విద్యాసాగర్ – మళయాళ సినిమాను ఏలిన తెలుగు సంగీతకారుడు

ఈ రోజు సంగీత దర్శకుడు “విద్యాసాగర్” పుట్టినరోజు. ఈయన సంగీతం చాలా ప్రత్యేకంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలుగులో దిగ్దర్శకులతో పని చేసినా దురదృష్టవశాత్తూ ఆ సినిమాలు ఆదరణ పొందకపోవడంతో జనాలకు ఎక్కువగా గుర్తులేరు. కానీ మళయాళంలో జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా నాకు నచ్చిన కొన్ని పాటలు…

తెలుగు ప్రేక్షకులకు గుర్తుచేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా తెలుగు పాటలే పంచుకుంటాను. అడపాదడపా పరభాషా పాటలు. ఇందులో ఎటువంటి క్రమమూ లేదు

ఇది నాదని అది నీదని – స్వరాభిషేకం

ఈ పాట సాహిత్యానికి ట్యూన్ చేశారనుకుంటాను. మొదట్లో వచ్చే పియానో, దాన్ని అనుసరించే రిథమ్ అద్భుతం. బాలు-చిత్రల మృదుమధుర గానంతో అలరిస్తుంది.

ఒక్క క్షణం- స్వరాభిషేకం

ఈ పాట మరో అద్భుతం. మరీ ముఖ్యంగా చరణాలు చాలా మధురంగా సాగుతాయి.

అనుజుడై లక్ష్మణుడు – స్వరాభిషేకం

ఉద్దండులు యేసుదాసు, బాలు కలిసి పాడిన గ్రాండ్ కంపోజిషన్. ఈ పాట విద్యాసాగర్ అసమాన ప్రతిభకు తార్కాణం. ఈ సినిమాకు సంగీతంలో నేషనల్ అవార్డు రావడానికి ఎంతో దోహదపడిందని చెప్పొచ్చు.

ఓం నమ: వయ్యారమా – కడప రెడ్డెమ్మ

ఈ సినిమాలో ఇదొక చక్కని మెలోడీ. వేటూరి రచన!

వెన్నెల్లో వేసంకాలం – ఒట్టేసి చెపుతున్నా

ఈ సినిమా గుర్తుండడానికి విద్యాసాగర్ సంగీతం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. “వెన్నెల్లో వేసంకాలం” అనే ఈ పాట సినిమాలో అత్యుత్తమం. బాలు గానం అద్భుతం!

అల్లుకొనవా – మజా

ఇది డబ్బింగ్ సినిమా. ఈ పాటని తమిళంలో మధుబాలకృష్ణన్ పాడగా తెలుగులో బాలు పాడారు. చరణాల ఫ్లో, బాలు ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం.

కంచిపట్టు చీరకట్టి – చిలకపచ్చకాపురం

ఇళయరాజా స్థాయి మెలోడీ ఇది. సిరివెన్నెల రచన, బాలు-జానకిల చిలిపి అల్లరి వెరసి మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాంటి పాట.

రారా స్వామి రారా – ముగ్గురు మొనగళ్ళు

ముగ్గురు మొనగాళ్ళు అనగానే “చామంతి పువ్వా” గుర్తొస్తుంది కానీ ఈ పాట ప్రత్యేకం. ఓ కీర్తన చేయగల బాణీలో రొమాంటిక్ గీతం వినిపించాలన్న దర్శకేంద్రుడి ఆలోచనకు విద్యాసాగర్ చేసిన క్లాసికల్ ఫ్యూజన్ ఇది. బాలు-చిత్రల అల్లరి, చిరు-రమ్యకృష్ణల నృత్యం మరో లెవెల్.

నేస్తమా Don’t Worry Be Happy – అలజడి

సినిమా పరాజయం పాటలపై ప్రభావం చూపిస్తుంది అన్నదానికి ఉదాహరణ “అలజడి” సినిమాలోని ఈ పాట. వెస్ట్రన్ పద్ధతిలో చేసిన చక్కని మెలోడీ. భువనచంద్ర సాహిత్యం ఉత్తేజితంగా ఉంటుంది.

ఎగిరే చిలకమ్మా – బంగారం

“బంగారం” సినిమా విడుదలయ్యాక ఆదరణ పొందకపోయినా జనాలను థియేటర్ వరకూ రప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌తో పాటు విద్యాసాగర్ సంగీతానిది కూడా. సినిమా టైటిల్ సాంగ్‌తో పాటు ఈ పాట కూడా అప్పట్లో మారుమ్రోగింది. ఉదిత్ నారాయణ్ ఎంతో ఉత్సాహంగా పాడిన పాట.

రారా సరసకు రారా – చంద్రముఖి

“శ్రోతాశ్విని” అనే రాగం సినిమాల్లో ఎక్కువగా వాడలేదు. అందులో చేసిన ఓ టాప్ క్లాస్ మెలోడీ ఇది. ట్యూన్‌తో పాటు ఇందులో చేసిన ఆర్చెస్ట్రేషను, వాయిద్యాల వాడకం అన్నీ కలిసి పాటని, సినిమాని మరో లెవెల్‌కు తీసుకెళ్ళాయి.

అందాల ఆకాశమంతా – చంద్రముఖి

“చంద్రముఖి” సినిమాలో ఉన్న మరో మంచి మెలోడీ ఈ పాట. ఇంటర్లూడ్స్, బాలు గానం చాలా బాగుంటాయి. తెలుగులో సాహిత్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది.

కలలో తెర – తేనెటీగ

ఈ పాట ఇప్పటి జెనరేషనుకు గుర్తుండే అవకాశం తక్కువ. పియానోతో మొదలయ్యే ఈ పాటలో ట్యూన్, ఆర్చెస్ట్రేషను చాలా బాగుంటాయి. వెన్నెలకంటి ఈ పాట సాహిత్యంలో “ముక్తపదగ్రస్తం” అలంకారం స్ఫూర్తితో ఓ వింత ప్రయోగం కూడా చేశారు.

మీసాల గోపాల – దొంగోడు

ఈ పాట అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇందులోని ఇంటర్‌లూడ్స్‌లో దిల్‌రూబా వాయిద్యాన్ని వాడారు.

నీ చూపు సుప్రభాతం – మాధవయ్య గారి మనవడు

ఈ పాటను ఒకానొక పాడుతాతీయగా ఎపిసోడ్‌లో బాలు పరిచయం చేశారు. చక్కని మెలోడీ ఇది.

మలరే మౌనమా – కర్ణ

“శివశంకరీ” పాట చేసిన “దర్బారి కానడ” రాగం ఆధారంగా చేసిన ఓ పాట. క్లాసికల్ టచ్ ఉన్న రొమాంటిక్ గీతం. సినిమా విజయంలో దీని పాత్ర చాలా ఉంది. తమిళ వెర్షను పంచుకోవడానికి కారణం బాలు. ❤️

తెలుగులో మనో పాడారు.

హే షబ్బా – కర్ణ (తెలుగు)

ఈ పాట కార్తీ ఖైదీ (2019) సినిమా ద్వారా మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అరబిక్ శైలిలో సాగే హుషారు పాట. ఇందులో రిథమ్ ప్రధానం. గాయకుడిగా మనో పేరున్నా మొదట్లో పల్లవి పాడింది విద్యాసాగరే!

బాగున్నావే ముద్దొచ్చే బుగ్గల్లో సిగ్గమ్మా – రుక్మిణి

ఇది కూడా విద్యాసాగర్ సంగీతం వల్లే గుర్తున్న సినిమా. ఇందులో “గోదారి రేవులోన” బాగా పాపులర్ అయినా ఈ మెలోడీ ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. సంగీతంతో పాటు సిరివెన్నెల రచన, బాలు భావ ప్రకటన ఇందులో హైలెట్స్.

ఊహలలో ఊపిరిలో – ఊర్మిళ

హిందీ సినిమా “దామిని” ఆధారంగా తీసిన సినిమా. ఇందులో ఈ పాట హైలైట్. “కళ్యాణి” రాగపు చాయలో సాగే ఈ పాటని అతి సున్నితమైన మెలోడీగా మలిచారు విద్యాసాగర్. బాలు తక్కువ శ్రుతిలో పాడిన పాటల్లో ఇదొకటి. భువనచంద్ర రచన!

లవ్‌లీ లవ్ లీలా – ఆయనగారు

సోలో వయొలిన్ ప్రధానంగా చేసిన మెలోడీ. తబలాను వాడిన విధానం కూడా అద్భుతం. వినడానికి సులువుగా ఉన్నా పాడడానికి, వ్రాయడానికి చాలా కష్టమైన బాణీ. సిరివెన్నెల రచన, మనో-సుజాతలు వేసిన గమకాలు అన్నీ పోటాపోటీగా సాగిన గీతం❤️

దేవతలా నిను చూస్తున్నా – నేను

భగ్న ప్రేమికుల ప్లేలిస్టులో ఎప్పుడూ ఉండే పాట. సినిమా ప్రాచుర్యంలో పెద్ద షేర్ కలిగినది.

పుదు మలర్ తొట్టు – పూవెల్లామ్ ఉన్ వాసమ్

ఈ పాటను విద్యాసాగర్ తెలుగులో “ఓ చినదాన”లో వాడారు కానీ కొంచెం బాణీ మార్చారు. దానికన్నా ఈ తమిళ ఒరిజినలే బాగుంటుంది. హుషారుగా సాగే మెలోడీ.

అనురాగమే హారతులాయె – ఊ కొడతారా ఉలిక్కి పడతారా

విద్యాసాగర్ మళయాళంలో చేసిన పాటనే ఈ సినిమాలో వాడుకున్నారు. ట్యూన్ మెలోడియస్‌గా సాగుతూనే కాళ్ళాడించే రిథమ్ ఉన్న పాట. ఈ సినిమాలో ఇది చాలా ముఖ్యమైన పాట.

మౌనాలు ఏలనే ప్రేయసి – రన్

డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో బాగా ఆడడానికి ఓ కారణం మ్యూజికల్ హిట్ అవ్వడం వల్లే. అప్పట్లో ఈ పాట బాగా పాపులర్.

ఓంకారం వంకర – సుందరకాండ (2008)

సినిమా పోవడం వల్ల ఇది గుర్తుండే అవకాశం కూడా తక్కువే కానీ చాలా వైవిధ్యం ఉన్న పాట ఇది. సాహిత్యానికే బాణీ కట్టిన పాట. చిత్ర మిమిక్రీ చేస్తూ అల్లరి చేస్తూ పాడిన పాట.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోలెడు పాటలు ఉన్నయి విద్యాసాగర్ ప్రతిభకు నిదర్శనాలు. ఇక్కడితో ముగిస్తునాను. ఆయనకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు!

– యశ్వంత్ ఆలూరు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s