భావ, రాగ భాష్యమే పాట. ఈ రెండింటిలో ఏ ఒక్కటి మరో దాని పై ఆధిక్యత చూపించినా పాట రక్తి కట్టదు. సంగీతం గొప్పదా లేక సాహిత్యం గొప్పదా అనే వివాదం ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆ రెండు సరస్వతి దేవికి రెండు కళ్ళు అనేది మాత్రం సత్యం.
సినిమా పాటకు పై రెండు లక్షణాలు చాలా అవసరం. ఆ రెండింటినీ సమపాళ్ళలో మేళవించి పాటలు చేసిన సినీ సంగీత దర్శకులలో శ్రీ ‘కె. వి. మహదేవన్’ ముందు వరసలో ఉంటారు. ఆయనెప్పుడూ ముందు బాణీ కట్టి తరువాత సాహిత్యం వ్రాయించుకోలేదు. సాహిత్యం చూశాక ఆయన చేసిన బాణీ నచ్చకపోతే ఆ సాహిత్యానికి ఆ బాణీయే వస్తుందని, ఒకవేళ బాణీ మారాలంటే సాహిత్యం మార్చమని చెప్పేవారట. “సాహిత్యం తనకు సరిపోయే బాణీని తానే సమకూర్చుకుంటుంది” అనేది మహదేవన్ గారి అభిప్రాయం, నమ్మకం కూడానూ. ఇంకో మాటలో చెప్పాలంటే, పాటలో మహదేవన్ గారి ప్రాధాన్యతాక్రమం భావము, రాగమే. భాషలోంచి పుట్టిన భావానికి రాగం కట్టి పాటను చేస్తారు ఆయన. ఇందుకు ఆయన కొంపోజ్ చేసిన ప్రతి పాటా ఉదాహరణే. అయితే, మచ్చుకు ‘సిరివెన్నెల’ సినిమాలోని ‘ప్రకృతి కాంతకు’ పాటను తీసుకొని విశ్లేషించుకుందాం.
ఈ అధ్భుత సృష్టి వెనుక నలుగురు బ్రహ్మలున్నారు. మొదటి బ్రహ్మ కవి శ్రీ ‘సీతారామశాస్త్రి’. తనలోని భావాలకు అక్షర రూపమిచ్చారు. అంతే కాకుండా, కవిత్వాన్ని తాళానుగుణంగా వ్రాసి, దాన్ని దరువేసి మరీ వినిపించే లక్షణం కూడా ఉంది ఆయనకు. ఈ పాటను కూడా ఆయన ఆ పద్ధతిలోనే వినిపించి ఉంటారు. రెండవ బ్రహ్మ శ్రీ ‘పుహళేంది’. కవిలోని ఆర్ద్రతను పూర్తిగా అర్థం చేసుకొని, దాన్ని మహదేవన్ గారికి వివరించి చెబుతారని, తరువాత ఆయన రాగం కట్టడం జరుగుతుందని అనేక సందర్భాలలో వారిద్దరితో పని చేసినవారు చెప్పడం జరిగింది. మూడవ బ్రహ్మ అయిన మహదేవన్ గారు రెండవ బ్రహ్మతో కలిసి ఆ ఆర్ద్రతకు రాగరూపాన్నిచ్చారు. నాలుగవ బ్రహ్మ శ్రీ ‘ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం’. మొదటి ముగ్గురి సృష్టిని పూర్తిగా ఆకళింపు చేసుకొని తన గానంతో ఈ అధ్భుతాన్ని సంపూర్ణం చేసి శ్రోతలకు చేరవేశారు. ఈ సృష్టికి స్థితి, లయకారకులు కళాతపస్వి శ్రీ ‘కాశీనాథుని విశ్వనాథ్’.
సాహిత్యం:
ముందు సాహిత్యమే పుట్టింది కాబట్టి ఈ పాట పూర్తి సాహిత్యం ఇది…
పల్లవి:
{ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితే ఎన్నెన్ని లయలో} – 2
ఎన్నెన్ని హొయలో… ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎద పై
సిరిమువ్వల సవ్వడి నీవై
నర్తించగ రావేలా… నిను నేఁ కీర్తించే వేళ
చరణం 1:
{అలల పెదవులతో… శిలల చెక్కిలి పై…
కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో…} – 2
ఉప్పొంగి సాగింది అనురాగము…
ఉప్పెనగా దూకింది ఈ రాగము…
చరణం 2:
కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో – 2
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
రా రా… రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనే…
ఎన్నెన్ని హొయలో… ఎన్నెన్ని లయలో
సంగీతం:
“ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో… పదము కదిపితే ఎన్నెన్ని లయలో” అనే పంక్తులలో ‘హొయలు’, ‘లయలు’ ప్రధానమైన పదాలు. వాటి భావాలను రాగయుక్తంగా వర్ణిస్తున్నట్టుగా గమకాలు ఎక్కువగా వేశారు. అవే పంక్తులు మొదటిసారి వచ్చేటప్పుడు వెనుక వినిపించే శ్రీ ‘హరిప్రసాద్ చౌరాసియా’ వేణు నాదంతో ఒలికించిన హొయలు అదనపు అందం అద్దుతుంది ఈ పల్లవికి. అలాగే, ‘ఎన్నెన్ని’ అనే ఆశ్చర్యపు భావం కూడా స్పష్టంగా తెలుపుతుంది.
“సిరివెన్నెల నిండిన ఎదపై… నిను నేఁ కీర్తించే వేళ” అనే పంక్తులలో కవి ఆర్ద్రతను తన రాగంలో చెక్కు చెదరనీయకుండా తీసుకొచ్చారు మామ. ప్రకృతి దేవతను “నర్తించగ రావేలా…” అంటూ వేడుతున్న చోట ఉన్న స్వరస్థానాలే ఇందుకు తార్కాణం.
సముద్రపు అలలు నిరంతరం ఒడ్డునున్న శిలలను తాకుతూ ఉంటాయి. ఆ నిరంతర ప్రక్రియను “అలల పెదవులతో… శిలల చెక్కిలి పై…” అనే పంక్తుల చివర్లో వేసిన గమకాలతో చక్కగా వివరించారు. ఆ ప్రక్రియకి భూమి స్పందనను “ఉప్పొంగి”, “ఉప్పెన” అనే పదాలను నొక్కి పలకడం ద్వారా తెలియజేశారు. ఇందులో మరో విశేషమేమిటంటే, “ఉప్పొంగి”న తరువాత “అనురాగం” దగ్గర స్వరం ఆ భావంలోని సున్నితత్వాన్ని తెలియపరుస్తూ మళ్ళీ సౌమ్యంగా ముగియడం. ఇదే పద్ధతి “ఉప్పెన” నుండి “ఈ రాగము” వరకు కూడా సాగుతుంది.
ఈ పాటలో రెండో చరణం మహదేవన్ గారి ప్రతిభకు మరో తార్కాణం. కొండలలో ప్రవహించే సెలయేటి గురించి చెప్పేటప్పుడు “కొండ”, “బండ” అనే పదాలను ఆ ధాతువుల లక్షణాలు సైతం స్ఫురించేలా బాణీలో వినిపించారు. మరి ఆ సెలయేటిని కోన పిలిచే చోట “రా రా రా” అని ఎంతో ప్రేమతో కూడిన ఆర్ద్రతను తీసుకొచ్చారు. కవి భావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని శ్రోతలకు కూడా చేరవేయడంలో మహదేవన్ గారు నిష్ణాతులు అని చెప్పడానికి ఈ పాట ఓ ఉదాహరణ అయితే అందులో ఈ పంక్తి మేలిమి బంగారం అని చెప్పాలి. “రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే” అనే చోట బాలు గారి గాత్రం శ్రోతల చెవుల్లో అమృత ధారను కురిపిస్తుంది. అలా పిలిచిన కోనలో వికసించిన “ఓ కొత్త వలపు” గురించి కూడా చాలా సున్నితంగా చెబుతారు.
ముగింపు:
ఇది సినిమా పాటే కానీ కేవలం సినిమాకు మాత్రమే పనికొచ్చే పాట కాదు. సినిమా చూడానివారు కూడా కళ్ళు మూసుకొని ఈ పాట వింటే కళ్ళ ముందు కొన్ని అందమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. అందుకు శాస్త్రి గారు ఎంత కారణమో, మహదేవన్ గారూ అంతే కారణం. ‘సిరి సిరి మువ్వ’ చూసి వేటూరి గారిని, ‘సిరివెన్నెల’ చూసి శాస్త్రి గారిని ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు అంటే, అందులో మహదేవన్ గారి పాత్ర చాలా కీలకమైనదనే చెప్పాలి. అంతెందుకు, బాణీ లేకుంటే ఆత్రేయ గారివి మాటలు మాత్రమే. వాటిని పాటలుగా మలిచి శ్రోతల మనసుల్లో ఆయన్ని ‘మనసు కవి’గా ముద్ర వేశారు మామ. ఆయన మీదున్న నానుడి “ఓ వార్తాపత్రిక ఇచ్చినా కూడా బాణీ కట్టేస్తారు” అని. మహదేవన్ గారి సంగీత దర్శకత్వం సినిమా సాహిత్యానికి జరిగిన పట్టాభిషేకం. ఇంతటి మహోన్నత వ్యక్తిని కనీసం ‘పద్మశ్రీ’తోనైనా గౌరవించకపోవడం భారతీయ సంగీత జాతి దౌర్భాగ్యం.
ఈ పాట యూట్యూబ్ లింకు ఇది…
నేను కోరిన వెంటనే నా ఈ వ్యాసాన్ని చదివి వీడియో చేసిన శ్రీ ‘విజయసారథి జీడిగుంట’ గారికి కృతజ్ఞతలు!
– యశ్వంత్ ఆలూరు