కరోనా కారణంగా అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో మొదటి విడతగా నేను చూసిన సినిమాలు, వాటి గురించి క్లుప్తంగా నా కామెంట్లు. ఇందులో ఎటువంటి క్రమం లేదు.
Badla (Hindi) – Netflix
ఇది చూడక చాలా రోజుల ముందే దీని మాతృక స్పానిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘ఎవరు’ చూశాను. ఇది చూసినప్పుడు మూలకథ తెలిసినప్పటికీ కథనం వేరుగా అనిపించింది. అస్సలు బోరు కొట్టలేదు. అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను. అయితే, నేను స్పానిష్ సినిమా చూడలేదు కాబట్టి ఈ సినిమా కంటే తెలుగు సినిమాకే ఎక్కువ మార్కులు వేస్తాను. అందుకు ప్రధాన కారణం క్లైమాక్స్. హిందీ సినిమా క్లైమాక్స్ థ్రిల్లింగ్ గా అనిపించింది కానీ కొద్దిగా నమ్మశక్యంగా అనిపించలేదు. ఏదేమైనా కచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది. కథ, కథనాలతో పాటు అమితాబ్, తాప్సీల నటనలు ఆకట్టుకున్నాయి.
Panipat – The Great Betrayal (Hindi) – Netflix
దర్శకుడు ‘అశుతోష్ గోవారికర్’ నుండి వచ్చిన చూడదగ్గ సినిమా. యుద్ధ సన్నివేశాలు, పాటలు, కళాదర్శకత్వం, కలరింగు ఇలా అన్నీ గోవారికర్ శైలిలోనే ఉన్నాయి. సినిమా కూడా ఎక్కడా బోరు కొట్టలేదు. అయితే, ఇందులో ప్రధానంగా నాకు రెండు ప్రతికూల అంశాలు అనిపించాయి. మొదటిది, ‘The Great Betrayal’ అని పేరులో ఉన్నంత గొప్పగా ఆ వంచన సినిమాలో అనిపించలేదు. బాగా సాగదీసి చివర్లో మీఠాపానులా చుట్టేసినట్టు అనిపించింది. నిజానికి, ఆ వంచన మూడో పానిపట్ యుద్ధంలో మరాఠా సామ్రాజ్యానికి పెద్ద నష్టాన్ని కలిగించింది. కనుక, అదేంటో తెలిసినప్పుడు కళ్ళు చెమర్చాలి. ఒకవేళ చెమర్చకపోయినా ‘అయ్యో’ అనైనా అనిపించాలి. ఈ రెండు భావనలనూ దర్శకుడు కలిగించలేకపోయాడు. రెండోది మరియు ముఖ్యమైన ప్రతికూల అంశం సినిమా హీరో ‘అర్జున్ కపూర్’. సినిమా చూస్తున్నంత సేపు గోవారికర్ ‘హృతిక్ రోషన్’తో ‘మొహెంజోదారో’ కాకుండా నేరుగా ఇదే తీసుంటే బాగుండేదని తెరపైన అర్జున్ కపూర్ కనిపించిన ప్రతిసారీ అనిపించింది. అంత ఆహార్యంతో అతడు శిల్పంలా నిలబడి ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. కానీ ఏదైనా చేద్దామని అతడు ప్రయత్నించినప్పుడు మరింత ఇబ్బందిగా అనిపించింది. తన రాజ్యం కోసం పోరాడుతున్నప్పుడు రౌద్రం, తన సేన శత్రువుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతుంటే ఆందోళన, తాము మోసపోయామని తెలిసినప్పుడు విచారం ఇలా ఏ భావమూ అతడి ముఖంలో కనిపించలేదు. ఈ సినిమాను థియేటరులో చూసినవారి పరిస్థితి ఊహించుకుంటే ఆ ఆందోళన, విచారము నాకు కలిగాయి.
Thambi (Tamil) – Netflix
ఈ సినిమా ఆరంభం నుండి చాలా ఎంగేజింగ్ కథనంతో సాగింది. మధ్యలో వచ్చే కొన్ని ఊహాతీతమైన మలుపులు బాగా ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అలా ఓ స్థాయికి తీసుకెళ్ళి అక్కడ నుండి అమాంతం తోసి కింద పడేసినట్టు అనిపించింది చివర్లో. ఇంతోటి దానికా ఇంతసేపు ఉత్కంఠగా ఎదురు చూసింది అనిపించింది. కానీ క్లైమాక్స్ వరకు కథనాన్ని తీసుకెళ్ళిన క్రమం, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసిన విధానానికి దర్శకుడు ‘జీతూ జోసెఫ్’కి అభినందనలు చెప్పుకోవాలి. చివర్లో హీరో ‘కార్తీ’కి కండోలెన్సులు చెప్పుకోవాలి.
Kannum Kannum Kollaiyadithaal (Tamil) – Netflix
చాలా రోజులకి లైటర్ వీన్ లో సాగే ఓ ఉల్లాసభరితమైన థ్రిల్లర్ సినిమా చూసిన భావన కలిగించింది ఈ సినిమా. సరదాగా మరియు ఉత్కంఠభరితంగా రెండున్నర గంటల పైన కథనం నడపడంలో దర్శకుడు ‘Desingh Periyasami’ ఉత్తీర్ణుడయ్యాడు. దర్శకుడు ‘గౌతమ్ మీనన్’ ఈ సినిమాలో చేసిన పాత్రని పూర్తిగా ఎంజాయ్ చేయగలిగాను. ఈ లాక్ డౌన్ సమయంలో నేను చూసిన ఉత్తమ సినిమాలలో ఇదొకటి.
Guilty (Hindi) – Netflix
MeToo నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చాలా hard-hitting కథ, కథనాలను కలిగి ఉంది. Netflix కోసమే తీయబడిన సినిమా కాబట్టి ఎటువంటి సెన్సార్ అడ్డంకులు లేకుండా చాలా rawగా, నిజాయితీగా తీయగలిగారు. ఆరంభం గజిబిజి కథనంతో ఆరంభం అయినప్పటికీ క్రమంగా ఆసక్తిని పెంచుకుంటూ పోయి, చివరకు గుండెను కొట్టి లేపి ఆలోచింపజేసే సినిమాగా ముగిసింది. ఆడవాళ్ళను ఎటువంటి సమయంలోనైనా taken for grantedగా తీసుకోరాదని చెంపదెబ్బ కొట్టి మరీ చెప్పిన సినిమా ఇది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ‘కియరా అద్వానీ’ ఎంత మంచి నటియో ఈ సినిమాతో అర్థమైంది. చాలా ఇష్టపడి చేసినట్టు అనిపించింది.
World Famous Lover (Telugu) – Netflix/SunNxt
దర్శకుడు ‘క్రాంతి మాధవ్’ ఒక మంచి అంశాన్ని స్పృశించాడు ఈ సినిమాలో. చాలా వ్రాయాలనుకొని ఏమీ వ్రాయలేని స్థితిని ప్రతి రచయిత తన జీవితంలో కచ్చితంగా ఎదురుకొని ఉంటాడు. ఇంత మంచి పాయింట్ ని కూలంకషంగా చర్చించడం మానేసి కథ, కథనాలను ఎటెటో తీసుకొని వెళ్ళిపోయాడు. అది మొదటి పొరపాటు.
ప్రతీ నటుడికి ఓ ల్యాండ్మార్క్ లాంటి సినిమా చేశాక దాని ప్రభావం ప్రేక్షకుల మీద చాలాకాలం పాటు ఉండిపోతుంది. దాని నుండి ప్రేక్షకుడిని బయటపడేసి ఓ కొత్త మార్క్ వేసే ప్రయత్నం చేయాలి. ఈ సినిమాకు ‘విజయ్ దేవరకొండ’ని అనుకున్నప్పుడు దర్శకుడు ఈ విధంగా ఆలోచించి ఉండాల్సింది. విజయ్ ‘శీనయ్య’ పాత్రని ఎంత బాగా పోషించినా అది కథలో ఓ భాగమే తప్ప అది ప్రధాన పాత్ర కాదు. ‘గౌతమ్’కి ‘అర్జున్ రెడ్డి’కి మధ్య లక్షణాల్లోనూ, నటనలోనూ ఎటువంటి తేడాలూ లేవు. ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ కాకపోవడానికి ఇది కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. ‘ఇదే నా చివరి ప్రేమకథ’ అని ప్రకటించిన విజయ్ దేవరకొండకు అభినందనలు తెలుపుకుంటున్నాను.
Driving License (Malayalam) – Prime Video
షారుఖ్ ఖాన్ తన చేతులతో పాటు ప్రేక్షకుల మెదడులను కూడా కాల్చిన ‘ఫ్యాన్’ సినిమానే కనుక బాగా తీస్తే అదే ‘డ్రైవింగ్ లైసెన్స్’ అవుతుంది. ఓ స్టార్ హీరోకి, అతడి వీరాభిమానికి మధ్య వైరం వచ్చే కారణాన్ని, తద్వారా వారిద్దరి మధ్య ఇగో పోరాటాన్ని చాలా నమ్మశక్యంగా చూపించాడు దర్శకుడు. వారిద్దరిలో ఎవరు మంచి వ్యక్తి, ఎవరు చెడ్డ వ్యక్తి, ఎవరి తరఫున తాను నిలబడాలో తెలియక ప్రేక్షకుడిలో ఒకింత తీపి అయోమయం కలుగుతుంది. సరిగ్గా అదే సమయానికి చక్కని ముగింపుతో సినిమా ముగుస్తుంది. ఈ లాక్ డౌన్ సమయంలో నేను చూసిన ఉత్తమ సినిమాలలో ఇదొకటి.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రాంచరణ్ రైట్స్ కొన్నాడని సమాచారం. అయితే, ఇక్కడి ప్రేక్షకులను ఆకర్షించాలంటే మంచి కాస్టింగ్ చేయాల్సిన అవసరముంది. హీరో పాత్రని రాంచరణ్ అవలీలగా చేయగలడు. అభిమాని పాత్రకు ఎంపిక చేసే నటుడి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. అలాగే, కొన్ని సన్నివేశాలు, పాత్రలలో కూడా మార్పులు అవసరం. సరైన శ్రద్ధ పెడితే తెలుగులో కూడా ఈ సినిమా మంచి పేరు సంపాదించే అవకాశముంది.
War (Hindi) – Prime Video
విపరీతమైన బడ్జెట్టుతో, విదేశాలలో అబ్బురపరిచే యాక్షన్ సీన్లు ఉండేలా ఓ సినిమా తీయాలని ముందే అనుకొని తీసిన సినిమా ‘వార్’. కాకపోతే, డబ్బుతో పాటు కాస్తైనా కథ లేకపోతే ప్రేక్షకులు ఫీల్ అవుతారేమో అన్నట్టుగా కొన్ని ట్విస్టులు పెట్టి తీశారు. అయితే, కథలోని ముఖ్యమైన ట్విస్ట్ మాత్రం ప్రేక్షకుడికి ఎక్కడా పసిగట్టే ఆస్కారం లేకుండా తీసినందుకు దర్శకుడు ‘సిద్ధార్థ్ ఆనంద్’ని మెచ్చుకోవాల్సి వచ్చింది. చివర్లో ఎంతకూ ముగియని ఫైట్ ఎపిసోడ్ చూసి అంతే నొచ్చుకోవాల్సి వచ్చింది కూడా.
O Pitta Katha (Telugu) – Prime Video
ఈ లాక్ డౌన్ లో నేను చూసిన ఉత్తమ సినిమాలలో ‘ఓ పిట్ట కథ’ కూడా ఒకటి. మామూలుగా ఆరంభమై, ఇదొక మామూలు సినిమానే అని అనిపిస్తూనే అమాంతం ఊహించని మలుపులతో దర్శకుడు ‘చందు ముద్దు’ నడపిన కథనం భలే ముద్దొచ్చేసింది. ఓ మంచి సినిమాకి ‘తక్కువ బడ్జెట్’ అనేది అడ్డంకి కాదని ఈ సినిమా మరోసారి నిరూపించింది. సినిమాలో ప్రతి చిన్న డీటైల్ ని కథనంలో వాడిన విధానం బాగా ఆకట్టుకుంది. ఇందులో నటుడు బ్రహ్మాజీ కొడుకు ఓ హీరోగా నటించాడు. అతడికి మొదటి సినిమాగా మంచి సినిమానే దొరికింది కానీ భవిష్యత్తులో హవభావాల మీద దృష్టి సారిస్తే బాగుంటుంది.
Hero (Tamil) / Shakti (Telugu) – Prime Video
మామూలుగా మొదలై, ఆ తరువాత క్రమంగా ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళిన సినిమా ఇది. భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న ప్రధాన లోపాన్ని స్పృశించడమే కాకుండా దానికి పరిష్కారం కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఈ సినిమా చూశాక ‘పీ. ఎస్. మిత్రన్’ రూపంలో మనకు మరో ‘శంకర్’ దొరికేశాడు అనిపించింది. శంకర్ లాగానే మిత్రన్ తన మొదటి సినిమా ‘అభిమన్యుడు’లో ఓ సామాజిక అంశాన్ని గ్రాండ్ స్కేలులో చెప్పడం జరిగింది. ఇందులోనూ అదే పద్ధతిని అనుసరించాడు. ‘అర్జున్’ చేసిన పాత్ర చాలా బాగుంది ఈ సినిమాలో. ఓ ‘జెంటిల్మన్’ చూసిన ఫీల్ ఇచ్చిన సినిమా ఇది.
Jaanu (Telugu) – Prime Video
నాకు తమిళ సినిమా ‘96’ బాగా నచ్చింది. సమానంగా ఇది కూడా నచ్చింది. తమిళ సినిమాలో ఉన్న ఫీల్ మరియు టెంపోని తెలుగులో ఎక్కడా తగ్గించకుండా తీశాడు అదే దర్శకుడు ‘ప్రేమ్ కుమార్’. తమిళంలో ‘విజయ్ సేతుపతి’కి తెలుగులో ‘శర్వానంద్’ ఎక్కడా తీసిపోలేదు అనిపించింది. ‘సమంత’ మాత్రం ‘త్రిష’ అంత మెప్పించలేకపోయినా శపించేలా అయితే చేయలేదు. స్కూల్ రోజుల్లో ఆ పాత్ర చేసిన అబ్బాయి మాత్రం అతకలేదు. అతడి మొహంలో అమాయకత్వం లేదు. ఈ సినిమాలో లాజికల్ సమస్యలేమిటంటే, మొదటగా, ఈ సినిమా స్కూల్ ఎపిసోడ్ జరిగే కాలం. 2004 ప్రాంతంలో తెలుగులో ఇళయరాజా హవా లేదు. అది దేవిశ్రీ ప్రసాద్ కుర్రకారుని ఉర్రూతలూగించిన సమయం. అప్పుడు కూడా స్కూల్ పిల్లలు 80లలో వచ్చిన ఇళయరాజా పాటలు పాడుకోవడం కొంచెం నమ్మశక్యంగా అనిపించలేదు కానీ జాను పాడిన పాటల ఎంపిక మాత్రం బాగుంది. మరో లాజికల్ సమస్య ఏమిటంటే, ‘యమునా తటిలో’ పాటను తమిళంలో ‘జానకి’ పాడగా తెలుగులో ‘స్వర్ణలత’ పాడారు. ఆ స్థానంలో వేరే పాటను ఎంపిక చేసుకొని ఉంటే బాగుండేది. అయితే కథలో ఫీల్ దెబ్బ తినకుండా ఉండడానికి ఈ రెండు విషయాలను వదిలేసి ఉంటారని నా అభిప్రాయం. తమిళ సినిమా చూడకుండా నేరుగా తెలుగులోనే చూసేవారికి ఇది బాగా నచ్చుతుందని నా నమ్మకం.
Asuran (Tamil) – Prime Video
చాలా ఆలస్యంగా చూశాను ఈ సినిమాను. మొదటి సగం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిచింది. దర్శకుడు ‘వెట్రిమారన్’ తన సినిమాలలో ఒక సీక్వెన్స్ మాత్రం రెప్ప వేయనీయకుండా చూసేలా చేస్తాడు. ఇందులో ధనుష్ తన కొడుకు శవాన్ని చూసిన సీక్వెన్స్ అలాంటిదే. రెండో సగంలో వచ్చే ఫ్లాష్బాక్ మాత్రం కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది. అయితే అందులోనూ గుండె బరువెక్కించే సన్నివేశాలు లేకపోలేదు. సహజంగా చిత్రీకరించిన పాత్రలు, సన్నివేశాలు, నటనలు ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాను తెలుగులో ‘శ్రీకాంత్ అడ్డాల’ చేతిలో ఎందుకు పెట్టారో అన్న ప్రశ్న, అతడు ఎలా హ్యాండిల్ చేస్తాడో అన్న ఆందోళన ఉంది కానీ సరిగ్గా తీయగలిగితే కచ్చితంగా అడ్డాల కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. తమిళంలో తీసినంత నిజాయితీగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీస్తే చాలు. Let’s hope the best for ‘నారప్ప’!
Shikara (Hindi) – Prime Video
1990 ప్రాంతంలో కాశ్మీరీ పండిట్ల సామూహిక వలసల నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. చాలా రోజుల తరువాత ‘విధు వినోద్ చోప్రా’ దర్శకత్వంలో వచ్చిన సినిమా. వలసలతో పాటు ఓ కాశ్మీరీ జంట మధ్య ప్రేమకథను కూడా నేపథ్యంగా ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలో మాత్రం అతడు తడబాటుకి గురైనట్టు అనిపించింది. ఎందుకంటే, రెండిటి మధ్య ఎటువంటి సంబంధం లేదు. కాసేపు సమస్యను చూపించి, మరి కాసేపు ప్రేమకథను చూపించడంతో ఎందులోనూ ఫీల్ సంపూర్ణంగా అనుభవించిన ఫీలింగ్ రాలేదు. పైగా, విపరీతమైన డీటైలింగు వల్ల సినిమా నిడివి రెండు గంటల కంటే తక్కువే ఉన్నప్పటికీ కథనం చాలా నెమ్మదిగా నడిచిన భావన కలిగింది. ఏదో పెళ్ళితంతులో తప్ప కాశ్మీరీ సంస్కృతిని సంపూర్ణంగా చూపించలేదు కూడా. ఒక్క విషయం మట్టుకు బాగా రిజిస్టర్ చేశాడు. వలసల తరువాత కాశ్మీర్ ప్రదేశమే కాదు, వలస వచ్చిన పండితులు కూడా మారిపోయారని, తమ సంస్కృతిని మరిచిపోయారని ఓ పెళ్ళి ద్వారా చెప్పిన విధానం నాకు నచ్చింది. అక్కడక్కడా ‘ఏ. ఆర్. రెహమాన్’ నేపథ్య సంగీతం బాగుంది.
Raja Vaaru Rani Gaaru (Telugu) – Prime Video
‘రావుగోపాలరావు’ పరిభాషలో చెప్పాలంటే ‘ఈ సినిమా షార్ట్ ఫిలిమ్ కి ఎక్కువ, ఫీచర్ ఫిలిమ్ కి తక్కువ’. కథావస్తువు చాలా చిన్నది. దాని మీదే రెండు గంటలు నడపడం చాలా చోట్ల బోరు కొట్టించింది. కానీ ముగింపు సన్నివేశాలు బాగున్నాయి.
Vaanam Kottattum (Tamil) – Prime Video
నేను చూసిన మరో మంచి సినిమా ఇది. ఈ సినిమాకు కథ, నిర్మాణం ‘మణిరత్నం’. ఆ ఛాయలు పాత్రల చిత్రణలోనూ, సన్నివేశాల్లోనూ ప్రస్ఫుటంగా కనబడింది. అలాగని కొత్త కథేమీ కాదు. ఓ వ్యక్తి ఆవేశంలో హత్య చేసి జైలుపాలైతే అతడి కుటుంబం ఎదురుకునే పరిస్థితులు, అతడు తిరిగొచ్చే సమయానికి ఆ కుటుంబంలో వచ్చిన మార్పులు ఏమిటి అన్నది ప్రధాన కథాంశం. ఈ కథాంశాన్ని ప్రతి పాత్ర కోణంలోంచి చాలా చక్కగా ఆవిష్కరించారు. అన్నీ తానే అనుకున్న భర్త చిన్న పిల్లలున్న కుటుంబ బాధ్యతను తన మీద వేసి జైలుకి వెళ్తే ఓ భార్య పడే వేదన, తమ తండ్రి జైలు ఖైదీ అని బయట చెప్పుకోలేక ఇబ్బంది పడే పిల్లల కష్టం, అనేక సంవత్సరాల తరువాత జైలు నుండి విడుదలై ఎంతో ఆశగా తన పిల్లలను చూడడానికి వచ్చి వారి ఆదరణకు నోచుకోలేని ఓ తండ్రి మనోవేదన, ఇలా సున్నితమైన భావాలను దర్శకుడు ‘ధన శేఖరన్’ ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది.
ఈ సినిమాలో ‘శరత్ కుమార్’ నటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ఆయన ఆహార్యం, పల్లెటూరి యాస అన్నీ బాగా సరిపోయాయి. అటు భర్త, ఇటు పిల్లల మధ్య నలిగిపోయే వ్యక్తిగా ‘రాధిక’ నటన కూడా మెప్పించింది.
Ayyappanum Koshiyum (Malayalam) – Prime Video
ఈ సినిమాలో కథావస్తువు చాలా చిన్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అహంకార ప్రేరేపిత పోరాటం. ఆరంభం చాలా బాగా జరిగింది కానీ క్రమంగా కథనం చప్పగా మారిపోయింది. అయితే, ‘డ్రైవింగ్ లైసెన్స్’ లాగ ప్రేక్షకుడు ఎవరి పక్కన నిలబడాలో అయోమయం అవసరం లేదు ఈ సినిమాలో. నేను ‘అయ్యప్ప నాయర్’ వైపే నిలబడ్డాను. అతడి కోపంలో న్యాయం ఉంది. కోషీ కోపంలో అహంకారం తప్ప మరేమీ కనబడలేదు. వారిద్దరూ కూర్చొని అయిదు నిమిషాలు మాట్లాడుకుంటే సమస్య సెటిల్ అయిపోయే అనేక సందర్భాలను వదిలేసి, దర్శకుడు కావాలని రెండు గంటల నలభై నిమిషాలు కథనాన్ని లాగి, వీరిద్దరి మధ్య ఎలాగూ ఓ ఫైటు ఉండాలి కాబట్టి దానితోనే సినిమా ముగించాలన్న తాపత్రయమే ఎక్కువగా కనబడింది. సగం సినిమా అయ్యాక పృథ్వీరాజుని దాటేసి బిజూ మీనన్ పూర్తిగా సినిమాను తన వైపు తిప్పేసుకున్నాడు. ఈ సినిమాలో నచ్చిన మరో అంశం అయ్యప్ప నాయర్ భార్య పాత్ర. చాలా శక్తివంతమైనది.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వాళ్ళు రైట్స్ కొన్నారని సమాచారం. దీన్ని యథావిధిగా తెలుగులో తీస్తే కచ్చితంగా బొమ్మ తిరగబడే అవకాశముంది. తెలుగు కోసం చాలా మార్పులు చేయాలి. కథావస్తువు చిన్నదిగా ఉండి కేవలం పాత్రల instincts మీద నడిచే సినిమాలను తెలుగులో సరిగ్గా డీల్ చేయకపోతే పరాజయం చవిచూసిన సందర్భాలు అనేకం. ఒకవేళ తెలుగులో దీన్ని మల్టీస్టారర్ సినిమాలా చేయాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచనను విరమించడం ఉత్తమమని నా అభిప్రాయం.
Hello Guru Prema Kosame (Telugu) – Prime Video
2018 నుండి చూడాలనుకుంటున్న ఈ సినిమాను చూసే వీలు ఎట్టకేలకు లాక్ డౌన్ లో దొరికింది. ఏమాత్రం అంచనాలు లేకుండా కేవలం టైంపాస్ కోసమే ఈ సినిమా చూడడం మొదలుపెట్టాను. ఆశ్చర్యపరుస్తూ సినిమా నచ్చింది. ఓ తండ్రి తన కూతురిని ప్రేమించడం కోసం ఓ అబ్బాయికి తానే సహాయపడే కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఆ పాత్ర ‘ప్రకాష్ రాజ్’ లాంటి సరైన నటుడికి వెళ్ళడంతో బాగా పండింది. సినిమాలో డైలాగులు కూడా చాలా బాగున్నాయి. “తండ్రీకూతుళ్ళు విడిపోతుంటే సుముహూర్తం అంటారేమిటి రా?” అనే డైలాగు చాలా నచ్చింది.
Raatchasi (Tamil) – Prime Video
పేరుకి ‘రాక్షసి’ అయినా చాలా అందమైన సినిమా ఇది. విద్యను ప్రైవేటీకరణ చేశాక ప్రైవేటు సంస్థల కోరల మధ్య చిక్కుకుపోయిన ప్రభుత్వ విద్యావిధానాన్ని ఉద్ధరించే ఓ హెడ్ మాస్టర్ కథ ఈ సినిమా. కథలో ప్రైవేటీకరణ తప్ప మరో సమస్య లేదు. అయితే నాకు నచ్చింది ఏమిటంటే, హెడ్ మాస్టర్ ఈ సమస్యను ఎలా ఎదురుకుందనే దానికంటే తాను చేరిన ప్రభుత్వ పాఠశాలను ఎలా బాగు చేసింది అన్నదే ఆసక్తికరంగా మరియు ఆహ్లాదకరంగా దర్శకుడు చూపించిన విధానం. హెడ్ మాస్టర్ పాత్ర చిత్రణ మరో పెద్ద బలం ఈ సినిమాకు. ఇలాంటి దృఢమైన వ్యక్తులే మన ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉండాలి అనిపించే పాత్ర అది. ఆ పాత్రలో ‘జ్యోతిక’ నటన అద్భుతం.
Lucifer (Malayalam) – Prime Video
ఇదొక ఫక్తు మాస్ సినిమా, భాషతో సంబంధం లేకుండా అన్ని దక్షిణ రాష్ట్రాల ప్రేక్షకులను అలరించగల మాస్ సినిమా. ఆ నమ్మకంతోనే అన్ని దక్షిణాది భాషల్లోకి అనువదించారు కాబోలు. అయితే, కథ, కథనాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించని దర్శకరచయితల పనితనం బాగా ఆకట్టుకుంది. ప్రతి పాత్రకు ఒక ఆర్క్ ఉంది. అది సరైన సమయంలో, సరైన విధంగా ముగిసింది. దర్శకుడు పృథ్వీరాజ్ ‘మోహన్ లాల్’కి వీరాభిమాని అని ఆద్యంతం తెలిసిపోయింది. తన అభిమాన నటుడిని అభిమానులకు ఎలా చూపించాలో అలాగే చూపించాడు.
ఈ సినిమాను తెలుగులో అనువదించి విడుదల చేసినా కూడా మెగాస్టార్ చేయదలిచాడు. నిజానికి, చిరంజీవికి బాగా సరిపోయే సబ్జెక్టు ఇది. అయితే, మలయాళంలో దర్శకరచయితలు చూపిన నిబద్ధతే ఇక్కడి వారు కూడా చూపితే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది.
Tanhaji – The Unsung Warrior (Hindi) – Hotstar
కథ, కథనం, పాత్రలు అన్నీ బాగున్నాయి. ‘సైఫ్ అలీ ఖాన్’ నటన బాగా ఆకట్టుకుంది. సినిమా ఎక్కడా బోరు కూడా కొట్టలేదు. కానీ పేలవమైన గ్రాఫిక్స్ సినిమాలోని భావోద్వేగాన్ని నీరుగార్చేశాయి. అంతమంది ప్రొడ్యూసర్ల పేర్లు పడ్డాయి టైటల్స్ లో కానీ గ్రాఫిక్స్ మాత్రం Microsoft Paintలో చేసినట్టు ఉన్నాయి. ‘సందీప్ శిరోద్కర్’ నేపథ్య సంగీతం బాగుంది కానీ ‘అజయ్ – అతుల్’ పాటలు ఆకట్టుకోలేదు.
Ashwathama (Telugu) – SunNxt
తెలుగులో ‘హిట్’ తరువాత నచ్చిన మంచి థ్రిల్లర్ సినిమా. హీరో నాగశౌర్య ఓ కొత్త కథావస్తువుతో ఈ సినిమా కథను సూటిగా, సుత్తి లేకుండా వ్రాశాడు. దర్శకుడు ‘రమణ తేజ’ పనితనం కూడా అలాగే ఉంది. సహజంగా, ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో ప్రతినాయకుడిని ఆఖరి దాక చూపించరు. కానీ ఇందులో ప్రతినాయకుడు ఎవరో ప్రేక్షకుడికి ముందే చూపించేసి హీరో అతడిని ఎలా ఓడిస్తాడు అనే ఆసక్తితో కథనాన్ని నడిపిన విధానం నాకు బాగా నచ్చింది. ముగింపు కూడా సూటిగా, సుత్తి లేకుండా ఉంది. ప్రతినాయకుడిగా ‘జిశు సేన్ గుప్తా’ నటన బాగుంది. అతడికి హేమచంద్ర చెప్పిన డబ్బింగ్ పాత్రకి ప్రాణం పోసింది.
Kalki (Telugu) – Prime Video
ఈ సినిమా కథగా చాలా బాగుంది. విశదీకరించి వ్రాస్తే ఓ యండమూరి స్థాయి నవల కూడా అవుతుంది. అయితే, దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’ ఈ కథను ఆకట్టుకునేలా చెప్పడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. ఎంతసేపూ స్టైలింగ్, లైటింగ్, కలరింగ్ , ఫ్రేమింగ్ మీదే ఉన్న దృష్టి సన్నివేశాల మీద ఉన్నటు కనిపించలేదు. ఒకటి, రెండుసార్లు ఫరవాలేదు కానీ అస్తమానం జీపు మీదున్న లోగోలు, అనవసరపు క్లోజప్ షాట్లు, స్లో మోషన్ షాట్లు వేయడం నీరసం పుట్టించింది. సౌండ్ రికార్డింగ్ విషయంలో కూడా శ్రద్ధ వహించలేదు. బాక్గ్రౌండ్ స్కోరు పెద్దగా వినిపిస్తూ డైలాగులు చాలా చిన్నగా వినిపించేలా చేశారు. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో దాదాపు రెండు గంటలు అయోమయం కలిగించే కథనంతో నడిపించి, ప్రేక్షకుడి సహనాన్ని తారాస్థాయిలో పరీక్షించి, చివరి పది నిమిషాలు మాత్రం అసలు కథ ఇది అని చెబితే, అప్పటివరకు జరిగిన కథనాన్ని మళ్ళీ ప్రేక్షకుడే నెమరువేసుకుంటే తప్ప అర్థం కాని పరిస్థితి ఈ సినిమాది. ఆ చివరి పది నిమిషాలతో పాటు రోలింగ్ టైటల్స్ లో వేసిన స్కెచ్లు కూడా నన్ను ఆకట్టుకున్నాయి. సినిమాకు, హీరో పాత్రకు ‘కల్కి’ అనే పేరు ఎందుకు పెట్టాడో వాటి ద్వారా చెప్పడం జరిగింది.
రాజశేఖర్ ‘గరుడవేగ’లో లాగే ఈ సినిమాలో కూడా నెమ్మదిగా నటించారు. రాహుల్ రామకృష్ణకు చాలా కీలకమైన, పెద్ద పాత్ర దొరికింది.
– యశ్వంత్ ఆలూరు