శంకరాభరణం
నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో!
ఏ సినిమా గురించైనా తలచుకున్నా లేదా మాట్లాడుకున్నా సహజంగా అది హీరోతోనే మొదలవుతుంది. నాకు ఈ సినిమా గురించి తలచుకున్నప్పుడల్లా మొదట అల్లు రామలింగయ్య గుర్తుకు వస్తారు. ఆ తరువాతే సోమయాజులు గుర్తుకు వస్తారు. అందుకే, నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో!
ఈ సినిమాకు ఆరోహణ, అవరోహణ శంకర శాస్త్రి అయితే తాళం మాధవాచార్యులు. తాళం లేకుండా ఒట్టి స్వరాలే ఆలపిస్తే, ఏ రాగమైనా రంజింపజేయదు. ఈ శంకరాభరణమూ అంతే. శంకర శాస్త్రి పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, కృష్ణంరాజు లాంటి వారిని అనుకున్నారు అంటే అది ఒక కన్వెన్షనల్ పాత్రని అర్థమవుతుంది. మాధవాచార్యులు పాత్రకు మాత్రం అల్లు రామలింగయ్యే కావాలని నిర్మాత పట్టుబట్టారంటే అది ఆయనే చేయగల ఓ టైలర్ మేడ్ పాత్రని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పాత్రని ఆయన చేయకపోయి ఉంటే సినిమా కచ్చితంగా నూటాయెనభై డిగ్రీలు తిరిగి ఉండేదని నా ప్రగాఢ నమ్మకం. అందుకే, నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో!
“ఇంకా నీకెందుకురా ఈ కంచి గరుడ సేవ?” అంటూ గండపెండేరం తొడిగించుకున్న శంకర శాస్త్రినే ఓ వ్యక్తి నిలదీస్తున్నప్పుడు, ఆ మాట విని కూడా శంకర శాస్త్రి మౌనంగా నిలబడ్డాడు అంటే, చివరకు ఉట్టి చేతి మీద కర్పూర హారతిని వెలిగించి చేయి కాల్చుకొని తనలోని నిస్సహాయతను ప్రకటించాడంటే, అవతలి వ్యక్తి కచ్చితంగా శంకర శాస్త్రి కన్నా పెద్ద స్టేచరున్న వ్యక్తి అయ్యుండాలి. అతడే మాధవాచార్యులు. అందుకే, నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో!
ఇప్పటికి ఈ సినిమా ఎన్నోసార్లు చూశాను. చూసిన ప్రతీసారి ‘శంకరుడిలా కనిపించే సోమయాజులు పక్కన ఆభరణం లాంటి అల్లు రామలింగయ్య లేకపోయుంటే ఈ శంకరాభరణం ఎలా ఉండేది?’ అన్న ఊహే చాలా బోసిగా అనిపిస్తుంది. అందుకే, ఎప్పటికీ నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో!
శంకరాభరణంలో అల్లు రామలింగయ్య అద్భుతంగా తన హీరోయిజాన్ని పండించిన సన్నివేశం…
– యశ్వంత్ ఆలూరు