కరోనా కారణంగా అమలు చేసిన లాక్ డౌన్ సమయంలో రెండో విడతగా నేను చూసిన సినిమాలు, వాటి గురించి క్లుప్తంగా నా కామెంట్లు. ఇందులో ఎటువంటి క్రమం లేదు.
Palasa 1978 (Telugu) – Prime Video
ఈ సినిమాకు ‘రంగస్థలం’తో దగ్గర పోలికలు ఉన్నాయి. రెండూ 70, 80లలో జాతి పేరిట చూపిన వివక్షతనే ప్రధాన అంశంగా కలిగిన సినిమాలు. అయితే, రంగస్థలం ప్రత్యేకంగా ఫలానా వర్గమని చెప్పకుండా అంతర్లీనంగా నడిస్తే, పలాస ప్రత్యేకించి కులాల ప్రస్తావన తెస్తూ సాగుతుంది. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా నడుస్తుంది కానీ ఎక్కడో సన్నివేశాలు, పాత్రల మధ్య డ్రామా బలంగా లేదనిపించింది. దర్శకుడు ఎక్కువ రియాలిటీకి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేశాడు. అది అభినందనీయమే కానీ డ్రామా ఉంటే కథనం ఇంకాస్త హత్తుకునేదేమో అనిపించింది. ఊరి పేరు సినిమాకి పెట్టినప్పుడు ఆ ఊరిని కూడా కథలో పాత్రను చేయాలి. ఈ సినిమాలో వ్యక్తులకు తప్ప ‘పలాస’ ఊరికి పాత్ర ఉన్నట్టు కనిపించలేదు. చివర్లో ‘మోహనరావు’ పాత్ర చెప్పే డైలాగులు గుండెను హత్తుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి కూడా. ఈ సినిమాలో హీరో కన్నా అతడి అన్న పాత్ర వేసిన ‘తిరువీర్’ నటన ఆకట్టుకుంది.
Joker (English) – Prime Video
సినిమా ఆరంభం నుండి చాలా నెమ్మదిగా సాగుతుంది కథనం. Arthur Fleck పాత్రను ఆవిష్కరించడమూ అలాగే జరిగింది. మెట్రో స్టేషనులో హత్య చేసే సన్నివేశం చాలా బాగా చిత్రీకరించారు. అక్కడి నుండి సినిమా ఆసక్తిగా కొనసాగుతుంది. చివరి అరగంట ముందు చూసిన సినిమాను మరిపించేసింది. అలాగే, నోలన్ తీసిన Batman Trilogy ప్రారంభానికి అనుసంధానం చేసిన విధానం అద్భుతం. జోకర్ గా Joaquin Phoenix నటన అద్భుతం. ఆస్కార్ అవార్డుకి కచ్చితంగా అర్హుడు.
Thappad (Hindi) – Prime Video
ముందుగా, ఒక చెంప దెబ్బను కథాంశంగా ఎంచుకున్నందుకు దర్శకుడు ‘అనుభవ్ సిన్హా’ని అభినందించాలి. భారతీయ చట్టంలో దీన్ని ఒక సమస్యగా ఇంకా పరిగణించడం లేదు. కానీ అనేకమంది స్త్రీలు ఎదురుకుంటున్న సమస్య ఇది. ఆ కోణంలో బాగా ఆలోచింపజేసే కథ ఇది. కానీ ఓ సినిమాగా చూస్తే, దర్శకుడు ఈ సమస్యను ఒక సీరియస్ సమస్యగా నెలకొల్పడంలో మాత్రం తడబడ్డాడు అనే చెప్పాలి. కానీ అన్ని పాత్రలలోని నెగటివ్ షేడ్స్ ని బాగా బయటపెట్టగలిగాడు. సినిమా ముగింపుకి చేరువ అవుతున్న కొద్దీ దర్శకుడి మోటో ఏంటో కూడా స్పష్టంగా లేదనిపించింది. ఏదేమైనా, చివారంటా, తాప్సీ పాత్రకంటే తన ఇంటి పనిమనిషి పాత్ర గమనమే హత్తుకుంది.
Sui Dhaaga (Hindi) – Prime Video
చాలా మంచి సినిమా ఇది. కష్టమైనా సరే మనలోని ప్రతిభను నమ్ముకొని, దాన్నే జీవనాధారంగా మార్చుకుంటే జీవితం బాగుంటుందని చెప్పిన సినిమా ఇది. ఇందులో ప్రధాన పాత్రల్లో ఓ అమాయకత్వం ఉంది. అందులోనే బోలెడు నిజాయితీ కూడా ఉంది. ఓ ప్రక్క అసలు కథాంశం గురించి చర్చిస్తూనే మరి ప్రక్క భార్యాభర్తల బంధాన్ని చూపిన తీరుకి దర్శకడు ‘శరత్ కటారియా’కు పూర్తి మార్కులు వేసేయాలి. వరుణ్ ధావన్, అనుష్క శర్మలు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు. ముఖ్యంగా, అనుష్క శర్మ పాత్రకు సరిపోయిన తీరు అద్భుతం.
Amar Akbar Anthony (Telugu) – Prime Video
కొన్ని కథలను దర్శకరచయితలు ఏమి ఊహించుకొని వ్రాస్తారో, వాటిని నటులకు, ఎలా చెప్పి ఒప్పించి డేట్స్ మరియు పెట్టుబడిని సంపాదిస్తారో భేతాళ ప్రశ్నలా ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇది ఒక మామూలు రివెంజ్ స్టోరీ. తన తల్లితండ్రులను చంపినవారిపై హీరో పగ తీర్చుకోవడమే కథాంశం. ఇది దశాబ్దాలుగా తెలుగు సినిమా చూపించనిదేమీ కాదు. అయితే, కథను చెప్పిన విధానంలో దర్శకుడి ఆలోచనల పోకడ కూడా ఓ భేతాళ ప్రశ్నే. హీరోకి అంటగట్టిన “dissociative identity disorder” అనే ఓ మానసిక జబ్బు వల్ల అటు అతడికి నష్టం కానీ, ప్రేక్షకుడికి ఉత్కంఠ కానీ ఏమీ లేదు. అలాంటప్పుడు ఆ పాయింట్ పెట్టడం వెనుక దర్శకుడి ఉద్దేశం ఏమిటి? బోనస్ గా హీరోయిన్ కి కూడా అదే జబ్బు ఉంటుంది కానీ ఏమీ ఉపయోగం లేదు. సినిమాకు ‘అమర్’ ఒక్కడు సరిపోతాడు. ‘అక్బర్’ మరియు ‘ఆంటోని’ అసలు అవసరం లేదు. ఇంతోటి దానికి సినిమా మొత్తం అమెరికాలో తీసి నిర్మాత డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టించాడు దర్శకుడు ‘శ్రీను వైట్ల’. మధ్యమధ్యలో హైదరాబాద్ ‘పార్క్ హయాత్’ హోటలునే అమెరికా అని నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. కామెడీ కూడా ఏమాత్రం పండలేదు.
Gopichand Chanakya (Telugu) – Prime Video
‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అన్నట్టుగా ఉంటుంది ఈ సినిమా. ప్రేక్షకులకు ఏదో ట్విస్టులు అందించేయాలన్న తాపత్రయంలో అసలు కథ ఎటు వెళుతోందో పట్టించుకోలేదు దర్శకుడు ‘తిరు’. తన స్నేహితులను కిడ్నాప్ చేశాడని ఉద్యోగం కూడా వదులుకుని ఒంటరిగా పాకిస్థాన్ వెళతాడు. క్లైమాక్స్ ఫైట్ మొదలవుతుంది అన్న సమయానికి మాత్రం ‘ఆపరేషన్ చాణక్య ఈజ్ ఆన్’ అంటాడు. అలాంటప్పుడు, మధ్యలో స్నేహితుల కిడ్నాప్ ఎందుకు? అలా కాకుండా నేరుగా ‘ఆపరేషన్ చాణక్య’ పేరుతో నలుగురు స్నేహితులూ పాకిస్థాన్ వెళ్ళి ఉంటే బాగుండేదేమో ఈ సినిమా. ఇలాంటి సినిమాలో హీరోయిన్ అవసరం లేదు. ఉన్నా కూడా హీరో ఆమెకి పాకిస్థాన్ నుండి ఫోన్ చేసి ఏమీ మాట్లాడని వాడిని ‘ఏదైనా మాట్లాడు’ అని ఈవిడ బతిమాలే అవసరం లేదు. ఒక వేళ బతిమాలినా అతడు మాట్లాడకపోతే చివరకు ‘నీ శ్వాస చాలు నన్ను మిస్ అవుతున్నావని చెప్పడానికి’ అని ఓ ఫారిన్ లొకేషన్లో పాట వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ సినిమా బడ్జెట్ కూడా బాగా అధికంగా కనిపించింది.
Lust Stories (Hindi) – Netflix
నలుగురు అద్భుత దర్శకుల కలయిక ఈ సినిమా. చాలా బోల్డ్ అటెంప్ట్ ఇది. మొదట వచ్చే ‘అనురాగ్ కశ్యప్’ తీసిన కథలో ‘రాధికా ఆప్టే’ పాత్రను చాలా నిజాయితీగా ఆవిష్కరించారు. ఆ క్రమంలో వచ్చే డైలాగులు చాలా బాగుంటాయి. ‘జోయా అక్తర్’ తీసిన కథలో తక్కువ డైలాగులతో కథను నడిపించారు కానీ కథనం నెమ్మదిగా సాగుతుంది. మూడోది అయిన ‘దిబాకర్ బెనర్జీ’ తీసిన కథ ఈ సినిమాలో అత్యంత బోరు కొట్టే కథ. పాత్ర ఇన్టెన్షన్లు ఏమిటో అర్థమైపోయాక కూడా కథను ముగించకపోవడమే ప్రధాన కారణం. ఇక ఆఖరున వచ్చే ‘కరణ్ జోహర్’ తీసిన కథ ఈ సినిమాకు ఉత్తమమైన కథగా చెప్పవచ్చు. ‘కైరా అద్వానీ’ నటనకు పూర్తి మార్కులు కూడా వేసేయాలి. ఈ కథ ఆరంభం నుండి అంతం వరకు చాలా బాగా సాగింది. Lust Stories అనే టైటిల్ కి సరైన న్యాయం కూడా ఈ కథే చేసిందని చెప్పాలి.
Varane Avashyamund (Malayalam) – Netflix/SunNxt
ఈ విడతలో నేను చూసిన అత్యుత్తమమైన సినిమా ఇది. ఒక నటుడు వరుసగా మంచి కథలు ఎంచుకోవడం ఎలా సాధ్యమని ‘దుల్కర్’ని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తనకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ లేని సినిమాను ఒప్పుకోవడమే కాక దాన్ని నిర్మించడం ‘సినిమా’ పట్ల అతడికున్న గౌరవం ఎంతో తెలుస్తుంది. అందుకే మొదట దుల్కర్ ని అభినందించాలి. ఇక సినిమా విషయానికి వస్తే, దాదాపుగా గంట పైన కథ చాలా ర్యాండమ్ గా సాగుతుంది. పాత్రల ప్రవర్తనలు కనెక్ట్ అవ్వవు. కానీ ఆ గంట తరువాత ఒక్కో పాత్రా చక్కగా ఆవిష్కరింపబడుతూ వెళ్తుంది. మనం ముఖ్యం అనుకునే ప్రతి పాత్రా చాలా పరిపక్వత కలిగి ఉంటుంది. భర్త లేనంత మాత్రాన, పెళ్ళి కావాల్సిన కూతురు ఉన్నంత మాత్రాన, ఓ వ్యక్తికి జీవితం మీద ఆశలు ఉండడంలో తప్పు లేదని ‘శోభన’ పాత్ర ద్వారా ఎలా చూపించాడో, ఎదిగే వయసులో తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎలా పడుతుంది అన్న విషయం ‘కళ్యాణి’ పాత్ర ద్వారా కూడా అంతే చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు ‘అనూప్ సత్యన్’. వీటితో పాటు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా జీవితంలో అలుముకున్న ఒంటరితనాన్ని జయించడం ఎంత కష్టమో ‘సురేష్ గోపీ’ పాత్ర ఓ చక్కటి నిదర్శనం. మనం నమ్ముకున్న వాళ్ళు పోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం బ్రతుకెలా సాగించాలో ‘దుల్కర్’ పాత్ర ద్వారా చెప్పడం జరిగింది. వీటన్నటితో పాటు ‘ఊర్వశి’ పాత్ర నన్ను అమితంగా ఆకట్టుకుంది. చివర్లో ‘ట్రావెలింగ్’ గురించి సురేష్ గోపీ ఇచ్చే స్పీచ్ కంటతడి పెట్టిస్తుంది. ఇలా, అన్నీ మంచి పాత్రలతో మంచి కథనంతో తీసిన ఓ మంచి సినిమా ఇది.
Chal Mohan Ranga (Telugu) – ZEE5
‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ కథతో వచ్చిన ఇది అటు మంచి సినిమా కాదు, అలాగని చెత్త సినిమా కూడా కాదు. అయితే, కథాంశం చాలా చిన్నది. జీవితంలో ఎలా స్థిరపడాలో అన్న ఫుల్ క్లారిటీతో ఉన్న ఓ అబ్బాయి, అసలు జీవితంలో తనకేం కావాలో తెలియని ఓ అమ్మాయి కథ ఈ సినిమా. ఈ సినిమాకు దర్శకుడు ‘కృష్ణ చైతన్య’నే అయినప్పటికీ ఇందులో త్రివిక్రమ్ తరహా పాత్రలు, సన్నివేశాలు ఉంటాయి. అక్కడక్కడా మాటల్లో కూడా త్రివిక్రమ్ వినబడతాడు. పలు చోట్ల ఆ మాటలు, కొన్ని చోట్ల సన్నివేశాలు నవ్విస్తాయి. సినిమా చివర్లో, రోడ్డుకి ఎడమ ప్రక్కనున్న మైలురాయిని ఢీ కొట్టిన కారు ఉవ్వెత్తున ఆకాశంలోకి ఎగిసి కుడి ప్రక్కకి తిరిగి ఎదురుగా వస్తున్న హీరోయిన్ కారుపై పడడం, తద్వారా హీరోహీరోయిన్లు కలిసే ఆ సన్నివేశంలో షాట్లతో సహా త్రివిక్రమే కనబడతాడు. ఒక చిన్న పోయింట్ ని కథగా ఎన్నుకోవడం, దాని మీద సన్నివేశాలను వ్రాసుకుంటూ పోయి, చివరకు కథలో ఒక డెడ్ లాక్ స్థితిలోకి వెళ్ళిపోయి, ఆ లాక్ ని అసాధ్యమైన మరియు ఆశ్చర్యకరమైన తాళాలతో విప్పడం త్రివిక్రమ్ మొదటి నుండి చేస్తున్నదే.
Palnati Pourusham (Telugu) – YouTube
ఎప్పుడూ ‘ఏ. ఆర్. రహమాన్’ అద్భుతంగా స్వరపరిచిన పాటలు వినడమే తప్ప సినిమా ఎప్పుడూ చూడలేదని ఈ సినిమా చూశాను. తమిళంలో ‘భారతీరాజా’ తీసిన ‘కిళక్కు చీమయిలే’ సినిమాకు రీమేక్ ఇది. ‘ముత్యాల సుబ్బయ్య’ దర్శకత్వం వహించారు. చరిత్రను వర్తమాన దృష్టితో చూడడం అప్పుడప్పుడు సరికాదు. ఈ సినిమా చూడాలన్నా మనం కాలంలో వెనక్కి వెళ్ళి చూడాలి. అయితే, అనవసరమైన సన్నివేశాలు, పాటలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, అన్నాచెల్లెళ్ళ బంధాన్ని బాగా ఆవిష్కరించారు. పంచాయితీ సన్నివేశం నుండి సినిమా బాగుంది. ‘నీలిమబ్బు కొండల్లోన’ పాట కథనానికి ప్రాణం పోసింది. ఈ సినిమాలో ‘కృష్ణంరాజు’ నటన చాలా బాగుంది. పాత్రకు ఎంత కావాలో అంతే భావోద్వేగాలు పలికించారు ఆయన. తన కొడుకు మావయ్య కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ కత్తి పట్టి అతడిని దూషించే సన్నివేశంలో ఆయన నటన చెప్పుకోదగ్గది. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ‘ఫిలింఫేర్’ కూడా అందుకున్నారు కృష్ణంరాజు.
– యశ్వంత్ ఆలూరు