‘రోజుకో తెలుగు పద్యం’ కార్యక్రమంలో భాగంగా ‘జీడిగుంట విజయసారథి’ గారు పరిచయం చేసిన ‘నూతనకవి సూరన’ గారు వ్రాసిన ‘ధనాభిరామం’ స్ఫూర్తిగా తీసుకొని చేసిన సంకలనం ఈ ‘సినీ ధనాభిరామం’. ముందుగా, సూరన ధనాభిరామం యొక్క సారాంశం ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
ఓ రోజు ఇంద్ర సభలో కుబేరుడికి, మన్మథుడికి మధ్య ఓ వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. ధనం గొప్పదని, దానితో ఏదైనా సాధ్యమని కుబేరుడి వాదన. ధనం పాపిష్టిదని, అది పక్కన చేరితే మనిషికి ఎన్నో దూరం అవుతాయన్నది మన్మథుడి వాదన. ఎవరి వాదనని వాళ్ళు నిరూపించుకోవడానికి భూలకంలోని ‘దాక్షారామం’ క్షేత్రానికి పయనమవుతారు. ఆ తరువాత జరిగే కథను సారథి గారు వివరించిన ఈ యూట్యూబ్ వీడియోలో వినండి.
ఈ వ్యాసంలో డబ్బు విశిష్టతను, ప్రయోజనాలను, నష్టాలను గురించి చర్చించిన సినిమా పాటలను గురించి ప్రస్తావిస్తాను. ఈ పాటలు ఆయా సందర్భాలను బట్టి, పాత్రల ఔచిత్యాలను బట్టి కుబేరుడి వాదనను కానీ, మన్మథుడి వాదనను కానీ లేదా ఇద్దరి వాదనలను కానీ సినీ ఫక్కీలో సమర్థిస్తాయి.
అయ్యయ్యో చేతిలో డబ్బులు పొయెనే – కులగోత్రాలు
‘కొసరాజు’ గారు రచించిన ఈ పాటను ‘సాలూరి రాజేశ్వరరావు’ గారు స్వరపరచగా ‘మాధవపెద్ది సత్యం’, ‘పిఠాపురం నాగేశ్వరరావు’ పాడారు. పేకాటలో డబ్బు పోగొట్టుకొన్న ఓ వ్యక్తి (రమణారెడ్డి) బాధపడుతుండగా, చుట్టూ ఉన్న అతడి స్నేహితులు (రేలంగి, తదితరులు) నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే, ఈ పాటలో తెరపై కనిపించేది హాస్యనటులు కాబట్టి ఈ పాట కూడా సరదా పంథాలోనే సాగుతుంది. ఈ అంశాలను పక్కనబెట్టి సాహిత్యాన్ని పరిశీలిస్తే, అంతర్లీనంగా “Money is a good slave but a bad master” అనే ఆంగ్ల సామెతను ఆద్యంతం గుర్తుచేస్తారు రచయిత. డబ్బు వలన కలిగే లాభనష్టాలతో పాటు, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఇతరులపై ఆధారపడకుండా (ఎంత మంచి స్నేహితుడైనా సరే) సొంత నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా గ్రహించవచ్చు.
డబ్బు కోల్పోయిన రమణారెడ్డిని ఓదారుస్తూ రేలంగి, మిగతా స్నేహితులు ఇలా అంటారు, “ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ… ఓటమి తప్పలేదు భాయీ…” అప్పుడు రమణారెడ్డి “మరి నువు చెప్పలేదు భాయీ!” అని అనగా “అది నా తప్పుగాదు భాయీ!” అని వెంటనే సమర్థించుకుంటాడు రేలంగి. డబ్బు ఎంతటి వారినైనా నాశనం చేస్తుందని, ఒక్కోసారి డబ్బు విషయంలో ప్రాణ స్నేహితులు కూడా ఎటువంటి సహాయం చేయరనే సూరన పద్యంలోని మన్మథుడి వాదనను సమర్థించే వాక్యాలివి. అలాగే, డబ్బు వలన ఉపయోగాలేమిటో చెప్పే కుబేరుడి వాదనను సమర్థిస్తూ ఈ పాటలో రెండో చరణం సాగుతుంది. డబ్బు పోగొట్టుకున్న రమణారెడ్డి పాత్రే కనువిప్పు కలగడంతో, అది ఉండుంటే “నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది… ఎంతో పుణ్యం దక్కేది…”, “ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎం.ఎల్.ఎ దక్కేది” అని వాపోతుంది.
ఈ పాటలో అదనంగా డబ్బు చెడు స్నేహాలను ఎలా తెచ్చిపెడుతుందో కూడా కొసరాజు గారు ఓ చరణంలో ఉదాహరించారు. రేలంగి తదితరులు అప్పటికే సర్వం కోల్పోయి బాధపడుతున్న రమణారెడ్డిని మళ్ళీ పేకాట ఆడడానికి ప్రోత్సాహిస్తూ “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు… మళ్ళీ ఆడి గెల్వవచ్చు…” అని అనగా “ఇంకా పెట్టుబడెవడిచ్చు?” అని రమణారెడ్డి తిరిగి ప్రశ్నిస్తాడు. అందుకు వాళ్ళంతా “ఇల్లు కుదవ పెట్టవచ్చు… ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు…” అని ప్రోత్సాహిస్తారు. “పోతే…?” అని రమణారెడ్డి మళ్ళీ ప్రశ్నించగా “అనుభవమ్ము వచ్చు…” అని తేలిగ్గా జరుకుంటారు. అప్పటికే కనువిప్పు కలిగిన రమణారెడ్డి “చివరకు జోలె కట్టవచ్చు” అని నిష్క్రమిస్తాడు.
డబ్బుకు లోకం దాసోహం గణనాథ – డబ్బుకు లోకం దాసోహం
‘సి. నారాయణ రెడ్డి’ గారు రచించిన ఈ పాటను ‘కె. వి. మహదేవన్’ గారు స్వరపరచగా ‘మాధవపెద్ది సత్యం’, ‘పిఠాపురం నాగేశ్వరరావు’ తదితరులు పాడారు. ఈ పాటలో ముఖ్యంగా మనిషి కనిపెట్టిన డబ్బు ఆ మనిషినే ఎలా ఆడిస్తుందో ప్రస్తావించారు రచయిత. “మూణ్ణాళ్ళ ముచ్చట కోసం గణనాథ… ఈ లోకంలో ఎంత మోసం గణనాథ… డబ్బుకు లోకం దాసోహం గణనాథ…” అని పాట ప్రారంభమవుతుంది.
డబ్బుతో ఏదైనా సాధ్యమేనన్న కుబేరుడి వాదనను సమర్థిస్తూ మొదటి చరణం ఇలా సాగుతుంది.
కులమున్న వాళ్ళు… గోత్రాలున్న వాళ్ళు…
విద్యలెన్నో నేర్చామని విర్రవీగే వాళ్ళు
గద్దెలనేలే పెద్దమనుషులు
డబ్బున్న వాని బానిస కొడుకులు
ఇది అక్షర సత్యమని “డబ్బుకు లోకం దాసోహం గణనాథ… ఇది దాచాలన్నా దాగని సత్యం గణనాథ…” అని ముగుస్తుంది ఈ చరణం.
డబ్బు పాపిష్టిది అనే మన్మథుడి వాదనను సమర్థిస్తూ, ఆ డబ్బు కోసం మనిషి చేసే అనేకమైన పాపాలను ప్రస్తావిస్తూ రెండో చరణం సాగుతుంది.
దేవుణ్ణి నిలిపేది డబ్బు కోసం
ఆ దేవుణ్ణే మింగేది డబ్బు కోసం
నీతులు చెప్పేది డబ్బు కోసం
వెనక గోతులు తవ్వేది డబ్బు కోసం
పార్టీలు కట్టేది డబ్బు కోసం
నైటు పార్టీలు ఇచ్చేదీ డబ్బు కోసం
అబ్బబ్బా మారదు ఈ వింత లోకం
డబ్బు ముందు అది దాసానుదాసం
మూడో చరణం కూడా ఇదే పంథాలో సాగుతుంది.
డబ్బు పెట్టి ఆలిని కొంటారు
ఆ డబ్బు కోసం ఆలినమ్ముకుంటారు
డబ్బు కోసం కాళ్ళ బేరాలాడతారు
ఆ డబ్బు దక్కితే నెత్తికెక్కి ఆడతారు
తల తిరిగి తైతక్కలాడుతారు
అలా, కుబేర – మన్మథ వాదనలను వ్రాసిన సూరన ధనాభిరామానికి అనేక ఉదాహరణలతో సరళ రూపమిస్తుంది ఈ సినారె గీతం.
ధనమేరా అన్నిటికీ మూలం – లక్ష్మీ నివాసం
ఈ ‘ఆరుద్ర’ గారి గీతాన్ని ‘కె. వి. మహదేవన్’ గారు స్వరపరచగా ‘ఘంటసాల’ గారు ఆలపించారు. సినిమా కథను బట్టి చూస్తే, ఈ పాట పూర్తిగా మన్మథుడి వాదనను సమర్థిస్తుంది. మనిషి డబ్బుని గౌరవించాలని, డబ్బు పేరుతో పరుల పట్ల వివక్ష చూపరాదని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. “ధనమేరా అన్నిటికీ మూలం… ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం…” అనే మొదటి పంక్తిలోనే రచయిత ఉద్దేశ్యం నెలకొల్పబడుతుంది. ఎటువంటి పదాడంబరం లేకుండా పాట సాగిపోతుంది.
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ఇలా డబ్బు వల్ల జరిగే చెడుని ప్రస్తావించి, దాన్ని అదుపు చేయమని పైన చెప్పుకున్న “Money is a good slave but a bad master” అనే ఆంగ్ల సామెతను మళ్ళీ గుర్తుచేస్తుంది ఈ పాట.
ఉన్నా నాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేని నాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చొని తింటే
అయ్యో… కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే
ధనలక్ష్మిని అదుపు చేయమని మొదటి చరణంలో చెప్పిన రచయిత అది ఎలా సాధ్యపడుతుందో రెండో చరణంలో చెప్పడం జరిగింది.
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలి కాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం
ఈ చరణంలో డబ్బు ఎవరికైనా ఒకటేనని, ఆ ధనం పేరుతో ఎవరి పట్లా వివక్ష చూపరాదని, కష్టపడి బ్రతికేవారికి ధనముకు కొరత ఉండదనీ, దాని కోసం అడ్డదారులు తొక్కవలసిన పని లేదని చెప్పడం జరిగింది.
డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా – బీదలపాట్లు
‘జి. కె. మూర్తి’ గారు రచించిన ఈ పాటను ‘కె. వి. మహదేవన్’ గారు స్వరపరిచారు. ‘ఘంటసాల’, ‘పి. బి. శ్రీనివాస్’ పాడారు. ఈ పాట దాదాపుగా కుబేరుడి వాదనను సమర్థిస్తూ సాగుతుంది. డబ్బుంటే కలిగే సౌఖ్యాలేమిటో వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా చెబుతుంది. మొదటగా, డబ్బుంటే దేవుడు కూడా పాపాలను తుడిచేస్తాడని చెప్పడం జరిగింది.
డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా
అది లేని వాడి బ్రతుకంతా ఒకటే చింత
డబ్బుంటేనే దేవుడు దర్శనాలు ఇస్తాడు
పాడు దొంగ సొమ్మైనా పాలు పంచుకుంటాడు
పైసా ఇస్తే పాపం పరిహారం చేస్తాడు
అందులో ఉందిరా మహత్తు, గమ్మత్తు
తరువాత, డబ్బు మనిషికి తెచ్చే గౌరవాన్ని ఇలా చెబుతుంది.
డబ్బొస్తే సుబ్బమ్మే సుబ్బులచ్చిమి
అసేయ్, ఒసేయ్ అనే పిల్లే ‘అమ్మగారు’
ఆరేయ్, ఒరేయ్ అన్నవాడే ‘అయ్యగారు’
ఇంతేరా ఈ లోకం ఎవ్వరూ మార్చలేరు
అయితే, చివర్లో నాగేశ్వరరావు పాత్ర వచ్చి ఈ ఆలోచనలు మారాలి అని చెప్పడం జరుగుతుంది.
సొమ్ము పెంచకు – బాబాయి అబ్బాయి
‘వేటూరి’ గారు వ్రాయగా, ‘చక్రవర్తి’ గారు స్వరపరచిన ఈ పాటని ‘ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం’, ‘మాధవపెద్ది రమేష్’ పాడారు. ఇది పూర్తిగా సూరన ధనాభిరామంలోని మన్మథుడి వాదనను సమర్థిస్తుంది. డబ్బు ఎక్కువగా ఉంటే వచ్చే కష్టాలేమిటో బాలకృష్ణ – వీరభద్రరావు పాత్రల మధ్య సరదా సంభాషణల రూపంలో ఈ పాటను వ్రాసారు రచయిత. సంభాషణ అంటే వేర్వేరు దృక్పథాలు కాకుండా రెండు పాత్రలూ ఒకే ఆలోచనలోనే ఉంటాయి.
సొమ్ము పెంచకు బాబాయో
సొమ్మసిల్లకు అబ్బాయో
పెరిగిపోతే పైకం ఎదుగుతుంది మైకం
ఇలా మొదలుపెట్టిన పాట చారణాల్లో మరిన్ని అంశాలు ప్రస్తావిస్తారు రచయిత.
నల్ల డబ్బుని దాచడానికి గుడ్డిగా నమ్మాలి
నానా గడ్డి కరవాలి
ఎందరి కాళ్ళో పట్టాలి
తెల్ల డబ్బుపై హక్కు కోసము బొక్కలు వెతకాలి
ఎన్నో ట్రిక్కులు చేయాలి
టాక్సులు తక్కువ కట్టాలి
డబ్బు ఎక్కువగా ఉంటే మన చుట్టూ ఆశావాదులు, అవకాశావాదులు చేరతారని, స్నేహితులను దూరం చేస్తుందని కూడా ఈ పాటలో చెబుతారు.
కుప్పతెప్పలుగా చెరువు నిండితే కప్పలు చేరుట ఖాయం
అప్పనంగా వచ్చిన సొమ్ము నిప్పు పెట్టడం ఖాయం
చెలిమికి చేసిపోవురా గాయం
చక్రవర్తికి వీధి బిచ్చెగత్తెకి – మనీ
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ గారు రచించి, ‘ఎం. ఎం. కీరవాణి’ గారు స్వరపరిచి, ‘ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం’ గారు పాడిన ఈ పాట సినిమాలో కథ, పాత్రల దృష్ట్యా పూర్తిగా ధనాభిరామంలోని కుబేరుడి వాదనను సమర్థిస్తూ సాగుతుంది. డబ్బు అందరికీ అవసరమని చెబుతూ పాట ప్రారంభమవుతుంది.
చక్రవర్తికి వీధి బిచ్చెగత్తెకి బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు, అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి, పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అందీ మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అందీ మనీ మనీ
ఇక ఈ డబ్బు విశిష్టతను చెప్పడంలో పరాకాష్ట, రచయిత చేసిన చమత్కారం ఈ రెండు వాక్యాల్లో కనిపిస్తుంది.
డబ్బునే లబ్ డబ్బనే గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
డబ్బు లేకపోతే ఇంట్లోకి ప్రవేశం అయినా ఒంట్లోకి తిండి అయినా కష్టమే అవుతుందని కూడా చెప్పడం జరిగింది.
ఇంటద్దె కట్టావా నా తండ్రి – నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరలి సైలెంట్లీ – నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పద బ్రదర్ మనీ వేటకి
అప్పుకే పద బ్రదర్ ప్రతీ పూటకి
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్మునే శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
డబ్బు లేకపోతే పడే కష్టాలేమిటో రెండో చరణంలో వ్యంగ్యంగానూ చెప్పడం జరుగుతుంది.
ప్రేమించుకోవచ్చు దర్జాగా – పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా – డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికి
చిలకా ఏ తోడు లేక – శుభలగ్నం
పై పాట వ్రాసిస ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ గారి రచనలో ‘ఎస్. వీ. కృష్ణారెడ్డి’ గారి సంగీత దర్శకత్వంలో, ‘ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం’ గారు పాడిన ఈ పాట పూర్తిగా ధనాభిరామంలోని పూర్తిగా మన్మథుడి వాదనను సమర్థిస్తూ సాగుతుంది. డబ్బు కోసం భర్తను వేరొకరికి అమ్మేసి, ఆ మోజులో జీవితంలో అన్నీ కోల్పోయిన ఓ పాత్రను తన మనసాక్షి ప్రశ్నిస్తున్నట్టుగా ఈ పాట సాగుతుంది.
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
అనే ఈ వాక్యాలు డబ్బుతో ఎన్ని కొన్నా సంతోషం కొనలేమని చెబుతాయి.
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
అలాగే…
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మారిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమావాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక
ఈ పంక్తులలో డబ్బు మీద మోజు వల్ల కలిగే నష్టాలను పూర్తిగా ప్రశ్నిస్తూ ప్రస్తావించారు రచయిత.
రూపాయి దండకం – పెళ్ళాం పిచ్చోడు
డబ్బు నేపథ్యంలో వ్రాసిన పాటల్లో ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు’ గారు రచించిన నటుడు ‘రాజేంద్రప్రసద్’ గారు స్వరపరిచిన ఈ పాటను ‘ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం’ గారు పాడారు.
ఇది పూర్తిగా కుబేరుడి వాదనను సమర్థిస్తూ, సూరన ధనాభిరామం నుండి బాగా స్ఫూర్తి పొందినదై సాగుతుంది.
రూపాయివే… విశ్వరూపమ్ము దాల్చినావే
దాసోహమే నీకు దేశదేశాల వారే
లోకాన జీవనాధారంబు నీవే
నమస్తే… నమస్తే రూపాయి నోటు
జై రూపాయి…
ఇలా మొదలైన పాటలో ధనాభిరామంలోని పద్యాలను గుర్తుచేసే కొన్ని పంక్తులను ప్రస్తావిస్తాను.
గబ్బిలం ఫేసు మనిషైన డబ్బుంటె మన్మథుండౌ
తారు డబ్బాను తలదన్ను పిల్లకే డబ్బుంటె మల్లెపూవౌ
అంట్ల వెధవైన ఆకాశమునకు ఎత్తుచున్
పెంట వెధవైన ప్రేమించగలరందరున్
ఇలా సరదాగా సాగే ఈ పాటను బాలు గారి గాత్రంలో విని తరించాల్సిందే, వ్రాసిన జొన్నవిత్తుల గారిని అభినందించి తీరాల్సిందే.
డబ్బు నేపథ్యంలో వచ్చిన మరి కొన్ని తెలుగు సినిమా పాటలను రెండో భాగంలో విశ్లేషిస్తాను.
– యశ్వంత్ ఆలూరు
Pingback: సినీ ధనాభిరామం – 1 — Yashwanth Aluru | Mon site officiel / My official website