలుగు సినిమా సంగీతాన్ని చిగురింపజేయడానికి కేరళ నుండి తరలి వచ్చిన గాన వసంతం శ్రీమతి కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర గారు. ఆప్యాయంగా, మన చిత్ర!
పదహారేళ్ళ వయసుకే పాడడం ప్రారంభించిన చిత్ర గారు కర్ణాటక సంగీతంలో University of Kerala నుండి బీ.ఏ. పట్టా పొందారు. ఆ తరువాత సంగీతంలో మాస్టర్స్ కూడా చేశారు. శ్రీ ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సింధుభైరవి సినిమాతో అటు తమిళ సినిమాకు, ఇటు తెలుగు సినిమాకు ఒకేసారి పరిచయమయ్యారు. “పాడలేను పల్లవైనా భాష రాని దానను” అని స్పష్టంగా భాష నేర్చుకొని మరీ పాడిన ఈ గాయనీమణిని అక్కున చేర్చుకోవడానికి తెలుగు సినిమాకు ఆట్టే సమయం పట్టలేదు. తెలుగు శ్రోతలు ఇప్పుడు చిత్ర గారిని ఎంతగా సొంతం చేసుకున్నారంటే, “నేను మలయాళీ” అని ఆవిడే స్వయంగా చెప్పినా కూడా నమ్మలేనంత!
సింధుభైరవితో మొదలైన ప్రయాణం జానకిరాముడు, ఆఖరి పోరాటం, రుద్రవీణ, గీతాంజలి, శివ లాంటి సినిమాలతో ఊపందుకుంది. మాతృదేవోభవలోని వేణువై వచ్చాను భువనానికి… గాలినై పోతాను గగనానికి అన్న పాటతో తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు చిత్ర గారు. శ్రీ కె. వి. మహదేవన్, శ్రీ కె. చక్రవర్తి, శ్రీ ఇళయరాజా, శ్రీ ఎం. ఎం. కీరవాణి, శ్రీ మణిశర్మ, శ్రీ ఏ. ఆర్. రెహమాన్ గార్ల లాంటి ఉద్దండుల సంగీత సారథ్యాలలో అనేక పాటలు పాడారు. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి అని జోల పాడాలన్నా, నిన్ను కోరి వర్ణం అని శృంగారం ఒలికించాలన్నా, భరత వేదమున నిరత నాట్యమున అని ఆర్ద్రతతో భగవంతుడిని ప్రార్థించాలన్నా, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అని ప్రేమను చూపించాలన్నా, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని విషాదం పలికించాలన్నా ఆమెకే చెల్లు. అంజలి అంజలి ఇది హృదయాంజలి అని కొండెక్కి కూర్చున్న శ్రుతులు కూడా ఆవిడ గాత్రానికి యిట్టే అందుతాయి. అలా గత ముప్పైనాలుగేళ్ళగా తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో 25000 పైచిలుకు పాటలు పాడారు. శ్రీ కె. జె. ఏసుదాసు, శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గార్లతో కలిసి పాడిన అనేక పాటలు అశేషమైన జనాదరణను పొందాయి.
చిత్ర గారి ప్రతిభకు కొలమానాలుగా ఎన్నో పురస్కారాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. బ్రిటీష్ పార్లెమెంటులో సత్కరించబడిన తొలి భారతీయ మహిళ వీరు. న్యూయార్కులోని మెట్రోపాలిటన్ ఓపెరా హౌస్ లో పురస్కారాన్ని అందుకున్న ఏకైక దక్షిణ భారతదేశ గాయని వీరు. చైనాలో జరిగిన ఖింగై ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో ఆ ప్రభుత్వం చేత సత్కరించబడిన ఏకైక భారతీయ గాయని కూడా వీరే. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీతో పాటు నాలుగు దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రభుత్వాల నుండి కూడా పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ గాయనిగా ఆరుసార్లు జాతీయ పురస్కారాలు, ఎనిమిది ఫిలింఫేర్లు, పదకొండు నందులు అందుకున్నారు. 2018లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్న తొలి వరుస మహిళల్లో ఒకరిగా నిలిచి, Ministry of Women and Child Development చేత సత్కరించబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో పురస్కారాలు.
కేరళకు చెందిన Asianet Cable Vision (ACV) అనే టీవీ ఛానల్ తో కలిసి ఏర్పాటు చేసిన స్నేహ నందన సంస్థ ద్వారా ఎంతోమంది పేద కళాకారులకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు చిత్ర గారు.
ప్రపంచ ఖ్యాతి గడించిన “చిన్న కుయిల్” అని పిలవబడే ఈ గాన కోకిల తన మధుర గానంతో ఈ సాయంత్రం మన భాగ్యనగరాన్ని ఆహ్లాదకరంగా మార్చడం నిజంగా మన భాగ్యం.
శ్రీ కె. జె ఏసుదాసు
ఆ భగవంతుడు ప్రత్యేకంగా తన కోసమే కొందరు మనుషులను సృష్టించుకుంటాడు అన్నదానికి నిలువెత్తు సాక్ష్యం ఈయన. హరివరాసనం స్వామి విశ్వమోహనం అనే ఆయన గానంతోనే ఆ శబరిమల అయ్యప్ప స్వామి నిదురలోకి జారుకుంటాడు. స్వాగతం కృష్ణ అని ఆయన పిలిస్తే చాలు గుమ్మం ముందు ఆ శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. ఆయనే శ్రీ కట్టాస్సెరి జోసెఫ్ ఏసుదాసు గారు. మనం గౌరవంగా పిలుచుకునే మన ఏసుదాసు గారు!
గత అయిదు దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, ఒరియా లాంటి స్వదేశీ భాషల్లోనే కాకుండా అరబిక్, ఇంగ్లీష్, రష్యన్ మరియు లాటిన్ లాంటి విదేశీ భాషల్లోనూ కలిపి మొత్తం ఎనభై వేల పాటలు పాడారు. సంగీతంలో ఆయనకు తెలియని అంశం లేదు. దేశ, విదేశాల్లో ఆయన అందుకోని ఘనత లేదు. ఉత్తమ గాయకుడిగా ఎనిమిది జాతీయ పురస్కారాలు, ఇరవై అయిదు కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, అయిదు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారంతో పాటు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ లను కూడా అందుకున్నారు ఈ సరస్వతీ పుత్రులు. కేరళ రాష్ట్ర ఆస్థాన గాయకుడిగా అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక గాయకులు కూడా వీరే. చెప్పుకుంటూ పోతే ఆయన పొందిన సత్కారాలకు, సన్మానాలకు లెక్కలేదు. 2006లో చెన్నైలోని ఏవియం స్టూడియోస్ లో ఒకేరోజు నాలుగు దక్షిణ భారతదేశ భాషల్లో పదహారు పాటలను రికార్డు చేశారు. వీరు ఏర్పాటు చేసిన తరంగిణి స్టూడియోస్ మరియు తరంగిణి రికార్డ్స్ తోనే మళయాళం సినిమా పాటలు స్టీరియోలో వినబడడం మొదలైంది. ఇలా వీరు సాధించిన ఘనతను గురించి వివరించుకుంటూ పోతే ఎంత సమయమైనా సరిపోదు.
బంగారు తిమ్మరాజు సినిమాలోని నిండు చందమామ నిగనిగల భామ అనే పాటతో తెలుగువారికి పరిచయమైన శ్రీ ఏసుదాసు గారు, అంతులేని కథ, మేఘసందేశం వంటి సినిమాలకు పాడిన పాటలతో తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రులయ్యారు. శ్రీ కె. వి. మహదేవన్, శ్రీ ఇళయరాజా గార్ల సంగీత దర్శకత్వాలలో పాడిన పాటల ద్వారా, డైలాగ్ కింగ్ శ్రీ మోహన్ బాబు గారి సినిమాలకు ఆస్థాన గాయకుడిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తెలవారదేమో స్వామి, నీతోనే ఆగేనా సంగీతం, లలిత ప్రియ కమలం విరిసినది, ఇదేలే తరతరాల చరితం, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఇలా పాటలను తన గానంతో మరో స్థాయికి తీసుకొని వెళ్ళిన సందర్భాలు ఎన్నో.
ఈ పుంభావ సరస్వతి ఈ సాయంత్రం మనల్ని తన స్వర రాగ గంగా ప్రవాహములో ఓలలాడించడానికి రావడం మనం చేసుకున్న పుణ్యం.
– యశ్వంత్ ఆలూరు
29/11/2019